కత్తి మహేష్ వివాదాన్ని ఫాలో అయినవారందరికీ ఈ వివేక్ అనే కొత్త క్యారెక్టర్ ఎవరు అన్నది పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిన విషయం తెలిసిందే. నిన్న మహాన్యూస్ ఛానల్ లో జరిగిన ప్యానల్ డిస్కషన్ లో కత్తి మహేష్ నోరు మూయించి అతను స్టూడియో వదిలి పారిపోయేటట్లు చేసి పవన్ అభిమానులతో వేనోళ్ళ పొగడబడుతున్న ఈ వివేక్ పూర్తి పేరు వివేక్ కృష్ణ. నాగచైతన్య నటించిన చిత్రం 'బెజవాడ'కు దర్శకుడు.

ఈ వివేక్ అసలు పేరు వివేక్ ఆనంద్. దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు. రాంగోపాల్ వర్మ స్వయంగా నిర్మించిన బెజవాడకు దర్శకుడు. ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన కోనేరు కిరణ్ కుమార్ కు కజిన్ అవుతారు. సినీ వ్యాపార కుటుంబంనుంచే వచ్చిన వివేక్ మొదట సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా అక్కడ జగపతిబాబుతో ఏర్పడిన పరిచయం ద్వారా కృష్ణవంశీ దగ్గర శిష్యుడిగా చేరారు. ఖడ్గం నుంచి ఆయన వద్ద పని చేశారు. 2011లో దర్శకుడిగా మారారు. అది విఫలమవటంతో రైటర్ గా మారారు. బోయపాటి శ్రీను వద్ద రైటర్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. లెజండ్ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల వెనక వివేక్ కూడా ఉన్నారు. త్వరలో ఒక పెద్ద చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలలో ఉన్నట్లు సమాచారం.

మహాన్యూస్ ఛానల్ లో ప్యానల్ డిస్కషన్ లో పాల్గొనగానే, వివేక్ మొదట కత్తిని ఒక ప్రశ్న అడిగారు. నేను మిమ్మల్ని కొడితే మీరేం చేస్తారని ప్రశ్నించారు. పోలీస్ కేసు పెడతానని కత్తి చెప్పారు. మరి ఈ పవన్ అభిమానులపై కేసులు పెట్టకుండా, పవన్ వచ్చి సమాధానం చెప్పాలంటూ టీవీ ఛానల్స్ స్టూడియోలచుట్టూ తిరుగుతూ యాగీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తన రెండో ప్రశ్నగా కత్తిని ఆయన తల్లి గురించి రెండు నిమిషాలు చెప్పాలని వివేక్ కోరారు. దానికి కత్తి ఒక్క క్షణం నిరుత్తరులయ్యారు. తర్వాత మళ్ళీ తేరుకుని తాను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనని అన్నారు. మీ తల్లి ఎలాంటి వాళ్ళయినా ఉండొచ్చు, మంచివారే అయిఉండొచ్చుగానీ, ఆమెను గురించి చెప్పటానికి అభ్యంతరమేమిటని వివేక్ ప్రశ్నించారు. వివేక్ దీనిపై ఎంత రెట్టించినా కత్తి మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు.  ఈలోపు ఫోన్ లో ఏదో మెసేజ్ వచ్చింది. అది చూసుకుని కత్తి అక్కడనుంచి మైక్ తీసేసి బయలుదేరారు. వివేక్, యాంకర్ ఎంత ఆపటానికి ప్రయత్నించినా ఆగకుండా వెళ్ళిపోయారు.

మొత్తానికి మూడు-నాలుగు నెలలుగా ఛానల్స్ అన్నింటిలో ఒకే విషయంపై వివాదాన్ని కొనసాగిస్తూ వందలమందిని నోరుమూయించిన కత్తి ఇలా అర్థంతరంగా వెనక్కు తగ్గటం ఇదే మొదటిసారి కావటంతో ఈ ప్యానల్ డిస్కషన్ తాలూకు వీడియో వైరల్ గా మారింది. కత్తి మహేష్ అనే వ్యక్తి వితండవాదానికి మారుపేరన్న విషయం బ్లాగులు, ఫేస్ బుక్ వంటి తెలుగు సామాజిక మాధ్యమాలలో మొదటినుంచి ఉన్న వారందరికీ తెలిసిందే. కత్తికి, పవన్ అభిమానులకు మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాదం నిన్న తారాస్థాయికి చేరింది. అభిమానులు తనను తిట్టినందుకుగానూ పవన్, అతనిని సమర్థించిన సినీ నటి పూనమ్ కౌర్ స్వయంగా వచ్చి సమాధానం చెప్పాలంటూ ఛాలెంజ్ విసిరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద కత్తి నిన్న హల్ చల్ చేశారు. అక్కడనుంచి టీవీ 9 ఛానల్ స్టూడియోకు వెళ్ళి వారి ప్యానెల్ డిస్కషన్ లో ఏకబిగిన ఐదారు గంటలు లైవ్ లో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నుంచి తెలుగు రాష్ట్రాలను రక్షిస్తానని, అతనినుంచి విముక్తి కలిగించటమే తన లక్ష్యమని చెప్పారు. దొంగలు, ఖూనీకోరులు, రౌడీలు, అవినీతిపరులే రాజకీయాలలో రాజ్యమేలుతున్న సమయాన పవన్ రాజకీయాలలోకొస్తే తప్పేముంది అని యాంకర్ అడగగా, పవన్ అవన్నీ కావనుకుంటున్నారా అని కత్తి ప్రశ్నించారు. అతనొక బ్రోకర్ అని, వెధవ అని దుయ్యబట్టారు. అభిమానుల ప్రవర్తనకుగానూ పవన్ వచ్చి తనకు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. పూనమ్ కౌర్ ఆంతరంగిక జీవితంపై తాను చేసిన ఆరోపణలను కూడా సమర్థించుకున్నారు. ఆమె వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు వేస్తూనే అవి ఆరోపణలు కావని చెప్పుకొచ్చారు. ఫోన్ ఇన్ లో పాల్గొన్నవారందరికీ వీసమంతైనా తగ్గకుండా బదులిచ్చారు. అలాంటి కత్తి మహేష్ కు వివేక్ రూపంలో చుక్కెదురైంది.