Asianet News TeluguAsianet News Telugu

నేడు గాడిచర్ల 57వ వర్ధంతి

in the memory father of library movement in Andhra Gadhicherla Hari Sarvottamarao

1850 నుండి ఒక శతమానం పాటు మన దేశములొ అన్ని రంగాలలొ లక్షలాది మంది,  పారదర్శకమైన త్యాగ నిరతులు, నిస్వార్థ దేశ భక్తులు, అంకిత భావంగల్గిన సమాజ సేవకులు, చిత్తశుద్దితొ వ్యవహరించిన సమాజ సంస్కర్తలు,  దార్శనిక మేధావులు ఉండేవారు. ఇందులొ ఎక్కువ మంది, భారత జాతీయ కాంగ్రెస్ గొడుగు కింద, గాంధీజి నాయకత్వములొ సాగిన ’జాతీయ ఉద్యమ’ములొ తమ సర్వస్వాన్ని పోగొట్టుగొన్నారు.

 

కొందరయితే, గాంధీ యుగానికి అంటే 1915 కు ముందే  పోరాటయోధులు. ఉద్యమం పై తమ స్వయం ప్రభతొ,  చెరగని ముద్ర వేశియున్నారు. అట్టి వారికి స్పూర్తి, "లాల్, పాల్, బాల్"లు. పంజాబ్ కేసరి, లాలా లజపత్ రాయ్,  విప్లవవాద పితామహుడు,  బెంగాల్ కు చెందిన బిపిన్ చంద్ర పాల్ మరియు మరాఠా కేసరి, బాలగంగాధర తిలక్.

 

ఈ ముగ్గురు నాయకులు, సుడి గాలి మాదరి దేశాన్నంతా తిరిగి, తమ వాగ్ధాటితొ ప్రజలను నిద్రలేపి, పరాయి పాలనకు వ్యతిరేకముగా, ఐక్యముగా పోరాడ వలసిన అవసరాన్ని, దానికి తగు మార్గాన్ని, ప్రజలకు భోదిస్తూ వచ్చారు.

 

  బిపిన్ చంద్ర పాల్ (నవ్ంబర్, 7, 1858 – మే 20, 1932) గారు అప్పటి మద్రాస్ రాష్ట్రములొని ఆంధ్ర  తీర ప్రాంతాలలొ సంచరిస్తూ,  1907, ఏప్రిల్ మాసములొ రాజమహేంద్రవరం వచ్చారు. వారక్కడ: India is not a desert; but a flower garden.  Though plenty of water is available, the gardener is not watering it properly. Hence the garden is withering away".  అని వక్కణీంచారు. దానిని, ఆంధ్ర మిల్టన్, అంధ ఆశు కవి, చిలకమర్తి  లక్ష్మీ నరసింహం పంతులుగారు:  "భరత ఖండంబు చక్కని పాడియావు / హిందువులు లేగదూడలై యేడ్చు చుండ / తెల్లవారను గడుసరి గొల్లవారు / పితుకుచున్నారు మూతులు బిగియగట్టి" అంటూ భావానువాదం పాడగా, రెచ్చి పోయిన జనానికం వందల సంఖ్యలో ఉద్యమంలో దూకారు. అందులొ యవకులే ఎక్కువ . యువ సైన్యానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో చదువుకొంటున్న కర్నూలు వాసి, గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారు. 

 

                          గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారు, రెవెన్యూ శాఖలొ ఉద్యోగిగా ఉన్న వెంకట రావు, భాగీరథి బాయిలకు కర్నూలో సెప్టెంబర్ 14,1983 లొ జన్మించారు. చిన్న తనములోనె తల్లిని పోగొట్టుకొన్న హరిసర్వోత్తముడిని, పిల్లలు లేని, పినతండ్రి, వకీలు, శ్రీనివాస రావుగారు, కర్నూలు, ఆదోని, పురపాలకోన్నత పాఠశాలలూనూ, గుత్తి మిషన్ ఉన్నత పాఠశాలలోనూ,  చదివించారు.

 

 ఆనాడు కర్నూలు జిల్లాలో ఉన్నది ఇంకొకటే, నంద్యాల ఎస్.పి.జి. ఉన్నత పాఠశాల. ఆదోని బళ్ళారి జిల్లాలో ఉండేది.  తరగతిలొ మొదటివాడిగా ఉత్తీర్ణుడైనందువల్ల పై చదువులకు విద్యార్థి వేతనం లభించడముతో, మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలొ చదివి ఆ నాడు ఆంధ్రదేశములో  ఎమ్ఎ పట్టా పుచ్చుకొన్న రెండవ వ్యక్తిగా గుర్తింపు పొందారు.

 

 మొదటివారు శ్రీ కాళహస్తి జమిందారు ’పానగల్ రాజా”గా బిరుదాంకితులైన సర్. పానగంటి రామరాయణింగార్. తర్వాత రోజుల్లొ వారు మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు కూడా.  ఆ రోజులలొ మద్రాస్, రాజమహెంద్రవరంలలొ రెండే శిక్షణ కళాశాలలు ఉండేవి. గాడిచర్ల   రాజమండ్రి లొ శిక్షణ కళాశాలలొ చదువుతూ ఉన్నప్పుడే బిపిన్ చంద్ర పాల్  ప్రభావానికి లోనై, ఎప్రిల్, 1907 లొ జాతీయ ఉద్యములొ పాల్గొన్ననందువల్ల, వారిని కళాశాలనుండి తొలగించడమే కాకుండా, అదే సంవత్సరం జూన్ నెలలొ  వారు శాశ్వతముగా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగాప్రకటించారు. పిన తండ్రిగారు ఉద్యమాలు విడిచేస్తేనే దత్తు స్వీకారానికి సిద్దమైనారు. అస్తి అంతస్తుల మద్య,  దేశ సేవను పణంగా పెట్టడానికి ఇష్టం లేని యువకిశోరం, దేశ సెవవైపే మొగ్గారు.

 

 వారి పై ఉన్న ఆంక్షలను 1937 లొ రాజగోపాలాచారిగారు మద్రాస్ రాష్ట్రం ముఖ్యమంత్రికాగానే రద్దు చెసారు.ఉద్యోగ విరమణ వయస్సు అంచులొ ఉన్న గాడిచర్లగారికి అది కేవలం సాంకేతిక విజయం.    రచనా సామర్థ్యం కలిగిన గాడిచర్ల వారు విద్యార్థి దశలోనే, శ్రీ కృష్ణ దేవరాయల ఆముక్తమాల్యద వ్రాశాడని, చిరు సంశోధనా గ్రంథాన్ని, అబ్రహామ్ లింకన్ సంక్షిప్త జీవిత చరిత్రన రాసి కీర్తి సంపాదించుకొన్నారు.  

 

మచిలీపట్టణంలొ జాతీయవాది బొడె నారాయణ రావు "స్వరాజ్య" పత్రికను స్థాపించినారు. దానికి గాడిచర్లవారు సంపాదకులుగా వ్యవహరిస్తూ,  వ్యాసాలూ కూడా రాస్తూఉండెవారు. ఆ సందర్భములొ,  కఠినంగా  వ్యవహరిస్తున్న తిరుచిరాపల్లి కలెక్టర్ ఐశ్ ను స్వదేశీ వాదులు 1908లొ హత్యచేశారు. దానికి ప్రభుత్వం అతి క్రూరముగా స్పందించింది.  ప్రజల నిరసనలను చెదర గొట్టడానికి, జరిపిన కాల్పులలొ, ముగ్గురు అమాయక ప్రజలు చనిపోయారు. దానిని ఖండిస్తూ గాడిచర్లవారు స్వరాజ్యలొ "విపరీత బుద్ధి" అనె శీర్షికతొ సంపాదకీయం రాశారు.  "అరరె ఫిరంగి క్రూర వ్యాఘ్రమా  నిష్కారణముగా నీవు ముగ్గురు హిందువులను ఒక్క సారిగా పొట్టన పెట్టుకొంటివి గదురా! నీవు నీతి చట్టములను కూడా అతిక్రమించుతున్నావు. ఓ భ్రాంతుడా! పొగరుబొతు తనమున కన్నులు గాననివారికి సహజ లక్షణమైన్ ఇట్టి వ్యతిరేకాభిప్రాయములను కలిగిన నీవు, నిరహస్యములను, బయటపెట్టుకొంటివి. హిందూ జాతీయాభివృద్ధితొ, మీ విదేశ పరిపాలన విధాన మంత మొందగలదని నివు రుజువు చేసి చెప్పుచున్నావు."  మతిలేని ప్రభుత్వం 1808, జులై, 18 న గాడిచర్ల మరియు బోడెలను అదపులోనికి తీసుకోని వారి పై దెశద్రోహ కేసు పెట్టింది. అదే రోజున మహారాష్ట్రములొ బాలగంగాధర తిలక్ ని కూడా అదపులోనికి తీసుకొన్నారు. అందువల్ల,

 

గాడిచర్లని, వారి అభిమానులు, శిష్యులు, "ఆంధ్రతిలక్" అని సంభోదించెవారు. వ్యాజ్యం విచారణ మచిలీపట్టణం జిల్లా కోర్టులొ జరుగగా, మానవత్వం కలిగిన కెర్షాస్సు అనె ఫారసి న్యాయాధీశుడు వారిరువురికి తలా ఆరు నెలల సాధారణ శిక్ష విదీంచారు.  దానితో అసంతృప్తి పొందిన ప్రభుత్వం శిక్ష పెంచాలని, కఠిన శిక్ష విదించాలని,  మద్రాస్ ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసింది. అక్కడ, తిరుగులేని బారిస్టర్ గా పేరుపొందిన టంగుటూరి ప్రకాశంగారు గాడిచర్లవారి తరపున వాదించినా లాభం లేక పోయింది. 1909 మార్చ్, 25, 23, 29, విచారణ జరిపి, ఎప్రిల్, 14, న బోడెవారిని శిక్షను కఠిన శిక్షగ మారుస్తూ, గాడిచర్లవారికి, మూడు సంవత్సరాల కఠిణ శిక్షగా పెంచుతూ తీర్పునిచ్చింది. "ఇటువంటి స్వయం ఘోషిత దేశాభిమానులవైపు తీవ్రంగా వ్యవహరించక పోతె, శాంతి భద్రతలకు హాని కలుగుతుందని" వ్యాఖ్యానించింది. ఇక్కడ గమనించవలసిన విషయం: మోపబడ్ద నేరం, విచారణ, శిక్ష గాంధీయుగానికి, ఏడు - ఆరు సంవత్సరాల ముందు. ఇలా భారత దెశములోనే, శిక్షింపబడ్డ మొట్టమొదటి పత్రికా రచయిత, ఆంధ్రదేశంలో జైలుకెళ్లిన మొట్టమొదటి ఆంధ్ర స్వతంత్ర సేనాని గాడిచర్ల. చరిత్ర పుటాలలొ వారి స్థానం శాశ్వతమైనది.  

 

         ఆ సందర్భములొ గాడిచర్ల వారి సతీమణి, రమాబాయి, నిండుగర్భిణి. మదనపల్లెలొ తల్లిగారి ఇంటికి కాన్పుకొరకు పోయారు. శిక్షపడిన రోజు, కొర్టులొ చూసి, ఆనంద భాష్పాలతో హారతి ఎత్తి, తిలకం పెట్టి "పోయిరాండీ" అటూ సాగనంపారంటూ ప్రత్యక్షసాక్షులు చెప్పేవారు.

 

 వెల్లూరు జైలులొ సామాన్య ఖైదీలతొ, జీవితం గడుపుతూ, నిబ్బరం కోల్పోకుండా, స్థితప్రజ్నులుగా, ఇతర జైలు వాసిలతొ హాస్య, చలాకి ఆయన. తోటి ఖైదీలకు  చదువు చప్పడం వంటి కార్యకలాపాలతో, జనానురాగాన్ని సంపాదించారు. వీరి కాయ కష్టం వారు నిర్వహించడముతొ, వారికి కొన్ని రాయితిలు వచ్చాయి. వారందరికి కృతజ్నలు తెలిపినారు.  జైలులొ ఇచ్చే పదార్థాలకు "దేవతా పుల్సు" అని నామకరణం చెసారు: "వాటిలొ, భగవంతుని సృష్టిలోని కొట్ళాది జీవరాశులు కనుపిస్తాయి" అని వ్యంగం వెలిబుచ్చుతూ దినచరిలొ రాసుకొన్నారు.  విడుదల అయ్యాక, మద్రాస్ లో దేశోద్ధారక నాగేశ్వర రావుగారు స్థాపించిన ఆంధ్రపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకుడిగా వ్యవహరించారు. అదే సందర్భములొ ’Editor' పదానికి, ’సంపాదక’ అనె తెలుగు పదాన్నిసృష్టించి, భారత దేశములోని దెశీయ, పత్రికా రంగములోనూ, నిఘంటులలొ చరిత్ర పుటములోకెక్కారు. మద్రాస్ పురపాలక సంఘం  పాకి పనివారి సంఘముతొ సహా, వివిధ కార్మిక సంఘాలను స్థాపించి కర్శకవర్గం అభివృధికొరకు శ్రమిస్తూ, కాంగ్రస్ రాజకీయాలలొ చురుకుగా పాల్గొంటూ ప్రతి సంవత్సరం వార్షిక అధివేశనానికి హారైయ్యెవారు. 1920 లొ నాగపూర్ సమావేశములొ, మంగళూరు ప్రతినిధి, కార్నాడు సదాశివ రావుగారితొ కలిసి, గాంధీజి సిద్దాంతాలను తీవ్రంగా విమర్శించినందుకు గాంధీగారు "ధీర హరిసరోత్తమ రావు"  (Brave Harisarvotthama Rao) అని వారిని కొనియాడారు. 

 

           1927 లొ మద్రాస్ శాసన మండలికి,  కర్నూలు జిల్లాకు కాంగ్రస్ అభ్యర్థిగా ఎన్నుకొ బడ్డారు. వారికి ప్రత్యర్థిగా జస్టిస్ పార్టీ , వారి పరమ మిత్రులైన కంభం శరభా రెడ్డిగారిని నిలబెట్టింది. సహృదయులైన శరభారెడ్దిగారు, తన మిత్రుని గుణ గానాలు, చేస్తూ, "అజాత శత్రువు, విద్యావంతుడు, వినయం గల్గిన వాడు, ప్రామాణికుడు, నిస్వార్థి, ........ చెప్పడానికి ఏమీ లేదు. ఐతే కాంగ్రెస్స్ అభ్యర్థి కాబట్టి నాకు వోటు వెయ్యండి అని ప్రచారం చేశారు". ఎన్నికలలొ గెలిచాక ఇద్దరూ చేదోడు వాదోడుగా ఉంటూ, అబివృధి పనుల పై దృష్టి సారించారు; కె.సి.కాలువ ఆధునీకరణ, శ్రీశైలం రోడు నవీనీకరణం ముఖ్యమైనవి. వారి చిత్తశుద్ధికి, అంకిత భావాలను గమనిస్తూ, ప్రభుత్వం "గాడిచర్ల, కారంత, (ఉడుపి) మోతె నారాయణ రావు (ఏలూరు) వంటివారు చట్టసభలకు ఎన్నికైతె, బ్రిటిష్ సార్వభౌమత్వం భారత దేశములొ ఎక్కువ కాలం కొనసాగదు" అనే భిప్రాయానికి వచ్చారు.  పార్టి ఆదేశాఅనుసారముగా 1930 లొ శాసన మండలి సభ్యత్వానికి రాజినామా చేసి, నిధానముగా,క్రియాశీల రాజకీయాలనుండి పక్క కు పోయి, సృజనాత్మక, నిర్మాణాత్మక, రచనాత్మక క్షేత్రం వైపు, దృష్టి సారించి, జాతీయ ఉద్యమాలతో తాను పాలు పంచుకొన్న ప్రతి ఉద్యమములొ, తన చెరగని ముద్ర వెశారు: గ్రంథాలయ, వయోజన విధ్యాభ్యాసం, భాషోద్యమం, రాయలసీమా ఉద్యమం,  ఆంధ్రొద్యమం, ఖాది, హరిజనోద్ధరణ, స్త్రీ విమోచన, గ్రామీణాభివృద్ధి, ఇత్యాది, ఇత్యాది. కొత్త, కొత్త, నినాదాలు సృష్టించారు. ఉదా: " మనకి వాతావరణం, Hot, hotter and hottest. So Khaddar is the most suitable cloth. Wear it with pride." 

 

                 వారికి అత్యంత ప్రీతి పాత్రమైనది "ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం". దానికి వారు ముప్పయి సంవత్సరాలకు పైగా అధ్యక్షునిగా వ్యవహరించి, తెలంగాణాతొ సహ, ఆంధ్ర దేశమంతటా, వయోభారాన్ని లెక్క చెయ్యకుండా మారు మూల పల్లెలలో ప్రయణించారు.

 

చిలకమర్తివారు ఉద్భోదించిన, ఈ క్రింది గ్రంథాలయ వేదాన్ని సాక్షత్కారమ్ చెయ్య డానికి, మనసా వాచ, కర్మణా, ఆఖరి ఊపిరి వరకూ పోరాడారు. 

 

 "వాయువులెల్లవారికి నెట్ళ స్వాధీనమైయున్నదో, 

జ్నానమూ అందరికి అట్ళనేస్వాధీనమైయుండవలయును.
ఉదకము ఎల్లవారికినెట్ళ సేవ్యముగా నున్నదో, 

జ్నానమూ అందరికి అట్లనె సేవ్యముగానుండవలయును.
సూర్య చంద్రమండలముల తేజస్సు ఎల్లవారికినెట్ళ సౌఖ్యప్రదముగానున్నదో, 

జ్నానమూఅందరికి అట్ళనె  సౌఖ్యప్ర దముగానుండవలయును".   

 

గ్రంథాలయోద్యమములొ వారి శిష్యువర్గములొ పాతూరివారెగాక,  హెమా, హేమిలైన వావిలాల, కోదాటి, కాళోజి, మొదలుగువారున్నారు.   కడపా రాఘవేంద్ర రావుగారు లేనిదే విశ్వేశ్వరయ్య, లేరు. ఇమ్మానేని హనుమంతరావుగారు లేనిదెే ప్రకాశంగారు లేరు. శివసుబ్రహ్మణ్య అయ్యర్ లేనిదెే అబ్దుల్ కలాం లేరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం.

 

నంద్యాల పురపాలక సంఘాధ్యక్షులు, దాని, వకీలు, భూస్వామి, కాదరాబాద్ నరసింగ రావుగారు లేనిదే, గాడిచర్లవారు లేరు. గాంధీ గారి మొదలు హరిసర్వోత్తమ రావుగారి వరకు ఈ దేశములోని నంద్యాలకొచ్చిన  మహానాయకులందరూ  కాదరాబాద్ వారి అతిథులే. హరిజన విద్యార్థి నిలయాన్ని స్థాపించి, విజయవంతముగా నడిపించినందుకు, వారి నామాంకితం "నంద్యాల గాంధీ"..  అయినా  ఎప్పుడూ పోలీసువారు వారి జోలికి పోలేదు. పరిపాలకులకు కూడా, గవర్నర్, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఎవరికైన,  కాదరాబాద్ వారే ఆతిథేయులు, సుమా! వారిళ్లు ఒక సత్రం. గాడిచర్లవారి కార్యక్షేత్రం నంద్యాల. వారి విడిది. కాదరాబాద్ వారి ఇల్లు.  వారి భార్య, రమా బాయి, కూతురు, ద్వారకా బాయిని అక్కడ వదలేశి ఊరూరా తిరిగేవారు.ఇంచు, మించు, అది తల్లి కూతురుకు, పుట్టినిల్లు. రమాబాయి, సెప్టెంబర్, 22, 1942 న క్యాన్సర్ వ్యాధితొ మరణించింది. రావుగారు ఒంటరి పోరాటం కొనసాగింది. 

 

              ఆంధ్ర ప్రదేశ్, గ్రంథాలయ సంఘానికి, అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్లవారు, పాతూరి నాగభూషణం, క్రమముగా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. పాతూరివారిని, ’నా మానస పుత్రుడు’ అని మనస్సు విప్పి కొనియాడగా, పాతూరివారు దానిని, అక్షరాలా కాపాడుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి, ఒక భవన నిర్మాణం చేసి, దానికి, "హరి సర్వోత్తమ భవనం" అని నమకరణం చేశారు.  గాడిచర్ల వారు అఖరి రోజులు, అక్కడెే గడుపుతూ వచ్చినా, కడపటి క్షణాలను ఏకైక కూతురు, ద్వారకా బాయి, అల్లుడు, నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి, మనుమండ్ళు, శ్రీరామ్, మోహన్, లక్ష్మణ్, సుధాకర్ లతో కలిసి మద్రాస్ లొ గడుపుతూ, 1960,  ఫిబ్రవరి 29, కొన ఊపిరి విడిచారు.

 

1994 లొ కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థకు "గాడిచర్ల హరిసర్వోత్తమ స్మారక భవనం" నామకరణం. ఆనాటి కార్యదర్శి, కీశే. కె.రోశయ్య గారిని ఈ సందర్భములొ స్మరించుకొవాలి.  ఫెబ్రవరి, 29, 2016 న గాడిచర్లవారి 56 వ వర్ధంతి సందర్భములో వారి నిలువెత్తు కాంస్య విగ్రహాం, జిల్లా  గ్రంథాలయ, సంఘం ఆవరణములొ, రాజ్య సభ సభ్యులు  టిజి వేంకటేశ్ మరియు రాష్ట్ర మాజీ ముఖ్య కార్యదర్శి,ఐ.యై,ఆర్, కృష్ణారావుగార్ల చేత ఆవిష్కరించబడినది.

 

గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, సంపతి ధనా రెడ్దిగారి, మరియు గ్రంథాలయ సంస్థ సిబ్బంది సహాయ సహకారం మరువరానిది. విగ్రహ నిర్మాణం గాడిచర్ల ఫౌండేశన్ వారి భిక్షాపాత్రం నుండి.  వారి పేరుతో ఒక తపాల బిల్ల అచ్చు వేయించడానికి, ప్రయత్నం జరుగుతూ ఉన్నది. గాడిచర్లవారు కృషి చెసిన వివిధ రంగాలలో, నిష్ణాతులైన ఒక కార్యకర్తను ఎన్నిక చేసి ప్రతి సంవత్సరం, 1997 నుండి వారి జన్మదినాన "గాడిచర్ల పుసస్కారం" ప్రదానం చెయ్యడం గాడిచర్ల ఫౌండేషన్ ఒక ముఖ ఉద్దేశం. ఇంతవరకు పురస్కార స్వీకృతులలొ, వావిలాల, కొదాటి, కాళోజి, డా.పినాకపాణి, పోత్తూరి, తదితరులున్నారు. 

 

(* చంద్రశేఖర్ కల్కూర కర్నూలులో ఒక ఉడుపి హోటల్ యజమాని. తెలుగు, కన్నడ పండితుడు. గాడిచర్ల ఫౌండేషన్ సారధి. అన్నింటికి మించి గొప్ప చదువరి)