అమరావతిలో ‘కాపు’ వేట మొదలయింది
కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభయం యాత్రకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో రాజధాని అమరావతి వేడెక్కుతూ ఉంది. రేపు ఉదయం కిర్లంపూడి నుంచి అమరావతికి ముద్రగడ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా, గ్రౌండ్ జీరో కిర్లంపూడి పోలీసుల వశమయ్యాయి. యాత్రను అపేందుకు పోలీసులు లాఠీ ఝళిపిస్తుంటే ,కొనసాగించేందుకు కాపులు తొడగొడుతున్నారు.
అయితే, చావో రేవో అంటున్న కాపులు, మొన్న మాదిగల లాగా, రాజధానిలో చొరబడి చంద్రబాబు డౌన్ డౌన్ అంటారేమో అనే భయం రాజధాని పోలీసులలో మొదలయింది. ఏదోవిధంగా కొంతమందయినాసరే రాజధాని ప్రాంతంలోకి దూరతారేమేననే భయంతో పోలీసులు ‘కాపు వేట’ ప్రారంభించారు. గుంటూరు జిల్లా పోలీసులు రెడ్ అలర్టు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మార్గాల్లో భారీ పోలీసు బందోబస్తు పెంచారు.
రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. ప్రకాశం బ్యారేజి, కనకదుర్గమ్మ వారధి మార్గాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు కాపులెవరయిన ఉన్నారేమో నని ప్రశ్నిస్తున్నారు. కాపు అని అనుమానం ఉన్న వారందరిని అదుపులోకి తీసుకుని కాదని తగిన ఆధారాలు చూపిస్తేనే విడిచి పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30, 144 లు పనిచేస్తూనే ఉన్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల మీద నిఘా తీవ్రతరం చేశారు. రేపు కిర్లంపూడికి ఎవ్వరూ వెళ్లకుండా అటు వైపు వెళ్లే వాహానాలన్నింటిమీద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తాత్కాలిక రాజధాని వెలగపూడి ప్రాంతానికి వచ్చి ఎవరైనా నిరసన తెలియజేస్తారేమోనన్న అనుమానంపై సచివాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో కొత్త వారెవరూ రాకుండా పోలీసులు కాపలాకాస్తున్నారు. కొత్త మొఖం కనబడితే చాలు తరిమేస్తున్నారు. అదుపులోకి తీసుకుంటున్నారు.
జాతీయ రహదారితోపాటు జిల్లాలోని అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. చీరాల-బాపట్ల-చెరుకుపల్లి-రేపల్లె-పెనుమూడి మార్గం మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తారేమో ననే అనుమానం ఈ మార్గంలో కూడా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లే వారిని, వచ్చే వారి కదలికల మీద కన్నేశారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే వారిలో అనుమానితులను ప్రశ్నించి కాపు కాదని తెలుసుకున్నాకే అనుమిస్తున్నారు.