మట్టి గణపయ్యలకు భలే డిమాండ్ .. ఎందుకంటే ?
చారిత్రాత్మక భాగ్యనగరం ఆధ్యాత్మిక నగరంగా మారబోతోంది. ఇప్పటికే లక్షల విగ్రహాలు కొనుగోలయ్యాయి. విగ్రహ ప్రతిష్ఠాపన రేపే కావడంతో ఎటు చూసినా విగ్రహాలు, పూజా సామాగ్రిల కొనుగోలుతో భక్తులు సందడి చేస్తున్నారు. ప్రభుత్వం వాగ్దానం చేసిన ఉచిత మట్టి వినాయకుల విగ్రహాలు కొన్ని ప్రత్యేక కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. కోటి దాటిన నగర జనాభాకు ఏమాత్రం అందుబాటులో లేకపోవడంతో వీధుల్లోని వినాయకుల కొనుగోలు జోరుగా సాగుతోంది. మట్టి గణపయ్యలనే కొంటున్నారు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన బాగానే పెరిగింది.
ఎక్కువగా మట్టితో చేసిన విగ్రహాలపైనే ఆసక్తి చూపుతున్నారని మట్టి విగ్రహాల వ్యాపారి కిషన్ చెప్పాడు. ఇతను మూడేళ్ల క్రితం దాకా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలనే విక్రయించేవాడు. పర్యావరణ పరిరక్షణలో తానూ భాగస్వామిగా మారి ఆ విగ్రహాలను విక్రయించకూడదని నిశ్చయించుకున్నాడు. అప్పటి నుంచి మట్టితో చేసిన విగ్రహాలనే విక్రయిస్తున్నాడు. వ్యాపారం బాగా జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. సాధారణ సమయాల్లోకన్నా వినాయక చవితి ముందురోజు నుంచి పండగరోజు సాయంత్రం వరకు వ్యాపారం బాగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ విగ్రహాలను తాను ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించానని చెప్పాడు. విగ్రహాల ధరను సైజును బట్టి రూ.60 నుంచి రూ.500 దాకా పలుకుతున్నట్లు వివరించాడు. షోలాపూర్ మెటీరియల్ మా ప్రత్యేకత ఏ పండుగ సందడి అయినా ఎన్టీఆర్ స్టేడియంను ఆనుకుని ఉన్న రోడ్డు ఆ పండుగ కళను తీసుకొస్తుంది.
గణపతి విగ్రహాలతోపాటు గణపతికి అవసరమైన ప్రతి వస్తువూ ఆ రోడ్డుపై కొలువుదీరి చూపరులను ఆకట్టుకుంటోంది. పర్యావరణ పరిరక్షణ నినాదం ఈ మధ్యనే ఊపందుకోవడంతో ఇంకా మట్టి విగ్రహాల విక్రయం వైపు దృష్టి సారించలేదని చెప్తున్నాడు శ్యాం. గుజరాత్ కు చెందిన శ్యాం బషీర్ బాగ్ లో నివసిస్తున్నాడు. తన కుటుంబం కొన్నేళ్లుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను తయారు చేస్తోందని శ్యాం సోదరుడు చంద్రకాంత్ చెప్పాడు. అందుకే సెలవు రోజుల్లో తమ కుటుంబంలోని పిల్లలు కూడా విగ్రహాలను అమ్మకంలో సాయం చేస్తారన్నాడు. తమ వద్ద రూ.250 మొదలుకొని రూ.1500 రూపాయల ధర పలికే విగ్రహాలను తయారు చేశామని వివరించాడు. భక్తులు ఎక్కువగా విగ్రహంతోపాటు పూజా సామాగ్రి కూడా అడుగుతుంటారని, పుష్పాలు, వివిధ రకాల పత్రాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపాడు.
- నస్రీన్ ఖాన్,
సీనియర్ జర్నలిస్టు,
హైదరాబాద్.