కొత్త సంవత్సరం వేడుక జరుపుకోవాలా.. వద్దా?
మిత్రులారా,
మునుపెన్నడూ లేని విధంగా కొత్త సంవత్సరం జరుపుకోవాలా, వద్దా అనే అంశం పై ఈసారి చాలా పెద్ద చర్చ జరుగుతున్నది. గతంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. కానీ ఈ ఏడాది ఎందుకో పరిస్థితి ఉల్టా అయింది. జరపాలా వద్దా? దీని బదులు ఉగాది జరుపుకోవాలి అన్న చర్చ తీవ్రరూపం దాల్చింది. తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది కాబట్టి ఉగాది నాడే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కొందరు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారైతే ఏకంగా కొత్త సంవత్సర వేడుకల కోసం దేవాలయాలను అలంకరించడం కాని, ప్రత్యేక పూజలు కాని చేయరాదని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు.
అంతర్జాతీయంగా ప్రామాణికమైన ఆంగ్ల సంవత్సరం మన జీవితంలో విడదీయరాని అంశమైపోయింది. పెళ్ళిరోజు కాని పుట్టినరోజు కాని ఎప్పుడు అని ఎవరినైనా అడిగితే ఫలానా జనవరి పదవ తేదీ అంటారు కాని వైశాఖ మాసం శుద్ధ దశమి అని తెలుగులో చెప్పరు.. చెప్పలేరు. ఒకవేళ ఉగాదిని కొత్తసంవత్సరం ప్రామాణికంగా తీసుకుంటే మనం ఆంగ్ల సంవత్సరాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. ఇది పూర్తిగా దుస్సాధ్యమే అవుతుంది.
అన్నిటికంటే ముఖ్యంగా మనం నూతన సంవత్సరాన్ని ఎలా ఆహ్వానిస్తున్నాం అన్న విషయాన్ని పరిశీలిస్తే....మద్యం విపరీతంగా సేవించడం, అర్ధరాత్రి వేళ అప్పటికే సుఖనిద్రలో ఉన్నవారికి నిద్రాభంగం కలిగించడం, తాగి వాహనాలను నడిపి ప్రమాదాలకు గురికావడం, ఇవే ప్రధానంగా గోచరిస్తాయి. ఈ చర్యలే కొత్త సంవత్సర వేడుకలను వెగటు పుట్టేలా చేస్తున్నాయి.
కొత్తసంవత్సరం లోకి మనం ప్రవేశిస్తున్నాం అన్న అత్యుత్సాహంతో మన ఆయు ప్రమాణం లోంచి ఒక సంవత్సరం వెళ్ళిపోయిందన్న విషయాన్ని మరచిపోతున్నాం. కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలకు, కొత్త ఆచరణకు పునాది కావాలి. మనలో ఉన్న దురలవాట్లను, అవలక్షణాలను తొలగించుకుని చైతన్యవంతమైన జీవన గమనంలోకి మళ్ళడానికి నూతన సంవత్సరం ఒక అధ్బుతమైన అవకాశం.
కాబట్టి నా ప్రియమైన మిత్రులారా... నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి తెలుగు ప్రజలంతా యావత్తూ సిద్దంగా ఉండాలని, ఆ శక్తి మనందరికీ సమకూరాలని ఆశిస్తున్నాను. ఆ దిశగా చేసే మన ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా యూత్ క్రమశిక్షణతో ముందుకు సాగడానికి అహర్నిశలూ ప్రయత్నిస్తారని ఆశిస్తూ... ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త సంవత్సర వేడుకలు జరుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...
....🏼
ఇట్లు...
చిటుప్రోలు వెంకటేశ్వర్లు,
సహాయ పారామెడికల్ అధికారి,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,
అక్కెనపల్లి, నార్కెట్ పల్లి మండలం,
నల్లగొండ జిల్లా.
(రచయిత చిటుప్రోలు వెంకటేశ్వర్లు వైద్య ఆరోగ్య శాఖలో అధికారిగా పనిచేస్తూనే... సోషల్ వర్కర్ గా సేవలందిస్తున్నారు.)