కెరీర్ ప్రారంభం నుంచి సరైన హిట్ ఒక్కటి కూడా పడకుండా లాక్కొస్తున్నాడు అల్లు శిరీష్. శ్రీరస్తు ..శుభమస్తు తప్ప చెప్పుకునేందుకు ఏ సినిమా లేదు. వరస ఫెయిల్యూర్స్. రీసెంట్ గా వచ్చిన మళయాళ రీమేక్  చిత్రం ఎబిసిడీ సైతం డిజాస్టర్. ఇలాంటి కీలకమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అంతా ఎదురుచూస్తారు. అందులోనూ దాదాపు ఎనిమిది నెలల నుంచీ కథలు, వింటూ గడుపుతున్నాడు. అయితే చాలా మంది దర్శకుల కథలు విని మళ్లీ ఓ రీమేక్ కే ఓటేసినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే...ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'ప్యార్ ప్రేమ కాదల్'. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతోంది. ఎలన్ డైరెక్షన్ లో హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం బోయ్ మీట్ గర్ల్ తరహా ప్రేమకథ.కాకపోతే హీరోయిన్ కాస్తంత స్పీడుగా ఉంటుంది.  ఎలన్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్ర కధ, ప్రేమ లోని భావోద్వేగాలు ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

RRR అజయ్ దేవగన్ రోల్.. జక్కన్న లెక్కలు మాములుగా లేవు!

మళయాళంలో వచ్చిన పెద్ద హిట్ ని రీమేక్ చేస్తేనే వర్కవుట్ కాలేదు. అలాంటిది ఈ సారి ఓ తమిళ సినిమాని రీమేక్ చేయటానికి ఎంచుకున్నట్లు సమాచారం. పోనీ అదేమన్నా తమిళంలో పెద్ద హిట్టైన సినిమానా అంటే...ఓకే అనిపించుకుని ఒడ్డున పడ్డ సినిమా. దాన్ని రాకేష్ శశి అనే దర్శకుడు చేతిలో పెట్టబోతున్నట్లు సమాచారం. రాకేష్ శశి గతంలో చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత అనే చిత్రం చేసారు. ఆ సినిమా ఆడకపోయినా బాగా తీసాడనే పేరు తెచ్చుకుంది. దాంతో ఈ రీమేక్ కు అతన్నే దర్శకుడుగా ఎంచుకున్నట్లు సమాచారం.

అలాగే ఈ రీమేక్ సినిమాలో మార్పులుకు అల్లు శిరీష్ ఒప్పుకోవటం లేదని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. యాజటీజ్ గా వెళ్లిపోదామని శిరీష్ పట్టుబడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే అందులో నిజమెంత ఉందని తెలియాల్సి ఉంది. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని మొదట డబ్బింగ్ చేసి, ట్రైలర్ కూడా వదిలారు. కానీ రీమేక్ అలోచన వచ్చాక దాన్ని విరమించుకున్నారు.