వైజ్ఞానిక సమాజం వైపు వడివడిగా అడుగులు వేయాలని తపన పడుతున్నాం. కాగితం వినియోగానికి స్వస్తి చెప్పి, 'డిజిటలైజేషన్' వైపు పరుగులు తీయాలని ఆకాంక్షిస్తున్నాం. నగదు రహిత సమాజం వైపు నడవండని జనాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇది ఆహ్వానించ తగ్గ  పరిణామమే. 

కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో దేనికైనా ధరఖాస్తు చేసుకోవాలంటే ఆధారాలు చూపెట్టడానికి కట్టలు కట్టలు 'జిరాక్స్' నకళ్ళు జత చేయాల్సిన అనివార్య పరిస్థితి కొనసాగుతున్నది.

నా దృష్టికి వచ్చిన ఒక సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక ఉద్యోగి వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ప్రధాన కార్యదర్శి నుండి ' నో అబ్జెక్షన్ సర్టిపికెట్' పొందడానికి ఎంతహైరానా పడుతున్నారో ఈ ఘటన తెలియజేస్తున్నది. 

ఒక పర్మనెంట్ ఉద్యోగి విదేశాల్లో ఉన్న తమ పిల్లల దగ్గరికి లేదా పది రోజులు విహార యాత్రకు వెళ్ళి రావాలను కొంటే తాను పని చేసే సంస్థ అధికారి ద్వారా పలు రకాల ఆధారాలు (నియామక ఉత్తర్వులు, క్రమబద్ధీకరణ ఉత్తర్వులు, ప్రమోషన్లకు సంబంధించిన ఉత్తర్వులు, బదిలీల ఉత్తర్వులు, కేసులు మరియు బకాయిలు లేవని, వగైరా వగైరా ధృవపత్రాలన్నింటిని సేకరించుకొని), దాదాపు 25 పేజీల దస్త్రాన్ని తయారు చేసి పంపాలి. 

ఇంతజేసినా 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' జారీ చేయడానికి 45 రోజులు గడువును నిర్ధేశిస్తూ 'సిటిజన్ ఛార్ట్' లో పేర్కొన్నారు. ఎందు కంటే అధికార దొంతర్లన్నింటికీ క్రిందికీ, మీదికీ ఆ దస్త్రం ప్రయాణించి, అంత్యమంగా ఉన్నతాధికారి ఆమోద ముద్రతో ఉత్తర్వులు జారీ కావాలి. దీని కోసం దరఖాస్తుదారు ఉద్యోగానికి లీవ్ పెట్టి లేదా ఆఫీస్ పని ఎగ్గొట్టి ఆ దస్త్రం వెంటపడి తిరగాలి లేదా మధ్య దళారీ ద్వారా లంచమిచ్చి పనిని చక్కబెట్టుకోవాలి. ఇదీ జరుగుతున్న తంతు. ఇది ఎంత అసంబద్ధంగా, అసమంజసంగా ఉన్నదో, కాస్త పరిశీలించమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. 

పాస్ పోర్ట్, వీసా పొందడానికి ఇంటర్నెట్ ద్వారా 'ఆన్ లైన్' దారఖాస్తు చేసుకోవచ్చు. కానీ, వాటికి ప్రభుత్వ ఉద్యోగి దారఖాస్తు చేసుకోవాలంటే ఈ తరహా తంతంతా కొనసాగించాలి. ' నో అబ్జెక్షన్ సర్టిపికెట్' పొందడానికి 'ఆన్ లైన్' దరఖాస్తు చేసుకొనే సౌలభ్యం కల్పిస్తే అవినీతికి తావు లేకుండా, త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడానికి, పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించడానికి వీలౌతుంది కదా!

అవినీతి మీద యుద్ధం ప్రకటించామంటున్నారు. సమర్థవంతమైన, పారదర్శకమైన, వేగవంతమైన , జవాబుదారీతనంతో కూడిన పాలనను అందిస్తున్నామని చెబుతున్న మాటలకు, ఆచరణకు పొంతన లేకుండా ఉన్నదన్న సంగతి దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఈ తరహా సమస్యలపై కూడా కాస్త ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలని విజ్ఞప్తి.

గమనిక: కైజాలా "ఎపి సియం కనెక్ట్" ద్వారా ఈ విజ్ఞప్తి చేశాను.

(రచయిత టి.లక్ష్మీనారాయణ*,కమ్యూనిస్టు, సామాజికాంశాల విశ్లేషకుడు)