ఫస్ట్ థింగ్స్ ఫస్ట్.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని - సగటు తెలుగు కమర్షియల్ సినిమాలలో హీరోలాగా - ఒంటిచేత్తో కేసీఆర్, ఆయన నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ సాధించుకొచ్చినట్లు ఎవరైనా అంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు.

 

ఈ రెండున్నరేళ్ళుగా కేసీఆర్ టైమ్ బాగుండటంతో ఆయనను ఇంద్రుడు, చంద్రుడు, అసహాయశూరుడు, మేరునగధీరుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నవారు(ఈ గొర్రెలమందలో ఈమధ్య కొందరు ఆంధ్రోళ్ళుకూడా చేరటం ఒక విశేషం) ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనతలో కేసీఆర్ కృషి మూడోవంతు మాత్రమే.

 

రాజకీయ నిరుద్యోగిగా 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిననాటినుంచి రాష్ట్ర సాధనవరకు ఉద్యమంలో ఆయన పాత్రను ఎవ్వరూ కాదనలేరు. అసలు కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రసాధనను ఊహించనుకూడా లేము. అయినా కూడా… అయినా కూడా, కేసీఆర్ కృషి(కంట్రిబ్యూషన్) మూడోవంతు మాత్రమే.

 

2009 వరకు ఆయన నడిపిన తెలంగాణ ఉద్యమం ఏమిటీ అంటే పలు దఫాలు ఉపఎన్నికలకు పిలుపునివ్వటం తప్ప రోడ్లపైకి వచ్చి చేసిన ధర్నాగానీ, దీక్షగానీ ఏదీ లేదన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అందుకే 2009 ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ 2004కంటే తక్కువగా - కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు మాత్రమే దక్కాయి(ఆ గెలిచినవి కూడా టీడీపీ బలంగా ఉన్నస్థానాలను పొత్తు బేరసారాలలో కేసీఆర్ తెలివిగా దక్కించుకోవటంవలనే టీఆర్ఎస్ కు దక్కాయని సైకిల్ నేతలు ఇప్పటికీ వాదిస్తారు).

 

ఆ ఎన్నికలలో టీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్లని అమ్ముకుందని తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి.(హైదరాబాద్ నగరంలో ఒక స్థానాన్ని ఎంతోకాలంగా పార్టీని నమ్ముకున్నవారిని పక్కకు నెట్టి రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒక ఎన్ఆర్ఐ కొనుక్కున్నాడంటూ అతనిని తెలంగాణ భవన్ లోనే టీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదటం అందరికీ తెలిసిన విషయమే).

 

2009 ఎన్నికల్లో పార్టీ బలం తగ్గటంతో కేసీఆర్ పై తిరుగుబాటు రావటం, దళిత నాయకుడు చంద్రశేఖరరావు, లంబాడీ నాయకుడు నాయక్, ముస్లిమ్ నాయకుడు రెహ్మాన్ తెలంగాణ భవన్ కు వచ్చి మరీ కేసీఆర్ ను పచ్చిబూతులు తిట్టివెళ్ళిన విషయం ఎవరూ మర్చిపోలేరు. వీటన్నింటినుంచి ప్రజల దృష్టి మళ్ళించటానికే కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహారదీక్షకు దిగారన్న వాదన ప్రచారంలో ఉంది. అసలు ఆ నిరాహారదీక్షకు కేసీఆర్ చెప్పిన కారణం హైదరాబాద్ ఫ్రీజోన్ అంశమయినప్పటికీ, ఆయన ఖమ్మంలో దీక్ష విరమించాలని చూశారని వార్తలు రావటంతో ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు భగ్గునమండటంతో ఆ నిరాహారదీక్ష, ఉద్యమం కొత్త మలుపు తీసుకున్నాయి. అప్పటినుంచి ఉద్యమం సూపర్ స్పీడ్ తో దూసుకెళ్ళటం అందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి అసలు ఉద్యమం అప్పుడే మొదలయింది.

 

2009 డిసెంబర్ లో తీవ్రరూపు దాల్చిన తెలంగాణ ఉద్యమంలో 'సకల జనుల సమ్మె', 'మిలియన్ మార్చ్', 'అసెంబ్లీ ముట్టడి', 'సాగరహారం' అంటూ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేని విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ జేఏసీ కృషిని ఎవరైనా కాదనగలరా! ఉద్యమం అంటే టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే కాదని, ఇతర రాజకీయ పార్టీలను, ప్రజసంఘాలను, ఉద్యోగసంఘాలను మమేకం చేసి, వాటన్నింటి నేతలతో సమన్వయం చేసుకుంటూ, ప్రతి వర్గానికీ, ప్రతి వృత్తికీ ఒక జేఏసీని ఏర్పాటు చేసి, ఏ రోజూ వేడి చల్లబడకుండా ఉద్యమాన్ని రగులుస్తూ ఆ సెగ కేంద్రంవరకు తాకేటట్లు చేయటం జేఏసీ ఘనత కాదా!

జేఏసీ వల్లనే 2009 డిసెంబర్ నుంచి రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వరకు ఉద్యమం ఒక గాడిలో సంఘటితంగా, సమీకృతంగా సాగింది. మరోవైపు రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ కృషిని కాదనలేము. నాడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేశవరావు, మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్య, రాజగోపాలరెడ్డి, మందా జగన్నాథం తదితర 12 మంది ఎంపీలు పార్లమెంట్ లో తమదైన శైలిలో ఎంతో కృషి చేశారు.

 

పార్లమెంట్ ఆవరణలో అనేక ఫీట్లు చేసి అందరి దృష్టినీ ఆకట్టుకోవటమే కాకుండా, 2012 నవంబర్ లో పార్లమెంట్ లో రీటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన తీర్మానం  ప్రవేశపెట్టే కీలక సమయంలో వీరి మద్దతు అవసరమైనపుడు సభకు హాజరుకాకుండా మెట్లపై కూర్చుని పార్టీ అధినేత్రి సోనియాకే షాక్ ఇచ్చారు. తెలంగాణపై సోనియానుంచి మాట తీసుకున్న తర్వాతే ఆ 12 మందీ ఆ తీర్మానం పై ఓటింగులో పాల్గొని యూపీఏ ప్రభుత్వం పడిపోకుండా నిలిపారు. ఆ 12 మంది వెనకా జైపాల్ రెడ్డి మంత్రాంగం ఉన్న విషయం తెలిసిందే. అప్పుడే కాదు పార్లమెంట్ లో 2014 ఫిబ్రవరి 18న బిల్లు పెట్టినపుడు కూడా జైపాల్ రెడ్డి మంత్రాంగం వలనే బిల్లు సాఫీగా పాస్ అయింది.

తెలంగాణ సాధనలో ఎవరి వంతు ఎంత అని లెక్కలు వేసుకుంటే, కేసీఆర్-టీఆర్ఎస్ కృషి మూడోవంతు అయితే కోదండరామ్-జేఏసీ కృషి మూడోవంతుగా, మిగిలిన పార్టీలు, రాష్ట్ర యువత, సామాన్యప్రజలది మూడోవంతుగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

అలాంటి కోదండరామ్ పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని అపర చాణక్యుడుగా వందిమాగధులచే కొనియాడబడుతున్న కేసీఆర్ కు అర్థంకాకపోవటం విచారకరం. కోదండరామ్ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకోసమే ఈ ర్యాలీలు, నిరసనలు వగైరా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలో నిజం ఉండే ఉండొచ్చుగాక. అయినా కూడా ఆయనపట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. పోలీసులు అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి తలుపులు పగలకొట్టటం, ఆ వార్తలను ఏ వార్తా సంస్థా ఇవ్వకపోవటం విచారకరం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలోనే ఏ నాయకుడిపట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థాయిలో విరుచుకుపడలేదు. "ర్యాలీలో పాల్గొంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం - కెరీర్ కు ఇది నష్టం కలిగిస్తుంది" అంటూ పోలీస్ ఉన్నతాధికారులు ఈ ర్యాలీలో పాల్గొనబోయే ఆందోళనకారులకు బహిరంగంగా హెచ్చరికలు చేయటం పరాకాష్ఠ.

 

అధికారమత్తు పూర్తిగా తలకెక్కిన కేసీఆర్ ఇది ఫ్యూడలిజం కాలం కాదని ప్రజాస్వామ్య కాలమని తెలియటంలేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. జానపదకథలలోని మహారాజులాగా ఫీలైపోతూ, వాస్తు పేరుతో రాజులసొమ్ము రాళ్ళపాలు అన్న నానుడిని నిజం చేస్తున్నారని దుయ్యబడుతున్నారు(అయితే వెంకటేశ్వరస్వామికి కానుకలివ్వటంపై మాత్రం ప్రతిపక్షనేతలు పెద్దగా విమర్శించటంలేదు.. ఎంతైనా తదుపరి ఎన్నికలలో గెలవాలంటే వెంకన్న అనుగ్రహం ఉండాలిగా మరి!). మీడియాపై తెలంగాణలో అప్రకటిత ఆంక్షలుండటం బహిరంగ రహస్యమని అంటున్నారు.

 

ఏది ఏమైనా వేలాది పుస్తకాలను, చక్కటి తెలుగు సాహిత్యాన్ని, చరిత్రను, కావ్యాలను చదివిన కేసీఆర్ కు అధికారం శాశ్వతం కాదన్న చిన్న విషయం తెలియకపోవటం విచారకరం. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్ ను ఇలా వేధించటం ఏ విధమైన రాజనీతిజ్ఞతో అర్థంకావటంలేదు. రెండున్నర ఏళ్ళుగా తెలంగాణలో నెలకొని ఉన్న ఫీల్ గుడ్ భావన నిన్నటితో తొలగిపోయినట్లే ఉంది. పట్టణాలలో, నగరాలలో ఉండే విద్యాధికులు ఏళ్ళతరబడి ఆంధ్రోళ్ళమీద పెంచుకున్న కక్ష కారణంగా కేసీఆర్ ను వేనోళ్ళతో పొగడటమేగానీ ఈ ప్రభుత్వం సామాన్యప్రజలకు ఒరగబెట్టిందేమీ కనబడటంలేదు.

 

కనీవినీ ఎరగని దారుణాలతో రాష్ట్రాన్ని వణికించిన నయీమ్ కేసును మూలన పెట్టేయటం, ఎదిరించినవాళ్ళను అణచివేయాలని కక్షకట్టినట్లు వ్యవహరించటం, జనండబ్బుతో సకుటుంబ సపరివారసమేతంగా భోగభాగ్యాలనుభవించటం, మీడియాపై అప్రకటిత కఠిన ఆంక్షలు విధించటం.. ఇత్యాది పనులన్నిటినీ ఓటర్లు గమనిస్తూనే ఉంటారని మరిచిపోవద్దు దొరా!

 

(ఇందులో వ్యక్తం చేసినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు)