ఒకప్పుడు స్టార్ హీరోలు కొన్ని భాషలకే పరిమితమై ఉండేవారు. భాష సమస్య వలన రిస్క్ తీసుకునేవారు కాదు. ఈ లిస్ట్ లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఉంటారు. మలయాళంలో కాకుండా ఆయన ఇతర భాషల్లో ఎన్ని అవకాశాలు వచ్చినా.. రిజెక్ట్ చేశారు.

తెలుగులో మాత్రం 'సూర్య పుత్రులు', 'స్వాతి కిరణం' వంటి చిత్రాల్లో నటించారు. ఆ తరువాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. రీసెంట్ గా 'యాత్ర' సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన 'మామాంగం' సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్.. కన్ఫర్మ్ చేసిన హీరో!

కేరళ చరిత్రలోని యుద్ధ వీరుల కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాని రూ.50 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఎం పద్మకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని ఇటీవల కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

'స్వాతి కిరణం' సినిమా రిలీజ్ కి ముందు తెలుగు వాళ్లు మమ్ముట్టిని స్వాగతిస్తారా అని అనుకున్నానని.. కానీ ఆ పాత్ర మరెవరూ చేయలేనంత గొప్పగా మమ్ముట్టి చేశారని తెలిపారు. పదేళ్ల తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించినట్లు చెప్పిన అల్లు అరవింద్.. మమ్ముట్టిని పవన్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయాలని అడిగారట.

దానికి మమ్ముట్టి.. 'ఇదే మాట చిరంజీవిని అడగగలరా..?' అని ప్రశ్నించారట. దానికి అల్లు అరవింద్ 'లేదండి నేను అడగలేను' అన్నారట. 'మరి నన్ను ఎందుకు అడిగారు' అని మమ్ముట్టి అడగగానే.. అల్లు అరవింద్ ఫోన్ కట్ చేసేసారట.

ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా గుర్తు చేసుకున్నారు. మమ్ముట్టి ఇలానే గతంలో దర్శకుడు దేవకట్టాపై కూడా సీరియస్ అయ్యారు. 'ప్రస్థానం' సినిమాలో సాయి కుమార్ పాత్ర కోసం ముందుగా మమ్ముట్టినే సంప్రదించారు. దానికి ఆయన డైరెక్టర్ మీద ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని దేవకట్టా పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.