ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఊపిరి బిగబట్టి ఎదురుచూసిన నంద్యాల ఉపఎన్నిక ఫలితం బయటకొచ్చేసింది. అధికార పార్టీకి అనూహ్యమైన స్థాయిలో మెజారిటీ రావటం ఒకింత ఆశ్చర్యకరమైన విషయం. అవును మరి! బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని సహజసిద్ధంగా వ్యతిరేకించే ముస్లిమ్ లు, ఇటీవలికాలంలో టీడీపీకి దూరమవుతున్న బలిజలు అత్యధిక సంఖ్యలో ఉన్న నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవటం ఆశ్చర్యకరమే! ఎవరు గెలిచినా నెక్ టూ నెక్ పైట్ స్థాయిలో మెజారిటీ ఉంటుందని అందరూ ఊహించగా, ఆ ఊహలను తల్లకిందులు చేస్తూ టీడీపీ 27 వేలకు పైగా ఆధిక్యతతో గెలిచింది. ఈ ఫలితంపై టీడీపీకి అనుకూలించిన, వైసీపీ ప్రతికూలించిన  పాయింట్లను ఒకటొకటిగా చూద్దాం!

 

టీడీపీకి అనుకూలించిన అంశాలు

 

1.  భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఈ ఉపఎన్నిక చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఒక నియోజకవర్గంలో సిట్టింగ్ నాయకుడు చనిపోతే జరిగే ఉపఎన్నికలో సానుభూతి ఫ్యాక్టర్ బలంగా ఉంటుంది. అదీ భూమా నాగిరెడ్డి రాయలసీమలో ఒక బలమైన నాయకుడు. నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులకు కర్నూలుజిల్లాలో ఒక స్థాయి, గౌరవం ఉన్న నాయకులుగా పేరుందనే చెప్పాలి. అసలు ఎవరైనా పెద్ద నాయకుడు చనిపోతే ఏకగ్రీవ ఎన్నికకోసం ఆ నాయకుడి పార్టీ ప్రయత్నిస్తుంది… ప్రత్యర్థిపార్టీ కూడా చాలా సందర్భాలలో అంగీకరిస్తుంది. భూమా విషయంలో టీడీపీ అడిగినా వైసీపీ అంగీకరించలేదు. మొత్తం మీద చూస్తే ‘సానుభూతి’ టీడీపీకి అనుకూలించిన మొదటి పాయింట్.

 

2.  అధికారపార్టీ కావటం టీడీపీకి అనుకూలించిన రెండో అంశం. సహజంగా అధికారం చేతిలో ఉంది కాబట్టి అధికార యంత్రాంగాన్ని, బలాన్ని, బలగాన్ని, నిధులను తారాస్థాయిలో వాడేశారు. మంత్రులందరినీ అక్కడే మోహరించటంతో పెద్ద తలకాయలన్నీ మంత్రాంగం చేసి పోల్ మేనేజిమెంట్ ను అత్యున్నతస్థాయిలో జరిపాయి. డబ్బో, దస్కమో ఓటుకు రెండు-మూడు వేలదాకా ముట్టజెప్పారని చెబుతున్నారు. అయితే ఈ పనిని ఇరుపార్టీలూ విశృంఖలంగా చేశాయనుకోండి.

 

3.  ప్రతిపక్ష వైసీపీ వ్యవహారశైలి తెలుగుదేశం విజయానికి కలిసొచ్చిన మూడో అంశం. అంటే సెల్ఫ్ గోల్ చేసుకుందన్నమాట. ఈ అంశాలను వైసీపీకి ప్రతికూలించిన అంశాలలో పరిశీలిద్దాం.

 

4.  సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారులకు ముఖ్యమంత్రి హెచ్చరిక నాలుగో అంశం. తెలుగుదేశం గెలవకపోతే పెన్షన్స్, ఇతర సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని సాక్షాత్తూ సీఎమ్ చంద్రబాబు నాయుడే అన్యాపదేశంగా హెచ్చరించటంకూడా కొంత ప్రభావం చూపింది.

 

వైసీపీకి అనుకూలించని అంశాలు

 

 

 

1.  వైసీపీ విశ్వసనీయత - 2014 ఎన్నికల్లో భారతీయజనతా పార్టీ ఘన విజయం సాధించిననాటినుంచి ఆ పార్టీతో సఖ్యతకోసం వైసీపీ దోబూచులాట అందరికీ తెలిసిన విషయమే. అది నిగూఢమైన వ్యూహమో, సీబీఐ కేసుల భయమో వైసీపీ నేతలకే తెలియాలి. ఇటీవల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేపీ అడిగినదే తడవుగా మద్దతు ప్రకటించి కమలానికి దగ్గరవ్వాలని ఉవ్విళ్ళూరిన సంగతి తెలిసిందే. దీనివలన బీజేపీ వ్యతిరేక ఓటర్ల మనసుల్లో, తటస్థుల మనసుల్లో జగన్ విశ్వసనీయతపై సందేహాలు తలెత్తటం సహజం. చివరికి ఏమయ్యింది… వచ్చే ఎన్నికల్లో బీజేపీతో అంటకాగుదామని ఆశించినప్పటికీ ఆ ఆశలపై నిన్న అమిత్ షా బిందెడు నీళ్ళు కుమ్మరించారు.

 

2. జగన్ వ్యవహారశైలి - అసలే జగన్ విమర్శలు ఉక్రోషంతో, ఉడుక్కుంటున్నట్లు ఉంటున్నాయన్న వాదన బలంగా వినిపిస్తుండగా, నంద్యాల ప్రచారంలో ఆయన మరో అడుగు ముందుకేసి, ఎన్నికల కోడ్ ను కూడా పట్టించుకోకుండా, ముఖ్యమంత్రిని కాల్చి చంపాలి, బట్టలూడదీయాలి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనితోపాటు పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలు కూడా వైఫల్యాలకు కారణమని చెప్పాలి. అసలు భూమా నాగిరెడ్డి చనిపోయినప్పుడు జగన్ పరామర్శకు వెళ్ళకపోవటం ఆనాడే భూమా కుటుంబంపై సానుభూతిని మరికాస్త పెంచిందని కూడా అంటున్నారు.

 

3. రోజా చౌకబారు విమర్శలు - వైఎస్ ప్రతిపక్షనేతగా ఉన్నపుడు అసెంబ్లీలో తనను విమర్శిస్తున్న టీడీపీ ఛోటా మోటా నాయకులను ఒక మాట అనేవారు… ‘రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు’ అని. ఇప్పుడు వైసీపీకి రోజా, భూమన, చెవిరెడ్డి వంటి కొందరు నాయకులు అలాగే తయారయ్యారు. జగన్ మెప్పు పొందటంకోసమో, ఏమోగానీ వీరు రెచ్చిపోతుంటారు. అఖిలప్రియ పంజాబీ డ్రస్ లపై రోజా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

 

మొత్తంమీద అడుగడుగునా ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ముప్పేటదాడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగుదేశానికి నంద్యాల విజయం పెద్ద స్థైర్యాన్ని ఇచ్చిందని చెప్పాలి. అయితే ఈ విజయానికి వైసీపీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలన్న విషయాన్ని టీడీపీ నేతలు మరవకూడదు. అవును మరి… టీడీపీ విజయంలో వైసీపీ నేతల స్వయంకృతాపరాథం పాత్ర ఎంతో ఉంది.

 

రెండేపార్టీలు ఉన్న రాష్ట్రంలో, అదీ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో అధికారానికి ఆమడ దూరంలోనే ఉన్నప్పటికీ జగన్ దానిని గుర్తించకుండా అసంతృప్తితో, అభద్రతాభావంతో ఊగిపోవటం, రెచ్చిపోవటం విచారకరం. ఇకనైనా అతను హుందాగా ప్రవర్తిస్తూ బాధ్యతాయుతంగా మాట్లాడుతూ చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం విజయసాయిరెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప మరెవరి మాటా వినకుండా ఫ్యూడల్ విధానంలో పార్టీని నడపే విధానాన్ని అతను మార్చుకోవాలి.