Asianet News TeluguAsianet News Telugu

నిరాడంబరత చాలా కాస్ట్లీ గురూ!

The cost of politics of simplicity

మార్క్సిజం మాత్రమే కాదు. మార్క్స్ అండ్ స్పెన్సరిజం కూడా తెలియాలి. 

లెనినిజం మాత్రమే కాదు. లినెన్ వస్త్ర నిజం కూడా ఎరగాలి.

మావో ఆలోచనా విధానం మాత్రమే కాదు. మా ఆలోచనా సరళీ తెలియాలి.

 

ఇరవై ఏళ్ళ క్రితం ఆకాశవాణి హైదరాబాద్ ఆఫీసుకి వెళ్ళినపుడు మిత్రుడు తెరేష్ బాబు ప్రతి గదీ పరిచయం చేసాడు. ఓ రూములోకి తీసుకెళ్ళి 'ఇది నిలయ విధ్వంసుల చోటు' అన్నాడు. 

 

అలా... సామాజిక, రాజకీయ అంశాల్లో కూడా ఈ నిలవ విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. కొత్తవింత-పాతరోత ఒకోసారి పాతవింత-కొత్తరోత గా అనిపిస్తోంది. ఎక్కడివో, ఏ రాష్యావో చైనావో సిద్ధాంతాలూ విలువలూ ఇక్కడ రుద్దుతారా అని యువతరం, రోజురోజుకీ భావదారిద్ర్యంలో కూరుకుపోతున్న భారత కమ్యూనిజం, విధాన నిర్ణయాలలో పాత్ర పోషించాల్సిన ఇరవైలోని వారికీ వెనుకటిలోనే ఉండిపోతున్న అరవైలోని వారికీ సంఘర్షణ. 

 

ప్రపంచీకరణలో మార్క్స్ అండ్ స్పెన్సర్, లెనన్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది (ఆమోదించనక్కర లేదు). మావో చుట్టూనే కాకుండా మా చుట్టూ తిప్పండి మీ దార్శనికత అని వేచి చూస్తోంది 60 శాతం పైగా జనాభాలో భాగమైన యువరక్తం. 

 

రాజకీయ, సాంస్కృతిక, ఆర్ధిక, ఆధునిక పోకడలు అన్నింటినీ ఒడిసి పట్టుకుని ఆకాశమే హద్దుగా ఎగరాలి అనుకుంటున్నది. 

 

'ఎకానమిక్స్ లో మాస్టర్స్ చేసినా ప్రజలంటే ప్రాణం. నిరాడంబరుడ్ని. రెండేరెండు చొక్కాలు. అయిదేళ్ళుగా ఏమీకొనలేదు....' చెప్తూ పోతున్నాడాయన.

 

ఎంతమందికి వ్యాపారం లేకుండా చేశాడో ఈ నిరాడంబరతతో. ఎకానమీ స్టాండ్ స్టిల్ ఇలాంటివాళ్ళుంటే.

 

నిరాడంబరత చాలా కాస్ట్లీ గురూ!

 

గాంధీ - నిరాడంబరత : ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి లండన్ వెళ్తే, కూడా తీసుకెళ్ళిన మేకను (పాలకోసం) పోషించడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బ్రిటిష్ ప్రభుత్వమూ నానా తంటాలు పడ్డారట. ఈయన మేకపాలు, కొల్లాయి ఏమోగానీ తడిసిమోపెడౌతోందని గోల అట. టాటా బిర్లాలు ఇది ఎపుడో చెప్పారు. రాజా నరేంద్రనాథ్, మోతీలాల్ నెహ్రూ ... తప్పక భరించారు !

 

"The cost of being a vegan is a whole lot higher than the cost of being a meat eater not only that but hardworking Americans who have to scrimp and scrape for everything a hard time buying the expensive stuff it takes to be a vegan."

- A netizen from the US

 

'నిరాడంబరత' అనేదే ఓ పెద్ద ట్రాప్, బహుదొడ్డ ట్రాష్. వారివల్ల ప్రత్యక్ష కష్టాలు పడడం మాత్రమే కాదు, వారి ఆ 'కీర్తి;ని కూడా జీవితాంతం మనం 'కోటబుల్ కోట్స్'గా చదువుకోవాల్సి వస్తుంది.

 

ఎవరి అడుగులలోనో నడవాల్సి వస్తుంది. మనం ఏమిటో మర్చిపోయి. అంతా ఫ్యాబ్రికేటెడ్ నాలెడ్జ్ తో మసలుకోవాల్సి వస్తుంది. ఎవరో అల్లే కల్లలకు మనం పందిరి కావలసి వస్తుంది.  వారిని విమర్శించే వారినుంచి వారినీ మననూ రక్షించుకోవడంకోసమే జీవితాన్ని వెచ్చించవలసి వస్తుంది.

 

వర్తమానంలో మనతో నడుస్తున్నవారినీ, భవిష్యత్తు రోజుల్నీ... గతకాలపు కీర్తిపరుల కళ్ళతో చూడాల్సి వస్తుంది. మొదటి చూపుకంటే ముందే, అంచనా వేయవలసి వస్తుంది. కొత్తదనం లేదు. ఛాలెంజ్ లేదు. నేర్చుకునేది లేదు. నిలవ విధ్వంసులలా మిగిలిపోవలసి వస్తుంది.

 

కాబట్టి... ఏ విలువలూ, ఏ ఇజాలూ సర్వకాల సర్వావస్తలకు పనికి రావు. అతి డైనమిక్ అయిన జీవనాన్ని ఎప్పటికపుడు పలవరించవలసిందే. పలకరించవలసిందే.

 

లేకపోతే, నిన్న అవుతాం. మన్నవుతాం.