సినిమా హాళ్ల మీద దాడెందుకు చేస్తారు ?

Why people attack movie theaters

ఈ పెద్దనోట్ల రద్దు ప్రభావం సామాన్యుల వినోదసాధనమైన సినిమా పైనా పడింది. చాకీరీ చేసిన జనాలకు atm ల ముందు నిలబడ్డమే మరో బండచాకిరిగా మారింది. చేతికొచ్చిన ఆ కాసిన్ని పైసలతో నిత్యావసరాలే చూసుకుంటారు కానీ వినోదానికి తావెక్కడ? 


సరే ఇప్పటి నోట్లరద్దు ప్రభావంతో కాస్తోకూస్తో మంచి టాక్ వచ్చిన సినిమాల కలెక్షన్లూ ఆశాజనకంగా లేవు.అదే సమయంలో నాటి జనతా ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల నిర్ణయం రద్దుకు సంబంధించిన వార్త ఒక పాత దినపత్రికలో కనిపించింది.ఆ వార్తతో పాటూ సినిమాహాల్ పై సిక్కుల దాడి అన్న మరో వార్త కంటబడింది.

 

Why people attack movie theatersదాని పూర్వాపరాలు.....

 

సినిమాహాల్లు జనానికెంత వినోదాన్ని పంచినా ఒక్కోసారి ప్రజాగ్రహానికి గురికాకతప్పదు.మామూలుగా సెకండ్ షో సినిమా అయ్యాక ఆడిటోరియం అన్ని తలుపువేస్తారు.ఇక ఆఫీసు గదికన్నా క్యాబిన్ కు మరింత పెద్దతాళాలు వేస్తారు.కారణం ఖరీదైన లెన్సులు ఉండటం.మహా అయితే సెక్యూరిటీ వాచ్ మన్ ఒకరుంటారు.ఏవైనా గొడవలు జరిగినప్పుడు అల్లరిమూకలు సులభంగా దాడి చెయ్యగలరౌ.ఇవేం కర్మాగారాలు కాదుగా గుంపంతా ఊరి చివరున్న వాటిని చేరడానికి,ఉండేదే నగరం నడిబొడ్డునాయె.

 


ఇలా ప్రజల ఆగ్రహానికి గురికావడానికి ఎన్నెన్నో కారణాలు.అప్పట్లో విజయవాడలో రంగా మృతి చెందినప్పుడు అనేక సినిమాహాల్లను తగలబెట్టారు.ఇక రాజీవ్ గాంధి హత్యానంతరం హైదరాబాద్ లోని అప్పటి మాజీ ముఖ్యమంత్రి రామారావు హాల్లను తగలబెట్టారు.

 


ఇప్పటికీ కొన్ని సంఘాలు,కులాలవారు తమను అవమానించారని దాడి చేస్తామని హెచ్చరికలు చేస్తుంటారు.కొందరు పెద్దలు ఇలాంటివి న్యాయస్థానాల్లో తేల్చుకోవాలని నీతులు చెబుతుంటారు కానీ ఈలోగా వారికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.ఒక ప్రాంతం,కులం,మతం వారి మనోభావాలు దెబ్బతీస్తూ....చివరికి వికలాంగులనూ కించపరుస్తూ సినిమాలు తీస్తుంటారు. ఇతరులకు నానాచెత్త,వెకిలితనాలు ఆపాదిస్తూ సినిమాలు తీసే హక్కు ఈ సినిమావాళ్లకుందా?

 

ఉదాహరణకు హీరో కోస్తాప్రాంతం యాస మాట్లడుతూ దిగబడుతాడు.ఇక విలన్లు,కమెడియన్లు తెలంగాణ,రాయలసీమ మాండలికంలో మాట్లాడుతుంటారు.ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కాబట్టి ఎక్కువతక్కువ వారి గురించి చూపినా,వాగినా సినిమావాళ్ల వీపు పగిలే పరిస్థితి.అందులోనూ వీళ్లంతా ఉండేది తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ లో కాబట్టి.ఇక రాయలసీమ ఫాక్షన్ అంటూ నానా చెత్త తీయటమే.అప్పట్లో ఎక్కడినుంచి కొట్టుకొచ్చిన కథో తెలియదు కానీ అమితాబ్ హీరోగా "హమ్" అంటూ ఒక సినిమా వచ్చింది.

 

మాఫియా డాన్ కుటుంబంతో అజ్ఞాతంలో బతుకుతుంటాడు.ఈ సినిమాను మార్చి ఆటో డ్రైవర్ గా సామాన్యజీవితం గడిపే భాష అన్న తమిళ సినిమా తీసారు...ఇంకేం మన తెలుగు కాపీ మాస్టర్లు రెచ్చిపోయారు...నేపధ్యమేమో రాయలసీమ ఫాక్షన్,ఒకడేమో ఇడ్లీలమ్ముకునే సమరసింహారెడ్డి,మరొకడు పడవ నడిపే ఇంద్ర, ఇంకొకడు నాట్యాచార్యుడు నరసింహనాయుడు...అంతేనా పిల్లలు బాంబులేసే ఆది వగైరా వగైరా....ఈ సినిమావాళ్లకు అసలు రాయలసీమ ఎల్లలు,వారి యాస,ఆచారవ్యవహారాలు ఏమైనా తెలుసా?వాడెవడో ఒక సినిమాలో ఏకంగా పదేళ్ల కొడుకునే చంపుకుంటాడు,ఇక హీరోగాడు "మొక్కే కదా అని పీకేస్తే" అంటూ డైలాగ...నిజానికి అశ్వత్ధ(రావిచెట్టు),తులసి(మగవారి పేరు)అనే మొక్కల,చెట్ల పేర్లు రాయలసీమలో మాత్రమే కనిపిస్తాయి.ఇక ఆహార అలవాట్లనూ కించపరుస్తారు.

 

ఒకప్పుడు సినిమా డిస్ట్రిబ్యూటర్లు గుంతకల్లులో ఉండేవారు కాబట్టి వీళ్లకు అనంతపురం స్పెషల్ రాగిసంగటి మాత్రం తెలిసుండొచ్చు,కానీ పక్కనున్న కర్నూల్ జిల్లా ప్రధాన ఆహారం జొన్నరొట్టేలు,సంగటి అన్నది వీరికి తెలియదు. ఇంకో రాజకీయనాయకుడొచ్చాకే వరీన్నం తింటున్నారని ఒక నాయకుడు చెబుతాడు, రాయలకాలం నాటి చెరువలకింద,బ్రిటిష్ వారు తవ్వించిన కె.సి.కెనాల్ కింద వరి పండించింది తెలియదు.ఇప్పటికీ కర్నూల్ సోనా మసూరికున్న విలువ దేనికుంది?

 


అందరూ ఇలాంటి సంస్కారహీనులుంటారా అంటే ఉండరు.అప్పట్లో "ఒక్కడు" సినిమాలో యధాప్రకారం విలన్‌ది రాయలసీమ,అతని తల్లి కల్లుతాగుతూ ఉన్నట్లు చూపించారు.రాయలసీమలో స్త్రీలెవరూ కల్లు,మద్యం తాగరు.అభ్యంతరం చెబితే నిర్మాత యం.యస్.రాజు క్షమాపణ చెప్పాడు.ఇటీవల "అ ఆ" సినిమాలో కులాన్ని కించపరుస్తూ ఒక పాత్రకు పేరు పెడితే అభ్యంతరం చెప్పారని త్రివిక్రమ్‌శ్రీనివాస్ పేరు మార్చాడు. 

 


ఇవేకాదు సినిమా విడుదలకు ముందే మనోభావాలు కించపరుస్తున్నారంటూ కమల్ హాసన్ విశ్వరూపం ను నిషేధించమని ఒక మతం వారు నిరసన తెలిపారు(రాజకీయ కారణాలూ ఉన్నాయి),మోహన్‌బాబు నిర్మించిన సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయని ఒక సామాజిక వర్గం వారు అతని ఇంటిముందు నిరసన తెలిపారు.
ఇక ఒకరి సంస్కృతిసంప్రదాయాలను కించపరిచే సినిమాలను సెన్సార్ వాళ్లు చూసీచూడనట్టు వదిలివేస్తున్నారు.అసలు ఈ సెన్సార్ బోర్డ్ నియంత్రణెందుకు?స్వీయనియంత్రణ ఉండి సినిమాలు తీస్తే ఇలాంటి గొడవలుంటాయా?

 

మొత్తానికి అప్పట్లో సిక్కులదాడికి సంబంధిన కథ ఇది.....

 


మన సినిమాల్లో హీరోలు మారువేషాలు వేసి విలన్ గ్యాంగ్ ను వెర్రివాళ్లను చేయడం అనేక సినిమాల్లో చూసాము.అదేంటో బుగ్గన గాటు,పులిపిరి,గడ్డంతొ వచ్చేస్తే సినిమాచూస్తున్న చంటిపిల్లలకూ హీరో మారువేషం అదని తెలుస్తుంది కానీ అంతపెద్ద నక్కజిత్తుల విలన్ మాత్రం కనిపెట్టలేడు.
ఈకోవలో అప్పట్లో ప్రముఖ నిర్మాత యం.యస్.రెడ్డి(ఇప్పటి తరానికి చెప్పాలంటే అంకుశం,అమ్మోరు,అరుంధతి నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి తండ్రి)పి.సి.రెడ్డి దర్శకత్వంలో శోభన్ బాబు,జయసుధ,జయప్రద లతో నాయుడుబావ అనే సినిమా నిర్మించాడు.ఇది 1978 సంక్రాంతికి విడుదలైంది.


ఈ సినిమాలో శోభన్ బాబు మారువేషంలో...ఒక సిక్కుగా కనిపిస్తాడు...ఆయన ఒక క్లబ్ లో కూర్చుని సిగరెట్ తాగుతాడు.సిక్కుల సంప్రదాయంలో పొగతాగటం మహా పాపం...ఇంకేం..మా మతాన్ని అవమానిస్తారా అంటూ హైదరాబాద్ లోని సిక్కులు సినిమాహాల్ పైన దాడి చేసారు.


ఒకరి మనోభావాలను దెబ్బతీస్తూ సినిమాలు తీస్తే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులోనూ జరుగుతాయి