‘బాహుబలి’ ని మరొక విధంగా చూడటమెలా?

how to view bahubali with difference

ఓ తెలుగు వాడు ఆ సినిమా తీసేయటంతో మన జన్మలు ధన్యమైపోయాయట. మన రక్తం పొంగి పోవాలట. మనమంతా రోమాంచిత ఉద్రిక్తులమవ్వాలట. కథా పరంగానా?

 

నటనా పరంగానా? భావజాల విలువల పరంగానా? నిర్మాణ స్థాయి పరంగానా? వెనుతిరిగి చూసుకోలేనంత స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. బరితెగింపు తనం కాకపోతే దాన్ని ఒక ప్రపంచ స్థాయి సినిమా అంటారా? కనీసం హాలీవుడ్ టీవీ సీరియల్ స్థాయి కూడా లేదు మొదటి భాగానికి. గ్రాఫిక్స్ చూపించాలన్న కక్కుర్తితో మంచుకొండలు, సముద్రాలు పక్కపక్కనే చూపించి ఫక్కుమని నవ్వించిన స్థాయి ఆ సినిమాది.

 

రాచరికాలు, బానిసత్వాలు, యుద్ధాలు, పదవుల కోసం వెన్నుపోట్లు, తోబుట్టువుల మధ్య భీషణ రక్తపాతం, చురకత్తితో ఒక తిరుగుబాటుదారుడ్ని హత్యచేసి నెత్తురోడే ముఖంతోనే ఇద్దరు పసిబిడ్డలకు చెరో వైపు స్తన్యమిచ్చే విడ్డూర రాజమాతల అరివీర భయంకర రాజనీతి గాంభీర్యం, విప్లవ భావాలతో రగిలిపోవాల్సిన పులి లాంటి హీరోయిన్లో ఆడతనాన్ని రగులుకొల్పి బొచ్చు కుందేలు పిల్లలా మార్చే దగాకోరు హీరోయిజం, నాగరీకత తెలియని వారందరూ నల్లగా క్రూరంగా వుంటారన్న పరమ ఫాసిస్టు చిత్రణలు...అన్ని రకాలుగా ఇన్ని అధ్వాన్నాలతో , అన్నన్ని చీకటి బాహుమూలాల్లో సంచరించటమేనా ఆ సినిమా విలువలు? ఒక్క పది నిమిషాలు కూడా ఆసక్తికరంగా లేదు. సినిమా యుద్ధ సన్నివేశాలతో సహా ఉత్కంఠ కలిగించలేదు. ముందుగానే ఇచ్చిన హైప్, మీడియాతో కుమ్ముక్కై వార్తకీ వాణిజ్య ప్రచారానికీ మధ్య సరిహద్దు రేఖల్ని కాలరాసే ప్రచారం, ప్రత్యేక వాణిజ్య వ్యూహాలు....ఇవి మాత్రమే ప్రత్యేకంగా చూపిస్తున్నాయి.

 

ప్రభుత్వాల్ని బుట్టలో వేసుకొని షోల సంఖ్య పెంచుకొని, టిక్కెట్ రేట్లు పెంచుకొని, టిక్కెట్ కావాలంటే తినుబండారాల కొనుగోలుని షరతుగా చేసి దగాకోరుతనం, దిగజారుడుతనం, నీతి బాహ్యత ఉఛ్చ స్థాయిలో ఆచరించిన ఆ సినిమా ఒక పెద్ద దోపిడీ కుట్ర.

 

మనం జురాసిక్ పార్కులు, టెర్మినేటర్ల, 2012ల తోనే ఈ సినిమాని పోల్చనవసరం లేదు. కనీసం యాభై, అరవై ఏళ్ళ క్రితం వచ్చిన టెన్ కమాండమెంట్స్, బెన్ హర్ సినిమాల కాలి గోటికి చాలదు. పోలార్ ఎక్స్ ప్రెస్ చూసారా? సినిమా మొత్తం కన్నార్పకుండా చూస్తాం. గుండెనెవ్వరో చిట్టి చిట్టి చేతులతో తడుతున్నట్లుంటుంది. సాంకేతికత, సృజనాత్మకత జమిలిగా పెనవేసుకుపోయి హృదయాన్ని హత్తుకుంటుంది. అవీ అంతర్జాతీయ స్థాయి సినిమాలంటే. అవతార్ వంటి సాంకేతికంగా అత్యున్నతమైన సినిమాలు ఇంకా ఎన్నో వందలున్నాయి. భారతీయ సినిమాలో కూడా బాహుబలి అబ్బ లాంటి సినిమాలున్నాయి. ఏ గ్రాఫిక్స్ లేకుండా ప్రతీకార భావోద్వేగాలతో కూడిన సాహస చిత్రం భారీ షోలే ఉంది. మొఘల్-ఎ-అజాం ఉంది. గ్రాఫిక్స్ తో తమిళ్ శంకర్ తీసిన రోబో ఉంది. అసలు ఈ సినిమాని ప్రపంచ స్థాయి సినిమా అని చెప్పుకోవటానికి అంత బరితెగింపుతనం ఎలా సాధ్యమైంది? మీడియా బ్రోకర్ పని చేస్తున్నది. ప్రభుత్వాధికారులు ప్రచారకర్తలైపోయారు. ఇంకా నయం ప్రభుత్వాలు ఎండాకాలం కాకపోతే బళ్ళకి సెలవులిచ్చేవారేమో కూడా. రైతుల ఆత్మహత్యలు, నిర్వాసితుల కష్టాలు పట్టని యంత్రాంగాలు రాజుగారి దేవతావస్త్రాలను పొగిడే పనిలో బిజి బిజీగా ఉన్నాయి. మనలాంటి చిన్న పిల్లలు వేలెత్తి చూపుదామా?

 

(ఫేస్ బుక్ నుంచి)