(వీడియో)తిరుపతిలో నూర్రూపాయలనోటంటే హడల్...

hundred not and ten rupee coin are rejected in Tirupati

మోడీ మాత్రమే డీమానిటైజేషన్ ప్రకటించగలడా? 


కుట్ర ఆందోళన అజ్ఞానము కూడా పోటీపడితే అనధికారిక డీమానిటైజేషన్ చోటుచేసుకోదా?

 

తిరుపతినగరంలో ఒక వారం పదిరోజుల ముందువరకు జనాలు ఇవ్వబోయిన పదిరూపాయలనాణేలు చెల్లవని చిల్లర అంగడులన్నీ తిరస్కరిస్తూ ఉండేవి.  త్వరలోనే ఈ నాణేలు రద్దు అవుతాయని కొందరు చెప్పడం, దాంతో ప్రజలు వాటిని త్వరగా వదిలించుకొనేందుకు తొందరపడడం, అదే కారణంతో వర్తకులు వాటిని తీసుకొనకపోవడంతో చిన్నపాటి గగ్గోలు రేగింది.  దాంతో బ్యాంకులన్నీ పదిరూపాయల నాణేలకు చెల్లుబాటు ఉందని ప్రకటించవలసి వచ్చింది.  అప్పటికీ ప్రజలు అపనమ్మకంతో ఉంటే చివరకు రిజర్వ్ బ్యాంక్ స్వయంగా ఆ నాణేలతో అందరూ లావాదేవీలు చేసుకోవచ్చని ప్రకటించవలసి వచ్చింది. 

 

కొందరు వ్యక్తులు బ్యాంకులలో అధికమొత్తంలో నాణేలను జమ చేయడానికి వచ్చినపుడు,  బ్యాంకు సిబ్బంది తిరిగి వాటిని కస్టమర్లకు ఇచ్చేటపుడు ఆ నాణేలను లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల,  నాణేలను లెక్కించే యంత్రాలు లేక ఇబ్బందులు రావడం వల్ల,  ఆ నాణేలను భద్రపరిచేందుకు తగినంత స్థలం కూడా ఒక సమస్య అయినందువల్ల బ్యాంకు సిబ్బంది నాణేలను తీసుకొనేందుకు విముఖత ప్రదర్శించడం కూడా ఈ సమస్య తలెత్తడానికి ఒక కారణమేమో అని స్వయంగా ఒక బ్యాంకు ఉద్యోగి చెప్పడం గమనార్హం.

 

ఆ గొడవ సద్దుమణగకముందే ఈసారి ఇంకో పుకారు తిరుపతి నగరంలో దవానలంలా వ్యాపించి జనాలను అయోమయంలో పడేస్తోంది.  ఇబ్బందులకు గురిచేస్తోంది.  వందరూపాయల నోట్లలో సిల్వర్ లైనింగ్ కలిగినవి, ముద్రింపబడిన సంవత్సరసంఖ్య లేనివి అయిన వందరూపాయల నోట్లు చెల్లవని వ్యాపారులు వాటిని తీసుకొనేందుకు తిరస్కరిస్తున్నారు.  ఎందువల్ల చెల్లదు?  అని అడిగితే ఆకుపచ్చ లైనింగు, ముద్రింపబడిన సంవత్సరసంఖ్య కలిగిన మరొక వందనోటును చూపి - "ఇదైతే చెల్లుతుంది" అంటున్నారు తప్ప, ఆ సిల్వర్ లైన్ కలిగిన నోట్లు ఎందువల్ల చెల్లవో చెప్పలేకపోతున్నారు. 

hundred not and ten rupee coin are rejected in Tirupati

(ఎర్రని మార్కింగ్ లోపల సిల్వర్ లైన్ ఉన్నది చెల్లదట.  ఆకుపచ్చని మార్కింగ్ ఉన్నచోట పచ్చని లైనింగ్ ఉన్నది చెల్లతుందట.)

 

hundred not and ten rupee coin are rejected in Tirupati

(ఎర్రని వృత్తం ఉన్న చోట ఆనోటు ముద్రింపబడిన సంవత్సరం లేదట అందుకని అది చెల్లదు అని వాదన.  పచ్చని వృత్తం ఉన్న నోటులో  సంవత్సరం ముద్రింపబడి ఉండటం చూడవచ్చు. )                       

 

తిరుపతి బస్ స్టాండులో "ఈవిధంగా నోట్లను మీరు ఎందుకు తీసుకోరు?  చెల్లవని మీకు ఎవరు చెప్పారు? ఎందువల్ల చెల్లవన్నారు?" అని కారణం అడిగిన ఒక వ్యక్తిని ఆ బస్టాండు ఆవరణలోనే ఉన్న ఒక హోటల్ సిబ్బంది "అడగడానికి మీరెవరు?" అని ప్రశ్నించారు.  "ఈ నోట్లు మీరెక్కడైనా మార్పిడి చేసి చూపించండి చూద్దాం" అంటూ సవాలు చేశారు.  దాడిచేసే ప్రయత్నం చేయబోయారు.  వీడియోను డిలిట్ చేయమని బెదిరించారు.  అయితే ప్రక్కనే మఫ్టీలో విధినిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది ఆ వ్యక్తిని రక్షించారు.

 

అదే బస్టాండు ఆవరణలో ఒక ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న కండక్టర్ అటువంటి నోటును ఒక ప్రయాణీకుడు ఇస్తే నేను తీసుకోనంటూ వ్యాఖ్యానించాడు.  ఎందువల్ల అని కారణం అడిగితే - "మేము  (కండక్టర్లం) నగదు చెల్లించే కౌంటర్లలో యంత్రాలు సిల్వర్ లైనింగ్ కలిగిన నోట్లను లెక్కించటం లేదని, అందువల్ల అటువంటి నోట్లను తేవద్దని ఆ కౌంటర్లలో ఉండే వ్యక్తులు చెప్పటం వల్ల నేను తీసుకోను" అంటూ కుండ బద్దలు కొట్టేశాడు. (వీడియో చూడండి)

 

సరే, ఆర్టీసీ సిబ్బందికి నోట్లను లెక్కించే యంత్రాలతో సమస్యలు ఉండటం వల్ల నోట్లు వద్దంటున్నారు అనుకుందాం.  కాని, తిరుపతి నగరంలో నెహ్రూ మార్కెట్ లో ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూరగాయలు అమ్మే వ్యాపారులు కూడా సిల్వర్ లైనింగ్ కలిగిన వందనోట్లను తిరస్కరిస్తున్నారు.  ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువును ఇంటి వద్దకు తెచ్చి ఇచ్చిన అమెజాన్ కంపెనీ ప్రతినిధి కూడా ఆ సిల్వర్ లైనింగ్ నోటును వద్దన్నాడు అంటూ ఓ గృహిణి వాపోయింది.

 

మోడీ ప్రకటించని ఈ రకమైన "ప్రైవేటు డీమానిటైజేషన్" తిరుపతివాసులను ఇబ్బంది పెడుతోంది. 

 

నవంబరులో ప్రకటింపబడిన  ఆధికారిక డీమానిటైజేషన్ వల్ల కలిగిన  అలజడి ఇప్పటికే నెమ్మదిగా ఉపశమించింది.  మోడీపై ప్రజలకు కలిగిన కోపం నెమ్మదిగా చల్లారుతోంది.  దీన్ని సహించలేని మోడీ ప్రత్యర్థులెవరైనా ఆరిపోతున్న ప్రజల ఆగ్రహజ్వాలల్లోనికి మరలా పుకార్ల పెట్రోలు జల్లుతున్నారా అని అనుమానం వస్తోంది.  కాని, దేశంలో మరెక్కడా లేనట్టు తిరుపతిలో మాత్రమే ఎందుకు ఈ పుకార్లు ప్రబలుతున్నాయి?  తిరుపతికి ప్రతిరోజూ వేలాది యాత్రికులు వస్తూ ఉంటారు.  "ఇటువంటి నోట్లు చెల్లవట" అనే పుకార్లను ఇక్కడి నుండి  దేశమంతటా వ్యాపింపచేయడం సులువనే ఉద్దేశంతో కొన్ని అరాచకశక్తులు ఏవైనా ఈ పుణ్యక్షేత్రాన్ని కేంద్రంగా ఎన్నుకున్నాయా? 

 

ఏమైనా డీమానిటైజేషన్ అనంతరం ఉత్పన్నమైన సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయబడ్డ ముఖ్యమంత్రుల బోర్డుకు అధ్యక్షుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తమ స్వంత జిల్లాలో వర్ధమానమౌతున్న ఈ సమస్యపై తక్షణమే దృష్టి సారించి మొగ్గలోనే త్రుంచివేయవలసిన అవసరం ఉంది.  ఆర్ బీ ఐ కూడా చురుకుగా వ్యవహరిస్తూ ఇటువంటి పుకార్లను కాలహరణం చేయకుండా ఖండించి తగిన వివరణను ఇవ్వాలి.  ప్రజలు వ్యాపారులు  కూడా ఇటువంటి పుకార్లను నమ్మకుండా ఉంటే ఆర్థికవ్యవస్థను కల్లోలపరిచే కుట్రదారుల కుయుక్తులు ఫలించకుండా ఉంటాయి.