అన్నింటా మనమే... చేతులు కలిపిన చంద్రుళ్లు

Naidu and KCR learning from each in fooling telugu people

మొన్నీ మధ్య తెలుగువారి ఏకచ్చత్రాధిపత్యం అంటూ ఉన్నవో లేనివో చూపించారు గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా రూపంలో. అంతకు మించిన రాజ్యకాంక్ష, అచ్చు రాచరికంలో లాగానే అన్ని వ్యవస్థలపై నియంత్రణ, ప్రతిపక్షాలనూ, చివరికి ప్రజలనూ గొంతు ఎత్తకుండా చేసే చాణక్యాలూ తంత్రాలూ నడుస్తున్నవి నేడు తెలుగు రాష్ట్రాలలో. రాజులు పోయారు, రాజ్యాలూ పోయాయి అని మనస్ఫూర్తిగా అనుకునే పరిస్థితులు నేడు ఆంధ్రలోనూ తెలంగాణా లోనూ లేవు. 

 

ఇది రాసే సమయానికి అక్కడ చెన్నైలో శశికళ ఎక్కడానికి  ముఖ్యమంత్రి పీఠం సిద్దం చేశారు.  

 

కొందరు తెలుగు మేధావులు మాత్రం అక్కడేదో జరగకూడనిది జరిగిపోతున్నట్టు బాధ ఒలకబోస్తున్నారు.  నిజానికి, ఒక్క కేరళ తప్ప సౌత్ ఇండియా అంతా  కుటుంబాల కోటలు, వారసత్వ రాజకీయాలే కదా. ఒక్క తమిళనాడును ఆడిపోసుకోవడం ఎందుకు? మన డెమోక్రసీ పిపాస బహు చిత్రమైనది. బానిస సెల్వం కోసం ఏడుస్తాం, అయ్యో కుక్క గొలుసు తెగిపోయిందే అని. ఆయన మాత్రం గొలుసు లేకపోయినా ఉన్నట్టు భావించి అక్కడే తచ్చాడుతాడు. ఆయనైనా, ఇంకే తెలుగు బానిసలైనా దక్షిణాపథానికిచ్చే భరోసా ఇదే.

 

మళ్ళీ తెలుగు చంద్రుల దగ్గరికి వస్తే - ప్రజాస్వామ్యాన్ని గౌరవించక, అంత సెంటిమెంటులోనూ తమకు 15 మంది ఎమ్మెల్యేలను యిచ్చి రెండో ప్రతిపక్ష పాత్ర పోషించండి అని తెలంగాణ ప్రజలిచ్చిన విస్పష్ట తీర్పును గౌరవించక, ప్రజలు ఎన్నుకున్న తెరాస ప్రభుత్వాన్ని కూలదోసే 'ఓటుకు నోటు' కుతంత్రానికి పాల్పడిన చంద్రబాబు ఇటు తెలంగాణకు ద్రోహం చేసారు, తద్వారా కేంద్రం చేతిలో చిక్కి అటు ఆంధ్రకూ ప్రత్యేక హోదా దక్కించుకోలేక పోతున్నారు.

 

 ఆంధ్రలోనూ తమకంటే మొత్తంగా మూడున్నర లక్షల ఓట్లు మాత్రమే (మొత్తం రాష్ట్రవ్యాప్త పోలైన ఓట్లలో) తక్కువ వచ్చిన ప్రతిపక్ష వైకాపా సర్వనాశనానికి, తద్వారా ప్రజల ప్రశ్నించే కాంక్షకు సమాధి కడుతున్నారు. ఆంధ్రలోనూ, తెలంగాణలోనూ తామే రాజ్యం చేయాలని చూసారు. సారాంశంలో ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారు. ఇలా గొంతెత్తిన ఎవరినైనా నయానో భయానో నోరు మూయిస్తున్నారు. విజ్ఞులైన చదువరులకు నేను వేరేగా డేటా ఇవ్వనక్కర లేదు. 

 

పైకి కత్తులు దూసినట్టు అపుడపుడు కనబడుతూ, ఇద్దరు చంద్రులు ఒకరితో ఒకరు కుమ్మక్కై, ఇరువురి బ్రోకర్లైన మీడియాధిపతులూ, కాంట్రాక్టర్లూ, వ్యాపార ఎంపీలు, కొండొకచో న్యాయ వ్యవస్థలోని కొందరి అండతో అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డారు. వచ్చే ఎన్నికల్లో వేరెవరూ అందుకోలేనంత ధనమయం చేసి మళ్ళీ గట్టు ఎక్కుదాం అనుకుంటున్నారు.

 

ఇక తెలంగాణలో - కనివిని ఎరుగని నియంతృత్వం సాగుతున్నది. మెయిన్ స్ట్రీం మీడియా ఆఫీసులపై రోజువారీ నియంత్రణ నడుస్తున్నది. కొందరి విషయంలో యేయే కార్యక్రమాలు ఇవ్వాలో, ఎలాంటి వార్తలు రాయాలో సూచనలు అనబడే అనధికార ఆజ్ఞలు వెళుతున్నాయి. ఇంకొందరి మీడియా ఆఫీసుల నుండే కాంట్రాక్టుల రూపకల్పన, కమీషన్ల ప్రణాళిక, ప్రభుత్వ ప్రాధాన్యాలు నిర్ణయించబడుతున్నాయి. తెలంగాణ సెక్రెటేరియట్ కు ముఖ్యమంత్రి రారు అంటున్నారు కానీ, ఇక్కడ ఉన్నది ఒక్క సెక్రెటేరియట్ కాదు. నాలుగైదు ఉన్నాయి. ఇక తెలంగాణ చంద్రుడు కూడా ఫోన్ ట్యాపింగ్ లో, సహారా స్కాం లో, ఆయన పిల్లలు బలవంతపు వసూళ్ళలో ఇరుక్కుపోయారు కేంద్రం చేతిలో. నల్లడబ్బు వ్యవహారంలోనూ నిండా మునిగిపోయి మోడీ దయాదాక్షిణ్యాలపై ఆధార పడి ఉన్నారు. అందుకే మొన్న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమీ దక్కకపోయినా కిక్కురుమన లేదు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం అధ్యక్షతన వెళ్ళే అఖిలపక్షానికి చివరి నిముషం ప్రధాని అపాయింట్ మెంట్ రద్దు అయినా కుక్కిన పేనులా ఉన్నారు.

 

ఇద్దరూ కూడా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి, అడ్డగోలు వలసలను ప్రోత్సహించడం వల్ల రెండు రాష్ట్రాలలోనూ ప్రతి నియోజకవర్గంలో నాలుగైదు నాయకులు తయారయ్యారు. రేపు టికెట్ల సమయంలో వీరు పార్టీ పుట్టి ముంచుతారు. అందుకే ఇద్దరు చంద్రులు కూడా నియోజక వర్గాలు పెంచండి అంటూ మోడీ కాళ్ళమీద పడుతున్నారు. బీజేపీకి రెండు రాష్ట్రాల లోనూ ఒరిగేది, పోయేది ఏమీ లేదు కాబట్టి, నియోజక వర్గాల పెంపు రాజ్యసభలో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ కూ ఇష్టం లేదు కాబట్టి... వీరి కలలు కల్లలే. 

 

అటు కొత్త రాష్ట్రాన్ని గట్తెక్కిస్తారని ఆయనను, ఇటు రాష్ట్రం సాధించాడని ఈయనను గద్దెనెక్కించి, బలమైన ప్రతిపక్షాలను యిచ్చి 9 కోట్ల ప్రజలు స్పష్టంగా తమ అభిమతాన్ని తెలిపితే వారిని నిండా ముంచుతున్నారు ఈ ఇద్దరు చంద్రులు. పైకి కత్తులు దూసినట్టు అపుడపుడు కనబడుతూ, ఇద్దరు చంద్రులు ఒకరితో ఒకరు కుమ్మక్కై, ఇరువురి బ్రోకర్లైన మీడియాధిపతులూ, కాంట్రాక్టర్లూ, వ్యాపార ఎంపీలు, కొండొకచో న్యాయ వ్యవస్థలోని కొందరి అండతో అడ్డగోలు సంపాదనకు ఎగబడ్డారు. వచ్చే ఎన్నికల్లో వేరెవరూ అందుకోలేనంత ధనమయం చేసి మళ్ళీ గట్టు ఎక్కుదాం అనుకుంటున్నారు. తమ వారసులకు సంపదను, అధికారాన్నే కాదు ప్రజల కలలనూ, కన్నీళ్ళనూ దోచి పెడదాం అనుకుంటున్నారు. 

 

ఇరు పార్టీలలో ఉన్న సాధారణ నాయకులు, కార్యకర్తలకు కూడా రేపు ఈ ఇద్దరూ మొండి చేయి చూపుతారు. ధనబలం, కులబలం, అహంకారంతో కన్నూమిన్నూగానక ఉన్న ఈ ఇరువురి వల్ల ప్రయోజనం పొందింది, పొందేది అధికార కులాలలోని బడా రాజకీయ నేతలు, అధికార గణం, మీడియాధిపతులూ, న్యాయ మూర్తులూ,  కాంట్రాక్టర్లూ, ఆస్పత్రుల, స్కూళ్ళూ కాలేజీల యజమానులూ మాత్రమే. 

 

మిగిలిన తరగతులలో స్థాయీ బేధాలతో నిమిత్తం లేకుండా ఎక్కడి పేదరికం అక్కడే ఉంది. ఎక్కడి బానిసత్వం అక్కడే అక్కడే ఉంది.  ఇది మారాలంటే, ఇరు పార్టీల్లో ఉన్న సామాన్య నాయకులు, కార్యకర్తలు, వారికి మద్దతునిచ్చిన జనం ఆలోచించాల్సిందే. గత మూడేళ్ళుగా ఏం జరుగుతున్నదో, పైకి చెప్పకపోయినా, ఒప్పుకోకపోయినా... నిజాయితీగా మేధకు పదునుపెట్టవలసిందే. 

 

చదువుకున్న, ఆలోచనాపరులైన తెలుగు ప్రజలు తేల్చుకోవాల్సింది తమను ఇంతగా అవమానిస్తున్న వీరిరువురినీ రెండేళ్ళ తర్వాత ఏం చేయాలనే!