రసాభాస -2
మొదటి భాగం ఇక్కడ చూడండి
రెండవ భాగం
4 రౌద్రరసాభాస ।।
రౌద్రరసానికి స్థాయిభావం క్రోధం. ఆ క్రోధాన్ని శత్రువులమీద కాక, గౌరవించదగిన పెద్దవారిమీద, తన మీద ఆధారపడి ఉన్న స్వజనం మీద, అల్పుల మీద, అసలు ఎవరిమీదనైనా నిష్కారణంగానో చూపితే అది రౌద్రరసాభాస.
రాజునైన తాను ఎంతో మోజు పడి అడిగినా శబలా ధేనువును తనకు ఇవ్వలేదనే క్రోధంతో విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిమీద చూపిన దుందుడుకుతనం రౌద్రరసాభాస.
అలాగే, "మీరు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదేం" అని నిండు సభలో ప్రజలు ఎవరైనా నిలదీసి అడిగితే - "ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మా ఎగస్పార్టీ పంపిన ఏజెంటువి. ఎక్కువ మాట్లాడకు." అని ఆ అడిగిన వారిపై కొందరు రాజకీయనాయకులు గట్టిగా కోప్పడి, గద్దించి నోరుమూయించడం కూడా కూడా ఇటువంటి రసాభాసే.
5 వీర రసాభాస।।
వీరుడంటే చాకచక్యంతో కత్తులు కర్రలు తిప్పగలిగినవాడనో లేక మంచి నేర్పరితనంతో బాణాలు వేసి శత్రువులను చంపగలిగినవాడనో ఒక భ్రమ చాలామందికి ఉంటుంది. కానీ ఒక గొప్ప పనిని చేయడంలోను, ఔన్నత్యాన్ని సాధించడంలోనూ ఉత్సాహం చూపేవాడిని వీరుడు అంటారని అలంకారశాస్త్రాలు చెబుతాయి. అందువల్ల వీరరసానికి స్థాయిభావం ఉత్సాహం. కానీ, ఒక పనికిమాలిన పనిని చేసేందుకు ఉత్సాహం చూపడం వీరరసాభాస.
రాజ్యం గెలుచుకొనడం గొప్ప పనే. కానీ యుద్ధంలో గెలిచి సాధిస్తే అది వీరోచితం. కానీ కౌరవులు జూదమాడి పాండవుల రాజ్యాన్ని గెలుచుకునేందుకు ఉత్సాహం చూపి పెద్దలందరికీ తమ చర్యలతో జుగుప్స కలిగించినందువల్ల అది వీరరసాభాస అయింది.
ఎన్నికల సమయంలో సమరశంఖారావం పూరించి, పాలకపక్షం చేసిన తప్పులన్నిటినీ ఎత్తి చూపుతూ, మేమైతే ఇలా చేసేవారం, మీరు మమ్మల్ని గెలిపించి చూడండి, మేము మిమ్మల్ని మీ జీవితాన్ని అంత ఎత్తున కూర్చోబెడతాము అందుకు మొదటి సంతకం మీ కోసమే అంకితం చేస్తాం అని వాగ్దానాలు చేసి, గెలిచి అధికారంలోనికి వచ్చిన తరువాత, నిధులు సరిపోవటం లేదు, కేంద్రం సహకరించటం లేదు అని కుంటి సాకులు చెప్పడం కూడా వీరరసాభాస.
ఎన్నికల సమయంలోనే, "మీ తరపున నేను ప్రశ్నిస్తా" అని భరోసా ఇచ్చి, ఆ తరువాత నోరుపెగలక ట్వీట్లతోను, సలహాలతోను, అక్కడక్కడా సభలు పెట్టి అభిప్రాయాలను వెలిబుచ్చడంతోను సరిపెట్టడం కూడా వీరరసాభాస. పిల్లల భాషలో చెప్పాలంటే థౌజండ్ వాలా బాంబులను చేతిలో పెట్టుకుని పేలుస్తానని గొప్పలు చెప్పి, అందరినీ ప్రదర్శనకు ఆహ్వానించి, చివరకు ఒక పాముబిళ్ళతో సరిపెట్టి, "చూశారుగా, ఇక పొండి" అనడం అన్నమాట.
6 భయానకరసాభాస।।
భయానకరసానికి స్థాయిభావం భయం. ఉదాహరణకు, అతి దగ్గరగా పామునో, మరో క్రూరజంతువునో చూసినపుడు - వణుకు పుట్టడం, రోమాలు నిక్కపొడుచుకొనడం, నోట తడి ఆరిపోవడం, ఎటువంటి భౌతిక శ్రమ లేకుండానే గుండె వేగంగా కొట్టుకొనడం మొదలైనవన్నీ భయానికి చిహ్నాలు. కానీ, భయపడాల్సి వచ్చినపుడు భయం కాకుండా నవ్వు పుట్టడం వంటివి జరిగితే అది భయానకరసాభాస.
పాతతెలుగు సినిమాల్లో రాజకుమారుడి వెంట పోయిన అనుంగు చెలికాడు ఒకడు అడవిలో దారి తప్పి, నిద్రపోతూ ఉండగా ఎలుగుబంటి వచ్చి అతనిని నిద్రలేపడం, అతడు అదేమిటో చూడకుండా విసుక్కొనడం, చివరకు అదేమిటో తెలుసుకొనేసరికి భయం వేసి అటూ ఇటూ దానికి దొరకకుండా పరుగెత్తి చెట్టెక్కడం - ఇలాంటివన్నీ భయానకరసాభాసలు. విలను బెదిరింపులు భయం పుట్టించకుండా నవ్విస్తే అది ఈ రకం రసాభాస. నేను మహా ధైర్యవంతుడిని అని గొప్పలు చెప్పి బ్రహ్మానందం వేగంగా వెడుతున్న వాహనంలో కూర్చుంటాడు. చివరకు ఆ వేగాన్ని తట్టుకోలేక ఆ బ్రహ్మానందం "ఆపండర్రోయ్" అని భయంకరంగా కేకలు పెడుతూ ఉంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. ఇది హాస్యరసంగా మారిన భయానకరసాభాస.
''నీ బండారం బయటపెడతా - ప్రజలకు నిజాలు తెలియజేస్తా, ఈ కేసునుండి తప్పించుకొనడం అసాధ్యం, అంత పక్కాగా అన్ని సాక్ష్యాలూ ఉన్నాయి" అంటూ ఒక రాష్ట్రపు ముఖ్యమంత్రి మరొక రాష్ట్రపు ముఖ్యమంత్రిని భయపెడుతూ ఉంటారు. ఈయన భయపడకుండా ఉన్నట్టు నటిస్తూ, చూసుకో, నీ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడతా, అసలు సెక్షన్ 8 ఏమైంది" అంటూ తిరిగి బెదిరిస్తూ ఉంటారు. ప్రజలు ఈ తీవ్రతను చూసి ఎవరిదో కొంప మునుగుతుంది అనుకుంటారు. చివరికి ఈ పరస్పర బెదిరింపులు అన్నీ గాలిలో దూదిపింజల్లా తేలిపోతాయి. ఇటువంటి కేసులలో నిజమేమిటో తెలిసినా తీర్పు మరొక విధంగా వస్తే ప్రజలకు న్యాయవస్థమీద భయగౌరవాలు పోతాయి. పైగా ఆ వ్యవస్థమీద అపనమ్మకం కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఉండవలసిన చోట భయం లేకుండా పోవడం కూడా భయానకరసాభాస. అదొక విషాదం కూడా!
7 భీభత్సరసాభాస।।
భీభత్సరసానికి స్థాయిభావం జుగుప్స. దేనినైనా చూసినపుడో లేదా విన్నపుడో మనకు రోత కలిగితే అక్కడ భీభత్సరసం ఉన్నట్టు. కానీ, జుగుప్స కాకుండా కోపం కలిగితే అది రౌద్రరసం అవుతుంది. శోకం కలిగితే అక్కడ కరుణరసం కలుగుతుంది. ఉభయత్ర భీభత్సరసాభాస కలిగినట్టు అర్థం చేసుకోవాలి.
కళింగయుద్ధం ముగిశాక అశోకుడు యుద్ధభూమికి వచ్చినపుడు ఎక్కడ చూసినా శవాలు కనబడ్డాయి. వాటిని నక్కలు రాబందులు పీక్కు తింటున్నాయి. అడుగడుగునా దుర్భరమైన దుర్గంధం ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. అటువంటి భీభత్సపరిసరాలలో అశోకునికి శోకం కలిగింది. పశ్చాత్త్తాపం కలిగింది. శాశ్వతమైన మనః పరివర్తన కలిగింది. అందువల్ల భీభత్సరసాభాస జరిగి కరుణరసం ఉద్భవించింది. అందువల్ల ప్రపంచానికి మేలే జరిగింది.
మామూలుగా అయితే బూతు మాటలకు రోత కలగాలి. ఓ ప్రముఖ టీవీ ప్రోగ్రాములో సమాజంలో అతి ప్రముఖులుగా చలామణీ అవుతున్న ఇద్దరు వ్యక్తులు న్యాయనిర్ణేతలుగా ఉన్నారట. ఆ ప్రోగ్రాములో పాల్గొనేవారు నానారకాల బూతు మాటలు , బూతు చేష్టలు చేస్తారట. వాటిని చూసి ఆ న్యాయనిర్ణేతలు ఇద్దరూ పగలబడి నవ్వుతూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారట. ఈ విధంగా రోత కలగవలసిన చోట నవ్వు కలిగిందంటే - అది భీభత్సరసాభాస అన్నమాట.
ఎన్నికల్లో ప్రత్యర్థులపై నిజమైనవి, నమ్మశక్యం కానివి కూడా లెక్కలేనన్నిఆరోపణలు చేయడం ఈరోజుల్లో సాధారణమై పోయింది. అమెరికా ఎన్నికల్లో కూడా ఇటువంటి ఆరోపణలు లెక్కలేనన్ని చూశాం. నమ్మిన వారు ఎందరో, నమ్మని వారు ఎందరో, కానీ, వారి వోట్లు దేశ రాజకీయ భవిష్యత్తును తేల్చేస్తాయి. అంతవరకు సరే - కానీ చట్టసభల్లో పధ్ధతి ప్రకారం ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసిన బాధ్యత పాలకపక్షానికి ఉంది.
కానీ, ఆ విధంగా సమాధానాలు ఇవ్వలేక - "నీవంటి అవినీతి పరుడికి నేను జవాబు చెప్పనక్కరలేదు" అనో, లేక "ఎన్నో కేసులు ఉన్న నీకు నన్ను ప్రశ్నలు అడిగే అర్హత లేదు" అనో తప్పించుకొనడం ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు. పాలకపక్షం అటువంటి బాధ్యతలేనితనం, లెక్కలేనితనం చూపితే ప్రజలకు రోత కలగడం ఖాయం. కానీ, ఇదే రకంగా వాళ్ళు వ్యవహరిస్తూ పోతే చివరకు అది వికటించి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆ రోత కాస్త కోపంగా పరిణమించి, ఇరుపక్షాలు స్థానాలు మార్చుకొమ్మని ప్రజలు తీర్పును ఇవ్వగలరు. కాబట్టి, భీభత్సమే కాదు, భీభత్సరసాభాస కూడా కష్టమే!
8 అద్భుతరసాభాస।।
అద్భుతరసానికి స్థాయిభావం విస్మయం. అపూర్వమైన వస్తువును చూసినపుడో లేక దానిని గూర్చి విన్నపుడో విస్మయం కలిగి అది అద్భుతం అనిపిస్తుంది.
రాజస్థాన్ లో ఎడారిలో పుట్టిపెరిగిన వాడికి సముద్రం చూడడం ఒక అద్భుతమైన విషయం. విశాఖపట్నంలో పుట్టి పెరిగినవాడికి అది అద్భుతం కానే కాదు. కానీ వాడు ఎడారిని చూస్తే ఆశ్చర్య పోతాడు. కానీ ఆ రాజస్థాన్ వాడు ఈ ఇసుకలో వీడికేం అద్భుతం కనిపించిందో అని ఆశ్చర్యపోవాలి. ఇలా ఒకరి అద్భుతం మరొకరికి అద్భుతరసాభాస కావచ్చు. రామాయణంలో సముద్రంపై వంతెన అనేది ఒక అద్భుతమైన విషయం. ఈరోజు చాలాచోట్ల సముద్రంపై వంతెనలు ఉన్నాయి. అద్భుతం కానేకాదు. మాయాబజార్ రోజుల్లో ప్రియదర్శిని పేటిక ఒక అద్భుతం. కానీ, స్కైపులు, ఫేస్బుక్ లైవ్ వీడియోలు అలవాటైన ఈ రోజుల్లో ఇవేమీ అద్భుతాలు అనిపించనే అనిపించవు. మాజిక్ షోలలో అద్భుతం కలుగుతుంది. కానీ, ఆ మేజిక్ రహస్యం తెలిస్తే ఇంతేనా అని ఆ షోలు అటుమీదట చప్పగా అనిపిస్తాయి. అది రసాభాస.
ఒకప్పుడు సర్కస్ లో చిలుకలు సైకిలు తొక్కడం, ఏనుగు ఫుట్బాల్ ఆడటం, ఎలుగుబంట్లు డాన్స్ చేయడం, సింహాల నోట్లో మనిషి తలపెట్టడం వంటివి చూసి చిన్నా పెద్దా అందరూ అద్భుతం అంటూ చప్పట్లు కొట్టేవారు. కానీ, కొందరు జాలిగుండెల పెద్దవారికి అటువంటివి చూసేసరికి విస్మయం బదులుగా శోకం కలిగిందట. ఆదెబ్బతో, అటువంటి సర్కస్ షోలన్నీ రసాభాస అయిపోయాయి. కోర్టు తీర్పు ప్రకారం ఇపుడు జంతువులతో సర్కస్ చేయించకూడదు.
కొద్ది వారాల క్రితం మోడీగారు డీమానిటైజషన్ ప్రకటించేసరికి సామాన్యులకు ఆయన నల్లడబ్బనే నరకాసురునితో యుద్ధం చేయబూనిన శ్రీకృష్ణమూర్తిలా కనిపించారు. అద్భుతరసం పుట్టిందన్నమాట. కానీ, నల్లడబ్బును నిజంగానే కట్టలకొద్దీ దాచుకున్నవారికి ఆయన మీద కోపం కలిగి రౌద్రరసం పుట్టి ఉంటుంది. బ్యాంకులలోను, ఎటిఎం లముందు క్యూలలోను నిలబడలేక అవస్థలు పడుతున్నవారికి శోకం కలిగి కరుణరసం ఉద్భవిస్తోంది. 2019 వరకు అద్భుతరసం కొనసాగితే మోడీ మళ్ళీ గెలుస్తాడు. కానీ, అద్భుతం అనుకున్నది కాస్త రసాభాస అయి, ఆయా ప్రజల కోపం, శోకం అంతవరకూ కూడా కొనసాగితే ఆయనకు ఓటమి ఖాయం! అద్భుతాన్ని రసాభాస చేస్తే ఫలితాలు ఇలా ఎదురుతిరుగుతాయని ప్రాక్టికల్ గా తెలుస్తుంది.
9 శాంతరసాభాస।।
శాంతానికి స్థాయిభావం శమం. అంటే నిశ్చలత. రాగద్వేషాదులు, అహంకార మమకారాలు లేని నిశ్చలత. ఈ శమం అలజడులు లేని కాలంలో మహారాజులలోను, తపోధనులలోను, ఉన్నంతవరకు చక్కగా ఉంటుంది. కానీ, అలజడులు ఉన్నపుడు కూడా శమం కలిగి ఉంటే అది శాంతరసాభాస.
సీతను ఎత్తుకుపోయినపుడు రాముడు నిశ్చలంగా ఉంటే "ఆహా! ఎంత గొప్ప ప్రశాంతచిత్తుడో కదా రాముడు!" అని మెచ్చుకోగలమా? రాముడలా ఉంటే రసాభాస జరిగినట్టే కదా? కౌరవులు ద్రౌపదిని అవమానిస్తున్నప్పటికీ పాండవులు సహించడం వల్ల భీష్మద్రోణాది విజ్ఞులకు తప్ప అక్కడున్న మిగిలిన అందరికీ లోకువ కాలేదా?
మన భారతదేశం కూడా ప్రపంచంలో లోకువ కావడానికి కారణం సరిగ్గా శాంతరసాభాసే. పాకిస్తాన్ అండతో టెర్రరిస్టులు తండోపతండాలుగా మన దేశం మీద పడి విధ్వంసం సృష్టిస్తూ ఉండగా పాకిస్తాన్ తో మీరు చేస్తున్న పని తప్పు , ప్లీజ్ అలా చేయకండి అని దశాబ్దాల తరబడి బ్రతిమాలాడుతూ ఉండటం వల్ల మన శత్రువులకు లోకువై పోయాం.
<><><><><><>
ఇవీ, రసాభాసాలలో రకాలు. కొన్ని రసాభాసలు మంచిని చేస్తే, మరికొన్ని దుష్పరిణామాలకు దారి తీస్తాయి.
కాబట్టి, నవరసాలను చక్కగా పోషించడమనే కళ కేవలం నటులకు మాత్రమే కాదు, రాజకీయనాయకులకు కూడా అవసరమే. రసాభాస జరిగితే పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలిసింది కదా?