సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కించాడు. సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా ఈ చిత్రంలో జంటగా నటించారు. తాత, మనవడి సెంటిమెంట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంటూనే.. కడుపుబ్బా నవ్విస్తోంది. 

డైరెక్టర్ మారుతి మార్క్ కామెడీ, రావు రమేష్ నటన ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్ర రిలీజ్ కు ముందు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి హిట్ అవుతుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండేది. కానీ ప్రస్తుతం ఈ చిత్రానికి వసూళ్లు సూపర్ హిట్ రేంజ్ లో నమోదవుతున్నాయి. చిత్ర యూనిట్ కూడా రిలీజ్ తర్వాత ప్రచార కార్యక్రమాల్ని జోరుగా నిర్వహిస్తోంది. మంగళవారం రోజు న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ఈవెంట్ నిర్వహించింది. 

ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, మారుతి, బన్నీ వాసు, అల్లు అరవింద్ ఇతర చిత్ర యూనిట్ పాల్గొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ ఈవెంట్ కు అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ ప్రతిరోజూ పండగే చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి తనకు విజయంపై అన్నీ అనుమానాలే ఉండేవి అని అరవింద్ అన్నారు. మారుతి కథ చెప్పగానే నచ్చింది.  ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ ఇందులో యువతని అట్రాక్ట్ చేసే అంశాలు లేవు. కథ బావుంది మారుతి కానీ యూతు లేదు.. బూతు లేదు ఫర్వాలేదా అని అడిగాను. మీకు కథ నచ్చింది కదా సర్.. మొదలు పెట్టేద్దాం అని మారుతి అన్నాడు. 

ప్రముఖ నిర్మాత కొడుకుపై పోలీసుల దాడి.. కారణం ఇదే!

సినిమా పూర్తయింది. తొలిసారి ప్రీమియర్ షో చూడగానే మేమంతా కడుపుబ్బా నవ్వుకున్నాం. మళ్ళీ అనుమానం వచ్చింది. మారుతి మనం నవ్వినట్లే.. ప్రేక్షకులు కూడా నవ్వుతారా అని అడిగా. సినిమా విడుదలయింది. తొలి షో ఆడియన్స్ తో థియేటర్ లో చూశాం. మళ్ళీ ప్రతి ఒక్కరు నవ్వారు. అందరూ నవ్వుతున్నారు.. బయటకు వెళ్లి సినిమా బావుందని చెబుతారా లేదా అని అనుమానం కలిగింది. 

నయనతారపై స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. నచ్చినా నచ్చకున్నా అంతే!

నాలో మెదిలిన ఇన్ని అనుమానాల్ని, అడ్డంకుల్ని ఈ చిత్రం సక్సెస్ గా నిలిచింది. ప్రేక్షకులు ప్రతిరోజూ పండగే మూవీని మరోస్థాయికి తీసుకెళ్లారు అని అల్లు అరవింద్ అన్నారు. తమన్ ప్రతిరోజూ పండగే చిత్రానికి సంగీతం అందించాడు. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం 10 రోజుల్లో 25 కోట్లకు పైగా షేర్ సాధించి దూసుకుపోతోంది. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ప్రతిరోజూ పండగే నిలిచింది.