బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయి గుర్తింపుపొందిన రాజమౌళి.. టాలీవుడ్ అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘RRR’ మూవీ అనౌన్స్ చేయగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా అనౌన్స్ చేసిన రోజే రిలీజ్ డేట్ కూడా ఎప్పుడనే విషయాన్ని వెల్లడించారు. 2020 జూలై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని చెప్పారు రాజమౌళి.

గతంలో కూడా రాజమౌళి తన సినిమాల విషయంలో ముందు ఒక డేట్ చెప్పడం ఆ తరువాత వాయిదా వేయడం లాంటివి చేశారు. అయితే ఇప్పుడు 'RRR' విషయంలో కూడా అదే జరగబోతుందని సమాచారం. బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

సంక్రాంతి సినిమాలపై రాజమౌళి సైలెన్స్.. కారణం?

'RRR' సినిమా రిలీజ్ డేట్ మారబోతుందని.. అందుతున్న సమాచారం ప్రకారం సినిమా 2020 అక్టోబర్ లో విడుదల కానుందని చెప్పారు. వివిధ భాషల్లో రిలీజ్ చేయనుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాలతో సినిమా విడుదల వాయిదా పడడం ఖాయమనిపిస్తుంది.

సినిమా షూటింగ్ డెబ్బై శాతం పూర్తయిందని అప్పట్లో 'RRR' బృందం ఓ అప్డేట్ ఇచ్చింది కానీ ఆ సమయంలో కూడా రిలీజ్ డేట్ ప్రస్తావన తీసుకురాలేదు. ఇక రీసెంట్ గా 'మత్తు వదలరా' సినిమా ఫంక్షన్ లో రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాని వీళ్లు ఏడాది పాటు తీశారు.. నేను 'RRR' రెండేళ్లు తీస్తే తప్పేంటి అంటూ రిలీజ్ డేట్ విషయాన్ని అడగొద్దని పరోక్షంగా చెప్పేశారు.

ఇంకా రెండు నెలల పాటు షూటింగ్ ఉండడం, గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం పట్టేలా ఉంది. అందుకే దసరా సమయానికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.