తనకు తన తల్లి గర్భంలో ఉండగానే సినిమాలపై మక్కువ ఏర్పడిందని చిరంజీవి అంటున్నారు. అందుకు సంబంధించిన ఆసక్తికర సంఘటనని చిరు ఆదివారం రోజు జరిగిన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ వేడుకలో వివరించారు. తన తండ్రి స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకంగా నాగార్జున ప్రతి ఏటా ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ద్వారా ప్రముఖ నటులకు అవార్డులు అందజేస్తున్నారు. 

2018 సంవత్సరానికి గాను లేడీ సూపర్ స్టార్ శ్రీదేవికి, 2019 సంవత్సరానికి గాను ఎవరు గ్రీన్ బ్యూటీ రేఖకు ఏఎన్నార్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగిస్తూ.. తన తల్లి అంజనాదేవి గర్భంతో ఉండగా జరిగిన మధురమైన సంఘటనని చిరంజీవి వివరించారు. 

అది 1955వ సంవత్సరం.. ఓ పల్లెటూరు.. పెళ్లి చేసుకుని ఓ కొత్తజంట జీవితాన్ని ప్రారంభించారు.. ఆమె గర్భం దాల్చింది.. త్వరలో కాన్పు జరగబోతోంది. కాన్పు తర్వాత బయటకు వెళ్లే అవకాశం ఉండదు. అదే సమయంలో తన అభిమాన నటుడి చిత్రం విడుదలయింది. నా అభిమాన నటుడి సినిమా విడుదలయింది చూడాలి అనే కోరికని తన భర్తకు చెప్పుకుంది. 

సినిమా చూడాలంటే పక్కనే ఉన్న టౌన్ కి వెళ్ళాలి. ఇప్పటిలా అప్పట్లో బస్సులు ఇతర వాహనాలు అందుబాటులో లేవు. జట్కా బండిలో వెళ్ళాలి. గతుకుల రోడ్డు. సరే భార్య ఓ కోరిక కోరింది.. తీర్చాలి అని వ్యక్తి భావించాడు. ఇద్దరూ సినిమాకు బయలుదేరారు. ఎదురుగా ఆవుల మంద రావడంతో జట్కా బండి బోల్తా కొట్టింది. ఆ జంట కూడా కింద పడ్డారు. పెద్ద ప్రమాదమేమీ లేదు. అయినా ఆమె భర్త కంగారుతో ఇంత ఇబ్బంది పడుతూ సినిమా అవసరమా అని అడిగాడు. లేదు సినిమా చూడాల్సిందే అని ఆమె తన భర్తకు చెప్పుకుంది. 

సరే ఎలాగోలా టౌన్ కి వెళ్లి సినిమా చూశారు. ఆ జంట సినిమా చూసి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఆ గర్భిణీ స్త్రీ ఎవరో కాదు.. మా అమ్మ అంజనాదేవి. ఆ వ్యక్తి మా నాన్న వెంకట్రావు గారు. ఆ పల్లెటూరు మొగల్తూరు. వాళ్లిద్దరూ సినిమా చూసింది పక్కనే ఉన్న టౌన్ నరసాపురంలో అని చిరంజీవి తెలిపారు. వాళ్లిద్దరూ చూసిన సినిమా 'రోజులు మారాయి'. మా అమ్మ అంత పిచ్చిగా అభిమానించే నటుడు మరెవరో కాదు ఈ మహానటుడు 'అక్కినేని నాగేశ్వరరావు'. ఆ తల్లి గర్భంలో ఉన్నది తానే అని చిరంజీవి వెల్లడించారు. 

మా అమ్మకు ఏఎన్నార్ అంటే అంత పిచ్చి అభిమానం. ఆయన ప్రతి చిత్రాన్ని అమ్మ చూసేది. ఒక రకంగా అందువల్లే తనకు సినిమాలపై మక్కువ ఏర్పడిందని చిరంజీవి పేర్కొన్నారు.