కెసిఆర్ : ఎవరి బాపు? ఎవరికి బాపు?

Telangana father of nation KCR surrounded by Telangana traitors

 

 

 

తన అనుంగు సహచరులతో బాపుగా, జాతిపితగా పిలిపించుకుంటున్న కేసీఆర్... నిజానికి ఎవరి బాపు? ఎవనికి బాపు? 

 

ధనిక రాష్ట్రాన్ని దగాచేస్తున్నోడు ఎవనికి బాపు? రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే రెండవ స్థానంలో (మహారాష్ట్ర తర్వాత), మహిళా రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ పాలకుడు ఎవని బాపు? 

 

రాష్ట్రం ఏర్పడినపుడు 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రంలో ఏం సాధించారని, ఏ ప్రజల జీవితాలు మెరుగయ్యాయని, ఎవరికి ఆ డబ్బంతా ఖర్చుపెట్టారని నేడు రాష్ట్రం దివాళా తీసింది? ఏ వర్గాలకు బాపు మీరు? 

 

99 శాతం మేనిఫెస్టో అమలు చేసామని చెప్తున్న రాష్ట్రంలో ఉద్యమకారులు నాలుక కోసుకుని చనిపోతే, రైలు కింద పడి చనిపోతే పట్టనట్టు ఉన్న బీటీ బిడ్డ ఎవనికి బాపు? 

 

బీడీ కార్మికులు, సెర్ఫ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, లక్ష ఉద్యోగాల జాడ లేక పరేషాన్ అవుతున్న యువతకు చీకటి చూపిస్తున్న వాడు ఎవరి బాపు? 

 

బంగారు తెలంగాణ బడుల్లో బిస్కెట్లే భోజనంగా మారిన పాలన ఎవరిది? పాలకుడు ఎవరికి బాపు? 

 

ఫీజులు ఎగ్గొడుతూ కాంగ్రెస్ దారిలో నడుస్తాం అంటూ, ఆ కాంగ్రెస్ వల్లే ఇన్ని సమస్యలు అంటూ, నిలదీసే వారిని ఏజెంట్లు అంటూ నరంలేని నాలుకలా మెలికలు తిరుగుతున్న ఎలిక పాము వంటి ఏలిక ఎవనికి బాపు? 

 

ముప్ఫై మూడు సార్లు కోర్టుతో మొట్టికాయలు వేయించుకుని, అసెంబ్లీలో అబద్ధాలు చెపుతూ, మెదక్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ ప్రాంత రైతుల భూములను దోచేస్తున్న వాడు ఎవరి బాపు?

 

మీదియానూ పోలీసు వ్యవస్థనూ చెరపట్టి, వారిలో అంతర్యుద్ధాలకూ,  ఆత్మహత్యలకూ కారకుడు అవుతున్న వాడు ఎవనికి బాపు? 

 

జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీలను మరచి పోవడం కాదు, తెలంగాణ చరిత్రనే మొత్తం మారుస్తున్నారు. తెలంగాణ అంటే చైతన్యం, తెలంగాణ అంటే తిరుగుబాటు అనే వారసత్వాన్ని చెరిపేసి... తెలంగాణ అంటే పూజా పునస్కారాలు, తెలంగాణ అంటే సబ్బండ వర్ణాల అణచివేత, తెలంగాణ అంటే పిట్టల దొర వాగ్దానాలు, తెలంగాణ అంటే ఆత్మహత్యల ఫ్యాక్టరీ, తెలంగాణ అంటే దొరల చరిత్ర, తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబ త్యాగాలుగా కొత్త చరిత్రను రచిస్తున్న మీరు ఎవనికి బాపు? 

 

 

తెలంగాణ రాకుండా చూడడానికి వెంకయ్య నాయుడు ఏం చేసిండో తెల్వదా బాపు కు?  అయినా ఆయనకు పోలీసు వాహనాల కాంట్రాక్టు కట్టబెడుతావు. ఎవనికి బాపువు నీవు?  రామోజీరావులు, మెగా కృష్ణారెడ్డిలు సహా తెలంగాణను ఆడ్డుకున్న వారందరూ మీకు స్నేహితులే కదా నేడు? మీరు ఎవరి బాపు? పార్లమెంటులో పెప్పర్ స్ప్రే యుద్ధం చేసిన రాజగోపాల్ మీకు వీరతాళ్ళు వేస్తున్నారు అంటే మీరు ఎవరికి బాపు? 

 

నాడు తెలంగాణ ఉద్యమంలో ద్రోహులుగా ముద్రపడ్డ ప్రతివాడూ మీ వెనుక, మీ పక్కన, మీ ముందు, పగలూ రాత్రీ ఉంటున్నారంటే మీరు ఎవరి బాపు? 

 

నాడు తెలంగాణ ఉద్యమంలో మీకంటే ఎక్కువ పనిచేసిన, ఎక్కువ త్యాగాలు చేసిన వారిని మీరు సన్నాసులు అనీ ఏజెంట్లు అనీ తెలంగాణ ద్రోహులు అనీ హేళన చేస్తున్నారంటే, వారిని నిర్బంధిస్తూన్నారంటే మీరు ఎవరికి బాపు? 

 

నీళ్ళు-నిధులు-నియామకాలు యివి కదా తెలంగాణకు కారణాలు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి - యివి కదా ప్రాథమ్యాలు? వీటికి పైసా యివ్వకుండా, ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కొత్త కొత్త స్కీములకు తెరదీస్తున్న మీరు ఎవరి బాపు? 

 

రైతు రుణమాఫీకి చేతులు రావు కానీ, మనకు సంబంధం లేని సినిమాలకు పన్ను మినహాయింపులు యిస్తున్న మీరు ఎవరికి బాపు? 

 

మల్లన్నసాగర్ బాధితుల పక్షాన నిలుస్తున్న ఆడబిడ్డను ఆడిపోసుకుంటున్న మీరు ఎవరి బాపు? 

 

తెలంగాణకు ఎపుడూ లేని గోస మిగులుస్తున్న మీరు... కేవలం తెలంగాణ వ్యతిరేకులకు మాత్రమే వరాలిచ్చే బాపు. మీ ముద్ర చెరగని విధంగా వారు మాత్రమే తలచుకునే ప్రామిసరీ నోటుపై విగ్రహపు బాపు మీరు. గండశిల బాపు మీరు!