తెలంగాణ కాంగ్రెస్ నేత డాక్టర్ శ్రవణ్ దాసోజు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను యదాతదంగా ప్రచురిస్తున్నాం.

శ్రీయుత ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి,
మీ ఇమేజీ తగ్గుతుందనుకున్న ప్రతీసారి ఏదో సరికొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి హంగామా చేయడం తమరికి ఓ అలవాటుగా మారింది. ఉద్యమ నేపథ్యంలోంచి అధికారంలోకి వచ్చిన మీ పాలనలో పట్టెడన్నం పెట్టే రైతన్నకు గడ్డు రోజులు దాపురిస్తాయని బహుశా ఎవరూ ఊహించఉండరు. కరువు కాటకాలతో అల్లాడిన రైతులను ఏనాడూ పట్టించుకోని మీరు, ఇవాళ రైతుల కేదో మేలు చేస్తున్నట్టు నటిస్తూ అకస్మాత్తుగా రైతు సమన్వయ సమితిని తెరపైకి తెచ్చి ఇక ఏదో అధ్భుతం జరిగిపోతుందంటూ ఆర్భాటం చేయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ”సంతలో పశువులను కొన్నట్లు ” మీరు కొనుక్కున్న నాయకులకు రాజకీయ నిరుద్యోగం బాపుకునేందుకేని భావిస్తున్నం. అందుకే రైతు సమన్వయ సమితి పేరిట ఓ దళారీ సంస్థను నెలకొల్పి, దానికి గుత్తా సుఖేందర్ రెడ్డి అనే ఓ రాజకీయ (బేహారి) దళారిని అధ్యక్షుడిగా ప్రకటించారు.

తాము పండించిన పంటలకు మద్దతు ధర రాక, దిగులుచెంది, మానసిక వేదనతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం పరామర్శించేందుకు కూడా తీరిక లేని మీరు హఠాత్తుగా రైతు పక్షపాతినంటూ... కాపునంటూ, పెదకాపాయన ఆధ్యర్యంలో... చినకాపాయనకు సమితి భాద్యతలు అప్పగిస్తున్నానంటూ కనికట్టు పదాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నరు. ఓవైపు ఆత్మహత్యలతో రాష్ట్రంలో రైతు హననం జరుగుతున్నాపట్టించుకోక ..” రోమ్ నగరము తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన ” చందంగా నాలుగేళ్లు ఫామ్ హౌస్ లో, ప్రగతిభవన్ లో కాలాయాపన చేసి ఎన్నికలు సమీపిస్తుండడంతో గంపగుత్తగా రైతుల ఓట్లు కొల్లగొట్టేందుకు .రైతు సంక్షేమం కోసమే సమన్వయ సమితిలంటూ బయలుదేరారు.

సమన్వయ సమితిల్లో టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యం
మీ అస్తవ్యస్త నిర్ణయాలు, అసందర్భ చర్యలతో విసిగి, అసంతృప్తితో రగిలిపోతున్న కార్యకర్తలను దారికి తెచ్చుకునేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. కార్యకర్తలంతా మీకు వ్యతిరేకంగా మారితే ఇబ్బందులు తప్పవని గ్రహించి, వారి రాజకీయ నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు సమన్వయ సమితి పేరిట పచ్చని గ్రామాల్లో చిచ్చు పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. నిజంగా మీకు రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయిన సర్పంచ్ లకు మరిన్ని అధికారాలిచ్చి, గ్రామాల్లో ఇప్పటికే పటిష్టం గా ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్ధను, వ్యవసాయ పరపతి సంఘాలను మరింత పటిష్టం చేసేవారు. కాని అందుకు భిన్నంగా పోటీ రాజకీయాలను, ఆధిపత్య ధోరణులను ప్రోత్సహించి ఆసందులో రాజకీయ లబ్ది పొందేందుకు కుయుక్తులు పన్నుతున్నరు. రాష్ట్రం కోసం ఉద్యమించినోళ్లకే సమన్వయ సమితిల్లో అవకాశమిస్తున్నమని చెప్పేకన్నా టీఆర్ఎస్ కార్యకర్తల నిరుద్యోగం బాపుతున్నం అని చెప్పితే బాగుండేదేమో. ముఖ్యమంత్రి స్ధాయిని దిగజార్చుతూ బహిరంగ సభల్లో బరాబర్ గా టీఆర్ఎస్ కార్యకర్తలకే సమన్వయ సమితిల్లో అవకాశం కల్పిస్తమనడం మీరాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనంగా భావిస్తున్నం. తెలంగాణా ఉద్యమంలో సబ్బండ వర్ణాలు, సకల జనులు జబ్బకు సంచి, చేతుల్లో జెండా పట్టుకుని,లాఠీ గోలీ ఖాయింగే తెలంగాణా లాయింగే అంటూ ముందుకు కదిలిన్రు. ఆత్మార్పణాలు చేసుకున్నరు. ఇవాళ ముఖ్యమంత్రి పీఠంలో మీరు కూర్చున్నరంటే అదంతా వారి పోరాటాల బిక్షేనన్న విషయం మరిచి అధికార మత్తులో జోగుతున్నరు. ఇంటికి పెద్దలా ఉండాల్సింది పోయి టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకే ప్రతినిధినన్నట్లు స్వార్ధపూరితంగా వ్యవహరించడం మంచిదికాదని హెచ్చరిస్తున్నం.

కౌలురైతుల ఉసురు పోసుకుంటున్రు 
వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టింపులేని మీరు రైతుల శ్రేయస్సు కోసం ఏదో చేస్తున్నట్లు ప్రకటించడం దారుణం. భూ సర్వేలో లెక్క తేలిన 1,61,00,000 లక్షల ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం నాలుగువేలు ఇస్తామనడం, కౌలు రైతులను ఎట్టి పరిస్థితుల్లో గుర్తించమని ఖరాఖండిగా చెప్పడం చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 15 లక్షలమంది చిన్న సన్నకారు కౌలు రైతుల నోట్లో మట్టి గొట్టే కుట్ర కాదా అని ప్రశ్నిస్తున్నం. ఆరుగాలం కష్టించే రైతన్నను ఆదుకోకుండా నిర్ధాక్షిణ్యంగా వారిని గుర్తించబోమంటూ తెగేసి చెప్పుతున్నరంటే, పెత్తందారి వ్యవస్థను పునరుద్దరించేలా మిమ్మల్ని నిజాం రాజు మరోమారు ఆవహించేడేమోనన్న అనుమానం కలుగుతోంది. ఎకరాకు నాలుగు వేల రూపాయల పథకంతో గ్రామాల్లో ఓట్లను గంపగుత్తగా దండుకోవాలన్నమీ దురాశ తప్ప ఇంకోటి కనిపించడంలేదు.

అవమానాలే తప్ప... పరామర్శలూ లేవు.సాయం లేదు. 
తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 4500 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే వారి చావులను కూడా అపహాస్యం చేసిన్రు. ఆత్మహత్యలతో రైతు కుటుంబాలు ఆగమయితుంటే దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన మీ మంత్రులు అన్నదాతలను అవమానించేరీతి మాట్లాడుతున్నరు. సమైక్యాంధ్ర కు నిలువెత్తు నిదర్శనం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతులను రౌడీ మూకలుగా అభివర్ణిస్తే.. భీమా డబ్బులకోసమే ఆత్మహత్యలుచేసుకుంటున్రని మరో మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడడం చూస్తుంటే మీకూ మీ మంత్రులకు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో అర్ధం అవుతోంది. సాక్షాత్తూ మీరే ఖమ్మం రైతుల ఆందోళనను, ”తన్నుకుంటాన్రు, గుద్దుకుంటాన్రు ” అంటూ అపహాస్యం చేస్తున్నతీరు ” తండ్రి తంతెల మీద ఏదో చేస్తే....కొడుకు కోనేట్లో మరేదో చేశాడన్న” చందంగా ఉంది. మీ నియోజక వర్గం లోనే దాదాపు 300 మందికి పైగా రైతుల ఆత్మహాత్యలకు పాల్పడితే పరామర్శించే తీరిక లేని మీరు రైతుల బాధలు తొలగేందుకే సమన్వయ సమితులంటూ, వారి బాగుకోసం కంకణం కట్టుకున్నట్లు మాట్లాడడం ”దయ్యాలు వేదాలు వల్లించిన ” చందంగా కనిపిస్తోంది.

భూములు లాక్కుంటూ రైతు శ్రేయస్సుకోసం పాటుపడుతున్నట్టు ప్రచారం
రైతుల కళ్లల్లో ఆనందం కోసమే తాపత్రయ పడుతున్నామంటూనే ప్రాజెక్ట్ ల పేరిట యేడాదికి రెండు పంటలు పండే భూములను లాక్కునేందుకు కుట్రలు చేసిన్రు. కరువుతో అల్లాడిన రైతాంగానికి 790 కోట్ల రూపాయలు కేంద్రప్రభుత్వం కరువుసాయం ప్రకటిస్తే ఒక్క రూపాయి పంచకుండా... ఇన్ పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా..తాత్సారం చేసి తగుదునమ్మా అంటూ ఇవాళ రైతు సంక్షేమమంటూ తిరుగుతున్నరు... జీవో నెంబర్ 173,194 లను విడుదల చేసి ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు ఆర్ధిక సాయం కింద 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, లోన్ సెటిల్ మెంట్ కోసం మరో లక్షరూపాయల సొమ్ము చెల్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి రెండున్నరేళ్లు గడిచినా ఇంత వరకూ ఒక్కరూపాయి ఇవ్వని గొప్పవ్యక్తిత్వం మీది. ఇవన్నీ మరిచి ఇప్పుడు 5 లక్షలకు భీమా చేయిస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టడం వెనుక రైతులను మరో మారు మోసగించే కుట్ర ఉన్నది. మరోవైపు కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఫసల్ భీమా యోజన అమలు చేయకుండా కొత్తగా రైతులకు చేసే మేలేంటో బహిరంగంగా చర్చిద్దాం రావాలని డిమాండ్ చేస్తున్నం.

ఇన్నాళ్లూ మొద్దునిద్ర నటించి ఇప్పుడేమో రంకెలా.
రైతులకు సాయం చేయకుండా తాత్సారం చేసిన కేంద్రం తో ఇన్నాళ్లూ ఎందుకు అంటకాగారో దాని వెనుక ఉన్న మతలబేంటో స్పష్టం చేయండి. మీ ఎంపీలు పార్లమెంటులో ఏనాడు కనీసమద్దతు ధరకోసం కొట్లాడకుండా, హైకోర్టు విభజన తోపాటు విభజన అంశంలోని ఏ ఒక్క హామీ కోసం డిమాండ్ చేయకుండా తాత్సారం చేసి మొద్దునిద్ర నటించి, ఇవాళ కేంద్రం నెరవేర్చలేదంటూ మాట్లాడడం వెనుకున్న మతలబేంటో మీమధ్య ఉన్నలోపాయికారి ఒప్పందమేంటో బహిర్గతం చేయండి. నోట్ల రద్దు అంశం మొదలు, జీఎస్టీ, రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక వరకు అన్నింటిలో అందరికన్నాఒకడుగు ముందే అన్నట్లు స్పందించి, మోడీ అడుగులకు మడుగులోత్తి తీరా ఇప్పడు వాడూ.. వీడంటూ తూలనాడడం చూస్తుంటే ఇన్నాళ్లూ మీకూ, ప్రధానమంత్రికి మధ్య కొనసాగిన రహస్య ఒప్పందాలేంటో, అవెందుకు చెడిపోయాయో బహిర్గతం చేయండి. బడ్జెట్ లో సరైన న్యాయం చేయకున్నా.. ఏనాడు కేంద్రాన్ని నిలదీయకుండా “కుంభకర్ణుడు నిద్రనుంచి లేచినట్లు” ఇవాళ కేంద్రం పై ఒంటికాలిపై లేస్తూ,రంకెలేస్తూ మీ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నరు.

ఆడలేక మద్దెల ఓడున్నట్లు
నాలుగేళ్లుగా ఏ ఒక్క ప్రాజెక్ట్ ను పూర్తిచేయని మీరు, కాంగ్రెస్ హయాంలో దాదాపు 90 శాతం పూర్తయిన ప్రాజెక్ట్లను రీడిజైనింగ్ పేరిట కాలాయాపన చేసి ప్రాజెక్ట్ ల డిజైన్ మార్చికోట్లాది రూపాయలను దోచుకుంటున్నరు. పైగా ”ఆడలేక మద్దెల ఓడన్నట్లు ” గడిచిన 70 ఏళ్లుగా కాంగ్రెస్ ఏంచేసిందని తూలనాడడం మీ దివాళా కోరు తనం ఏస్ధాయికి దిగజారిందో తెలుస్తోంది. రాష్ట్రంలో..దేశంలో ఇవాళ ఉన్న ప్రముఖ ప్రాజెక్ట్ లన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించివేనన్న కనీస ఇంగితం లేకపోవడం , ఎన్నో రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించి ఎగుమతులు చేసే స్థాయిలో ఉన్నామంటే అది కాంగ్రెస్ పాలకులు దూరదృష్టి కి నిదర్శనమన్న కనీస సోయి లేక పోవడం దురదృష్టకరం.

కల్లబొల్లి కబుర్లతో కాలాయాపన
దశాబ్దాలుగా దిక్కుతోచని రైతాంగానికి తామే దిక్కుగా మారుతమని, గడిచిన నాలుగేళ్లుగా ఎందుకు పెద్ద దిక్కుకాలేక పోయారో చెప్పండి. రైతుల బతుకు చెప్రాసులకన్నా అధ్వాన్నంగా ఉందని ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నరు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కష్టాలతో రైతులు చనిపోయిన్రని, దొంగఏడుపులతో కల్లబొల్లి కబుర్లు చెబుతున్న మీరు మీ పాలనాకాలంలో కొనసాగిన ఆత్మహత్యలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నరు. గ్రామాల్లో రైతు సమన్వయ సమితి భవనాల నిర్మాణం కోసం 4, 5 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పుతున్న మీరు వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పండి. గతంలో దళితుడే ముఖ్యమంత్రని, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మిస్తమని, దళితులకు మూడెకరాల వ్యవసాయభూమి ఇస్తామని మోసగించిన మీరు అదే తరహాలో రైతులను ఉద్దరిస్తమని మోసగించేందుకు కుట్రకు తెరలేపారు.

కల్తీ విత్తనాలు, పురుగుల మందులు అరికట్టలేని అసమర్దులు 
కల్తీ మందులు మరియు కాన్సర్ కారక హెటీ కాటన్ విత్తనాన్ని మోన్ సాంటో కంపెనీ కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే తెలంగాణా రైతులకు అమ్ముతున్న వారిని నియంత్రించ లేకపోవడం మీ అసమర్ధత, వైఫల్యం కాదా...? ఈ దుర్మార్గులతో మీకున్న లోపాయి కారి ఒప్పందమేంటో వెల్లడించండి. గతంలో ద్వాక్రా సంఘాలు, మార్కెట్ కమిటీలు గ్రామాల్లోనే ధాన్యం సేకరించి రైతులకు లాభం చేకూర్చింది నిజం కాదా..? ఇప్పుడు పంటకాలనీలంటూ కొత్తగా రైతులను మభ్యపెట్టడం ఎవరి ప్రయోజనాలు నెరవేర్చడానికో చెప్పండి. విత్తనాల ఎంపిక, నియంత్రిత విధానం అంటూ వల్లిస్తున్నమీరు ఉచితంగా నాణ్యమైన విత్తనాలను, ఎరువులను, పురుగుమందులు సరఫరా చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలని సవాల్ చేస్తున్నం. లక్షరూపాయల రుణమాఫీ పేరిట వడ్డీ.. మాఫీ చేయక పోవడంతో 35 లక్షల పాస్ బుక్ లు ఇంకా బ్యాంకుల్లో తనఖా ఉన్నాయి. ఈ విషయం పై మాట్లాడకుండా, రైతులకోసం అసెంబ్లీ లో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ పెడుతామనడం హాస్యాస్పదం కాక మరేమిటి. సమన్వయ సమితిల కోసం 6,7 వేల కోట్లు రూపాయల ఖర్చుచేసేందుకు చూపించే శ్రధ్ద...బ్యాంకుల్లో రైతులు తనఖా పెట్టిన పాస్ బుక్కులు విడిపించేందుకు చూపిస్తే రైతు పక్షపాతి అని నమ్మేవాళ్లం. బ్యాంకులకు ప్రభుత్వమే గ్యారంటీ గా వ్యవహరించి సకాలంలో రైతులకు లోన్లు ఇప్పించి, వడ్డీ మాఫీ చేయిస్తే రైతు బాంధవులుగా గుర్తించేవాళ్లం, కాని ఇవేవీ చేయకుండా నేనూ రైతునంటూ.. నేనూ కాపునేనంటూ... కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తూ మరోమారు రైతులను మోసగించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నం.

మీ స్వంత నియోజకవర్గంలో రైతుల తిప్పలు (కడగండ్లు)
“కూట్లో రాయితీయలేనోడు ఏట్లో రాయితీసిండన్న” చందంగా మీతీరు కనిపిస్తోంది. మీ స్వంత నియోజక వర్గం.. గజ్వేల్ మార్కెట్ యార్డులో రైతులకు పంట అమ్మిన డబ్బులు సకాలంలో ఇప్పించడం లో విఫలమయ్యారు. ఈ సీజన్ ముగిసే నాటికి దాదాపు 8135 క్వింటాళ్ల కంది పంట అమ్మిన 1789 మంది రైతులకు డబ్బులు ఇవ్వడంలో విఫలమయి కేవలం 100 మంది రైతులకు మాత్రమే డబ్బులు చెల్లించగలిగారు. మిగితా రైతులంతా తమ డబ్బులు ఇప్పించాలంటూ రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. పది క్వింటాళ్ల కన్నా ఎక్కువ పంట తీసుకొస్తే మార్కెటింగ్ అధికారి అంగీకార పత్రం జతచేయాలన్న నిభంధన పెట్టారు. అందుబాటులో అధికారి లేకపోవడం వల్ల రైతుల తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ప్రభుత్వం సకాలంలో పంట కొనకపోవడం వల్ల కుటుంబ అవసరాలకు డబ్బులు సర్ధుబాటు కాకపోవడం వల్లే రైతులు తమ పంటను దళారులకు అడ్డికి పావుశేరు చొప్పున అమ్ముకున్నరు. ఇంకొందరు రైతులు గిట్టుబాటు ధర లేక పోవడంతో పంటలు తగలబెట్టుకుని నిరసన తెలియజేసినా మీరు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఇవాళ సమన్వయ సమితి పేరిట రైతుల కేదో చేస్తామని చెప్పడం విడ్డూరమే.

గజ్వేల్ మార్కెట్ యార్డు వివరాలు (28.02.2018నాటికి) 
అధికారిక లెక్కల ప్రకారమే.. గజ్వేల్ మార్కెట్ యార్డు పరిధిలో దాదాపు 50 వేల క్వింటాళ్ల పైచిలుకు పత్తి పండితే..ఎక్కువ మొత్తం దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ మార్కెట్ లో కేవలం 588మంది రైతులు 8034.8 క్వింటాళ్ల పత్తిని విక్రయిస్తే.. బహిరంగ మార్కెట్లో 10,179 మంది రైతులు దాదాపు 44,973 క్వింటాళ్ల పత్తిని దళారులకు అమ్ముకున్నరు. ఇందుకు కారణం బహిరంగ మార్కెట్ లో పత్తి ధర ఎక్కువుంటే ప్రభుత్వ మార్కెట్లో తక్కువగా ఉండడమే. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు సరైన ధర కల్పించేందుకు కృషిచేయకపోవడం, తద్వారా వారి శ్రమను దోపిడికి గురిచేసే దుర్మార్గం కాదా..ఒకవేళ కేంద్రం ధర తక్కువగా నిర్ణయిస్తే తెలంగాణా రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటూ పదే పదే చెప్పుతున్న మీరు రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ ను ఎందుకు ఇవ్వలేకపోయారో స్పష్టం చేయాలి.

అదేవిధంగా మొక్కజొన్న పంటను కేవలం 261 మంది రైతులు గజ్వేల్ ప్రభుత్వ మార్కెట్ లో తమ పంటను అమ్ముకుంటే.. 960 మంది రైతులు దాదాపు 12,399 క్వింటాళ్ల ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక వరి పండించే రైతుల గోస మరింత దీనంగా ఉంది.. మద్దతు ధర , సకాలంలో కొనుగోళ్లు జరగక పోవడం వల్ల పుష్కలంగా పండిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ మార్కెట్ కు ఇబ్బడి ముబ్బడిగా తరలించాల్సిన రైతులు దళారులకు అడ్డికి పావుశేరుచొప్పున అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు. రికార్డుల ప్రకారం చూస్తే కేవలం 124 మంది రైతులు మాత్రమే 5942.8 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వ మార్కెట్ లో అమ్మారు. దీన్ని బట్టే మీ ప్రభుత్వం దళారులకు దోచిపెట్టేందుకే కావాలనే కొనుగోలు చేయకుండా, డబ్బులు చెల్లించకుండా రైతులను శ్రమదోపిడి చేస్తుందని అనుమానం వస్తోంది.

రైతుల సమస్యలకు ప్రధానకారణం మీరనుసరిస్తున్న విధానాలే, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మద్దతు ధర ఇప్పించలేని మీ అసమర్ధత, నిస్సహాయతనుంచి తప్పించుకోవడం కోసం నెపం కేంద్రం పై నెట్టేసి తప్పుకోవాలనుకుంటున్నరు. మరో పక్క రైతు సమన్వయ సమితిల పేరిట మీ పార్టీ పటిష్టత కోసం గ్రామల్లో చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ, రైతు ఆత్మహత్యలకు, ఇతర సమస్యలకు మీరు కారణం కాదనే భ్రాంతి కలిగిస్తూ జాతీయ రాజకీయాల పై మాట్లాడుతున్నరు.

ఎవరినైనా ఒక్కసారో లేక రెండుసార్లో మోసగించవచ్చుకాని ఎల్లవేళలా మోసగించడం,మభ్యపెట్టడం సాధ్యం కాదని, తాము మోసగించబడుతున్నమని గ్రహించిన మరుక్షణం ప్రజల్లో పెల్లుబికే ఆగ్రహ జ్వాలల్లో మీరు, మీ పార్టీమిడుతలా మాడిపోవాల్సి వస్తుందన్న వాస్తవం గ్రహించండి.
ఇట్లు
డాక్టర్ శ్రవణ్ దాసోజు
ముఖ్య అధికార ప్రతినిధి, తెలంగాణా కాంగ్రెస్