రెచ్చిపోతే ఏమవుతుంది ?
"ఒక ఐడియా జీవితాన్నే మార్చివేస్తుంది" అంటూ ఒక టెలికాం కంపెనీ వాళ్ళు చేస్తున్న ప్రచారం విస్తృతాదరణను పొందింది.
నిజమే, ఒక్క ఐడియానే కాదు, "ఒక్క మాట" కూడా జీవితాలను మార్చివేస్తుంది. అలా ఎన్నో కీలక మలుపులకు కారణాలైన ఆ "ఒక్క మాటలు" కోకొల్లలుగా ఉన్నాయి.
అలాంటివాటిలో మన భారతీయులకు సుపరిచితమైనది, 2007 గుజరాత్ ఎన్నికల సందర్భంగా "మోడి"ని ఉద్దేశించి "సోనియా" అన్నమాట "మృత్యు బేహారి". ఆఒక్కమాటను అందిపుచ్చుకొన్న మోడి, మాటల తూటాలను పేల్చారు. ప్రాసలకు పదును పెట్టారు. దెబ్బకు కాంగ్రెస్ కు దిమ్మ తిరిగింది. ఆ ఒక్కమాటకు నేటికీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. ’వోన్లీ విమల్ ‘అనే మాట ఇప్పటికీ పాతబడని టెక్స్ టైల్ మంత్రం.
తెలుగు రాజకీయాల్లో కూడా ఇలాంటి పదునైన మాటలు మాటలున్నాయి. జాగ్రత్తగా వాడితే శత్రువు చిదిమివేస్తాయి. పొరపాటుగా వాడితే, మనల్లే దహించి వేస్తాయి.
2009 రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ గారు నంద్యాల సభలో మాట్లాడుతూ, టిడిపి & టిఆర్‌ఎస్ పార్టీల మహాకూటమి గనక అధికారంలోనికి వస్తే, కేసిఆర్ చెబుతున్నట్లుగా, మన సంస్థలన్నిటినీ మూసివేస్తే, ""హైదరాబాద్ మన రాష్ట్రంలో భాగం కాకుండా పోతుంది, హైదరాబాద్ లో మనం విదేశీయులమవుతాం జాగ్రత్త."" అంటూ హెచ్చరించారు. ఇది అతిశయోక్తికే అన్నాకూడా - ఈఒక్క మాట అప్పట్లో పెనుసంచలనం అయ్యింది. ఆఒక్కమాట ఖచ్చితంగా ఓట్లను ప్రభావితం చేసింది.
ఇకపోతే చంద్రబాబు అన్నాడంటూ ప్రచారంలో ఉన్నమాట ""వ్యవసాయం దండగ"" - ఈమాటను అప్పట్లో వైఎస్ పదే పదే “వ్యవసాయం పండగ” అంటూ చంద్రబాబును వొంటిమీద జర్రులు పాకిసించారు. దానికి కౌంటర్ ఇవ్వలేక చంద్రబాబు మరింత రెచ్చిపోయి మాట్లాడేవారు. అలా చంద్రబాబు రెచ్చిపోయే కొద్దీ, వైఎస్‌ఆర్ మరింతగా రెచ్చగొట్టేవారు. తాను అధికారంలో ఉన్నన్నాళ్ళూ వైఎస్‌ఆర్ ఓ రకంగా చంద్రబాబును జోకర్ ను చేసేశారు.
అదీ "ఒక్క మాట"కున్న పవర్..!! ఇలాంటి "ఒక్క మాట" లు చెబుతూ పోతే కోకొల్లలు.
సరే, ఇక ఈ సోదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, నిన్న ఉరవకొండ సభలో జగన్ చేసిన వ్యాఖ్య ""చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు 'ముఖ్య కంత్రి'"" - దీనిపై జగన్ వీరాభిమానులు పండగచేసుకొంటూ ఉంటే, టిడిపి వాళ్ళు మండి పడుతున్నారు. కొంతమంది, జగన్ ఇలా నోరుజారితే కష్టం, సంయమనం పాటించాలి అంటున్నారు. ఆమాటలో తప్పేముంది అంటున్నారు. కంత్రీ అంటే మోసగాడే కదా, చంద్రబాబును అలా అనడం కరెక్టే అంటున్నారు.
ఇక నా ఉద్దేశ్యం ప్రకారం, జగన్ ఇలా వ్యాఖ్యానించడం వ్యూహాత్మక తప్పిదమే కాకుండా, చంద్రబాబు ట్రాప్ లో పడటానికి బాట అవుతుంది. చంద్రబాబు & కో వాళ్ళు, జగన్ మీద అనేక ఆరోపణలను చేస్తూ, పదేపదే అడ్డూ అదుపూ లేకుండా దూషిస్తూ, రౌడీ అనీ, దొంగ అని, దోపిడీ దారు, కబ్జాకోరు, ఇలా జిగుప్సాకరంగా మాటల దాడులు చేస్తున్నారు. ఇక చంద్రబాబు ఐతే ఏకంగా "పులివెందుల గూండా" అంటూ స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడు. దీనిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
అయితే, "చంద్రబాబు & కో" చేస్తున్న ఆ దాడి అంతా వారి "పక్కా వ్యూహంలో భాగమే" ఈ విషయాన్ని జగన్ గుర్తించి నడుచుకోవాలి.
జగన్ ఎంత రెచ్చిపోయి, నోరు జారితే చంద్రబాబుకు అంత అడ్వాంటేజీ అవుతుంది. నిన్నటి "ఉరవకొండ సభ"నే చూస్తే, ఆ సభలో ఎన్నో సమస్యలను జగన్ ప్రస్తావించాడు. ప్రభుత్వంపై నిపులు చెరిగాడు. చంద్రబాబును ఎండగట్టాడు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతూ, చంద్రబాబు అసమర్థతను తీవ్రంగా విమర్శించాడు.
.... అయినా ఏం లాభం ?? "కంత్రీ" అన్న ఆ "ఒక్కమాట" - వీటన్నిటినీ పూర్వపక్షం చేసింది..
ఈఒక్క మాటను చూపి, జగన్ కు సంస్కారం లేదంటూ విపరీత ప్రచారం చేస్తారు. చంద్రబాబు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టినా పెడతాడు. ఇప్పటికే "చంద్రబాబును చెపులతో కొట్టాలి" అన్న వ్యాఖ్య చేసి జగన్ ఇబ్బంది పడుతున్నాడు.
ఇక్కడ జగన్ అభిమానులు చేస్తున్న వాదన ఏమిటంటే, "చంద్రబాబు & కో" వాళ్ళు జగన్ ను ఇంత తీవ్రంగా దూషిస్తూ ఉన్నా, జగన్ మాత్రం ఎందుకు తిరిగి అనకూడదు అంటున్నారు. అయితే, ఇది సరికాదన్నది నా భావన. చంద్రబాబునాయుడి రాజకీయాలు గమనించినవాళ్ళకి బాగా తెలుస్తుంది, ఆయన వ్యవహార శైలి ఎలాంటిదో. ఆయన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివాళ్లపై బురదచల్లి, రెచ్చగొట్టడం అన్నది చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం. ఆవ్యూహంలో జగన్ పడడంవల్ల, చంద్రబాబు వైఫల్యాలను ఎంతలా ఎండగట్టాలనుకొన్నా సరే, కొన్ని పరుషమైన మాటలవల్ల, జగన్ ను చులకన చేస్తారు, పచ్చ మీడియా సహాకారంతో.
ఇక్కడ జగన్ అభిమానులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. చంద్రబాబు జీవితంలో అన్నీ చూశాడు. ఆయన చూడని,ఆడని రాజకీయం లేదు. ఎక్కువకాలం అధికారంలో ఉన్నాడు. ఇప్పటిక్రీ అధికారంలో ఉన్నాడు, మీడియా అంతా ఆయనదే. ఆయన చుట్టూ, వేటకుక్కల్లాంటి వాళ్ళు ఆయనమీద ఈగకూడా వాలకుండా సదా కాపాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తితో పోల్చుకొని, ఆయన తిడుతున్నాడు కాబట్టి, నేనుకూడా తిడతాను అంటే నష్టపోయేది జగనే తప్ప బాబుకాడు - "అరిటాకు ముల్లు సామెత" జగన్ గుర్తుపెట్టుకోవాలి.
ఇక జగన్... చిన్నవయసులోనే బోలెడు సమస్యలు చుట్టుముట్టాయి. పద్మవ్యూహంలో చిక్కుకొన్నాడు. సవాలక్ష సమస్యలు చుట్టుముట్టినా, మొక్కవోని ధైర్యంతో ముందుకు దూసుకెళుతున్నాడు. పార్టీపై మంచి పట్టు కూడా ఉంది. చంద్రబాబులాంటి వాడిని ఎదురోడ్డి 67మంది ఎంఎల్‌ఏ లను గెలిపించుకొన్నాడు. కొంతమంది గొడదూకినా, నిబ్బరంగా ఉన్నాడు. నిరంతరమూ పోరాటాలు చేస్తున్నాడు. ఏమాత్రమూ వెనకాడడం లేదు. ఈవిషయంలో అభినందించాలి. ఈ వరవడి కొనసాగాలి.
అయితే, ఒక గొప్ప ప్రజా నాయకుడిగా ఎదగాలనుకొంటున్న జగన్, వేటకుముందు ఓపికగా నిరీక్షిస్తున్నా పులికున్నంత ఓపికతో ఉండాలి. సహనాన్ని అలవరచుకోవాలి. ఇలాంటి లూజ్ టాక్ వల్ల, అభిమానులు సంతోషించవచ్చు - ప్రజలు చప్పట్లు కొట్టవచ్చు, కానీ అది మనలను ఒకమెట్టు క్రిందకి దించుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ దూషణలకు రెచ్చిపోయి పడితే, చిరిగేది అరిటాకే అన్నది మరవకూడదు.
.... కాబట్టి, ఇదేదో జగన్ ను విమర్శించడానికి వ్రాసిన వ్యాసం అనుకోకుండా, ఒక శ్రేయోభిలాషిగా, మంచి భవిష్యత్తు ఉన్న జగన్, అధికారపక్షాలవాళ్ళ అసభ్య దూషణలకు రెచ్చిపోకుండా కాస్త ఆచితూచి నడుచుకొంటే మంచిది అని చెప్పడానికే.