బాహుబలి ఎవరు? రానా లేక ప్రభాస్?

there are too many gaps in blockbuster Baahubali 2 conclusion

 

 "ఏమైనా చేసుకో - ప్రచారం నీ చుట్టూనే జరిగేలా చూసుకో" అన్నది సులభమైన ప్రచార సూత్రం. ఈ తరహా ప్రచారానికి పెద్ద మేధోసంపత్తితో పనిలేదు. మనం ఏదో ఓ మహాద్భుతాన్ని సృష్టించబోతున్నట్లుగా కనీవినీ ఎరుగని ప్రచారాన్ని చేయగల పకడ్బందీ ప్రచారవ్యూహాలు ఉంటే చాలు. అవి ఎలా ఉంటాయంటే... 
 .
...... "సోమాలియా దేశంవాళ్ళు స్పేస్ షిప్ ను నిర్మించి, Interstellar Operations చేయబోతున్నట్లుగా" మరోఅనుమానానికి తావులేకుండా ప్రపంచాన్ని నమ్మించగలగడం..!!
.
ఈ "బాహుబలి" ప్రహసనం కూడా అచ్చం "సోమాలియా స్పేస్ షిప్ - Interstellar Operations" బాపతే..!!
.
 ఏదో చేయాలి, కానీ ఏమిచేయాలో తెలియడం లేదు. కొత్తగా ఏమైనా చేద్దామా అంటే, ఆ కొత్తదేదో తెలియడం లేదు. ఏదిచేసినా కాపీమయమే. ఏమిచేసినా ఓ.! ఇదా, ఆల్రెడీ చూసేశాంగా అన్నభావనే కలిగేలా ఉన్న పరిస్థితులు. 
.
.... మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ??? 
.
తమచుట్టూనే భారీ ప్రచారం జరిగేలా చూసుకోవాలి..
 తామేదో ఘనకార్యంచేస్తున్నట్లుగా బిల్డప్పులివ్వాలి... 
 ఏమైనా సరే చేసి, జనాలను తాము చేస్తున్న కార్యాన్ని చూడడానికి రప్పించుకోవాలి. 
వచ్చాక, ఒక గుండుసూదిని చూపించి, ఇదే మేముచేసిన అద్భుతం అంటూ చేతులు దులుపుకోవాలి.. 
 తీరా వచ్చాక, ఇక చేసేదేమీ లేక ఉసూరుమంటూ వెళ్లిపోతారు అమాయక జీవులు.. 
.
..... అంటే అచ్చం "రాజుగారి దేవతావస్త్రాలు" తరహా అన్నమాట..!!
.
రాజుగారు దేవతావస్త్రాల్లో లేరు, నగ్నంగా ఉన్నారు అంటే, తమనెక్కడ తెలివిలేనివాళ్ళుగా అంచనావేస్తారో అన్న ఒక ఫాల్స్ ప్రిస్టేజీలో కొందరూ - మనోడేగా, ఎదోచేశాడుగా, పొగిడేద్దాంలే అంటూ మరికొందరు.. ఇలా ఆహా.. ఓహో.. అనేస్తూ మరింత హైపును తెచ్చేస్తారు. మధ్యలో నాలాంటి సందేహ జీవులు, అయ్యో, అదేమిటండీ, రాజుగారు నగ్నంగా ఊరేగుతూ ఉంటే, మీరేమిటీ ఆయన దేవతా వస్త్రాలు వేసుకొన్నాడు అంటున్నారు అంటే, లోలోన ఓ.! నిజమేగా. ! అనుకొంటూ, పైకిమాత్రం నీబొంద రా.. నీబొంద .. సరిగ్గా చూసిచావు అంటారు..!!
.
****
.... సరే, ఇక నా సోది ఆపేస్తాను.. ఇక అసలు విషయానికొస్తే,
.
అసలు ఈ సినిమాలో "బాహుబలి" రానా యా లేక ప్రభాసా అన్నంతలా "ప్రభాస్" పాత్రను వీక్ గా మలచారు. మొదటి భాగంలో వీర బిల్డప్పుతో వచ్చిన  "అమరేంద్ర బాహుబలి"  ఈ భాగంలో ఒక గమ్యంలేని వాడిగా తయారయ్యారు.  ఏదో అక్కడక్కడా కాసిని మెరుపులు తప్పిస్తే, "అమరేంద్ర బాహుబలి" పాత్ర పవర్ఫుల్ గా లేదు. ఇక "మహేంద్ర బాహుబలి" (శివుడు పాత్ర) గురించి చెప్పేపనే లేదు. ఆటవిక జాతుల్లాగా పిచ్చకొట్టుడు కొట్టుకోవడానికే పనికొచ్చేలా పాత్రను మలచారు. అసలు కథకున్న స్పాన్ చాలా తక్కువ, దాన్ని గమ్యంలేని ప్రయాణంలా చిత్తమొచ్చిన రీతిన మలచడంవల్ల వచ్చిన తంటా ఇది. 

there are too many gaps in blockbuster Baahubali 2 conclusion

.


 గ్రాఫిక్సు/వి‌ఎఫ్‌ఎక్స్ వర్క్ కోసమే అవసరంలేని సన్నివేశాలను సృస్టించి, అర్థంలేని కథనాలను జోడించి, అసలు కథ ఆత్మకోల్పోయేలా చేశారు. మొదటిభాగంలో ఎంతో క్యూరియాసిటీని కల్గింపజేశారు. లెక్కలేనన్ని సందేహాలను లేవనెత్తి, ఆ సందేహాలన్నిటికీ సమాధానాలు రెండోభాగంలో దొరుకుతాయి అన్నంతగా బిల్డప్పిచ్చారు. ఆ ఆసక్తితోనే, ప్రేక్షకులు బాక్సాఫీసు క్యూ కట్టారు. 


.
మొదటిభాగంలోని కీలకమైన అంశాలను గుర్తుచేస్తూ టైటిల్స్ మొదలవుతాయి. ఆరకంగా గతభాగానికి మనము కనెక్ట్ అవుతాము. 
.
 గత భాగంలో యుద్ధం ముగిశాక, "అమరేంద్ర బాహుబలి"ని రాజుగా ప్రకటించిన రాజమాత "శివగామి", ఈ భాగంలో అతనిని "మహారాజుగా పట్టాభిషేకం" చేస్తారని సగటు ప్రేక్షకుడు ఊహిస్తాడు, ఆశిస్తాడు. బహుశా, ప్రేక్షకుల ఊహలకందని మలుపులు తిప్పడానికన్నట్లుగా, సింహాసనాధీష్టడవడానికి  ముందు దేశాటనకు వెళ్ళమని ఆదేశిస్తుంది, శివగామి. శిరసావహిస్తూ, కట్టప తోడుగా దేశాటనకు బయలుదేరుతారు. ఆదేశాటన వీళ్ళు గుర్రమ్మీద వెళుతూ ఉంటే, అలా ఒక బి‌జి‌ఎం తో రెండు నిమిషాల్లోనే ముగిసిపోతుంది. అదికూడా చాలా అసహజంగా ఉంటుంది. తదుపరి "యువ అనుష్క" పరిచయ సన్నివేశం. అంతే, ఇక అక్కడినుండి, "కట్టప్ప & బాహుబలి" ఇద్దరూ కలిసి అమాయకుల్లాగా నటిస్తూ, యువరాణి అనుష్క దృష్టిలో పడతారు. ఆవిడనే ఏదైనా పని ఇప్పించమని అడుగుతారు. సర్లే మావెంట వచ్చి చావు, ఏదో ఒకటి నేర్పిస్తాంలే అంటుంది ఆ" కుంతల యువరాణి దేవసేన"


ఈయన అమాయకుడు కాదనీ, ఆయనొక యుద్ధవీరుడనీ, ఆయన చేయి, ఈవిడ నడుముకి తగలగానే గుర్తుపట్టేస్తుంది


 ఇక్కడినుండి, "సుబ్బరాజు" అనుష్క బావగా ఆయనకు పొసగని ఖామెడీతో చిరాకు తెప్పిస్తాడు. బాహుబలి కుంతల రాజ్యంలో ఉంటూ, అనుష్క ప్రేమలో పడతాడు. ఆవిషయాన్ని అనుస్క కూడా గమనిస్తుంది. ఈయన అమాయకుడు కాదనీ, ఆయనొక యుద్ధవీరుడనీ, ఆయన చేయి, ఈవిడ నడుముకి తగలగానే గుర్తుపట్టేస్తుంది. ఆ సందర్భంలోనే బాహుబలి పరాక్రమాన్ని పరీక్షించడానికి ఒక ఎద్దును ఆయనమీదకు వదులుతుంది. బాహుబలి కావాలనే ఎద్దుతో కుమ్మించుకొని గాయపడతాడు. ఇక ఆయనకు చికిత్స, అనుష్క ఆవేదన, కట్టవ వీరఖామెడీ ఇవన్నీ కలిసి మనకు ఒంటిమీద తెళ్ళూ జెఱ్రులూ పాకుతాయి. అప్పుడే అనుష్క ఒక భక్తి పాటేసుకొంటుంది. దాంట్లో ప్రభాస్ ను కృష్ణుడి తో పోల్చుకొంటూ పుష్పం, పత్రం, ఫలం, తోయం ఇలా అన్నీ కృష్ణుడి వంకపెట్టి బాహుబలికి ఆర్పిస్తుంది.. ఈసందర్భంలో కూచిపూడి ముద్రతో కొన్ని స్టెప్పులేస్తుంది.. (అమ్మా అనుష్కా, భవిష్యత్తులో ఇలాంటి స్టేపులేసి, జనాలకు గుండెపోటు తెప్పించవద్దు. "మస్సాల మిర్చీ పిల్ల మజ్జా సేద్దాం వత్తావా" తరహా పాటలకి జనాలు అలవాటు పడిపోయారు. కూచిపూడిని జనాలు మరిచేలా చేయవద్దు).. అదేమిటో అక్కడ ప్రభాస్ అర్దరాత్రి పూట ఒక బానులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుకుతూ ఉంటాడు.. ఇదేం పైత్యమో..!!

 

గ్రాఫిక్స్ తో చేసిన ఆవులు/ఎద్దులు చూస్తే విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ కోసం చేసిన నాసిరకం పనితనం కనిపిస్తుంది
 

ఇక పోతే "పిండారీల ఫైటు".. చైనా గోడంత పేద్దదైన కోటగోడ మధ్యలో శత్రుదుర్భేద్యమైన భవనాల మధ్యలో ఏకంగా రాజభవనంలోనికి వచ్చేస్తారు ఆ పిండారీలు. మొదటి భాగంలో కాలకేయుల మాదిరి ఇక్కడ పిండారీలన్నమాట. వీళ్లతో చేసే యుద్ధం ఒక వీర కామెడీ.. గ్రాఫిక్స్ తో చేసిన ఆవులు/ఎద్దులు చూస్తే విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ కోసం చేసిన నాసిరకం పనితనం కనిపిస్తుంది. వాటి కొమ్ములకు మంటలు పెట్టడమే ఒక కామెడీ అనుకొంటే, ఆ ఎద్దులమీద నిలబడి వీరలెవెల్లో స్వారీ చేస్తాడు మన బాహుబలి. ఆ సీన్ చూస్తే, ఏదో వీడియో గేమ్ ఆడినట్లు ఉంటుంది.. ఆ మండుతున్న కొమ్ములు కూడా క్లియర్ గా నాసిరకం గ్రాఫిక్స్ లాగా కనిపిస్తాయి. - ప్రతి సన్నివేషమూ అసహజమే.. ఇక చివరగా ఆ పిండారీలను ఎదుర్కొలేక, అక్కడే ఉన్న ఒక ఆనకట్టను పగలగొడతారు. అదికూడా ఆ ఎద్దులు/ఆవుల సహాయంతోనే తాళ్లువేసి లాగేస్తారు. ఆ నీటిప్రవాహంలో ఆ పిండారీలంతా తుడిచిపెట్టుకుపోతారు. ఆనీటి ప్రవాహం ఏకంగా రాజమందిరాన్ని కూడా ముంచెత్తేవిధంగా ఉంటుంది.. ఆ నీళ్ళలో ఒక చెట్టుకొమ్మను ఆసరాగా చేసుకొని, దానిమీద 90డిగ్రీల యాంగిల్లో నిలబడి ఏకంగా బాల్కనీలోనికి అడుగుపెడతాడు మన వీరో బాహుబలి. అక్కడ యువరాణి అనుష్కతోబాటుగా అందరూ స్వాగతిస్తారన్నమాట..! అప్పుడే తాను అమరేంద్రబాహుబలి అన్న విషయం తెలుస్తుంది. అదెలాగంటే...

 

there are too many gaps in blockbuster Baahubali 2 conclusion


.
అంతకుముందే, "భళ్లాలదేవ" కోరికమీద, "దేవసేన"ను తమ కొడలిగా చేసుకొంటున్నాననీ, దానికి సమ్మతంగా భల్లాలుడి కత్తికి దేవసేనచేత కంకణం కట్టించుకొని, క్షత్రియ వివాహాన్ని కానిచ్చి, ఈవిడ పంపిన లెక్కలేనన్ని కానుకలను స్వీకరించమని ఆదేశిస్తూ వారి పరివారాన్ని పంపుతుంది శివగామి. ఆవిడ అహంకారానికి ఒళ్ళు మండిన దేవసేన, తన కత్తినీ, తనదగ్గరి నగలను భల్లాలుడికి పంపి, శివగామి పెళ్లి రాయభారాన్ని తిరస్కరిస్తుంది. ఒళ్ళుమండిన శివగామి, యువరాణిని బంధించమని ఒక గ్రాఫిక్స్ డేగతో, బాహుబలికి వర్తమానం పంపుతుంది. అదేమిటో, ఆ డేగకు ఈయనెక్కడున్నాడో గూగుల్ కొఆర్డినేట్స్ తో సహా తెలిసిపోతుంది. ఆ లేఖలోని సారాంశాన్ని అనుష్కకు వివరిస్తాడు ప్రభాస్. ఒళ్ళుమండిన అనుష్క, అక్కడే ఉన్న ఒక కాగడాతో ప్రభాస్ గుండెలమీద కొడుతుంది. అప్పుడు ఆయన వేసుకొన్న బట్టలన్నీ కాలిపోయి, మాహిష్మతీ లోగో కనిపిస్తుంది.. మరో నిముషంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న కాస్ట్యూములు, ఫుల్ మేకప్ తో కనిపిస్తాయి ప్రభాస్ ఒంటిమీద. అప్పుడు కట్టప్ప అనౌన్స్ చేస్తాడు, ఈయన "మహేంద్ర బాహుబలి" - మాహిష్మతికి కాబోయే మహారాజు అని.
.
ఎదోలా అనుష్కను ఒప్పించి, తన గౌరవానికి భంగం కల్పించనని మాటిచ్చి దేవసేనను మాహిష్మతికి తెస్తాడు బాహుబలి. అక్కడ తెలుస్తుంది, తాను బంధించి తెచ్చిన అనుష్కను భాల్లాలుడికిచ్చి వివాహం చేయడానికి శివగామి తెమ్మందని. ఇక్కడ మొదలైన ఇగో ప్రాబ్లమ్స్, ప్రభాస్ ను రాజ్యాధికారం నుండి తప్పుకోమని చెప్పడం, అంతఃపురం నుండి వెలివేయడం, ఆఖరికి శివగామియే బాహుబలిని చంపమనేంతవరకూ ఆటోమేటిగ్గా జరిగిపోతాయి. - ఇవన్నీ పిచ్చ ఖామెడీగా ఉంటాయి. అంతటి పెద్ద మాహిష్మతీ రాజమాత, ధర్మాధర్మవిచక్షణ లేకుండా, కనీసం ఇంగితం లేకుండా, ఇలా చెప్పుడు మాటలను వింటుందా అంటే, ఇవే ఊహకందని ట్విస్టులు అని మనం అర్థం చేసుకోవాలి. 

 

అదేమిటో, ఆ డేగకు ఈయనెక్కడున్నాడో గూగుల్ కొఆర్డినేట్స్ తో సహా తెలిసిపోతుంది


.
ఇక బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా ప్రకటించిన తదుపరి, భల్లాలుడి రాజ్యాధికార స్వీకారం అట్టహాసంగా జరుగుతుంది. ఇక్కడ ప్రజలూ, సైన్యమూ అందరూ కలిసి గుండెలమీద పిడికిలినుంచి "మాహిష్మతీ సామ్రాజ్యం అస్మాకం అజేయం ఆసూర్యచంద్రతారార్కం వర్ధతాం" అంటూ "మాహిష్మతీ జాతీయగీతాన్ని" ఆలపిస్తారు.. ఇక్కడ అశ్వ, గజ, పదాతి దళాల వందన స్వీకారం, భాల్లాలుడి అధికార దాహం తదితరాలు. పట్టాభిషేకం సందర్భంగా జనాలంతా జయ బాహుబలి అంటూ భాల్లాలుడి పట్ల తమ అయిష్టతను ప్రకటిస్తారు.ఆసందర్భంగా వాళ్ళు చేసే అలజడికి, దానిని అణచడానికి సిద్ధం అంటూ సైన్యం ఈటెలతో, కత్తీ డాలుతో చేసే శబ్ధాలూ మొత్తం ప్రదేశాన్నే ఊగిపోయేలా ఉంటాయన్నమాట. చివరికి భాల్లాలుడు కూర్చున్న సింహాసనం కూడా ఊగిపోయి, దానికున్న ఛత్రం ఊడిపోయేంతలా ఉంటాయి. ఇదేమిటో జక్కన్నకే తెలియాలి. మరీ ఇంత కామెడీనా..!!
.
 సైన్యాధ్యక్షుడయ్యాక దేవసేనతో వివాహం, ఆమె గర్భం దాల్చడం జరిగిపోతాయి. ఈ తరుణంలోనే బాహుబలిని సర్వసైన్యాధ్యక్షుడిగా తొలగించి, ఒక కుర్రకుంకను ఆపదవిలో పెడతాడు భాల్లాలుడు. ఇదంతా అనుష్క సీమంతంలోనే జరుగుతుంది. అక్కడ శివగామి కూడా ఉంటుంది. కానీ ఏమీ ఆనదు.. 

 అలా గర్భవతిగా ఉన్న దేవసేన, శివాలయానికి దర్శనార్థం వస్తుంది. అంతెత్తులో ఉన్న ఆలయ దర్శనానికి జనం తండోపతండాలుగా వస్తారు. పురుషులను ఒకవైపూ, మహిళలను మరోవైపూ క్యూలో పంపుతూ, వాళ్లనివెళ్లండి వెళ్ళండి త్వరగా అంటూ తోస్తూ ఉంటారు. ఇదో వీరకామెడీ. అప్పుడే వచ్చిన అనుష్కను, మహారాజు వస్తున్నాడంటూ, డైరెక్ట్ దర్శనానికి వీలులేదని, పక్కనున్న సర్వదర్శనం క్యూలోనికి వెళ్లమంటాడు ఆ కుర్రకుంక సర్వసైన్యాద్యక్షుడు. అదేమిటో, సర్వసైన్యాధ్యక్షుడంటే గుళ్లదగ్గర క్యూలను నియంత్రడానికి నియమిస్తారన్నమాట..!! ఇక క్యూలో వెళ్ళే మహిళలను అంగాంగమూ తడుముతూ ఉంటాడు ఆ కుర్రకుంక. అలానే అనుష్కను కూడా తడమడానికి వస్తే, వాడిదగ్గరున్న చిన్న పిడిబాకుతో, వాడీ వెలుని తెగ్గోస్తుంది. దీన్ని పెద్దనేరంగా చూస్తూ, బెబ్బులి  లెవెల్లో ఆమెకు పెద్దపెద్ద సంకెళ్ళువేసి విచారణకు సభామధ్యంలో ప్రవేశపెడతారు. అదేమిటో, ఆ విశారణలో శివగామి ఆద్యంతమూ దేవసేనమీద వ్యక్తిగత ద్వేషాన్ని చూపించినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. రాజమాత అన్నీ భావోద్వేగాలకూ అతీతంగా ఉండాలన్న ఇంగితం ఉండదు. ఇక బాహుబలి వచ్చి ఆ కుర్రకుంక తల నరికెస్తారు. ఇది రాజాధిక్కారమంటూ అంతఃపుర బహిష్కరణ విధిస్తారు.. శివగామి సమక్షంలోనే. 
.
.... అంతే, ఇక దండాలయ్యా.. మామధ్యనే ఉండాలయ్యా అంటూ హృదయవిదారకంగా ఆహ్వానిస్తారు ప్రజలు..!!
.
అలా జస్ట్-మిస్ కింగ్ గా ప్రజలమధ్యకు వచ్చిన బాహుబలి, అకస్మాత్తుగా ఒక ఇంజనీర్ అయిపోతాడు. ఇంతెత్తు కొండలాగా ఉన్న ఒక ప్రదేశానికి పైవరకూ కర్రలు వేసి పెద్ద నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అదేమిటో కనీసం ప్రస్తావించలేదు. పైనున్నవాళ్ళు నీళ్ళు తీసుకొనిపోవడానికి ఇబ్బంది పడితే, తాటిచెట్లకు తాళ్ళూవేసి వాటిని క్రిందకు వంచి, పెద్ద తెప్పలాంటిదానిలో నీళ్ళు నించి, అ వంచిన తాళ్ళను తెగ్గొడతారు. అంతే, ఆటాటిచెట్లు వందకిలోమీటర్ల స్పీడుతో ఆ నీళ్లని పైకి చిమ్మితే. వాళ్ళంతా మాబాబే, సల్లంగుండాల అన్నట్లుగా ఆనీటిని తాగుతారు.. అసలు తాటిచెట్టును వంచడం సాధ్యమా ?? ఒకవేళ వంచాలని చూస్తే అది విరిగిపోతుందే తప్ప క్రిందకు వంగి మళ్ళీ పైకి లేవదు.. ఇలాంటి టెక్నాలజీని వాడుకోలేక మన చంద్రబాబుగారు అనవసరంగా ఎత్తిపోతల పథకాలకు వేలాదికోట్లు ఖర్చుచేస్తున్నారు. తాటిచెట్లు పెంచితే పోలా..!! అందుకేనేమో అమరావతి నిర్మాణంలో రాజమౌళిని భాగస్వామ్యం చేశారు. (ఏంటో మనఖర్మ)

 

there are too many gaps in blockbuster Baahubali 2 conclusion


.
 ఇక బాహుబలిని చంపేందుకు భల్లాలుడు వేసిన ప్లాను... బాహుబలి తనపై హత్యాయత్నం చేశాడంటూ, సుబ్బరాజుని ట్రాప్ చేసి, బాహుబలి తనకు బహూరించిన ఒక పిడిబాకును ఆధారంగా చూపుతూ, ఇది సాక్ష్యాత్తూ బాహుబలి పన్నిన పన్నాగంగా శివగామిని నమ్మిస్తారు. అదేమిటో, ఏ విచారణా లేకుండా ఆ మహాధర్మమూర్తిగా చెప్పబడుతున్న రాజమాత, ఒక్క ఆధారంతోనే బాహుబలిని చంపేయ్ అంటూ ఆదేశిస్తుంది. తానీపని చేయలేననీ, తనను చంపమనీ అంటాడు కట్టప్ప. కుదరదంటుంది శివగామి. బాహుబలిని చంపాల్సిందే అని నొక్కిచెబుతుంది. కట్టమీద నమ్మకంలేక ఆయనను సజీవంగా తగలబెడతాడు భల్లాల. ఈవిషయం బాహుబలికి ఎవరో వచ్చి చెబుతారు. దేవసేన పురిటినొప్పులతో ఉంటుంది, అయినా సరే కట్టప్పను కాపాడమని కత్తినిచ్చి పంపుతుంది. అంతే ఇక బాహుబలి శవం కూడా కనపడదు దేవసేనకు. ఇక్కడ, కట్టప్పను చంపుతున్నారని ఎక్కడో ఉన్న బాహుబలిని రప్పించడానికే భల్లాల ఈ వార్తను చేరవేశాడని అని మనమనుకోవాలి. బాహుబలి వచ్చి, కట్టప్పను కాపాడతాడు.. సరిగ్గా అప్పుడే మనం మరిచిపోయిన కాలకేయులు దాడిచేస్తారు. మరొక్క ఫైట్.. బాహుబలి కాలకేయులతో పోరాడుతూ ఉంటే, కట్టప్ప వెనకనుండి పొడిచేస్తాడు. - "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు" ?? అంటూ రెండేళ్లుగా వేధిస్తున్న ప్రశ్నకు తలతిక్కసమాధానం దొరుకుతుంది.

 
.
 తర్వాత, మనం ఫస్ట్ పార్ట్ క్లైమ్యాక్స్ కు వెళతాము. అక్కడ శివుడు అనబడే మహేంద్ర బాహుబలి, ముసలి దేవసేన, అవంతిక అనబడే తమన్నా ఎట్సేట్రా ఉంటారు. అప్పుడే క్లైమ్యాక్స్ మొదలవుతుంది.. అమేయమైన సైనిక బలంతో, శత్రుదుర్భేద్యంగా అలరారుతున్న మాహిష్మతీ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడానికి, ఒకటీ ఆరా ఉన్న విల్లంబులూ, పొట్టి కత్తులతో దాడిచేస్తారు. ఇక్కడినుండి చూస్కో నాసామిరంగా.. అన్నీ బాలయ్య సీన్లే... ఇంకా చెప్పాలంటే బాలయ్యను మరిచిపోతారు.. కట్టప్ప ఈ జూనియర్ బాహుబలిని తన తండ్రి సీనియర్ బాహుబలిలానే ఆలోచంచమని చెబుతాడు.. ఒక్కసారిగా పొలికేక పెడతాడు, మరుక్షణం తళుక్కున బుర్రలో ఆవిడియా వస్తుంది.. వాళ్లనాన్న తాటిచెట్లతో కొండమీదికి నీళ్ళను ఎత్తిపోసిన ఎత్తిపోతల టెక్నాలజీని, మన జూనియర్ కూడా వాడుకొంటాడు.. కాకపోతే, ఆయన నీళ్ళను ఎత్తిపోస్తే, ఈయన ఏకంగా మనుషులనే ఎత్తిపోస్తాడు.. తాటిచెట్లను వంచడం,. వాటితో మనుషులను ఆకాశమంత ఎత్తు ఉన్న కోటలోనికి విసిరేయడం.. ఆ విసిరే సందర్భం పిచ్చకామెడీగా ఉంటుంది.. బహుశా మనోడు కార్టూన్ కథ ల్లేని  లోటును పిల్లలకు తీర్చాడు. తదుపరి జరిగే కొట్లాట చిల్లరగా ఉంటుంది. 


.
భల్లాలుడు జూనియర్ బాహుబలిని వీరకొట్టుడు కొడతాడు.. బాహుబలి పాత్ర కేవలం మాటలతో బిల్డప్పులకే ఎక్కువగా ప్రాధాన్యం కలిపిస్తుంది. బాహుబలి ఒక్కతన్ను తంతే చివరికి మొదటిభాగంలో ముసలి దేవసేన పుల్లలతో పేర్చిన చితిలో వచ్చి పడతాడు. దేవసేన వచ్చి ఆ చితిని అంటిస్తుంది.. భల్లాలుడి దహనం... జూనియర్ బాహుబలి పట్టాభిషేకం... ముసలి దేవసేన రాజమాత... ఆటవిక అవంతిక బాహుబలికి భార్యగా అర్థమొచ్చేలా నాటకం ముగుస్తుంది. అదేమిటో, దేవసేన సీనియర్ బాహుబలికి దర్శనమిచ్చిన అదే పింక్ కలర్ లంగా ఓణీలో ఉంటుంది ఈ అవంతిక..!! 

 

there are too many gaps in blockbuster Baahubali 2 conclusion
.
..... సరే, అదీ కథ.. కథనం మాత్రం చెడ్డ చిరాకు తెప్పిస్తుంది.. గ్రాఫిక్స్ కోసమే సినిమాను మూడుగంటలు పొడిగించారు. ఈ సినిమాలో చాలా చాలా కాపీ చేసినవి ఉన్నాయి. కాకపోతే, కాపీచేయడం మన జన్మహక్కు కాబట్టు, వాటి జోలికి వెళ్లడంలేదు. అయ్యవారిని చేయబోతే కోతిపిల్ల తయారైన చందాన, ఏదో చేయబోతే, మరేదో అయ్యి, చివరికి ఇంకేదో అయ్యింది..!! హమ్మయ్య.. !! అయిపోయింది అనిపించారు..!
.
... ఇక పాత్రల తీరు చూస్తే, 
.
 ఈ సినిమాలో ప్రతిఒక్క పాత్రా అవసరానికి మించిన ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాయి. అలా చేస్తేనే గొప్పనటన అని బహుశా దర్శకుడి భావన కాబోలు. డబ్బింగ్ చెప్పించడంలో దర్శకుడు కాన్సంట్రేట్ చేయలేదు. నాజర్ "న" ను "ణ" గా పలుకుతూఉంటే వినడానికి చిరాగ్గా ఉంటుంది. అలాగే రమ్యకృష్ణ "అరవయాస" ఇరిటేట్ చేస్తుంది. మొదటిభాగంలో రాజమాతగా మంచి గాంభీర్యాన్ని క్యారీ చేసిన శివగామి పాత్ర ఈభాగంలో ఒకమామూలు రాజకుటుంభీకురాలిగా, ఏమాత్రం ఇంగితం లేకుండా, విపరీతమైన భావేద్వేగాలతో నడుస్తుంది. ఇది ఆమె పదేపదే ప్రవచించే "న్యాయం - ధర్మం - పాలన"తరహా మాటలకు అస్సలు పొసగదు.  సీనియర్ బాహుబలి & భల్లాలుడు పుట్టినప్పటినుండీ రెండోభాగం క్లైమ్యాక్స్ వరకూ "నాజర్" ఒకే వయసులో ఉంటాడు.! భలే భలే..! కట్టప్ప కూడా అంతే..!! 
.
 ఇకపోతే, ఈ సినిమాలో అనేక సన్నివేశాలను కేవలం మేము కూడా వి‌ఎఫ్‌ఎక్స్ చేయగలము అన్న ఒక పంతంతో చేసినట్లు అనిపిస్తుంది. కానీ అవేమీ అంతా గొప్పగా, వీళ్ళు డప్పు కొట్టుకొంటున్నట్లు హాలీవుడ్ కు దరిదాపుల్లో కూడా లేవు. అసలు కంపేరిజన్ ఎందుకో నాకార్థం కాదు.!! ఇక "ఒరోరి రాజా వీరాధివీరా"అనే పాటలో ఊహలకు రెక్కలు తొడిగాడు దర్శకుడు. ఈ పాటలో నావ ఆకాశంలోనికి ఎగురుతుంది. మేఘాల్లో గుఱ్ఱాలు ఎగురుతూ ఉంటాయి. అద్భుతమైన లొకేషన్లు కనువిందు చేస్తాయి. ఆ పాట మొత్తం అలా ఊహాలోకంలోనే గడిచిపోతుంది. చాలామంది చెప్పినట్లుగా ఆపాట "విజువల్ గ్రాండీర్ - హాలీవుడ్డు రేంజీ"లో లేకపోయినా, బాగా తీశారు. 
.
దేవసేనను నీటిమార్గంలో మాహిష్మతికి తెచ్చే ఆ నావ పేద్దదిగా చూపిస్తారు. ఎంత పెద్దదంటే, ఆ నావకున్న కుంతల ధ్వజపు కర్ర విరిగిపోతుంది (మాహిష్మతి ముందు కుంతల ఇలాగే పడుండాలి అని సింబాలిగ్గా చెప్పినట్లు భావించవచ్చు) అయితే, కుంతల రాజ్యంలో దేవసేన ఎక్కుతున్నప్పుడు ఆనావ అతిచిన్నదిగా ఉంటుంది. అది ఎంత చిన్నదంటే, రాజమందిరం మెట్లమీడినుండి నావలోనికి మధ్యలో ప్రభాస్ నీళ్ళలో నిలబడి, ఆటోచేయీ, ఇటోచేయీ వేస్తే. ఆయనమీదుగా నావలోనికి నడచి వెళుతుంది దేవసేన. అంటే అంతచిన్న నావ అన్నమాట.. మరి కుంతలలో చిన్నదిగా ఉన్న ఆ నావ మాహిష్మతికి వచ్చేలోపు అంతపెద్దదిగా ఎలా అయ్యింది చేప్మా..!! మధ్యలో వాళ్ళిద్దరూ పాడుకొన్న పాటలో ఆకాశంలోనికి ఎగిరినా అది ఊహ అనుకోవచ్చు. మరి ఇలా భారీగా ఎలా తయారయ్యిందో మరి..!! ఇదేమిటో!
.
 ఇకపోతే మాహిష్మతీ ప్రజలు.. అదేమిటో బాహుబలి కనిపిస్తే చాలు గంగవెఱ్ఱులెత్తిపోతారు. బాహుబలిని చూసినప్పుడల్లా వాళ్ళలో ఆనందం, ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం, ప్రేమ, ఇలా నవరసాలనూ కలగలిపి హృదయవిదారకంగా ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళకు పనీపాటా ఉండవేమో.. ఎప్పుడూ రాజమందిరం చుట్టూ తచ్చాడుతూ, ఎప్పుడు జై కొడదామా అన్నట్లు బాలయ్య అభిమానుల్లాగా ఉంటారు. 
.
"కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు" అంటూ ఒకటే ఊరించిన రాజమౌళి, దానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయాడు. కేవలం రాజకుటుంబానికి బానిస కాబట్టి, కట్టప్ప వాళ్ళు చెప్పిందంతా చేస్తాడు అన్న ఒక్క పాయింట్ తప్ప.. అదికూడా "నేనిది చేయలేను తల్లీ" అంటూ మొరపెట్టుకొంటాడు కట్టప్ప.. చెప్పిన మాట వినే కట్టప్ప, చేయలేను తల్లీ అని ఎందుకంటాడు ??? అదీ తనను చావునుండి కాపాడిన బాహుబలిని అలా వెనకనుండి పొడిచి, తాను సింహాసనం చెప్పినట్లుగా చేసి, మాటమీద నిలబడేమనిషిని అని చూపడం ఏమాత్రం కన్విన్సింగ్ గా లేదు. 
.
 ఇకపోతే, మొదటిభాగంలో వీర బిల్డప్పునిచ్చిన "అస్లామ్ ఖాన్" పాత్ర ఔచిత్యమేమితో సమాధానంలేని ప్రశ్న్యగానే మిగిలిపోయింది. అవసరమైనప్పుడు నేను సదా సిద్ధం అంటాడు అస్లామ్ ఖాన్. అప్పుడు మనలాంటి ప్రేక్షకులు మామూలుగా ఊహించేదేమిటంటే, బహుశా జూనియర్ బాహుబలి భల్లాలుడిని ఎదుర్కోవడానికి "అస్లామ్ ఖాన్" సహాయం తీసుకొంటాడేమో, అందుకే ఆపాత్రను పరిచయం చేశాడని ఊహిస్తారు... కానీ. కానీ... ప్రేక్షకులు ఊహించై మలుపులు ఇవ్వడానికేనేమో అన్నట్లుగా, ఈ భాగంలో ఆపాత్ర ప్రస్తావన కూడా లేకుండానే పూర్తిగా పక్కనపెట్టారు. ఇది "వరస్ట్ స్క్రీన్ ప్లే".... స్క్రీన్ ప్లే సూత్రాల ప్రకారం, తెరమీద కనిపించే ప్రతి కీలకమైన అంశమూ, అది వ్యక్తి కావచ్చు, లేక ఒక వస్తువు కావచ్చు, వాటి ప్రాముఖ్యం కతాగమనంలో ఖచ్చితంగా ఉండితీరాలి. మరి గజ దర్శకుడైన ఈయనకు ఆమాత్రం తెలీదా ??
.

 ఇకపోతే, ఆ అవంతిక ఎందుకలా తన జీవితాన్నంతా దేవసేనను వెతకాడానికి ధారపోసిందో, ఆమె ఎవరో కూడా తెలిపే ప్రయత్నం చేయలేదు. మొదటి భాగంలో భల్లాలుడి కొడుకు (అడివి శేష్) తలను నరకడం, ఆ తలను ఇపుడు ముసలి దేవసేన తేవడం చూపిస్తారు. కానీ భాల్లాలుడు పెళ్ళి ప్రస్తావన కనీసం చేయలేదు (బహుశా అది అనవసరం అని దర్శకుడు భావించి ఉండవచ్చు) చూపకపోవడం వల్ల నష్టంకూదా లేదనుకోండి.


.
 ఈ సినిమాలో చివరి సన్నివేశంలో కోటపైన ఒక మెగా టెలిస్కోప్ ఉంటుంది. దానికి లెన్సులు + జూమ్ కూడా ఉంటుంది. దాంట్లోనుండి దూరంగా వస్తున్న ముసలి దేవసేన + జూనియర్ బాహుబలి లను చూసి, వారిమీద దాడిచేయిస్తాడు. ఇక హెలికాప్టర్ రెక్కలమాదిరి ఉన్న ఛాపింగ్ వీల్ ఉన్న ఒక యంత్రాన్ని ముందు తగిలించుకొని "గ్రాఫిక్స్ దున్నపోతులు" లాగుతున్న రతంలో రాణా రావడం కామెడికే కామెడీగా ఉంటుంది. 


.
 ఇక ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది సంగీతాన్నందించిన "కర్ణకఠోర గీరవాణీ" గురించి. సినిమాలో "సాహోరే బాహుబలి" అన్న సాంగ్ తప్ప మిగతావి ఏవీ రిజిస్టర్ కావు. ఆ "నావ పాట" రిచ్ గా తీసినా, కీరవాణి సంగీతం మాత్రం పేలవమే. ఇక బ్యాక్ గ్రౌండ్ సంగీతం మొత్తం ఆర్తనాదాలు చేసినట్లుగా ఉండి, చెవుల్లో రక్తం తెప్పిస్తుంది. దానికి తోడు, ఈయన పాడాలన్న పైత్యం కాస్తా మన ప్రాణాలమీదికి తెస్తుంది. ఎక్కడపడీతే అక్కడ బిట్లూ ఈయనే పాడతాడు.. పాటల్లో మధ్యమద్యలో వచ్చి చెవులుకోసుకోవాలన్నంతగా చావగొడతాడు. ఇక బి‌జి‌ఎం లో ఆయన తీసే ఆలాపన ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అక్కడక్కడా కాపీట్యూన్లు అనిపించే బి‌జి‌ఎం తప్ప, సినిమా మొత్తం దారిద్రాతిదరిద్రంగా బి‌జి‌ఎం చేశాడు. దానికితోడు ఈయన కర్ణాకఠోరమైన గొంతుతో మన సహనాన్ని పరీక్షించాడు.... ఒక్కమాటలో చెప్పాలంటే, "కీరవాణి సరుకైపోయింది - కాపీకొట్టడం కూడా రానట్లుంది - భేషుగ్గా రిటైర్మెంట్ పుచ్చుకొని", అందరిపై విమర్శలు చేస్తూ కాలం గడిపేయవచ్చు.. !!

 

***

.... చివరగా చెప్పేదేమిటంటే.... 

 ఈ బాహుబలి ప్రహసనం అంతా "సోమాలియా స్పేస్ షిప్ బాపతే"...!! 

ఇదొక గమ్యంలేని ప్రయాణం..!! బలవంతపు తద్దినం.. 

 ఏదో చేసేయాలనుకొని - ఏమి చేయాలో తెలీక - ఇంకేదో చేసేసి, చివరికి ఏమీ సాధించలేక, 
.
 అతిభారీప్రచారంతో జనాల చెవులోకి పెట్టారు ఒక సోమాలియా స్పేస్ షిప్పు. దాంట్లో అందరూ వెళ్ళి "అంతరిక్ష ప్రయాణం" చేసి క్షేమంగా తిరిగిరండి..!!

...స్పేస్ లో ఉండేది శూన్యమే అని మరీ ప్రత్యేకంగా చెప్పాలా..!!

.