ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి చాలా కాలం తరువాత 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో విజయశాంతి కీలకపాత్ర పోషిస్తున్నారు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. ఇందులో భాగంగా విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అసలు సినిమాలు చేయాలనే ఆలోచన ఉండేది కాదని.. కానీ చాలా రోజులుగా అనీల్ రావిపూడి తనతో సినిమా చేయాలని తిరుగుతున్నాడని.. ఇప్పటికి కుదిరిందని చెప్పుకొచ్చింది.

RRR స్టార్స్ బాక్స్ ఆఫీస్ హిట్స్.. 3 నుంచి 300 కోట్ల ప్రయాణం!

కథ బాగా అనిపించడంతో సినిమా ఒప్పుకున్నట్లు తెలిపింది. మహేష్ బాబుతో నటించడం గురించి మాట్లాడుతూ అప్పటిరోజులను గుర్తు చేసుకున్నారు. 1988లో 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో మహేష్ తో కలిసి నటించిన విషయాన్ని వెల్లడించింది. అప్పుడు మహేష్ వయసు 14 ఏళ్లని.. చాలా క్యూట్ గా ఉండేవాడని చెప్పారు.

ఒక సీన్ లో మహేష్ ని కొట్టాల్సి వస్తే.. చేయి దగ్గరకి వెళ్తోంది కానీ కొట్టడానికి మనసు రాక చాలా టేక్ లు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. 'మీరు కొడతారా..? లేక షూటింగ్ కి పేకప్ చెప్పమంటారా..?' అంటూ కృష్ణ గారు కోప్పడ్డ విషయాన్ని చెప్పారు.

ఆ సమయంలో మహేష్ బాబు వచ్చి 'పర్వాలేదండీ.. కొట్టండి' అంటూ క్యూట్ గా చెప్పాడని.. అలాంటి చిన్న పిల్లాడు ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడని.. అతడితో మళ్లీ కలిసి నటిస్తానని అనుకోలేదని చెప్పుకొచ్చారు. అప్పుడు షూటింగ్ లో బాబుని తను చూసుకునేదాన్ని అని చెప్పిన విజయశాంతి ఇప్పుడు షూటింగ్ లో మహేష్ తనను జాగ్రత్త చూసుకున్నారని చెప్పుకొచ్చింది. అసలు మహేష్ సూపర్ స్టార్ అన్నట్లే ఉండదని.. పెద్ద వాళ్లంటే చాలా గౌరవమని.. చాలా మర్యాదగా ఉంటారని చెప్పుకొచ్చారు.