Asianet News TeluguAsianet News Telugu

దేవుడు మంచి బాలుడు, చెడగొట్టకండి ప్లీజ్

Innocent god is being taken hostage

“ద్యావుడా...” ఇది ఆ మధ్యవచ్చిన ఒక సినిమాలో హీరో ఊతపదం కాదు,కొత్తగా ఒక దర్శకుడు తీసిన సినిమాపేరు.

 

ఆ సినిమా టీజర్ వచ్చాక మనోభావాలు గాయపడ్డాయని కొందరు youtube నుంచి తీసేయించారు...అంతేకాదు ఆ దర్శకుడినీ అరెస్ట్ చేసారు.

 

ఇంతకూ దానిలొ అభ్యంతరం పెట్టాల్సిన విషయమేముందా అంటారా?ఒక భక్తుడు శివలింగానికి మధ్యంతో అభిషేకం చెయ్యడం. మద్యం అపవిత్ర ద్రవం. కాబట్టి ఇది తప్పు అనేది వాదన.

 

ఎవరి  పూజావిధానం వారిది.  కావాలంటే ఈ కథ చదవండి.

 

ఇదొక శివరాత్రి కథ ఒకటి చూద్దాం...

ఒక వేటగాడిని పులి తరుముతుంది.చెట్టెక్కి కూర్చుంటాడు.వీడు దిగకపోతాడా,నేను తినకపోతానా అని పులి చెట్టుకింద కూర్చుంటుంది.రాత్రి నిద్రపోతే కిందపడి పులికి ఆహారమవుతానని ఒక్కో ఆకు తెంపుతూ కిందపడేసి గడుపుతాడు.తెల్లారి అలికిడికి పులి వెళ్లిపోతుంది.ఇక వేటగాడి ఆకులన్నీ కిందున్న శివలింగం మీద పడ్డాయి,రాత్రంతా జాగారణ చేసాడని పుణ్యం వచ్చి ఆయన చచ్చాక కైలాసానికి పోతాడు.

 

అంటే తెలిసీతెలియక చేసిన పూజకూ ఫలితం ఉంటుందని చెబుతారు.

 

ఇక అదే శివరాత్రిరోజు చెప్పుకునే కన్నప్ప కథా తెలిసిందే..ఆటవీకుడైన తిన్నడు అడవిలో దొరికే వేట మాంసాన్ని అర్పించేవాడు...అంతేనా తేనో,ఇప్పసారానో కూడా అర్పించే ఉంటాడు..ఇక నోట్లో నీళ్లు తెచ్చి శివలింగం మీద ఉమ్మేసి అభిషేకం చేసేవాడు.తన రెండో కన్ను అర్పించేప్పుడు గుర్తుగా తన కాలినే శివలింగం పైన గుర్తుగా పెడతాడు.

 

ఇక మరో కథ శిరియాళుడిది..పరీక్షించడానికొచ్చిన శివుడికి తన కొడుకు తల కోసి మరీ బిక్షపెడతాడు. ఇంకో విష్ణుభక్తుడు చివరిరోజుల్లో కొడుకు నారాయణను పిలిచి వైకుంఠం చేరుతాడు.

 

భక్తి,పూజావిధానాలు ఎవడి సొంతం వాడిదని ఇన్ని కథలుంటే ఇదిమాత్రం తప్పెందుకైంది?

 

2

మనకు ఓ దాశాబ్దం క్రితం హైదరాబాద్ లో నాంపల్లి బాబా అనే ఒకాయన్ను అవధూతగా భావించి జనం సిగరెట్లు తీసుకుపోయి ఇచ్చేవారు.ఆయన పోయాక ఆయన సమాధిమందిరం దగ్గరా ఈ సిగరెట్ల ఆచారం కొనసాగుతూనే ఉంది.ఇంతా చేసి ఆ సమాధిమందిరం నిర్వహించేది టీవీల్లో ప్రవచనాలు చెప్పే ఓ పెద్దమ్మ.

 

అసలీ దేవుళ్లెవరు?ఎవరి దేవుళ్లను ఎవరు సొంతం చేసుకున్నారు?ఎవరి ఆచారాలెవరు కబ్జా చేసారు? ఆ మధ్య సమ్మక్క-సారలక్క జాతరలో మద్యాన్ని అర్పించడాన్ని నిషేధించాలనుకుంటే సాధ్యం కాలేదు...అదే శ్రీశైలంలో ఒక ఆచారం మానిపించగలిగారు...

 

శ్రీశైలంలో స్థానిక చెంచులు భ్రమరాంబ దేవికి జంతుబలులిచ్చేవారు...కొన్ని దశాబ్దాల ముందు నిషేధించి సాత్విక బలులు ఏర్పాటు చేసారు..అంటే వేలాది కొబ్బరికాయలు కొట్టడం,నిమ్మకాయలు కొయ్యడం,నిమ్మకాయల తోరణాలు కట్టడం...అన్నపురాశిలో పసుపుకుంకాలు కలిపి అర్పించడం లాంటివన్నమాట....

 

ఇదే కాదు అహోబిలం నవనారసింహులలో ఒకరైన పావన/పాములేటి నరసింహస్వామికి ఉగాది తరువాత ఒక నెలలో ప్రతిశనివారం వేలాదిగా జంతువులను బలి ఇస్తారు.

 

ఈ జంతుబలులేనా?ఒకానొక కాలంలో నరబలులూ ఉండేవని ఐతరేయ బ్రాహ్మణంలోని హరిశ్చంద్రుడి కథ ద్వారా తెలుస్తుంది.పిల్లలలు లేని ఈయనకు వరుణుడి వరంతో లో(రో)హితాస్యుడనే కొడుకు పుడతాడు.ఆ పిల్లాడిని వరుణుడికి బలి ఇస్తా అంటాడు.మాట తప్పి ఆ పిల్లాడిని అడవులకు పంపుతాడు,ఈలోగా వరుణుడు నంజువ్యాధి గ్రస్తుడవు కమ్మని శాపం ఇస్తాడు.ఇక రాకుమారుడు ఒక పేద బ్రాహ్మణుడిని ఒప్పించి కొన్ని వందల గోవులిచ్చి ఆయన ముగ్గురు కొడుకుల్లో ఒకరిని బలిపశువుగా తెస్తాడు.చివరికా బ్రాహ్మణ బాలకుడు దేవతలందరినీ,వరుణుడితో సహా ప్రసన్నం చేసుకుని బయటపడతాడు.

 

ఈ కథలన్నీ అయ్యాక మన దేశంలో బౌద్ధ,జైన మతాలొచ్చాయి...కథలూ మార్చాల్సి వచ్చింది...ఈ కథ ఎన్నికష్టాలెదురైనా సత్యం తప్పని,మనకు తెలిసిన హరిశ్చంద్రుడి కథ వచ్చింది.

 

అసలొకానొక కాలంలో దేవుళ్లను(ప్రకృతికి సంబంధించిన వారే సుమా)తృప్తి పరచడం ఒక్కటే ఉండేదని ఈ వరాలకు దేబరించడం,ఆత్మసమర్పణ లాంటి భావాలు శరణాగతి వేడుకునే(మూడింటిని శరణం గచ్చామి అంటారు కదా)పద్దతి వచ్చింది..ఆ తర్వాత భక్తి యుగంలో ఇది మరింత వ్యాప్తి చెందిందంటారు.

 

ఈ ఆత్మసమర్పణలు,కష్టాలుకన్నీళ్లు అనుభవిస్తే చివరిలో ఫలితం...ఇహ,పరలోకాల్లో అన్న భావనకు మూలం బౌద్దం అని పండితుల భావన.

   

ఇంకా షణ్మతాలున్న హైందవంలో ఎవరి ఆచారాలు వారివి...వామాచారాంలో మద్య,మాంస,మత్స్య,ముద్ర,మైధునాలనే మకార పంచకానికి ప్రాధాన్యత ఉంది...

అసలు బౌద్ధంలో వజ్రయాన కూడా ఈ విధానమేగా! 

 

3

అసలు పురాణేతిహాసాల్లో పెద్దగా గుడుల ప్రస్తావనుండదు.రుక్మిణి కళ్యాణం లాంటి కొన్ని చోట్ల తప్ప.అసలు ప్రతి భారతీయుడి ఇంటిలో పూజగది ఉంటుంది,అసలు గుడుల అవసరం లేదు కానీ వారు కోర్కెలను ఈడేర్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పడనికి గుడికిపోతారని కొందరు పెద్దలన్నారు.స రేఎవరి పూజావిధానాలు వారివి,కాలగమనంలో ఎందరో దేవీదేవతలకు గుడులొచ్చాయి...అవి ఒకనాటి సాంస్కృతిక,విద్యా,ఉపాధి కేంద్రాలుగా,గ్రామసభల పాత్రనూ నిర్వహించాయి.మళ్లీ వీటినాశ్రయించి ఎన్నో ఆచారాలు,దురాచారాలు....

 

4

 

మొన్నీమధ్య ఒక ప్రవచనకారుడి వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి...ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి.

 

మొదటిది...నాటి యాదవులు అనాగరికులో,ఇంకోటో కాదు...దేహభ్రాంతి వదలక కొడుకులను యవ్వనం అడగ్గా వాళ్లు తిరస్కరించాడని శాపం పెడతాడు యయాతి...రాజ్యార్హత కోల్పోయిన వారు యాదవులయ్యారు...ఒప్పుకున్న కొడుకు సంతతే హస్తినాపుర పాలకులైన కురువంశం అయ్యారు...ఇక యాదవులు పశుపోషణ,వ్యాపారాలు చేసేవారు కాబట్టి నాటి సమాజంలో వైశ్యులని ఇస్కాన్ పుస్తకాల్లో ఉంటుంది.

 

రెండవది...శుచీశుభ్రతల గురించి చేసిన వ్యాఖ్యలుగా తీసుకుంటే...వాటి నేపధ్యమూ నాటి జీవన విధానాలే...శాస్త్రాలు చెప్పేవారు కాకుండా మిగిలిన వారు శ్రామిక కులాలు...తెల్లవారుఝాముతో మొదలయ్యే పనులు చీకటిపడే సరికి అయిపోవాలి...ఇక రాత్రిల్లూ పెంచుకుంటున్న పశుపక్ష్యాదులను చూసుకోవాలి...ఇంత బిజీజీవితాల్లో ఎంచక్కా స్నానం కానించి పనికిపోలేరు...ఇక స్త్రీల కష్టాలెన్నో...ఎంతో శ్రమపడాలి...జరుగుబాటున్నోల్లు నెలలో మూడురోజులు తీసుకునే విశ్రాంతీ ఉండని రోజులు...పండుగలుపబ్బాలొచ్చినా చచ్చేత గొడ్డుచాకిరి...పనులన్నీ అయ్యాక ఏ మద్యాహ్నమో,సాయంత్రమో స్నానం చేసి దీపారాధన చెయ్యడమే కష్టం...మరి ఈ నేపధ్యం చూడకుండా మాట్లాడాడని కొందరి ఆక్షేపణ.

 

5

 

సరే కాలంతో పాటూ తెచ్చిన యంత్రాలవల్ల శ్రమా తగ్గింది,తీరుబాటు దొరికింది...అందరూ విద్యావంతులయ్యారు..ఇక ఆధునిక సాంకేతికత,విద్యల వల్ల ఇతరదేశాల్లో జీవనశైలి ఎలా మారుతుందో కానీ మన దగ్గర మాత్రం సంస్కృతీకరించబడాలనుకుంటారు...ఈ జాడ్యం సరళీకృత ఆర్ధిక విధానాల తరువాత,సోవియట్ విచ్చిన్నం తర్వాత మరింత ఎక్కువైంది.ఒకవైపు ఉపాధి,వ్యాపారాలవల్ల వచ్చి పడుతున్న డబ్బు,మరోపక్క ఒక ఆదర్శ రాజ్యం అని నమ్మిన దేశం విచ్చిన్నం కావడం....ఇంకేం మనోళ్లంతా ఆధునిక జల్సాలు చేస్తూనే గతం వైపు చూడ్డం మొదలైంది.

 

మధ్యయుగాల్లో ఎవరెవరో రాజులయ్యేవారు...జనానికి గతం గొప్పలు చెప్పుకోవాడానికి కావ్యాలు రాయించుకుని తాము సూర్య,చంద్ర వంశీయులమని చెప్పుకునేవాళ్లు.

 

ఇప్పుడూ అదే యావ..ప్రతి కులానికో మూలపురుషుడిని వెతికిపట్టుకున్నారు...(వీళ్లు ఆ టాటా,బిర్లా,అంబానీలు ఒకే కుదురు నుంచి వచ్చి ఉంటే వీళ్లు,వాళ్లూ వియ్యమందుతారా అని అడక్కండి)..దీనివల్ల మా స్వాభిమానం పెరిగిందని అంటారు...ఇంకా సంస్కృతీకరింపబడి కొత్త ఆచారాలు తలకెత్తుకున్నారు.

 

అధునికత ఇస్తున్న ఫలాలు అనుభవిస్తూనే ప్రాచీనతవైపు మళ్లీ పరుగులు....

 

నిన్న చూస్తే కంప్యూటర్ల మీద పని చేసే పిల్లలూ సంస్కృతి అంటూ జల్లికట్టు కోసం వీధులెక్కారు..శ్రీలంక తమిళ వేర్పాటువాది ప్రభాకరన్ కటౌట్లు పెట్టారు...ప్రభుత్వాలనే మెడలు వంచి ఆర్డినెన్స్ తెచ్చేట్లు చేసారు....

 

పాతికేళ్ల క్రితం షాబానో కేసులో తీర్పును కాదన్నారు..పరిహారంగా అయోధ్యలో శిలాన్యాస్ కు అనుమతి ఇచ్చారు..ఆ తర్వాత కథ...దేశవిభజన గాయాలు మానుతున్న తరుణంలో మళ్లీ సమాజంలో నిట్టనిలువు చీలిక..రావణకాష్టంలా రగులుతూనే ఉంది...

 

ఏర్పరచున్న వ్యవస్థలను కాదని బజార్లకెక్కీ సాధించుకుంటున్నది పురోగమనమా?తిరోగమనమా? ఒకనాటి సతి,బాల్యవివాహాలు,బలవంతపు కాపురాలు....సంస్కృతి అని తిరిగి తెచ్చుకోవాలా? ఇంత కాలగమనంలో ఎన్నో మార్పులు జరిగితే ఏది మన అసలైన సంస్కృతి? ఆధినికత వైపు అడుగులేస్తూనే సంస్కృతి అంటూ వెనక్కి చూడ్డంలో ఔచిత్యముందా?

 

ఊగిసలాడకే మనసా.....