"ముచ్చుమర్రి రాయలసీమకు ప్రాణనాడి" అంటే అతిశయోక్తే!
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం చాలా ప్రయోజనకరమైనది. ఆ పథకం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చి, నిర్ధేశిత లక్ష్యానికి అనుగుణంగా నీటి పంపింగ్ ప్రక్రియ సత్వరం అమలులోకి రావాలన్నదే ప్రజల ఆకాంక్ష. "ముచ్చుమర్రి రాయలసీమకు ప్రాణనాడి" అని అభివర్ణించడం మాత్రం అతిశయోక్తే! (పోటో ముచ్చు మర్రిలో నీరు వదిలాక చంద్రబాబు)
ముచ్చుమర్రి ఎత్తిపోతలకు ఒక పూర్వరంగం ఉన్నది. అత్యంత కరవు పీడిత అనంతపురం జిల్లాకు కాస్త దప్పిక తీర్చడానికి వీలుగా బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర జలాశయం నుండి కె.సి.కెనాల్ కు కేటాయించిన 10 టియంసిలను పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పిఎబిఆర్)కు కేటాయించి, ఆ మేరకు కె.సి.కెనాల్ కు శ్రీశైలం జలాశయం నుండి 10 టియంసిల నీటిని సర్దుబాటు చేయాలన్న చిరకాల కోరికను మన్నించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అఖిల పక్ష సమావేశం ఏకగ్రీవ౦గా తీర్మానం చేసింది. ఆ మేరకు 2005 ఆగస్టు 14న ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
కృష్ణా నదిలో వరద ప్రవాహం 30 రోజులకు మించి ఉండడం లేదని, చెన్నయి నగరానికి సరఫరా చేయాల్సిన 15, యస్.ఆర్.బి.సి.కి 19 మరియు కె.సి.కెనాల్ కు 10, మొత్తం 44 టియంసిల నికరజలాలతో పాటు తెలుగు గంగకు 29, గాలేరు - నగరి సుజల స్రవంతి పథకానికి 38 కలిపి 67 టియంసిల మిగులు జలాలు, అలాగే త్రాగు నీటి అవసరాలకు స్థూలంగా 112 టియంసిలను 30 రోజుల్లో సరఫరా చేయాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించడానికి 2005 డిసెంబరు 21న జరిగిన అఖిల పక్ష సమావేశం ఆమోద ముద్ర వేసింది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలంటే శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 జూన్ 15న జారీ చేసిన జి.ఓ.నెం.69 అవరోధంగా ఉన్నదన్న భావన బలంగా ఉన్నది. దాని ప్రకారం కనీస నీటి మట్టం 834 అడుగులుగా నిర్ధారించబడింది. అంత కంటే దిగువకు నీటి మట్టం పడిపోతే కేవలం త్రాగు నీటి అవసరాలకే నీటిని విడుదల చేయాలి. కానీ, ఆ నిబంధన తరచూ ఉల్లంఘనలకు గురౌతున్నది. తాజా పరిస్థితిని గమనిస్తే, ఆగస్టు 1 నాటికి 778 అడుగుల నీటి మట్టం ఉంటే పై నుంచి వచ్చిన కొద్ది పాటి నీటి ప్రవాహంతో నేడు 813 అడుగులకు పెరిగి 37 టియంసిల నిల్వకు నీరు చేరింది.
834 అడుగుల నీటి మట్టం లేకపోతే హంద్రీ - నీవా సుజల స్రవంతికి మల్యాల దగ్గర నిర్మించిన ఎత్తిపోతల నుండి నీటి సరఫరా సాధ్యం కాదు. అందుకే కె.సి.కెనాల్ మరియు హంద్రీ - నీవాకు నీటిని తరలించడానికి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని2008లోనే నిర్మించ తలపెట్టారు. ఈ పథకం ద్వారా 810 అడుగుల నీటి మట్టం దగ్గరి నుంచే నీటిని తీసుకెళ్ళ వచ్చు. అప్రోచ్ కెనాల్ నిర్మాణం కూడా పూర్తైతే 798 అడుగుల నీటి మట్టం నుండి కూడా నీటిని తీసుకెళ్ళవచ్చని చెబుతున్నారు. అందులో ఉన్న ప్రమాదాన్ని కూడా గుర్తెరిగి మాట్లాడితే బాగుంటుంది. ఆ నీటి మట్టం దగ్గర అసలు నీటి లభ్యతెంత? శ్రీశైలం జలాశయంలో ఓండ్రుమట్టి చేరిపోతూ నీటి నిల్వ సామర్థ్యం కూడా తరిగి పోతున్న నేపథ్యంలో అది సాధ్యమేనా!
నాలుగు పంపుల ద్వారా ఎడమ వైపున కె.సి. కెనాల్ కు, 12 పంపుల ద్వారా కుడి వైపున హంద్రీ - నీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయాలన్నది నిర్ధేశిత లక్ష్యం. తదనుగుణంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల నుండి మల్యాల ఎత్తిపోతల వరకు 'లింక్ కెనాల్' ను నిర్మించారు. జనవరిలో రెండు పంపులను ప్రారంభించి కె.సి.కెనాల్ కు నీటిని తరలిస్తూ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. తాజాగా మరో నాలుగు పంపులను ప్రారంభించి హంద్రీ - నీవాకు నీటిని తరలిస్తూ మరొకసారి పథకాన్ని జాతికి అంకితం చేశారు. ఎత్తిపోతల పథకం ఒకటే, కానీ, రెండు సార్లు జాతికి అంకితం చేయబడింది. సంతోషం. ఇంకా పది పంపులను ఏర్పాటు చేయాలి. వాటికి తోడు మరో నాలుగు పంపులను కూడా ఏర్పాటు చేస్తామని తాజాగా అధికారికంగా ప్రకటించారు. మొత్తం పంపులను దశల వారిగా ఏర్పాటు చేస్తూ, ఎన్నిసార్లు ఈ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తారో!
శ్రీశైలం జలాశయంలో తాజా నీటి నిల్వ 37 టియంసిలు మాత్రమే. అంటే, రెండు మూడు టియంసిల నీటిని కూడా తరలించలేని దుస్థితిలో నీటి నిల్వలు ఉన్నాయి. అంత మాత్రానికి ఇంత ప్రచారార్భాటం అవసరమా?
రాయలసీమకు నీళ్ళిచ్చి మాకు ఇవ్వలేదన్నఅపోహ నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుదారులలోను, వచ్చిన నీళ్ళన్నింటినీ రాయలసీమకు మళ్ళించుకు పోతున్నారన్న దుష్ప్రచారంతో నిరంతరం విధ్వేషాన్నిరెచ్చగొట్టే దుష్టశక్తులకు అవకాశం కల్పించడానికే ఉపయోగపడుతుంది. అంతే కానీ, ఆచరణలో రాయలసీమకు నేడున్న పరిస్థితుల్లో పై నుంచి శ్రీశైలం జలాశయంలోకి ప్రవాహం పెరిగితే తప్ప సాధ్యం కాదని అందరికీ విధితమే.
ఈ పూర్వరంగంలో ఒకసారి ప్రారంభించిన ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా మరో నాలుగు పంపులను మొదలు పెట్టడానికి ఇంత 'హైప్' సృష్టించాలా?
నాలుగు పంపుల ద్వారా నీటి పంపింగ్ మొదలు పెట్టడం సంతోషదాయకమే. కారణం, శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ పెరిగితే ముచ్చుమర్రి నుండి నీటిని తరలించడానికి వీలౌతుంది. ఆ మేరకు తప్పని సరిగా హర్షించ తగ్గ చర్యే. మిగిలి ఉన్ననిర్మాణ పనులను కూడా సత్వరం పూర్తి చేసి, వినియోగంలోకి తెస్తే ప్రజలు హర్షిస్తారు.
శాస్త్రీయమైన, హేతుబద్ధమైన ఆలోచనలను, ధృక్పథాన్ని పెంపొందించాల్సిన ప్రభుత్వం పుష్కరాలు, పూజలు, పునస్కారాలు, జలహారతులు వగైరా కార్యక్రమాల ద్వారా మూఢనమ్మకాలను, అశాస్త్రీయ భావాలను పెంపొందించే రీతిలో వ్యవహరించడం కూడా ఏ మాత్రం సమర్థనీయం కాదు. పైపెచ్చు, ఏడాదిలో మూడు సార్లు 'నదుల పండుగ' పేరుతో నిర్వహిస్తామని ప్రభుత్వ పెద్దలు శెలవిచ్చారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాదా!
ఆఖరి మాట. తుంగభద్ర నదీ జలాలు దాదాపు ప్రతి ఏడాది 50, 60 టియంసిలు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి చేరిన నీటిని మళ్ళీ ఎత్తిపోతల పథకాల ద్వారా కె.సి.కెనాల్ కు, హంద్రీ - నీవాకు తరలించాల్సి వస్తున్నది. సుంకేసుల ఆనకట్టకు పై భాగంలో తుంగభద్రా నదిపై 15-20 టియంసిల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయరును నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న ప్రతిపాదన ఉన్నది. దానిపై అధ్యయనం చేసి, నివేదికను రూపొందించడానికి దాదాపు 55 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ 2013 నవంబరు 1న జి.ఓ.నెం.100ను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే జారీ చేసింది. అత్యధిక భాగం అధ్యయనం కూడా చేసినట్లు అధికారిక పత్రాల్లో కూడా ప్రస్తావన ఉన్నది. దానిపై తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి.
(*టి లక్ష్మీనారాయణ.విద్యార్థి దశనుంచి అనేక ప్రజాఉద్యమాలలో పాల్గొన్నారు. ఇపుడుతెలుగనాట బాగా పేరున్న రాజకీయ విశ్లేషకుడు)