సీమ రిజర్వాయర్లన్నీ నింపేస్తున్నారు, ఇందుకేనా?

Why Naidu flooding Rayalaseema with Krishna water

నిన్న అంటే జనవరి 4 న ప్రారంభం కావలసిన ప్రతిపక్షనేత రైతు భరోసా యాత్ర ఒక రోజు ఆలస్యమైంది.  కాకపోతే దినపత్రికల్లో అప్పుడే మాటల యుద్ధాలు మొదలయ్యాయి .ఎవరి వర్గాలు వారివిగా ఉన్న ఉపముఖ్యమంత్రి కె.యి.కృష్ణమూర్తి,నంద్యాల శాసన సభ్యుడు భూమీ నాగిరెడ్డి,జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఈ విషయంలో ముప్పేట దాడి మొదలు పెట్టారు.

 

ఇక వీరందరి దాడుల్లో కామన్ పాయింట్...మునుపెన్నడూ లేని విధంగా బాబు సీమ  రిజర్వాయర్లన్ని పొర్లిపోయేలా నీళ్లతో నింపుతూ ఉన్నాడు. మరి ఎందుకీ యాత్ర?నువ్వు ప్రాజెక్టుల వ్యతిరేకివి అంటూ విమర్శలకు దిగారు.

 

ముందు ఈ నాయకుల పొగడ్తలు,విమర్శల సంగతి చూసి ఆ తర్వాత జగన్ యాత్ర సంగతి...అన్నీ క్రోడీకరించి రాయలసీమ భవిష్యత్తు గురించీ చూద్దాం.

 

ప్రస్తుతం రాయలసీమలోని కొన్ని జలాశయాల ప్రస్తుత నీటి నిల్వలు చూద్దాం..

 

వెలుగోడు(తెలుగుగంగ)రిజర్వాయర్ లో 9tmc(పంటలకు నీళ్లు ఇచ్చిన తర్వాత).గోరుకల్లు,ఔకు,గండికోట(ఇవన్నీ శ్రీశైలం కుడి కాలువ...నిజానికి గండికోట కు శ్రీశైలం కుడికాలువకు సమాంతరంగా తవ్వే గాలేరు-నగరి తయారు కానందున కుడికాలువ ద్వారా పంపారు)...3.4,2.5,3.5 టియంసి లు ఉన్నాయి..

 

.గోరుకల్లు,ఔకు రిజర్వాయర్ల కింద పంటలకు నీళ్లు ఇచ్చిన తర్వాత పరిస్థితి ఇది.ఇక హంద్రీ-నీవా నుంచి మొత్తంగా 21.5 టియంసి వాడుకోగా కర్నూల్ జిల్లాకు 6.5 టియంసి లు ఇవ్వగా మిగిలిన 15 టియంసి లు అనంతపురం జిల్లాకు తరలించారు.ఇవి కాకుండా నెల్లూరు జిల్లా సోమశిలలో ప్రస్తుతం 36 టియంసి ఉన్నాయి..వీటిలో 16 టియంసి లు ఆ పరిసరాల్లో పడిన వర్షాల ద్వారా చేరితే మిగిలిన 20 టియంసి లు కృష్ణ జలాలే.

 

ఒక్కసారిగా ఇన్ని నీళ్లు రాయలసీమ రిజర్వాయర్లలో నింపడానికి ఎన్నో కారణాలు...

 

---బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక రాయలసీమ అంటూ ఊరూరా యాత్రలు చెయ్యడం.

 

---రైతు నాయకుడు బొజ్జా దశరధరామి రెడ్డి సిద్దేశ్వరం అలుగు-రాయలసీమ వెలుగు అంటూ పిలుపునివ్వగా గ్రామాలనుంచి పార్టీలకు అతీతంగా జనం తరలి వచ్చారు...ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెరవక 30,000 మంది జనం సిద్దేశ్వరం చేరారు.

 

---వీళ్లే కాదు ప్రతి ఆదివారం సీమ 4 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కనీసం నాలుగు సంస్థలు రాయలసీమ భవిష్యత్తు గురించి చర్చలు జరుపుతున్నారు.

 

---మీరు సీమ జిల్లాల్లో 10 మందిని కదిలిస్తే 7 గురు అమరావతి అంటూ ఒకేచోట అభివృద్దిని కేంద్రాకరిస్తున్నారనే అసంతృప్తి ని వెళ్లగక్కుతారు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియకపోవు.

 

ఇప్పుడు రాయలసీమ రిజర్వాయర్లన్నీ  నింపుతున్నారని గొప్పలు చెబుతున్న నాయకులను మొన్న వేసవిలో నీళ్లు లేనప్పుడు మీరేం చేసారని ప్రజలు అడుగుతున్నారు.

 

ఇక బాబు ఇప్పుడు నీళ్లివ్వడానికి ప్రధాన కారణం...ఇవిగో ఇవన్నీ పట్టిసీమ నీళ్లే... తెచ్చి మీ గొంతులు,పొలాలు తడిపుతున్నా  అని చెప్పుకోవడానికి తప్ప మరొకటి కాదు.

 

---శ్రీశైల కనీసనీటిమట్టం 854 అడుగులనుంచి 836 అడుగులకు తగ్గిస్తూ GO-69-1996 తెచ్చింది బాబు కాదా?

 

సీమకు శ్రీశైలం నికరజలాలు,మిగులుజలాలు తెలుగుగంగ పారాలన్నా శ్రీశైలం నీటిమట్టం కనీసం 841 అడుగుల పైనే ఉండాలి మరి.ఇవి మొదలయ్యేది పోతిరెడ్డిపాడు దగ్గర.

 

ఇక రాజశేఖర్ రెడ్డి హయాంలో శరవేగంగా నిర్మాణాలు జరిగిన హంద్రీ-నీవ(834 అడుగుల పైబడి నీటిమట్టం ఉండాలి),గాలేరు-నగరి(ఇదీ పోతిరెడ్డిపాడు దగ్గర మొదలవుతుంది కాబట్టి 841 పైన ఉండాలి)మిగులు జలాల ప్రాజెక్టులకు నీళ్లు పారేదెలా?

 

ఇక ముచ్చుమర్రి హెచ్చులు చెబుతున్నారు...కర్నూలు,కడప జిల్లాలకు ప్రాణాధారమైన కె.సి.కెనాల్( తుంగభద్ర) జలాలు 10tmc అనంతపురం జిల్లాకు దానం ఇచ్చారు..ఒక 5 tmc శ్రీశైలం కాలువ దగ్గరనుంచి,మరో 5 ముచ్చుమర్రి నుంచి ఎత్తిపోసుకోవడానికి చేసిన పనులు తప్ప ప్రత్యేకంగా ఒక్క ఎకరా ఆయకట్టు స్థిరీకరణ జరగదు.

 

ఇంతా చేసి ఇవి మిగులు జలాలే..కాకపోతే ముచ్చుమర్రి దగ్గర 800 అడుగుల దిగువగనే ఎత్తిపోసుకోవచ్చు.ఇక ఈ పనులు చేస్తూ రాయలసీమంతా సుభిక్షం చెయ్యబోతున్నామంటారు.రేపు తెలంగాణా వారి పాలమూరు-రంగారెడ్డి,కల్వకుర్తి పథకాలు ప్రారంభ అయితే ఈ అనంతపురం కు కేటాయించిన నీళ్లన్నా ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంటుందా?

 

వేదిక మీద ప్రసంగించిన దివాకర్ రెడ్డి ఇతర నాయకులు కర్నూలు,కడప వారి 10 టియంసి మాకెందుకు..ఈ హంద్రీ-నీవా పారించుకుంటున్నాం అని ఎందుకు అనలేకపోయారు.

 

అంతటొ మొగలాయి మొనగాళ్లు తుంగభద్ర లో వారి వాటా కోసం ఎందుకు ఉద్యమించరు?

 

పూడిక,దూరాభారం ఉన్నందున జలచౌర్యం,పాతకాలువల వల్ల నీటి నష్టాలు జరుగుతుంటే సమాంతర కాలువ ఎందుకు సాధించుకోరు?

 

అడుక్కునే పక్కజిల్లాల మీద పడి గీక్కు తినాలా?

 

ఇక వృధాగా పోతున్న తుంగభద్ర జలాలను సద్వినియోగం చెయ్యడానికి గుండ్రేవుల రిజర్వాయర్ ను అడుగుతుంటే ఎందుకు పట్టించుకోరు.కె.సి.కెనాల్ పైనా రాజోలు దగ్గర ఒక మినీ రిజర్వాయర్ ను ఎందుకు పట్టించుకోరు?ఇక రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామంటూ ప్రతినలు చేసే వీరికి అంతలోనే పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల మీద అంత ప్రేమెందుకు వచ్చింది?ఈ కోట్లాది రూపయలన్నీ ఒక్క ఏడాదిలో వృధా కావా?

 

సరే పట్టిసీమ వల్ల ఈ నీళ్లు రాయలసీమకు వస్తున్నాయి,పోలవరమే పూర్తి చేయబోతున్నారు...మరి దీనివల్ల ఎగువరాష్ట్రాలు నిలుపుకోగా మిగిలే 45 టియంసి ల నీళ్లు రాయలసీమకే అనే జివొ ఇవ్వగలరా?

 

ఇందులో మేమూ ఎగువ రాష్ట్రమే అంటూ తెలంగాణ వాళ్లు వాటా అడగరా? 

 

సరే వాళ్లనూ ఒప్పించి నీళ్లే పారించినా రాయలసీమలో ఆ నీళ్లను నిలువ ఉంచుకునే రిజర్వాయర్లు,కాలువలూ ఉన్నాయా?

 

ఇప్పుడే కర్నూలు జిల్లాలో నింపిన హంద్రీ-నీవా నీళ్లను కృష్ణగిరి,పందికోన రిజర్వాయర్లలో నుంచి వాడుకోలేకపోతున్నారు..కారణం కాలువలు లేకపోవటం.గతేడాది కృష్ణ ఎగువ నుంచి చుక్క నీళ్లు శ్రీశైలం చేరలేదు...చేరినవన్నీ తుంగభద్ర నీళ్లే...గతేడాదిలాంటి పరిస్థితే మున్ముందు వస్తే ఇప్పుడిచ్చినట్లు నీళ్లివ్వగలరా? ఇదంతా పాలకుల,కోస్తాంధ్రుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం తప్ప సీమకు మీరు పట్టిసీమ/పోలవరం వల్ల మిగిలిన నీళ్లను GO ద్వారా ఇవ్వకుంటే హక్కు ఎక్కడిది? 

 

 

జగన్ భయం

 

పదవులకు ఆశపడ్డ పాలకపక్షం వైఖరి ఇదైతే....ప్రతిపక్షనాయకుడూ శ్రీశైలం నీటిమట్టం గురించి,మిగిలిన రిజర్వాయర్ల గురించీ అడగాలంటే ఆయనకూ భయమే.

 

2015 డిసెంబర్ లో తిరుపతిలో ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది...అన్ని పార్టీల వారొస్తామన్నా చివరికి అందరూ మొహం చాటేసారు.

 

కారణం..సీమ సమస్యల గురించి మాట్లాడితే..ఇదుగో మరో ప్రాంతీయ ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నారంటూ మసిబట్ట కాల్చి మొహాన వేస్తారు.

 

ఇక ఆ సభలో పాల్గొన్న కమ్యూనిస్ట్ నాయకులనూ మన సమస్య నీటిమట్టం గురించి మీ కృష్ణాజిల్లా అధిష్టాన నాయకులను ఒప్పించగలరా అంటే వాళ్లకు వాళ్ల జండాలకన్నా ఎక్కువగా మొహాలు ఎర్రబడ్డాయి.

 

మరి ఈ రోజు రైతు భరోసా యాత్రలో జగన్ ఏం మాట్లాడబోతున్నాడో,ఏ భరోసా ఇవ్వబోతున్నడో..రేపు మళ్లీ అధికారపక్షం నాయకుల మాటల తూటాలెలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే.