పంచాయతీ ఎన్నికలు పరోక్షం అసలే వద్దు
పంచాయతీ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో అసలే వద్దు. తెలంగాణ సర్కారు పరోక్షం విషయంలో పునరాలోచన చెయ్యాలి. ప్రస్తుత ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టానికి సమూల మార్పులు తెచ్చి పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడము పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కాని పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామనడం మాత్రం ప్రజల్లో నిరసన వెల్లువెత్తుతున్నది.
ప్రస్తుతం గ్రామాల్లో ఎన్నికల అనంతరం గొడవలు మరిచి జనాలు ప్రశాంతంగా ఉంటున్నారు. అందరూ ఏకమై గ్రామాభివృద్ధిలో భాగస్వాములై పనిచేస్తున్నారు. ప్రజలంతా స్నేహపూర్వకంగా కలిసిపోయే వాతవరణం వుంది. పరోక్ష ఎన్నికలతో గ్రామాల్లో ముఠాలకు, గ్రూపు రాజకీయాలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆ గ్రూపులు, ముఠాలు నిరంతరం కొనసాగి అభివృద్దికి ఆటంకంగా మారే ప్రమాదముంది.
సర్పంచ్ గా ప్రజలు తమకు నచ్చిన మెచ్చినవారిని ప్రత్యక్షంగా ఎన్నుకునే అవకాశం లేకపోవడముతో ఓటేవ్వరికి వేస్తామో ఎవ్వరు సర్పంచ్ గా ఎన్నికవుతారో తెలీదు. ఈ ఎన్నిక ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా జరిగి నాయకుల పట్ల విశ్వనీయత దెబ్బతినే ప్రమాదముంది. వార్డు సబ్యులతో బేరాసారాలూ, లాబియింగుతో అర్ధ బలం, అంగ బలం ఉన్నవాడే అధికార పీఠమెక్కుతాడు. సామాన్యులు, యువకులు స్థానిక రాజకీయాల్లో ఏమాత్రం రాణించలేరు. ప్రజల బాగోగులు చూడాల్సిన సర్పంచ్ వార్డు సభ్యుల చుట్టూ తిరుగుతూ కుర్చీని కాపాడుకోవలిసిన పరిస్థితి వస్తుంది. ప్రజా మన్నలతో సంబంధం లేక వార్డు సభ్యులను మచ్చిక చేసుకునేందుకు కడవరకు పాకులాడాల్సిన దుస్థితి దాపురిస్తుంది.
చిన్న పంచాయితీల్లో (500 ఓటర్లు) వార్డుకు 60-70 ఓట్లు ఉంటే పోటీదారులు ఎక్కువై ఓటుకు వేళల్లో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చి, సర్పంచ్ కు మద్దతిస్తే లక్షలల్లో డిమాండ్ చేసే పరిస్థితులు నెలకొంటాయి. ఎన్నికలంటేనే ముఠా కక్షలు, డబ్బులు రాజ్యమేలి గ్రామాల్లో ప్రశాంతతకు, శాంతి సామరస్యతకు భంగం ఏర్పడే అవకాశముంది. మొత్తానికి ప్రజాభీష్టానికి వ్యతిరేకమైన ఈ ఎన్నికతో ప్రజా సేవను పక్కకు బెట్టి 5 సంవత్సరాలు వార్డు సభ్యులను కాపాడుకొనే పరిస్తితి వస్తది. అందుకే ప్రభుత్వం ప్రజల మనోభావాలకనుగుణంగా యదావిధిగా ప్రత్యక్ష ఎన్నికలే జరుపుతుందని ఆశిద్దాము.
యధా ప్రజా, తధా రాజా...
ఇట్లు
గీకురు రవీందర్
(* రచయిత సర్పంచ్, చిగురుమామిడి గ్రామం, మండలం, కరీంనగర్ జిల్లా.)