రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.  తెలంగాణలో  రెడ్లు సంఘటితమయ్యేందుకు ఆయన నిర్ణయం వూపు నిచ్చింది. కేసీఆర్ వ్యతిరేకులకు రేవంత్ ఒక కుదురుగా మారేటట్లున్నాడు.  2019 ఎన్నికల్లో ముఖాముఖి పోటీ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సంఖ్యాపరంగా మూడు నాలుగు శాతం మించకపోయినా ఆర్థికపరంగా, సామాజిక పరంగా బలంగా ఉండే రెడ్డి వర్గం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణలో చక్రం తిప్పేది. అయితే, విభజన తర్వాత వారి పరిస్థితి తల్లకిందులైంది. సంఖ్యాపరంగా నామమాత్రంగా(0.5 శాతం) ఉండే వెలమ సామాజికవర్గానికి చెందిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. నాటినుంచి రెడ్లలో అసంతృప్తి మొదలయింది. రాజకీయంగా, సామాజికంగా తమ ప్రాధాన్యత తగ్గిపోయిందని మధనపడుతున్నారు. కొన్ని రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని దీనిపై చర్చలు కూడా జరిపారు. ఇదిలా ఉంటే, పులిమీద పుట్రలా గతకొద్దిరోజులుగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు వారిని మరింత రెచ్చగొట్టాయి. ముఖ్యంగా కేసీఆర్ ఇటీవల కోదండరామ్ ను దారుణంగా కించపరచటం, వీ6 ఛానల్ లో ప్రత్యేకంగా ప్యానెల్ డిస్కషన్ పెట్టించి తన బంటులైన దేశపతి శ్రీనివాస్, దేవీ ప్రసాద్, ప్రకాష్, అల్లంనారాయణ మొదలైనవారితో రెడ్లను తిట్టించటం, కమ్మ సామాజికవర్గాన్ని దువ్వటం వంటి వ్యవహారాలు. రెడ్లపై చేసిన వ్యాఖ్యలకుగానూ దేశపతిని రెడ్డి జాగృతి అనే రెడ్డి కుల సంఘం సిద్దిపేటలో ఘెరావ్ చేసిందికూడా. ఇది రెడ్ల లో వస్తున్న  కదలిక సూచన.

కేసీఆర్ కు 2014 ఎన్నికల్లో ప్రజలు సాధారణ మెజారిటీయే ఇచ్చినప్పటికీ, తదనంతర పరిణామాలలో ఆయన పాపులారిటీ షోడశ కళలుగా పెరిగిపోయింది. ప్రతి ఉపఎన్నికలలో బ్రహ్మాండమైన విజయాలు, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘనవిజయం, తాజాగా సింగరేణి ఎన్నికల్లో విజయం వంటి పరిణామాలతో కేసీఆర్ పాపులారిటీ, ఇమేజ్ రాకెట్ స్పీడుతో దూసుకుపోతున్నాయి. అంతలా ఎదిగిపోయిన కేసీఆర్ తో తలపడే, నాయకుడు-మొనగాడు ఎవ్వరూ లేరనే భావన కూడా ఇటీవల ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ భావనను కొట్టిపారేయటానికి ఆ మధ్య జానారెడ్డి, కేసీఆర్ తో తలపడటానికి మా బాహుబలి రాబోతున్నాడని ఒక వ్యాఖ్య చేశారు. అది ఉద్దేశ్యపూర్వకంగా అన్నారో, లేక తమాషాగా అన్నారోగానీ ఇప్పుడు కేసీఆర్ ను ఎదుర్కోటానకి రేవంత్ ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుకోబోతున్నట్లే కనిపిస్తోంది. 

ఓటుకు నోటు వంటి కేసులో ట్రాప్ చేసి పట్టించినాకూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటూ పోరాడటమే రేవంత్ కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఒకరకంగా ఆ పోరాట పటిమ వలనే రేవంత్ స్థాయి ఒక మెట్టుకు పైకి వెళ్ళగా, తాజా పరిణామాలతో అది మరింత పెరిగింది. దీనితో కేసీఆర్ వ్యతిరేకులు అందరికీ రేవంత్ ఆప్తుడుగా కనిపించటం,  అతనితో చేయికలపాలని అనిపించటం సహజం. మరోవైపు కేసీఆర్ అంటే రగిలిపోతున్న రెడ్డి సామాజికవర్గం అండ ఉండనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అనే ఒక గట్టి వేదిక కూడా లభించింది. దానికి తోడు సాక్షాత్తూ తన సమీప బంధువు, కురు వృద్ధుడు జైపాల్ రెడ్డి, దూరపు బంధువులు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటివారు కాంగ్రెస్ లోనే ఉండటం రేవంత్ కు కలిసొచ్చే మరో అంశం. కాబట్టి ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో, కేసీఆర్ కు ఎంత పోటీ ఇస్తాడో తెలియదుగానీ, తెలంగాణలో రేవంత్ ఒక బలమైన శక్తిగా అయితే ఎదగబోతున్నాడన్నది మాత్రం తథ్యం. అయితే ఈ సమయంలో అతను గతంలోలా రెచ్చిపోకుండా పరిణతితో కూడిన రాజకీయం చేస్తే తప్పనిసరిగా మరోస్థాయికి ఎదుగుతాడు. ఎలాగూ కేసీఆర్ రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకోటానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి, లెఫ్ట్ పార్టీలు, కోదండరామ్ నేతృత్వంలోని జేఏసీ కాంగ్రెస్ నాయకత్వంలో బరిలో దిగుతాయి. కనుక, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ పాత్ర కీలకం కానుండే అవకాశం స్పష్టంగా ఉంది.

 

(*రచయిత శ్రవణ్ బాబు సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్. ఫోన్ నెం.9948293346)