‘అమ్మ’ కి అవతలి వైపు

the unforgettable side of Jayalalithaa

 

 

జయకు జీవితంలో ప్రతిచోటా దక్కాల్సినవి దక్కలేదనే చెప్పాలి.చదవాలనుకున్న దాన్ని బలవంతంగా(?) సినీ ఫీల్డ్ కు తెచ్చారు.ఇక్కడ నచ్చిన సహనటులు లేకున్నా డబ్బుతీసుకున్నందుకు ఎవరితోనైనా నటించాల్సిందే.అర్ధరాత్రి వరకూ పూటుగా తాగి ఉదయాన్నే కంపునోర్లతో వచ్చే సహనటులతో నటించాల్సిందే.ఇప్పుడంటే నార్త్ అమ్మాయిల దిగుమతి మొదలైంది,వీరిని ప్రధానంగా ఎన్నిక చేసుకోవడానికి కారణం నిస్సిగ్గుగా అంగాంగ ప్రదర్శన చెయ్యటం.ఆ రోజుల్లో ముందుగానే ఇష్టం లేని పరిశ్రమకు వచ్చిన జయ అంగాంగ ప్రదర్శన చేయాల్సి వచ్చింది.


ఒక ఉదాహరణ చెప్పాలంటే గండికోట రహస్యం అన్న సినిమా చూడండి.యూ ట్యూబ్ లో 3 గంటల సినిమా ఉంటుంది..అందులో 2 గం.13 ని.దగ్గర చూడండి కథకు ఏలాంటి సంబంధంలేకున్నా ఒక పదం పాడుతూ కొలనులో స్నానం చేసి మెట్లెక్కి పోయే సీన్ చూస్తే ఈవిడను ఎంత ఎక్స్ ప్లాయిట్ చేసారో తెలుస్తుంది.అంతకుముందు జయశంకర్ తో చనువుగా ఉండేదని గుసగుసలు,శోభన్ ప్రేమాయణం,యం.జీ.ఆర్ బందీకానా....పెళ్లిపెటాకులు,పిల్లాజెల్లా ఎవరూ లేక ఏమవుతారు?

 

ఒక విషయం మీద ఆసక్తి కలిగినప్పుడు దాన్ని పొందాలనే కోరిక కలుగుతుంది.కోరిక తీరనప్పుడు క్రోధం కలుగుతుంది.దానివల్ల వ్యామోహము,స్మృతి చిన్నాభిన్నంవుతుంది.దీనివల్ల బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించి మనిషి పతనమవుతాడని భగవద్గీతలో ఉంది.

 

ఈ బుద్ధి కోల్పోయి చేసే పనుల్లో,పతనంలో రకరకాలు.కొందరిలో స్వీయ పతనం.దేవదాసు లాగా...ఇంకా చెప్పాలంటే దేవదాసు సినిమాలో అతను పొందలేని పార్వతి పాత్రను నటించిన సావిత్రి లాగా.అప్పటికే పెళ్లాంపిల్లలున్న జెమినీ గణేషన్ ను పెళ్లి చేసుకుంది.ఒకరిని వదిలొచ్చినాయన ఈవిడకు మాత్రమే సొంతమెందుకవుతాడు?ఈవిడ స్వీయ పతనాన్ని ఎంచుకుంది...తాగుడుకు బానిసైంది.తనను గుర్తించని భత మీద ఎంత కసి పెరిగిపోయిందంటే.మగాడికి లేని పద్దతి నాకెందుకని విచ్చలవిడి తనంతో మరింత అదఃపాతాళానికి పడిపోయింది.(సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారు రాసిన ఆత్మకథలోనూ ఈ విషయం రాసారు).


జయలలితేమో పక్కనోళ్ల వినాశనానికి పాల్పడింది. ఆవిడకు సాగిలపడని వారిని పాశవికంగా అణచివేసింది.
రాజకీయాల్లో చూస్తే ఇన్ని అవమానాలు.ఈ జీవితమ్మీది కసి,అసహనం,గుర్తింపుకోసం తపనలు మొదలయ్యాయి.
మొదటిసారి ముఖ్యమంత్రయ్యాక అవినీతి కుంభకోణాలే కాకుండా అప్పటి గవర్నర్ చెన్నారెడ్డితోనూ కయ్యానికి కాలుదువ్వేది.


ఏ సుఖాలు నోచక శశికళ ను నెచ్చెలిగా చేసుకుంది.


తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుంబకోణం కోనేరు లో జరిగే మహామహం ఉత్సవాల స్నానం నెచ్చెలితో కలిసి చేసింది.ఆవిడను చూసే ఆత్రం,పుణ్యఘడియలు అంటూ జనం దూసుకొచ్చారు,తొక్కిసలాటలో 50 మంది మరణించారు. 


ఆ తర్వాత నరకప్రాయమైన జైలు జీవితం మరింత కసిని పెంచాయి.


ఇక రెండవసారి ముఖ్యమంత్రయ్యాక దెబ్బకుదెబ్బ అని ఒకానొక అర్ధరాత్రి కరుణానిధిని అరెస్ట్,తోడుగా కేంద్రమంత్రులు మురసోలిమారన్,టీ.ఆర్.బాలు లనూ చేయించింది.
మరో దీపావళి అమావాస్యనాటి అర్ధరాత్రి మహబూబ్ నగర్ లో ఉన్న కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని అత్యంత అవమానకర రీతిలో అరెస్ట్ చేయించింది.దీనికి కారణం వీరి మెడికల్ కాలేజ్ మీద కన్నేయడం అంటారు.


ఇవేనా?ఎన్నెన్నో నియంత పోకడలు పోయింది.భాజపా వారి మీటింగ్ లో నుంచి హఠాత్తుగా మాయమైంది,కారణం ఆ తర్వాత తెలిసింది...ఈవిడ కుక్క చచ్చిందని.
అంతేనా వాజ్ పేయి ప్రభూత్వానికి 1999 లో మద్దతు ఉపసంహరించుకుంది.మళ్లీ 2003 లో అయోధ్యలో కాకుండా రామమందిరం మరెక్కడ నిర్మిస్తారు?అని అడుగుతుంది.తన షష్టి పూర్తి సందర్భంగా ఒక ఆలయంలో నెచ్చెలి,ఈవిడ దంపతుల్లా గట్టిమేళం వాయిస్తుంటే దండలు మార్చుకున్నారు.ఇన్ని వైరుధ్యాలపుట్ట.ఇక పోటా చట్టం కింద జైలుపాలు చేసిన వైగో తోనూ జట్టుకట్టడాన్ని,తాను ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో మొహమ్మీద యాసిడ్ పోయించిన ఐ.ఏ.యస్ అధికారిణికి మద్రాస్ మేయర్ ఎన్నికల్లో మద్దతు తెలపడం, పదవీ లాలస అనక మరేమంటారు?

 

ఇక మూడవసారి ముఖ్యమంత్రయ్యాక నెచ్చెలి శశికళను ఇంటి నుంచి గెంటేసి మళ్లీ చేరదీసింది.అక్రమాస్తుల కేసులో మళ్లీ జైలు జీవితం గడిపింది.

 

ఇక ఈసారి ముఖ్యమంత్రయ్యాక తనువే వదిలి వెళ్లింది.


----అసలు జనాకర్షక పథకాలు మొదలుపెట్టిన యం.జీ.ఆర్ కాలంలో రాష్ట్రం పారిశ్రామికరంగంలో 2 వ స్థానం నుంచి పదో స్థానానికి దిగజారింది.
ఇక జయ 3వ సారి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల వాగ్దానాల మేరకు ఉచితం ఉచితం అంటూ ఎన్నో గృహోపకరణాలు,లాప్ టాప్ ల పందేరం చేసి,క్యాంటీన్లు పెట్టించి,మంచినీళ్లు సరఫరా చేసి అమ్మ అనే బ్రాండ్ ఇమేజ్ సంపాదించింది తప్ప సామాన్యుల జీవన ప్రమాణాలు పెరిగి కొనుగోలు శక్తి పెంచే ఏర్పాట్లేమీ చేయలేదు.మధ్య యుగపు పాలకుల పోకడలు పోవడం తప్ప కొత్తదనమేమీ లేదు.వీళ్లిచ్చిన గృహోపకరణాలు ఆంధ్ర సరిహద్దుల్లో లారీల్లో తెచ్చి కారుచౌకగా అమ్మారు.ఈ చర్యలు జనాలను సోమరులను చెయ్యడం తప్ప మరేం కాదు.

నిజానికిప్పుడు అందరూ దుఖిస్తున్న సమయంలో కమల్ ట్వీట్ ఎందరికో కోప కారణమైంది.ఒకపక్క ఇబ్బందులు పడిన రజనీ,ఇబ్బందులు పెట్టిన కరుణానిధి కుటుంబీకులు నివాళులు అర్పించినా కమల్ ప్రతిస్పందన మాత్రం మరోలా ఉంది.


ఇలాంటి సమయంలో ఇలాంటి మాటలు అవసరమా అంటారు కొందరు....
కొంతకాలం తర్వాత అన్నా కానీ మనిషి పోయాక ఇప్పుడవసరమా అనకమానరు..తన అభిప్రాయాన్ని మాత్రం నిష్కర్షగా చెప్పాడు ఆవిడ మీద "ఆధారపడ్డవాళ్లకు" సానుభూతి అని...అంతేకానీ అందరినీ అనలేదుగా!మరి చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే వారినంటే ఇతరులకెందుకు బాభ?? .పోయాడని హిట్లర్ ను గొప్పవాడని అనలేము కదా అంటారు కొందరు.



నిజానికి తెలుగువారికి ఆమె ఒకనాటి గ్లామర్ హీరోయినే తప్ప మరేం కాదు..అయినా మన మీడియా అత్యుత్సాహంతో "అమ్మ" అని కీర్తిస్తూ పేజీలకుపేజీలు రాసారు,గంటలకుగంటలు ఆమె గురించి చూపించారు. ఏమీ కానీ యం.జీ.ఆర్ శవం పక్క నుంచి లాగటాన్నీ చూపించి ఆమె కసి ఆమెనంతటిదాన్ని చేసిందన్నారు...ఎప్పుడైనా విజేతల గురించే శోకిస్తాం..మరి అదే ఘటన మనకూ రామారావు విషయంలో జరగలేదా? ఆయన అర్ధాంగి లక్ష్మిపార్వతిని పక్కకు తోసెయ్యలేదా?

 


పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా,ద్వితీయశ్రేణి నాయకులను ఎదగకుండా నియంతపోకడలు పోయి,ఆ తర్వాత పార్టీ ఉనికికే భంగంవాటిల్లే పనులు చేసిన వ్యక్తిని అమ్మగా కీర్తించడం విడ్డూరం కాదా?మరి మనకు పొరుగునున్న మరో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గత 16 ఏళ్లుగా పదవిలో ఉన్నా ఇన్ని వెర్రిమొర్రి వేషాలెయ్యలేదనీ గుర్తుంచుకోండి.
చేసే రాక్షసప్పనులన్నీ చేసి జనానికిన్ని కుక్క బిస్కెట్లేసి అమ్మా అనిపించుకుంది వాళ్ల రాష్ట్రంలో.మరి మనకేం ఒరగబెట్టింది?...మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదాకే కాదు తెలుగును ప్రాచీన భాష హోదాకు అడ్డుపడ్డ ఈ తమిళ రాజకీయాలను ఎందుకింత తలకెత్తుకున్నారో అర్ధం కాలేదు.

 

కుంభకోణం మహామహం దుర్ఘటన జరిగిన పుష్కర కాలానికి జయేంద్ర సరస్వతి అరెస్ట్.. ఆ తర్వాత పుష్కరానికి జయ మరణం ఒక యాదృచ్చికం.


జైలుకు పంపిన వైగో తో పొత్తు,జనం గుసగుసలాడే శోభన్ బాబు కూతురు,శశికళ తో సంబంధాలు,విషప్రయోగం,ద్రావిడ ఉద్యమ మూలాలు మరచి తెచ్చిపెట్టుకున్న విపరీతమైన మూఢనమ్మకాలు,వాజ్ పేయి ప్రభుత్వాన్ని కూల్చిన కారణం,సొంత అన్న పిల్లలను చేరదీయకపోవడం,కంచి స్వామి అరెస్ట్ వెనుక కథ....కోర్టుల వింత తీర్పులు.....ఈ కథల నిజాలెప్పటికైనా బయటికి వస్తాయా?లేక కాలం మింగిన అనేక కథల్లా మిగిలిపోతాయా? (అయిపోయింది). జయలలిత  ‘వ్యక్తి త్వ విశ్లేషణ ’కు  ఇది ముంగిపు.

గత  రెండు భాగాలు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి.