కన్నీళ్లు ఆగలేదు..
నిన్న అర్థరాత్రి 12.53 గంటలకు నా సహచర జర్నలిస్టు నస్రీన్ ఖాన్ వాట్సాప్ లో మెసేజ పెట్టింది. గురువు గారు శ్రీకాంత్ అనారోగ్యంతో మరణించారని. కానీ.. నా ఫోన్ రాత్రి స్విచ్చాఫ్ అయింది. తెల్లవారిన తర్వాత చార్జింగ్ పెట్టి.. ఉదయం 8 గంటల సమయంలో నస్రీన్ పెట్టిన మెసేజ్ చూశాను. మెసేజ్ లోని మొదటి లైనులో సీనియర్ జర్నలిస్టు గుర్రంకొండ శ్రీకాంత్ అన్న పేరు చదవగానే నా గుండెలు గుబేల్ మన్నాయి. పెద్దాయనకు ఏమైందో అని ఆందోళన మొదలైంది. నా మనసు కీడు శెంకించింది. భయం భయంగానే మిగిలిన 8లైన్ల మెసేజి చదివిన. ఆ మెసేజ్ చదవగానే నా కన్నీళ్లు ఆగలేదు. అయ్యో... గురువుగారు లేరని తెలిసిన క్షణం... నా పదిహేనేళ్ల జర్నలిజం కెరీర్ అంతా నాకు మతికొచ్చింది.
2002 నవంబరులో వార్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజంలో పరీక్ష రాసిన. ఇంటర్వూకు హాజరయిన. ఎదురుగా శ్రీకాంత్ సార్.. గంభీరమైన గొంతుతో.. ఏం పేరు అని అడిగిండు. నాగరాజు అని చెప్పిన.. ఏ ఊరు.. నల్లగొండ జిల్లా నకిరేకల్ అని చెప్పిన. తర్వాత నేను రాసిన పరీక్ష తాలూకు పేపర్లు మల్లా ఒకసారి పరిశీలించి... కొద్దిసేపు పలు అంశాలపై మాట్లాడించి.. సరే వెళ్లు.. అని చెప్పిర్రు. తర్వాత నేను వార్త జర్నలిజం స్కూల్ కు సెలెక్ట్ అయిన. ఏడు నెలల పాటు ట్రైనింగ్. ఈ సమయంలో జర్నలిస్టుగా తన అనుభవాలను ఎక్కువగా చెప్పేవారు శ్రీకాంత్ సార్. జర్నలిస్టుగా నా ప్రయాణంలో ప్రతి అడుగులోనూ శ్రీకాంత్ సార్ ముద్ర ఉంటుందనే చెబుతాను. క్లాస్ రూములో ఆయన నుంచి నేర్చుకున్న పాఠాల కంటే.. వార్త ఆఫీసు గేటు వద్ద ఉన్న చాయ్ కేఫ్ లో నేర్చుకున్న విషయాలే ఎక్కువ. క్లాస్ మొదలు కాగానే.. గంటన్నర రెండు గంటల కాంగనే చాయ్ తాగేందుకు పోతుంటిమి. సార్ మాత్రం తెల్ల రంగులో ఉండే మెంతాల్ సిగరేట్ తాగేటోడు. మేమందరం చాయ్ తాగుతుంటిమి. రెండు సిగరేట్లు తాగనిదే సార్.. అక్కడి నుంచి కదలకపోతుండే. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి తాగి.. తర్వాత తిరిగి ఆఫీసులో అడుగు పెట్టేవాళ్లం.
ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి గంటల తరబడి చెప్పేవారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా ప్రవేశించింది.. లక్ష్మీ పార్వతిని ఏ పరిస్థితుల్లో ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు.. టిడిపిని కుదిపేసిన లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ తాలూకు అనేక ఆసక్తికరమైన అంశాలను సైతం సార్ మాకు చెప్పుతుండే.
ఆ అలవాటు మాత్రం సార్ నుంచి నేర్చుకోలేకపోయిన
శ్రీకాంత్ సార్ తన శిశ్యులందరినీ ఒకే తీరులో చూసేవారు. తన శిశ్యుల గురించి ఎవరికైనా చాలా గొప్పగా చెప్పేవారు. వార్తలో పనిచేసిన తర్వాత ఎవరైనా ఉద్యోగాలు మానేసి వచ్చిన సందర్భంలో ఇతర సంస్థల్లో వారికి రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో మావాడు బాగా రాస్తాడు.. మీరు ఉద్యోగం ఇవ్వండి అని సిఫార్సు చేసేవారు. అలా ఎంత మంది వచ్చినా.. తన శిశ్యుల గురించి గొప్పగా చెప్పేవారు. ఆయన శిశ్య బృందంలో కొంతమందికి సిగరేట్ తాగే అలవాటు ఉండేది. శ్రీకాంత్ సార్ అడుగుజాడల్లోనే నడిచినప్పటికీ నాకు మటుకు ఆ సిగరెట్ తాగే అలవాటు మాత్రం నేర్చుకోలేదు. సిగరేట్ తాగడం వళ్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది.. కాబట్టి మానేయండి అని శిశ్య బృందంలోని కొందరు సార్ కు చెప్తుండేవాళ్లం. అయితే దానికి సార్ సమాధానమేమంటే.. మా ఇంట్లో మానేశాను కదా..? అనేవారు. ఇంట్లో మాత్రం సిగరేట్ తాగేవారు కాదు.
కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న వ్యక్తి కావడంతో తన ఇంటిపేరును తొలగించుకున్నారు శ్రీకాంత్ సార్. ఎప్పుడూ ఆయన పేరు శ్రీకాంత్ అని చెప్పేవారు. దీంతో మాకు వాళ్ల ఇంటిపేరు ఏందబ్బా అని తెలుసుకోవాలని అనిపించేది. మేము వార్త జర్నలిజం స్కూల్ విడిచిన చాలా ఏండ్ల తర్వాత కానీ.. సార్ ఇంటిపేరు గుర్రంకొండ అని తెలియలేదు. ఆరోజుల్లో కమ్యూనిస్టు నేతలు తమ కులం పేర్లు (రెడ్డి, రావు లాంటివి) తొలగించుకుంటున్న తరుణంలో శ్రీకాంత్ సార్ మాత్రం తన ఇంటిపేరును తొలగించుకుని శ్రీకాంత్ అని మాత్రమే పెట్టుకునేవారు. ఆయన రాసిన పుస్తకాల మీద కూడా రచయిత పేరు శ్రీకాంత్ అని మాత్రమే ఉంటుంది.
జర్నలిస్టు శ్రీకాంత్ సార్ గురించి మరింత సమాచారం...
ఐదు దశాబ్దాల పాటు పాత్రికేయులుగా కొనసాగిన గుర్రంకొండ శ్రీకాంత్ (79 సంవత్సరాలు) గుండె సంబంధ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అత్తాపూర్ లోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నెల్లూరు జిల్లా సీతారాంపురంలో పుట్టిన గుర్రంకొండ శ్రీకాంత్ విద్యార్థిగా ఉన్నప్పుడే విజయవాడ నుంచి (ఆంధ్ర రాష్ట్రం) వెలువడే ‘యువజన’ పత్రికకు పలు వ్యాసాలు రాశారు. పాత్రికేయ జీవితానికి పడిన ఆ పునాది ఆ తర్వాత ప్రగతిశీల భావజాలం కారణంగా విశాలాంధ్ర పత్రికలో పాత్రికేయునిగా పనిచేయడానికి దోహదపడింది. కొంతకాలం అక్కడే పనిచేసిన శ్రీకాంత్ ఆ తర్వాత సోవియట్ విప్లవం స్ఫూర్తితో అప్పటి మద్రాసు నగరం నుంచి వెలువడే ‘సోవియట్ భూమి’ పత్రికలో చేరారు. 1970వ దశకంలో అది మూతపడేంత వరకు ఆ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనలో శ్రీకాంత్ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన ఆహ్వానం మేరకు మద్రాసు నగరాన్ని విడిచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం పథకం గురించి ఎన్టీఆర్ అనేక కోణాల్లో శ్రీకాంత్‌తో లోతుగా చర్చించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు రాజకీయ ప్రసంగాలను తయారుచేసే కీలక భూమిక పోషించారు. ఎన్టీఆర్‌కు చివరి ప్రసంగాన్ని రూపొందించింది కూడా శ్రీకాంతే. ఎన్టీఆర్ మరణించేంత వరకూ గండిపేటలోని కుటీరంలోనే కుటుంబంతో కలిసి ఉండేవారు. ఆ తర్వాత వార్త దినపత్రిక ప్రారంభమవుతున్న సందర్భంగా యాజమాన్యం విజ్ఞప్తి మేరకు జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టి సుమారు 400 మంది యువ పాత్రికేయులను తీర్చిదిద్దారు. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్నవారు ప్రస్తుతం వివిధ పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో పాత్రికేయులుగా పనిచేస్తున్నారు.
పాత్రికేయుడిగా ‘జర్నలిస్టు కరదీపిక’ పుస్తకాన్ని రచించారు.
దాంతోపాటు రెండు సినీ కథలు సిపాయి చిన్నయ్య, ఒక ఊరి కథ రచించారు.
ఐదు సామాజిక నవలలు రచించారు.. అందులో
దేవుళ్ళారా మీ పేరేంటి
ప్రేమకు కత్తిపోట్లు
మనిషిలో మనీషి
గద్దల గుంపు
మదన సదనం
అలాగే అనేక రచనలకు విమర్శకుడిగా వ్యవహరించారు.
సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు,
తాపీ ధర్మారావు కీర్తి పురస్కారం
మహాకవి శ్రీశ్రీ సాహిత్య పురస్కారం లాంటి డజనుకు పైగా అవార్డులను పొందారు.
ఇట్లు
అల్లి నాగరాజు,
జర్నలిస్టు,
ఏషియానెట్ జాతీయ వెబ్ సైట్.