వీరివీరి గుమ్మడిపండు వీరి పార్టీ ఏది?

Kurnool district parties and politicians

ఒక అడవి దారి గుండా తండ్రీకొడుకులు ప్రయాణిస్తున్నారు.ఎదురుగా ఇద్దరు స్త్రీల పాద ముద్రలు కనిపించాయి.అప్పటికే ఆ తండ్రికి భార్యలేదు.తండ్రీకొడుకులిద్దరూ ఒక మాట అనుకున్నారు.పెద్ద పాదముద్రలావిడను తండ్రీ,చిన్న పాద ముద్రలావిడను కొడుకూ పెళ్లి చేసుకోవాలని.కాసేపు ప్రయాణించాక వీరికి ఆ స్త్రీలు కనిపించారు.కానీ....పెద్ద పాదాలావిడ కూతురు,చిన్న పాదాలావిడ తల్లి.మరి ముందు నిర్ణయించుకున్న ప్రకారం తండ్రీకొడుకులు పెళ్లాడితే,పిల్లలు పుడితే ఒకరి పిల్లలకు మరొకరు ఏ వరుస అవుతారు?తెలిసీ జవాబు చెప్పకపోయావో నీ తల వేయి వ్రక్కలు అన్నాడు విక్రమార్కుడి భుజమ్మీదున్న శవం లోని భేతాళుడు.ఇంత అసంబద్దమైన ప్రశ్నకు ఆ రాజూ సమాధానం చెప్పలేకపోయాడు.ఇదే భేతాళ కథల్లోని చివరి కథ.

 

ప్రస్తుతం మా జిల్లాలో రాజకీయ నాయకుల సవాళ్లు చూస్తుంటే ఈ కథే గుర్తొస్తుంది.

 

అధికార పక్షంలో వుంటూ వర్గాలుగా విడిపోయిన నాయకులు పరస్పరం మీరు వలసొచ్చిన వాళ్లు,తగ్గి ఉండాలి అని విమర్శించుకుంటున్నారు.ఈ వలసల కథా క్రమంబెట్టిదనినా...

 

అది ఆళ్లగడ్డ నియోజకవర్గం.1989 ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం తరపున నిలబడ్డ భూమా శేఖర్ రెడ్డి గెలిచాడు.(తెలుగుదేశం స్థాపించినప్పుడు ఆళ్లగడ్డకు ప్రాతినిధ్యం వహించిన ఎస్వీ సుబ్బారెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ తరపున కోవెలకుంట్ల లో పోటీ చేసి ఓడిపోయారు,ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం తరఔన పత్తికొండ నుంచి గెలిచారు.వీరు భూమా శేఖర్ రెడ్డి,నాగిరెడ్డి గార్ల మేనమామే కాదు నాగిరెడ్డి గారి భార్య శోభా వీరి కూతురే)

 

శాసన సభ్యుడైన శేఖర్ రెడ్డి హఠాత్తుగా మరణించారు.ఉప ఎన్నికలు వచ్చాయి.నాగిరెడ్డి నామినేషన్ వేయడానికీ అడ్డంకులు,చేతిలో రైఫిల్ పట్టుకుని నామినేషన్ కేంద్రానికి అనుచరులతో పోతున్న నాగిరెడ్డి ఫోటో అప్పట్లో ఇండియా టుడే  కవర్ ఫోటోగా రావటం ఒక సంచలనం.

 

ఈలోగా పీ.వీ.నరసింహా రావు 1991 లో నంద్యాలనుంచి పార్లమెంట్ కు నిలబడ్డప్పుడు తెలుగువాడు ప్రధానయ్యాడని తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు.మళ్లీ 1996 ఎన్నికల్లో ఈ సారి పీ.వీ నంద్యాలతోపాటూ బరంపురం లోనూ నిలిచున్నాడు.ఈ సారి పోటీకి ఎవరూ సాహసించకుంటే 1994 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే గా గెలిచిన నాగిరెడ్డిని పోటీ పెట్టారు.ఆ తర్వాత పీ.వీ నంద్యాల స్థానానికి రాజీనామా చేసి బరంపురాన్ని ఉంచుకున్నారు.ఖాళీ అయిన స్థానానికి ఉపేన్నికలొచ్చాయి.ఈ 1996 ఉప ఎన్నికల్లో,ఆ తర్వాత 1998,99 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగిరెడ్డి విజయం సాధించాడు.ఇక ఆళ్లగడ్డ నుంచి వారి శ్రీమతి శోభ 1999 ప్రాతినిధ్యం వహించారు.2004 ఎన్నికల్లో భూమా దంపతులిద్దరూ ఓడిపోయారు.పార్లమెంట్ సభ్యుడిగా ఎస్పివై రెడ్డి(ఈ సారి అభ్యరిగా శొభానాగిరెడ్డి నిలబడ్డారు),ఆళ్లగడ్డ నుంచి పాతకాపు గంగుల ప్రతాప్ రెడ్డి గెలిచారు.ఆ తర్వాత ప్రజారాజ్యం లో చేరారు.శోభా గారు ఆళ్లగడ్డ శాసనసభ్యురాలిగా గెలవగా,పార్లమెంట్ కు పోటీ చేసిన నాగిరెడ్డిని SPY.రెడ్డి మళ్లీ ఓడించారు.ఆ తర్వాత భూమా దంపతులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు.శోభాగారి అకాలమరణం,మరణానంతరం గెలిచిన వ్యక్తిగా ఎన్నికల చరిత్రలో నిలవడం,ఆ తర్వాత అక్కడి నుంచి గెలిచిన వీరి అమ్మాయి అఖిలప్రియతో కలి ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ నుండి ఎన్నికైన నాగిరెడ్డి తెలుగుదేశంలో చేరడం తెలిసిందే.

 

ఇక నంద్యాల విషయానికొస్తే ఎప్పుడూ ఎలాంటి ఫాక్షన్ గొడవలుండని ప్రశాంతమైన నియోజకవర్గం.ఇక 2004,2009 లో కాంగ్రెస్ తరపున పార్లమెంట్ సభ్యుడైన ఎస్పివై రెడ్డి స్వస్థలం పులివెందుల నియోజకవర్గం.నంద్యాలలో పైపుల పరిశ్రమ పెట్టి ఎన్నో దానధర్మాలు చేసి పేరు సంపాదించుకున్నాడు.1991 ఎన్నికల్లో భాజపా తరపున నిలబడి ఓడిపోయాడు.ఆ తర్వాత ఒరిస్సా సూపర్ సైక్లోన్ సమయంలో భారీ విరాళమిచ్చి తెదేపా లో చేరాలని ప్రయత్నించాడు.కోరికల తీరని వీరు 1999 లో నంద్యాల,గిద్దలూరు ల నుంచి స్వతంత్ర అభ్యర్థి గా నిలబడ్డారు.వీరికి బస్సు గుర్తు కేటాయించగా అప్పటి నంద్యాల శాసన సభ్యుడు ఫరూక్ ఒక డమ్మీ అభ్యర్థిని పార్లమెంట్ కు బస్సు గుర్తుతో నిలబెట్టాడు.రెండు బ్యాలెట్ పేపర్లలో తికమకపడ్డ జనం పార్లమెంట్ బస్సుకు గుద్దేసారు.స్వల్ప మెజారిటీతో SPYరెడ్డి ఓడిపోగా ఆ తర్వాత జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని 2 సార్లు ఎంపి అయ్యాక మూడోసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ తరపున గెల్చి మొన్న తెలుగుదేశంలోకి వలసపోయారు.

 

 

ఇక నంద్యాల అసెంబ్లీకి 2004,2009 లో కాంగ్రెస్ తరపున ప్రానిధ్యం వహించిన శిల్పా మోహన్ రెడ్డి ది కడపజిల్లా కొండసుంకేసుల గ్రామం.హైదరాబాద్లో ఎన్నో వ్యాపారాలు చేసారు.తెలుగుదేశం హయాంలో కొన్నాళ్లు ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా ఉన్నారు.వీరి బంధుమిత్రులందరూ బనగానపెల్లె,కోవెలకుంట్లలో ఉన్నా ప్రశాంతతకు నెలవైన నంద్యాల నియోజకవర్గం చేరాడు.నంది రైతు సమాఖ్య అంటూ రైతు సమస్యల వేదిక మొదలు పెట్టాడు.చోటామోటా సేవాకార్యక్రమాలు మొదలుపెట్టి వైఎస్ ఆర్  తో ఉన్న పరిచయాలతో టికెట్ సంపాదించి గెలిచాడు.ఇక 2009 లో రెండవసారి గెలిచి కొన్నాళ్లు వైఎస్ ఆర్  మంత్రివర్గంలో పనిచేసాడు.ఇక 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి తరఫున ఓడిపోయాడు.

 

ఇక వీరి సోదరుడు చక్రపాణి రెడ్డి ముందు ఎమ్మిగనూరు మీద కన్నేసి అక్కడ ఏవో సేవాకార్యక్రమాలంటూ మొదలుపెట్టినా గిట్టుబాటు కాలేదు.నంద్యాలకు పక్కనే ఉండి నంద్యాల లోని కొన్ని మండలాలను పక్కనున్న నియోజకవర్గంలో (ఒకప్పుడు ఆత్మకూరు,ఇప్పుడు శ్రీశైలం)కలపగా పాత పరిచయాలు లాభిస్తాయని శ్రీశైలం నియోజకవర్గం లో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి తనను వైఎస్ ఆర్  సిపి అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నాడు.ఈలోగా అక్కడ బుడ్డా రాజశేఖర రెడ్డి వైఎస్ ఆర్  సిపి లో చేరాడు.నియోజకవర్గ పర్యటనకు వచ్చిన జగన్ వాహనంలో చక్రపాణిరెడ్డి ఉన్నాడు.ఎదురేగి వస్తున్న రాజశేఖర్ రెడ్డి కోసం చక్రపాణిరెడ్డి ని వాహనం దిగమన్నాడు జగన్.అలిగిన ఈయన తెదేపా తరపున నిలబడి ఓడిపోయినా ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు.

 

ఇక బుడ్డా రాజశేఖర్ రెడ్డి తండ్రి వెంగళరెడ్డి తెదేపా శాసన సభ్యుడిగా ఉంటూ 1989 లో రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున గెలిచారు.వీరిని నక్సలైట్లు హత్య చేయగా పెద్దకొడుకు సీతారామిరెడ్డి తెదేపా తరపున గెలిచారు. 2004 లో రాజశేఖర్ రెడ్డి శ్రీమతి శైలజ,2009 లో రాజశేఖర్ రెడ్డి తెదేపా తరపున ఓడిపోగా 2014 లో వైఎస్ ఆర్  సిపి నుంచి గెలిచిన వీరు ప్రస్తుతం తెదేపా లో చేరారు.ఇక వీరిని ఓడించిన కాంగ్రెస్ అభ్యర్ఠి ఏరాసు ప్రతాప్రెడ్డి ఆ పక్కనున్న పాణ్యం నియోజకవర్గం నుంచి తెదేపా తరపున నిలబడి ఓడిపోయాడు.

 

ఇక భూమా నాగిరెడ్డి బావమరిది ఎస్వి.మోహన్ రెడ్డి కర్నూల్ నుంచి వైఎస్ ఆర్  సిపి నుండి గెలిచి తెదేపా తీర్థం పుచ్చుకున్నాడు.ఇక 1999 లో తెదేపా తరపున గెలిచిన పారిశ్రామికవేత్త టిజి వెంకటేష్ 2004 లో కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయి రోశయ్య ప్రాపకంతో కాంగ్రెస్ లో చేరి 2009 లో గెలిచి మంత్రిగా చేసాడు. మళ్లీ 2014 లో తెదేపా లో చేరి మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయి తెదేపా, వైఎస్ ఆర్ సిపి లకు రాజ్యసభ పదవి కోసంకన్నుకొట్టి చివరకు తెదేపా తరపున సభ్యుడయ్యాడు.యువనేతకు భారీ ముడుపులు సమర్పించాడని వినికిడి.

 

ఇక ఆళ్లగడ్డలో ఒకనాటి కాంగ్రెస్ పాతకాపులు గంగుల సోదరులు తెలుగుదేశంలోనే ఉన్నారు(ప్రతాప్రెడ్డి మాత్రం ఏ పార్టీలో లేనంటాడు).వీరి అనుచరులుగా కొన్నాళ్లున్న ఇరిగెల పుల్లారెడ్డి సోదరులు తెదేపాలోనే ఉన్నారు.

 

అక్కడా మొత్తానికి 3 వర్గాలు తెదేపాలో ఉండగా నంద్యాలలో భూమ,శిల్పా,ఫరూక్,  ఎస్  పి వై రెడ్డి నాలుగు వర్గాలు తెదేపాలో ఉన్నారు.

 

మొన్న జరిగిన జనచైతన్య యాత్రలో ప్రతి వర్గం అవతలి వర్గాన్ని దుమ్మెత్తి పోసుకుంటూ వలసపక్షులని విమర్శించుకుంటుంటే విస్తుపోవడం జనాలవంతైంది.ఉన్నవాళ్లెవరో,వలసపక్షులెవరో,వలసలను గుర్తించేదెలాగో తెలియక చివరి కథను అసంబద్దమైన,జవాబులేని సమస్యగా భావించిన విక్రమార్కుడిలా చేష్టలుడిగి చూస్తున్నారు.