బతుకమ్మ చీరలతో టిఆర్ ఎస్ సెల్ఫ్ గోల్

kcr scored self goal with batukamma sarees

మూడున్నరేళ్ళుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోదండరామ్, కె.లక్ష్మణ్ వంటి మహా మహా నాయకులు చేయలేని పనిని బతుకమ్మ చీరలు చేశాయి. అవును మరి! ఈ నాయకవర్యులందరూ తెలంగాణ ప్రజల చెవులల్లో ఇళ్ళు కట్టుకుని మరీ కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ సాధించలేని ఫలితం ఇప్పుడు ఒక్క దెబ్బతో సూటిగా, సుత్తిలేకుండా జరిగిపోయింది. అపర చాణుక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ బతుకమ్మ చీరలతో సెల్ఫ్ గోల్ చేసుకుని తన పరువు తానే బజారున వేసుకున్నారు.

 

గద్దెనెక్కిననాటినుంచీ, తన మనస్సుకు నచ్చటమే ఆలస్యం, చేతికి ఎముక లేదన్నట్లుగా అడిగినవారికి అడిగినట్లుగా వరాలు కురిపిస్తున్న కేసీఆర్, అదే ఫ్లోలో బతుకమ్మ చీరలు అనే పథకానికి ఆర్భాటంగా రూపకల్పన చేశారు. బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన 1.04 కోట్ల మంది మహిళలకు చీర, జాకెట్ కలిపి కిట్ గా ఇవ్వాలని పథకం రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో డీ ఆర్ డీ ఏ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఈ కిట్ ల పంపిణీ బాధ్యతలు నిర్వర్తిస్తాయి. ఈ పథకానికి ప్రభుత్వ ఖజానానుంచి రు.200 కోట్ల నిధులను మంజూరు చేశారు.

 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేత కార్మికులకు ఉపాధి కల్పించటంతోపాటు ఆడపడుచులకు పండగపూట చీరలు పంపిణీ చేయాలనుకోవటం మంచి ఉద్దేశ్యమే అయినప్పటికీ పథకం లక్ష్యం విఫలమవటానికి ప్రధాన కారణం ముందుచూపు లేకపోవటం.

 

ఈ ఏడాది జూన్ 5న వివిధ జిల్లాలలోని చేనేత సొసైటీలకు ఆర్డర్ లు ఇచ్చారు. సెప్టెంబర్ 5 నాటికి చీరలను తయారు చేసి ఇవ్వాలని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అయితే సమయం తక్కువగా ఉండటంతో సొసైటీలు డెడ్ లైన్ అందుకోలేకపోయాయి. దీనితో ప్రభుత్వం గుజరాత్ లోని సూరత్ నుంచి టెండర్ ద్వారా చీరలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి తెప్పించింది. ఈ చీరలనే పంపిణీకి పెట్టారు. పంపిణీ కార్యక్రమం ప్రారంభమవటంతోనే విమర్శలు వెల్లువెత్తాయి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన చీరల పంపిణీ కార్యక్రమంలో సహజంగానే తొక్కిసలాటలవంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్లయితే జుట్లుపట్టుకోవటాలు, పిడిగుద్దులవంటి ఘటనలు వీడియోలద్వారా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే ఈ తొక్కిసలాట ఘటనలు ఒక ఎత్తయితే, చీరలు చూడగానే తగిలిన షాక్ మహిళామణులకు మరో ఎత్తని చెప్పాలి. ప్రభుత్వం ఆర్భాటంగా(నేతచీరలు ఇస్తామని) ప్రకటించినట్లు పండగరోజు కట్టుకోవటానికి నేతచీరలు పంపిణీ చేస్తారని ఆశగా చూసిన మహిళలకు దిమ్మ తరిగింది. బతుకమ్మ కిట్ లో కేవలం 60-70 రూపాయలు ఖరీదు ఉండే... నాసిరకం పాలిస్టర్ చీర దర్శనమివ్వటంతో మహిళలు భగ్గుమన్నారు. పనులన్నీ మానుకుని గంటల తరబడి క్యూలో నిలుచున్నది దీనికోసమా అని నిప్పులు చెరిగారు. రోజుకు రు.200-300 కూలిచేసుకుంటూ ఆ పనిని వదిలేసి వచ్చి క్యూలో నిలబడ్డవారయితే అమ్మనా బూతులు తిట్టారు.  మొత్తం మీద బతుకమ్మ కిట్ అందుకున్న మహిళామణులందరూ ముక్తకంఠంతో కేసీఆర్ ను దుమ్మెత్తిపోస్తున్నారు… శాపనార్థాలు పెడుతున్నారు. కొన్ని చోట్లయితే ఈ చీరలను తగలబెట్టినట్లు కూడా వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి…. అయితే ఇలాంటి పనుల వెనక ప్రతిపక్షాలు ఉండిఉండొచ్చుకూడా.

 

చీరల పథకం అభాసుపాలయిందని అర్థం చేసుకున్న ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. ఉచితంగా చీరలు పంపిణీచేశామని, నచ్చకపోతే దానిని పక్కన పెడతారు… లేకపోతే పనిమనుషులకు ఇస్తారు గానీ ఎవరూ తగలబెట్టరు అని అన్నారు. లక్షలమంది బతుకమ్మ సారెను కళ్ళకద్దుకుంటుంటే కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

బతుకమ్మ చీరల పథకం టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు అని చెప్పాలి. గత మూడున్నర ఏళ్ళలో కేసీఆర్ ప్రభుత్వానికి ఇలాంటి ఎదురుదెబ్బ ఎక్కడా తగలలేదు… కోర్టు కేసులు మినహాయిస్తే. ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కేసీఆర్ చేసిన అలవికాని హామీలు నెరవేరకపోవటం, నేరెళ్ళ, మంధనిలలో దళిత వివాదాలు, ఇతర పార్టీలనుంచి ఎమ్మెల్యేలను లాక్కోవటం, నయీమ్ కేసు, హైదరాబాద్ లో భూముల కుంభకోణం కేసు, ఓటుకు నోటు కేసును నీరుగార్చటం వంటి విషయాలు ఎన్ని ఉన్నా ఇవన్నీ రోజూ పేపర్లు చదివేవాళ్ళు పట్టించుకోవటమేగానీ, కిందిస్తాయి ఓటరుదాకా చేరలేదనే చెప్పాలి. రైతుల ఆత్మహత్యలు బాగా జరిగినా దానికి ప్రభుత్వాన్ని నిందించేంత స్థితి లేదు. అత్యంత వ్యయంతో సీఎమ్ క్యాంప్ ఆఫీస్ నిర్మాణం, కాన్వాయ్ లోకి వాహనాల కొనుగోలు వంటి దుబారాలను కూడా సామాన్య ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లుగా అనిపించలేదు. అందుకే 2104 ఎన్నికల తర్వాత జరిగిన హైదరాబాద్ కార్పొరేషన్ తదితర మున్సిపల్ ఎన్నికల్లో, ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు గొప్ప మ్యాండేట్ ఏమీ ఇవ్వలేదు… బ్రహ్మరథం ఏమీ పట్టలేదు. కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి కూడా ఆ ఎన్నికల్లో మంచి సంఖ్యలోనే ఫలితాలు లభించాయి. అయితే ఎన్నికల తర్వాత కేసీఆర్ కు అనూహ్య స్థాయిలో పాపులారిటీ పెరిగిపోయింది. అంటే ఎన్నికలముందు కంటే ఎన్నికల తర్వాతే ఆయనకు హీరో ఇమేజ్ పెరిగిందని చెప్పాలి. దీనికి - ఆయన తన చిరకాల ప్రత్యర్థి చంద్రబాబు నాయుడును ఓటుకునోటు కేసులో ఇరికించటం, చండీయాగం, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆంధ్రులను ఆకట్టుకోవటం వంటివాటిని కారణాలుగా భావించొచ్చు.

 

అలా శుక్లపక్ష చంద్రుడిలా రోజురోజుకూ పెరిగిన కేసీఆర్ ఇమేజ్ మీద బతుకమ్మ చీరలు మొదటి  దెబ్బ వేశాయి. దీనికి కారణం ఆయనే కావటం ఒక విశేషం. ఎందుకంటే మొదటినుంచీ ఆంధ్రప్రదేశ్ లో తాను ఎవరినైతే సమర్థించారో, ఆ జగన్ బాటలోనే కేసీఆర్ ప్రవేశించి సెల్ఫ్ గోల్ చేసుకోవటం. ఇటీవలి నంద్యాల ఉపఎన్నికతో సహా, ఏపీ రాజకీయాలలో అనేక తప్పులు చేసి సెల్ఫ్ గోల్ రాజాగా పేరు తెచ్చుకున్న జగన్ లాగానే కేసీఆర్ బతుకమ్మ చీరలతో మొదటి సెల్ఫ్ గోల్ చేశారు.

 

ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలను ప్రకటించటం తప్పితే నిజానికి పరిపాలనలో కేసీఆర్ ముద్ర ఏమీ కనిపించలేదని చెప్పాలి. దీనికితోడు వాస్తు భయంతో సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్ నుంచే పరిపాలన సాగించటంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పరిపాలనంతా కేసీఆర్, కేటీఆర్... కొద్దో గొప్పో హరీష్ ల చేతుల్లోనే ఉండటం, మిగిలిన మంత్రులంతా నామ్ కే వాస్తే అన్నట్లున్న విషయంకూడా అందరికీ తెలుసు.  ఇక పార్టీలో చూస్తే, అసంతృప్తి విపరీతంగా ఉన్నప్పటికీ కేసీఆర్ ఇమేజ్ విపరీతంగా పెరిగిపోవటంతో గొంతువిప్పే ధైర్యం ఎవరూ చేయటంలేదు.  పార్టీలో ఎప్పటినుంచో ఉన్నవారు, ఇతరపార్టీలనుంచి వచ్చిన కొత్త బ్యాచ్ కు మధ్య సహజంగానే తీవ్ర విభేదాలు ఉన్నాయి. జిల్లాలలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. దీనికి తోడు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కోదండరామ్ వంటి పలువురిని కేసీఆర్ పక్కన పెట్టటం టీఆర్ఎస్ సానుభూతిపరులకే చాలామందికి నచ్చటంలేదు.

 

అన్నమాటను నిలబెట్టుకుంటారని ఒక్కనాటికీ నమ్మలేమన్నది కేసీఆర్ పై ప్రత్యర్థులు చేసే మొట్టమొదటి విమర్శ. విశ్వసనీయత విషయంలో తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ మీద ఏమీ గొప్ప ఎక్స్ పెక్టేషన్స్ లేవుగానీ, అయినప్పటికీ గత మూడున్నరేళ్ళలో ఆయనకు బలంగా మద్దతిచ్చారు. బతుకమ్మచీరలు లాంటి వ్యవహారాలు మరో రెండు మూడు జరిగితే మాత్రం ప్రజలు తమ మనసు మార్చుకోకుండా ఉండరని చెప్పాలి. అందులోనూ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ లబ్దిదారుల ఎంపిక విషయంలో కూడా జనంలో అసంతృప్తులు తీవ్రంగా చెలరేగే అవకాశం ఉంది. మరి ఈ సవాళ్ళను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

 

( * శ్రవణ్ బాబు సీనియర్ జర్నలిస్టు. హైదరాబాద్. ఫోన్  9948293346)

 

మరిన్ని వార్త ల కోసం క్లిక్ చేయండి ఇక్కడ