కొత్త పుస్తకం తెరవక ఎన్నాళ్లయిందో...
చదువొచ్చీ చదవని వారికీ, చదువు రాని వారికీ తేడా లేదు అన్నాడొక మహానుభావుడు.
చదవటం అన్నది ఒక మంచి జీవితాన్ని రూపుదిద్దే ప్రాధమిక పరికరం. అయితే జీవన విధానానికి ఒక హుందా తనాన్ని ఆపాదించి, జీవిత క్రమశిక్షణలో ఒక భాగంగా ఇమిడిపోయిన ఈ పరికరం మెల్లగా కనుమరుగై పోతున్నది.
సాంకేతికాభివృధ్ధి చదవే అలవాటును కబళించేస్తున్నది. విద్యార్థులు పాఠ్య పుస్తకాలని పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడానికి తప్ప అసలు చదవటం లేదు. ఫోన్ల లో వీడియో గేములూ, చాట్లూ ఇంకా ఎస్.ఎం ఎస్ ల తోనే సమయమంతా సరిపోతోంది. ఇక జ్ఞాన సముపార్జన పక్కన పడేస్తే, ఆనందానికో లేక అహ్లాదానికో పుస్తకాలు చదివడం మాయమవుతున్నది. జీవితం వేగం పుంజుకుంటోంది. తీరిగ్గా ఓ గ్రంధాలయం మూలన కూర్చొని ఓ పుస్తకం చదవటం అన్నది ఈ నాటి తరానికి కాలం వృధా చేయడమే అనిపిస్తోంది.
“ఒక పుస్తకం చదవటానికి వుత్కంఠ చూపించే వ్యక్తికీ, అలసిపోయి, చదవటానికి ఓ పుస్తకం కావాలని వెదికే వ్యక్తికీ చాలా తేడా వుంది” అంటాడు జి. కే . ఛెస్టర్టన్
ఇప్పటి యువతరం పై సాంఘిక మాధ్యమాల ప్రభావం ఎక్కువ కావడం తో చదవటం అనే అలవాటు మెల్లగా వారి జీవితాల్లోంచి నిష్క్రమిస్తోంది. ఇక స్కూలు విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వారికి చదవటం అనేదే తెలీకుండా పోతోంది. చదవటం స్కూలు వరకే పరిమితమై పోయింది. మిగతా సమయమంతా వీడియో గేములు ఆడుకోవడానికీ, టీవీ చూడటానికీ సరిపోతోంది.
పిల్లల విషయం లో అయితే తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా వుందేమో అనిపిస్తుంది. కొంతమంది ఇళ్లలో, పిల్లల ధ్యానాన్ని మళ్లించడానికో, వారినుండి తాము కొంత విరామం పొందడానికో వారే ఈ సెల్ ఫొన్లనూ ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలనూ, పిల్లలకి అలవాటు చేస్తున్నారు. అలాంటి విషయాల్లో వారికి ఒక పుస్తకాన్నిచ్చి చదువుకుంటూ కూర్చో అనిచెప్పగలమా?
ఇంతకు ముందయితే పిల్లలు బైటికి వెళ్లి ఆడుకునే వారు లేదా, ఇంట్లో కూర్చుని ఏ కథల పుస్తకమో చదువుకునే వారు. పిల్లల గురించి ఆ రోజుల్లో వచ్చిన చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు లాంటి పుస్తకాలు ఈనాడు వున్నాయా? వున్నా వాటిలో ఆనాటి నాణ్యత వుందా? పిల్లల్ని ఆకర్షించి చదివించగలవా?
చదువుకోవడమంటే పాఠ్య పుస్తకాలు మాత్రమే అనే భావం ఈ నాడు పిల్లల్లో పాతుకుపోయింది. పిల్లల ప్రపంచాన్ని విస్తరింపచేయడానికి చిన్న చిన్న విషయాలు అనేకం వున్నాయి. ఆన్నింటిలొకీ అత్యుత్తమమైనది పుస్తకం చదవటం అన్నారు పెద్దలు. ఏం చదవాలి? చదివే అలవాటును కలిగించి చదవటాన్ని ఒక లోతైన అవసరంగా మలచ గలిగేది ఏదైనా చదవొచ్చు.
నిజానికి చదివే అలవాటు జ్ఞాన సముపార్జనకే కాకుండా అధిక పదజాలాన్ని తెలిసేలా చేసి తద్వారా భాషను కూడా అభివృధ్ధి పరుస్తుంది. మంచి సంభాషణా చతురతను కల్గిస్తుంది. ఒక సాంప్రదాయంగా వుంటూ వచ్చిన చదివే అలవాటు దేశ చరిత్రలో, దాని సంస్కృతి లో ఒక భాగమై వుండేది. ఇప్పుడు మారుతున్న జీవనవిధానం లో సాంకేతికతను ఎంత త్వరగా సాధన చేయగలిగితే, ఎంత త్వరగా దానిలో ప్రావీణ్యం సంపాదించగలిగితే అంతటి విలువ ఇవ్వబడుతుంది, కాబట్టి, సెల్ ఫోన్లూ, మార్కెట్ ని దాడి చేస్తున్న వివిధ రకాల ఎలెక్ట్రానిక్ పరికరాలూ, టీవీ లు ప్రముఖమై పోతున్నాయి.
చాలా మంది ముద్రణాలయాల్లో ముద్రించిన పుస్తకాలనుండి, కంప్యూటర్లలో, కిండెల్ లాటి పరికరాలలో ఫోన్లలో, చదవటం మొదలు పెట్టారు. అప్పుడు చదువరుల సంఖ్య బాగా తగ్గి పోయింది. దాని తరువాత సాంఘిక మాధ్యమాల్లొ పోస్టులూ, సందేశాలూ, వాటిని ఫార్వర్డ్ చేయటాలు మొదలైన పనులకి సమయాన్ని కేటాయించాల్సి రావడం తో, చాలామంది ప్రత్యేకంగా చదవటం అనే అలవాటుకు దూరమై పోయారు.
నేటి జీవన విధానానికి డబ్బు కూడా చాలా అవసరమైపోయింది. డబ్బు సంపాదించడమనే ప్రక్రియలో నేటి యువతరం చాలా ఆనందాలనే త్యజిసున్నది. ఈ త్యాగాల ప్రవాహం లో చదవటం అనే ఒకనాటి ఆహ్లాదకరమైన అలవాటు కొట్టుకు పోతోంది.
చదివే అలవాటు దానితో పాటు కొన్ని మంచి విషయాలని తీసుకుని వెళ్లిపోతోంది.
చదివే అలవాటు తగ్గటం వల్ల, యువత, సాంఘిక మాధ్యమాల్లో గడిపే సమయం ఎక్కువవుతోంది. ఆ సమయం కేవలం ఆహ్లాదాన్ని కలిగించడానికే పనికొస్తున్నది తప్ప విజ్ఞాన పరంగా ఎలాంటి వుత్పాదకతనూ ఇవ్వటం లేదు. సాంఘిక మాధ్య మాలని వుపయోగించే యువత, కొత్త పోకడలతో కొత్త పదాలనీ (సందేశాల ను పంపించడం కోసం ఆవిష్కరించే నూతన పదజాలం) కనిపెట్టి, భాష ని కుదిస్తోంది. సృజనాత్మకత ను కోల్పోతోంది.
పుస్తకాలు చదవటం వల్ల (ముద్రించిన పుస్తకాలైనా, లేక కంప్యూటర్లో చదివినా) ఒక విషయాన్ని కూలంకషంగా తెలుసుకునే అవకాశం వుండేది. ఈ అలవాటు తగ్గి పోవడం వల్ల అంతర్జాలం లో వెదికి ఆ విషయం మీది సమాచారాన్ని ముక్కలు ముక్కలు గా (వివిధ వెబ్ సైట్ల నుండి వివిధ రూపాలుగా) రాబట్టటం అలవాటుగా మారి పోయింది. ఈ సమాచార సేకరణ ఒక నిలకడలేని చదువు . దీనివల్ల తెలుసుకునే విషయపు పరిపూర్ణత దెబ్బతింటుంది. ఆలోచనల్లోనూ , ఆ విషయాన్ని అర్థం చేసుకునే రీతిలోను లోటు కలుగు తున్నది.
ఇంతకు ముందు ఒక పుస్తకాన్ని చదివిన తరువాత ఆ పుస్తకం మీద వివిధ అభిప్రాయలు తెలుసుకోవడానికి నలుగురితో చర్చించే వారు. అందరూ కలిసేవారు. సాంఘిక సంబంధాలు వృధ్ధి చెందేవి. కలుపుగోలుతనం వుండేది. సంఘం కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా వుండేది. ఇప్పుడు అవన్నీ తగ్గి పోయాయి.
మొత్తం మీద చదివే అలవాటు తగ్గిపోవడం వల్ల జీవన శైలే మారిపోయింది. ఏదీ చదవని వారి మేధస్సు ఒక మూసేసిన గ్రంధాలయం లాంటిది.