తాను ఇకపై సినిమాలు చేయడం మాని పూర్తి  స్థాయి  రాజకీయాలలో ఉంటానని సినీ నటుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్  అన్నారు. అలాగే ఇపుడాయన రాజకీయాల్లోకి వచ్చారు. పవన్ రాజకీయాల్లో ఎందుకు ఉండాలో ఎలా ఉండాలో ఒక సారి పరిశీలిద్దాం. ఇలాగే ఆయన రాజకీయావసరం గురించి కూడా చర్చిద్దాం.

 యధాలాపమే అయినా, హోదా ఇస్తే BJP తోచేతులు కలపడానికి తనకు అభ్యంతరం లేదు అని YSRCP అధినేత జగన్ ప్రకటించిన నేపథ్యంలో పవన్ రాజకీయాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 ఎన్నికల తర్వాత ముందు కూడా కాంగ్రెస్,టిడిపి కి బిన్నమైన రాజకీయ ప్రత్యామ్నాయం కావాలనే ప్రజలు బలంగానే ఉన్నారు. అందుకు నిదర్శనమే చిరంజీవి  ‘ప్రజారాజ్యం’కు వచ్చిన 18 శాతం ఓట్లు. విభజన అనంతరం అధికార TDP విపక్ష YSRCP అనుసరిస్తున్న పద్దతులు పట్ల ప్రజలలో చెప్పుకో దగ్గ వ్యతిరేకత వచ్చింది. ఈ వర్గం ప్రజలు కచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఆలోచన చేస్తారు. ప్రత్యామ్నయ రాజకీయాలను ఎవరు అందించగలరు? దీనికి ప్రజలందరికి తెలిసిన వ్యక్తి అయి ఉండాలి.  2019 ఎన్నికల నాటికి పరిశీలిస్తే ఆ అవకాశం ఒక్క పవన్ కళ్యాన్ నాయకత్వం లోని ‘జనసేన’ రూపంలో మాత్రమే కనిపిస్తుంది.

ఏపి ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయాలు ఏందుకు కావాలి....

ప్రజలు నేడు కోరుకుంటున్నది ప్రత్యామ్నాయ రాజకీయాలు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. విభజన అనంతరం రాష్ట్రం బాగా నష్ట పోయింది అన్నది వాస్తవం. అలాంటి రాష్ట్రానికి కేంద్రం సహకారం అదే స్థాయిలోఉండాలి. అలాంటపుడు రాష్ట్రం ఈ సహాయం పొందేందుకు ఎంతో బాధ్యతతో వ్యవహరించాలి. కాని అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండూ బాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. పోలవరం, రాజధాని ఎంపిక దాని నిర్మాణం, రాయలసీమకు ప్యాకేజీ, కడప ఉక్కు, కేంద్రీయ సంస్థల పూర్తి  స్థాయి నిర్మాణం, ఆర్థిక లోటు లాంటి విషయాలలో ప్రజల ప్రయోజనాల దృష్టిలో కాకుండా వచ్చింది ఎవరి ఖాతాలో ఉండాలి, రానిదానికి ఎవరిని ముద్దాయిని చేయాలి అన్న దాని పై శ్రద్ధ చూపిస్తున్నారు. ఇందులో 10 వంతు అయిన రాష్ట్రానికి ఏమి కావాలి ఉన్నంతలో ఏమి చేయగలం అన్న విషయాలపై దృష్టి పెట్టి ఉంటే ఎంతో కొంత మేలు జరిగి ఉండేది. అదే సందర్బంలో విపక్ష YSRCP వైఖరి కూడా సహేతుకంగా లేదు. విభజన చట్టం అమలు విషయంలో చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్లుగా కేంద్రాన్ని జగన్ ప్రశ్నించడం లేదు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంది అని ఒక వైపు మాట్లాడూతూనే రాష్ట్రపతి ఎన్నికలలో ఏక పక్షంగా BJP కి YSRCP మద్దతు ప్రకటించింది. చివరకు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో రాష్ట్రానికి చెంది ఉండి కూడా పెద్దగా ఉపయోగపడలేదని వెంకయ్యగారిని విమర్శించి అదే వ్యక్తికి గాంధీ మనవడిని సైతం పక్కన పెట్టి ఓటు వేశారు. హోదా రాదని అందరికి అర్థం అవుతున్నది. హోదా రాకపోయినా రాజధాని, పోలవరం, కడప ఉక్కు, రాయలసీమకు ప్యాకేజీ గుంతకల్లుకు రైల్వేజోన్, మన్నవరం , దుగ్గిరాజపట్నం ను పూర్తి చేయడం, ఆర్దిక లోటును బర్తీ చేయడం హైదరాబాలోని ఉమ్మడి ఆస్తుల విభజన లాంటి వాటిని హక్కులు చెప్పిన విభజన చట్టాన్ని అమలు చేస్తే కచ్చితంగా మేలు జరుగుతుంది. అదే హోదా ఇచ్చినా విభజన చట్టాన్ని అమలు చేయకపోతే వచ్చే ప్రయోజనం చాలా పరిమితం. కాని YSRCP మాత్రం హోదా చుట్టూనే రాజకీయాలు చేస్తున్నది.

కేంద్రం ఏపి పై చిన్న చూపు చూడడానికి బలమైన కారణం అధికార, విపక్ష పార్టీలు రెండూ కేంద్రంతో దోస్తీ చేయడమే.  మిగిలిన రాజకీయ పార్టీలకు ప్రస్తుత పరిస్థితులలో పెద్ద పాత్రలేదు.  అందుకు తగిన రీతిలో వారు కూడా ప్రయత్నం చేయడం లేదు . పలితంగానే TDP, YSRCP లకు బలమైన ప్రత్యామ్నాయం కావాలని ఏపి ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడే పవన్ అవసరం ఉంది.

పవన్ పవర్ స్టార్ మంచి ప్రత్యామ్నాయ స్టార్ కావాలి....

తెలుగు ప్రజలలో బలమైన ప్రజాదరన కలిగిన వ్యక్తులలో పవన్ కల్యాణ్ ఒకరు. సినీ రంగంలో పవర్ స్టార్ గా అభిమానులను సంపాందించుకున్నారు. 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు  విజయానికి పవన్ పాత్రకూడా కీలకమైనదే. అలా సినీ రంగంలోనే కాదు రాజకీయలలో పవర్ స్టార్ అనిపించుకున్నారు. 2014 ఎన్నికలకు పవర్ స్టార్ పాత్ర సరిపోయింది. కాని 2019 ఎన్నికల నాటికి ఇది చాలదు. పవర్ స్టార్ రాజకీయ ప్రత్యామ్నాయ స్టార్ కావాలి. అపుడే రాష్ట్రానికి మంచిది. కానీ పవన్ 2014 నుంచి ఇప్పటి వరకు రాజకీయాలలో పోషిస్తున్న పాత్ర మాత్రం పవర్ స్టార్ స్థాయికి మించడం లేదు. ఫలితంగా తాను ఒకరికి నష్టం చేయడానికో మరోకరికి లాభ చేయడానికో మాత్రమే ఉపయోగపడుతున్నారు. తన పంధాను మార్చుకోకుండా 2019 లో కూడా పవర్ స్టార్ పాత్రకే పరిమితమయితే మళ్లీ కూడా ఒకరికి లాభం చేయడం మరోకరికి నష్టం చేయడం మాత్రమే జరుగుతుంది. అయితే 2014 ఎన్నికలు రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో జరిగినవి. అప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్దితులలో పవన్ వైఖరి పెద్దగా విమర్శలకు గురి కాలేదు. కానీ 2019 ఎన్నికలు అందుకు భిన్నంగా ఉంటాయి. అపుడు కూడా ఇలాంటి వైఖరితో నే ఉంటే మాత్రం పవన్ కచ్చితంగా ముద్దాయిగా మిగిలిపోతాడు. అందుకే ఏపిలోని ప్రధాన పార్టీలయిన TDP ,YSRCP లకు భిన్నమైన రాజకీయాలు చేయడానికి పవన్ కు ఒక మంచి అవకాశం వచ్చింది. రాష్ట్రప్రజల అవసరం మేరకు పవన్ కల్యాణ్ నాయకత్వం లోని ‘జనసేన’ రాజకీయాలు పవర్ స్టార్ నుంచి ప్రత్యామ్నాయ రాజకీయల వైపు అడుగు వేయాలి.

 

*రచయిత మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి  మంచి నిబద్ధత ఉన్న రాజకీయ విశ్లేషకుడు. ఫోన్ నెం.9490493436