ఇదేమిటో తెలుసా?
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి..
రాష్ట్రంలో క్రిస్టియన్ సోదరులను మీరు మాత్రమే ఆదరిస్తున్నారని, మీ ప్రభుత్వం మాత్రమే గౌరవిస్తోందనే రీతిలో మీరూ, మీ మంత్రులు మాయ మాటలు చెబుతున్నారు కానీ వాస్తవానికి క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో మీరూ, మీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి అనుచితంగానే కాదు యావత్ క్రిస్టియన్ సోదరులను దారుణంగా అవమానించేదిగా ఉంది ఈ విషయాన్ని మరిపించడానికి మీరు ఎన్ని గారడీలు చేసినా పంజాగుట్ట చౌరస్తాలో వందల కోట్ల వ్యయంతో మీరు కట్టుకున్న గడీ విషయాన్ని వారికి గుర్తుకు తెస్తూనే ఉంటుంది
తెలంగాణా రాష్ట్రంలో క్రిస్టియన్ సోదరులు ఈనెల 25న నాల్గవ క్రిస్‌మస్ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో క్రిస్టియన్ భవన్ విషయంలో మీరు చేసిన మోసం గురించి వారందరితో పాటుగా తెలంగాణా సమాజం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది.తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్టియన్ సోదరుల సంక్షేమం గురించి ఎన్నో మాటలు చెప్పిన మీరు రూ.10 కోట్లతో తెలంగాణా క్రిస్టియన్ భవనాన్ని సకల సౌకర్యాలతో నిర్మించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో మారేడ్‌పల్లి మండలం, మల్కాజ్‌గిరి గ్రామానికి చెందిన మహేంద్రహిల్స్ సర్వే నెంబర్ 844/1 లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆదేశాలివ్వడంతోపాటు 2014, డిసెంబర్ 23న ఆ భూమిలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి మీరే స్వయంగా శంకుస్థాపన చేసారు.ఏడాది కాలంలోపుగా క్రిస్టియన్ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు రాబోయే క్రిస్‌మస్‌ను కొత్త క్రిస్టియన్ భవన్‌లో అందరం కలిసి ఆనందంగా జరుపుకుందామంటూ అందరినీ ఊహల పల్లకిలో ఎక్కించారు. భవన్ నమూనా ఒకె చేశారు(పై ఫోటో)
శంకుస్థాపన చేసిన తర్వాత ఈ క్రిస్టియన్ భవన నిర్మాణపనులను పర్యవేక్షించడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యే స్టీఫెనసన్‌తో పాటుగా రాష్ట్రస్థాయిలోని అధికారులతో కలిపి తొమ్మిది మందితో ఒక కమిటీని కూడా నియమిస్తున్నట్లు మైనార్టీసంక్షేమ శాఖ ద్వారా జీవో ఆర్‌టి నెంబర్ 22, తేది 23.02.2015 ను కూడా మీ ప్రభుత్వం జారీ చేసింది.అయితే ఇదంతా జరిగి మూడేళ్లు దాటిపోయినా, మూడు క్రిస్‌మస్‌లు వచ్చిపోయినా ఆ భవన నిర్మాణం జరగలేదు.క్రిస్టియన్ సోదరులకు మీరు ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు.అసలు ఆ భవన నిర్మాణమే ప్రారంభం కాలేదు.ఈ మూడేళ్లలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి మీ ప్రభుత్వం ఏం చేసిందో, మీరు ప్రత్యేకంగా నియమించిన కమిటీ ఏం చేసిందో తెలియదు. ఇదిలా ఉంటే మళ్లీ ఈసారి క్రిస్‌మస్‌ను గుర్తు చేసే డిసెంబర్ మాసం వచ్చే సరికి మీ ప్రభుత్వానికి క్రిస్టియన్లతో పాటుగా క్రిష్టియన్ భవనం కూడా గుర్తొచ్చినట్లుంది.
ఎన్నికల సమీపిస్తున్న వేళ మళ్లీ క్రిస్టియన్లు తమ భవన్ గురించి గుర్తు చేసుకుంటే మీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని భావించి మరోసారి క్రిస్టియన్ సోదరులను మోసగించడానికి ఈ నెల 04.12.2017 తేదీన అల్వాల్ మండలంలోని యాప్రాల్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 124/B లో తెలంగాణా క్రిస్టియన్ భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో శంకుస్థాపన చేయించారు.
క్రిస్టియన్ భవన్‌కు మొదట మహేంద్రహిల్స్‌లో కేటాయించిన స్థలం వివాదంలో ఉండటంతో ఈసారి యాప్రాల్‌లో శంకు స్థాపన చేస్తున్నామని ఏడాదిలోపుగా ఇక్కడ క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తవుతుందని మరోసారి మీ మందిమాగధులు సన్నాయినొక్కులు నొక్కారు. అయితే యాప్రాల్‌లో శంకు స్థాపన చేసిన భూమి కూడా వివాదంలో ఉన్నదే కాగా నాలుగు రోజులకే యాప్రాల్ భూమిపై స్టే వచ్చింది. 20.12.2017వ తేదీన హైకోర్టు ఆ భూమిని వెంటనే దాని సొంతదారులకు తిరిగి ఇచ్చేయమంటూ ఉత్తర్వులను జారీ చేసిన విషయం ఈ రోజు పత్రికల్లో వచ్చింది
అంటే మీ ప్రభుత్వం క్రిస్టియన్ భవన నిర్మాణం కోసం రెండోసారి వేసిన పునాది కూడా వట్టిదేనని తేలిపోయింది.ఇదంతా మీకు తెలియకుండానే జరిగిందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ భూమి ఎవరిదో, ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టే నిర్మాణాలకు అవసరమైన ప్రభుత్వ భూమి ఎక్కడుందన్న సమాచారం మీ ప్రభుత్వానికి అరచేతిలోనే ఉంటుంది.అయినా కూడా క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి రెండు సార్లు వివాదాస్పదమైన భూమిని కేటాయించారంటే దాని అర్థం అసలు ఆ భవన్ కట్టే ఉద్దేశ్యమే మీకు లేదని..
నిజంగా మీరు కట్టించాలని అనుకుంటే ఎంత వేగంగా ఎంత వైభవంగా నిర్మాణపనులను పూర్తి చేయించగలుగుతారో చెప్పడానికి నగరం నడిబొడ్డున పంజాగుట్ట చౌరస్తాలో మీరు కట్టుకున్న గడీకి మించిన మంచి ఉదాహరణ మరొకటి ఉండదు. కోట్ల రుపాయల వ్యయంతో పది ఎకరాల విస్తీర్ణంలో 150 గదుల గడీని కేవలం 8 నెలల కాలంలోనే కట్టించగలిగిన మీకు రెండెకరాలలో నిర్మించాలనుకున్న క్రిస్టియన్ భవన్ నిర్మించాలంటే ఆరు నెలలు కూడా పట్టదు.
ఈ వాస్తవ పరిస్థితిని మరిపించడానికి మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా క్రిస్టియన్ భవన్ నిర్మాణం పేరిట తమకు జరిగిన అవమానాన్ని క్రిస్టియన్ సోదరులెవరూ మరిచిపోరు...
-తెలంగాణా ్రకైస్తవ సమాజం
.