బిజెపికి, కాంగ్రెస్ కు ఉన్న తేడా ఏమిటో గుజరాత్ చెప్పింది
గుజరాత్ ఎన్నికల్లో ...
- బీజేపీ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు సంపాదించింది.
- కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు సంపాదించింది.
- బీజేపీ ఉన్నతాదాయ వర్గాలనుంచి ఎక్కువ ఓట్లు పొందింది.
- కాంగ్రెస్ అల్పాదాయ వర్గాలనుంచి ఎక్కువ ఓట్లు పొందింది.
ఇవి ఊహలు కావు. లెక్కలు. మీడియాలో అందరికీ అందుబాటులో ఉన్న ఎన్నికల గణాంకాలు. ఉదాహరణకు ఈ వీడియో చూడండి : https://www.facebook.com/bloombergquint/videos/1841148576182903/
ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదలను మరింత పేదలుగా మార్చడమే బీజీపీ విధానం, లక్ష్యం. ఇందుకు వారు హిందూమతాన్ని సాకుగా చూపుతూ... మేధావులూ, ప్రగతిశీలురూ అయిన హిందువులను కూడా వారికి తెలియకుండానే తమవైపు తిప్పుకుంటారు. హిందూ ధర్మం ఒక జీవన విధానం అనేవారు... ఆ జీవన విధానపు విధ్వంసాల (సాంస్కృతికంగా కాదు ఈ కామెంట్, సంస్కృతీ పేరుతో చేసే మత/రాజకీయ/ఆర్ధిక ఆధిపత్యం గురించి) కింద నలుగుతున్న గ్రామీణ పేదల గురించి పట్టించుకోరు. ఈ బతుకు శిథిలం అవుతున్న వారిలో మెజారిటీ కూడా హిందూమతస్తులే. వీళ్ళ పరిస్థితే ఇలా ఉంటే, ఇక మైనారిటీలుగా ఉన్న, దుర్భర జీవనం గడుపుతున్న ముస్లింల గురించి ఎవరిక్కావాలి? వారందరూ పాకిస్తాన్ పౌరులు, జాతీయ జెండాలు ఎగురవేయరు అంటూ వారిని ఈ నేలలోనే పరాయివారుగా చూస్తూ ఉంటారు.
సహజీవన సారాన్ని, సహన సౌశీల్యాల్ని నేర్పని స్వధర్మం... పరధర్మం కన్నా భయావహం!
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మొదలుపెట్టిన అలీన విధానం నుంచీ, బహుళార్ధసాధక నీటిపారుదల ప్రాజెక్టుల నుంచీ, పంచశీల నుంచీ, ఆ తర్వాత బ్యాంకుల జాతీయీకరణ నుంచీ, ఉపాధిహామీ చట్టం నుంచీ, విద్యా హక్కు చట్టం నుంచీ, సమాచార హక్కు చట్టం నుంచీ, భూసేకరణ చట్టం నుంచీ... ఎన్నో మానవీయమైన, ఈ దేశ పౌరులకు సాధికారత యిచ్చే విధానాలు తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీని అవినీతి పార్టీగా చిత్రిస్తూ... ఈ దేశ మధ్యతరగతి, సంపన్న తరగతి దృష్టిలో అవినీతి అంటే కేవలం అక్రమార్జన మాత్రమే... నీతి లేకపోవడం కాదు అనే బీజాలు నాటుతూ, హిందూ మతాన్ని తోడుతెచ్చుకుని తమ పబ్బం గడుపుకోవడం తప్ప బీజేపీ ఈ దేశ గ్రామీణ ప్రజల, పేదల జీవితాలలో ఎలాంటి గుణాత్మకమైన మార్పు కోసం ఎప్పుడూ పని చేయలేదు. చేయదు. వారి అజెండా అది కానే కాదు.
కాంగ్రెస్ పార్టీ... యెంత అవినీతి మూటగట్టుకున్నా... ఈ దేశ సామాన్య ప్రజల దగ్గర స్థానం కోల్పోకపోవడానికి కారణం అభివృద్ధి, సంక్షేమ ఫలితాలు వారికి ఎంతోకొంత అందడమే. ఈ విషయంలో బీజేపీ కాంగ్రెస్ కు ఎప్పటికీ మ్యాచ్ కాదు.
బుద్ధిజీవులూ, మేధావులూ ఆలోచించవలసిన మరొక అంశం గుజరాత్ ఎన్నికలు తెరమీదకు తెచ్చాయి. అదే NOTA. పైవారెవరూ మాకు నచ్చలేదు (None Of The Above) అనే ఈ ఎంపికకు దాదాపు 5.5 లక్షల మంది ఓటేశారు. దీని కారణంగా దాదాపు 12 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. వ్యవస్థాగతమైన మార్పులు, ఈ దేశ గ్రామీణ పేదల సాధికారతకు సంబంధించిన విధానాల వంటి అంశాలకు చదువుకున్న వారు, బుద్ధిజీవులు ఎక్కువ ప్రాధాన్యత యివ్వకపోతే వారి జీవితాల్లో వెలుగు తెచ్చే పాలన సాధ్యం కాదు.
భావోద్వేగాల రాజకీయాలకు సహకరించడం యెంత తప్పో, ఆ రాజకీయాల్ని ఎదుర్కునేవారిని సమర్ధించకపోవడం కూడా అంతే తప్పు. తమ సాంకేతిక మౌనం తమకు నచ్చని, తాము మెచ్చనివారికే మేలు చేస్తుందని NOTA రుజువు చేసింది.
సారాంశంలో - మహాత్మా గాంధీ చెప్పిన 'భారతదేశం గ్రామాల్లో ఉంది' అనే నిజం, గ్రామవాసుల జీవనప్రమాణాల మెరుగుదల సాధ్యం కానిదే భారతం పురోగతి చెందదు అన్న అర్థంలో చూడాల్సి ఉంది. భావోద్వేగరాజకీయాలకు మంగళం పాడవలసి ఉన్నది. అందరి సంక్షేమం ఇందులోనే ఉన్నది.
(* శ్రీశైల్ రెడ్డి పంజుగుల. తెలంగాణ యాక్టివిస్టు. రాజకీయ విశ్లేషకుడు.ఫోన్ నెం.9030997371, email: srisail@gmail.com)