కొద్దిరోజులుగా తెలుగురాష్ట్రాలను కుదిపేస్తున్న వీరమాచనేని డైట్ ప్లాన్ మీద తెలుగు మీడియాలో మొట్టమొదటిసారిగా ఏషియానెట్ వెబ్ సైట్ విస్తృత కథనాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే(ఆ కథనాన్ని చదవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి). షుగర్ వ్యాధిని ఒక్కరోజులో తగ్గించుకోవచ్చని చిటికేసి మరీ చెబుతున్న వీరమాచనేని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో హాట్ టాపిక్ గా మారారు. వీరమాచనేనికంటే ఎంతో ముందుగానే విశాఖపట్నానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ పీవీ సత్యనారాయణ ఈ ప్రత్యామ్నాయ ఆహారవిధానంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు నయం చేస్తున్నప్పటికీ ఆయనకు పెద్గగా ప్రచారం లభించలేదు. దానికి కారణం సత్యనారాయణ కార్డియో థొరాసిక్ సర్జన్ కావటం, సర్జన్ గా తన విధులను కొనసాగిస్తున్నందున దీనిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టలేకపోవటం. మరోవైపు వీరమాచనేని చెప్పేతీరు బలంగా నాటుకుపోయేటట్లు ఉండటం, విజయవాడలోని పలువురు ప్రముఖ వైద్యుల మద్దతు కూడా లభించటంతో ఆయన సిద్ధాంతం విస్తృతంగా ప్రజలలోకి వెళ్ళింది.  షుగర్ వ్యాధితో ఎన్నోరోజులుగా బాధపడుతున్నవారికి ఈయన ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి దానినుంచి బయటపడే మార్గముందని ఎవరైనా చెబితే ఆశగా చూడటం సహజం. ఔత్సాహికులు కొంతమంది ఈయన డైట్ ప్లాన్ ను ఆచరిస్తుండగా, మరికొంతమంది వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఆచరించేవారిలో రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులతోసహా ఎందరో ప్రముఖులు ఉంటున్నారు. మరోవైపు అల్లోపతి వైద్యులు, ఒబేసిటీ, షుగర్ వ్యాధిలను ఆధారంగా చేసుకుని వ్యాపారం చేసేవారు మాత్రం వీరమాచనేనిపై విరుచుకుపడుతున్నారు. మరి ఈ ఇరుపక్షాలలో ఎవరు కరెక్టో తెలుసుకోవాలంటే ఇరుపక్షాల ప్రధాన వాదనలను పరిశీలించాలి.

 

అనుకూల వాదన

 

1. ఈ ప్రత్యామ్నాయ ఆహారవిధానం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయన్నది మాత్రం నిజం. దీనిని ఎవ్వరూ కాదనలేరు. ఫలితాలు పొందినవారు స్వయంగా చెబుతున్నారు. కేవలం షుగర్ వ్యాధే కాదు, ఒబేసిటీ, బీపీ, స్పాండిలైటిస్, సొరియాసిస్, ఆర్థరైటిస్ వ్యాధులకు కూడా ఉపశమనం లభిస్తోంది.

 

2. కార్బోహైడ్రేట్స్ ప్రాతిపదికన నడిచే మెటబాలిజంను కొవ్వుపదార్థాల ప్రాతిపదికన నడిచే మెటబాలిజంకు మార్చటం అనేది దీనిలోని ప్రాధమిక సూత్రం. ఈ ఆహారవిధానంలో - మందులుగానీ, మూలికలుగానీ ఏమీ లేవు. కేవలం రెండు లేదా మూడు నెలల కాల వ్యవధిలో ఆహారంలో మార్పులద్వారానే ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు.

 

3. డాక్టర్ పీవీ సత్యనారాయణగానీ, వీరమాచనేని రామకృష్ణారావుగానీ ఈ ఆహారవిధానాన్ని వ్యాపార ప్రయోజనాలకోసమో, స్వలాభంకోసమో చేయటం లేదని, తాము పొందిన సత్ఫలితాన్ని అందరికీ తెలియజెప్పటానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారన్నది గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం.

 

4. నిర్ణీత కాలవ్యవధి ముగిసిన తర్వాత(ఫలితాలు లభించిన తర్వాత) మళ్ళీ చెలరేగిపోయి మునుపటిలాగా తినకూడదని, కార్బోహైడ్రేట్స్ ను తక్కువగా తీసుకోవటం అనే పద్ధతిని కొనసాగించాల్సిఉంటుందని సూచిస్తున్నారు. వంటలకు కొబ్బరినూనెను కొనసాగించాలని అంటున్నారు.

 

5. ఈ ఆహారవిధానం సర్వరోగ నివారిణి కాదని, జీవనశైలి వ్యాధులకు మాత్రమేనని స్పష్టంగా చెబుతున్నారు. గుండె, కిడ్నీ జబ్బులు ఉన్నవారు దీనిని అనుసరించగూడదని, అసలు దీనిని అనుసరిద్దామనుకునే ప్రతివారూ ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్న తర్వాతే మొదలుపెట్టాలని హెచ్చరిస్తున్నారు.

 

6. ఫ్యాట్ పదార్థాలను అధికంగా, కార్బోహైడ్రేట్లను అతి తక్కువగా తీసుకునే ఈ కఠినమైన ఈ పథ్యాన్ని అనుసరించేది రెండు లేదా మూడు నెలలే కావటం వలన, ఈ విధానాన్ని అనుసరిస్తే తీవ్ర దుష్ఫలితాలు ఏర్పడతాయన్న ఆరోపణ - వాదనకు నిలబడటంలేదు.

 

7. ఈ విధానాన్ని ఆచరించిన తర్వాత వ్యాధులు తగ్గటంతోబాటు కొత్త శక్తి వస్తుందని కూడా ఫలితాలు పొందినవారు చెబుతున్నారు.

 

8. కార్బోహైడ్రేట్స్ తగ్గించటం అనే ఈ ఆహారవిధానం కొత్తదేమీ కాదని, అందరికీ తెలిసిందేనని కొందరు అల్లోపతి డాక్టర్లు అంటున్నారు. షుగర్ వ్యాధికి చికిత్సలో మొట్టమొదటగా రోగికి చెప్పవలసింది జీవనశైలిలో చేసుకోవలసిన ఈ మార్పుల గురించేనని. కాకపోతే ఆ మార్పుల గురించి తాము బలంగా చెప్పలేకపోయామని, వీరమాచనేని బలంగా నాటుకుపోయేలా చెప్పి ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళారని చెబుతున్నారు.

 

9. కొన్ని వేలమంది వ్యక్తులతోబాటు 500మందికి పైగా వైద్యులుకూడా ఈ విధానాన్ని అనుసరించి సత్ఫలితాలు పొందారని వీరమాచనేని ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే మెడికల్ కౌన్సిల్ నిబంధనల దృష్ట్యా వారు బాహాటంగా ఈ విధానాన్ని సమర్థించలేకపోతున్నారని అంటున్నారు.

 

వ్యతిరేక వాదన

 

1. ఏ విధమైన శాస్త్రీయ పరిశోధనలు చేయని, శాస్త్రీయంగా రుజువుకాని ఈ చికిత్సావిధానాన్ని ప్రచారం చేయటం వైద్యశాస్త్ర నిబంధనలకు విరుద్ధం… అనైతికం.

 

2. షుగర్ వ్యాధిని, బీపీని, ఒబేసిటీని ఇలా ఒకే విధానంతో తగ్గించే వైద్యం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేదు… ఇలాంటిది నిజంగా శాస్త్రీయంగా రుజువైతే వీరమాచనేనికి నోబెల్ బహుమతి ఇవ్వాలి.

 

3. ఒక మందు అప్రూవల్ పొందే ముందు దానిపై ఎంతోకాలం, ఎందరో వ్యక్తులపై విస్తృత పరిశోధనలు చేస్తారు. ఈ ప్రత్యామ్నాయ ఆహారవిధానంపై ఆ స్థాయిలో పరిశోధనలు జరగలేదు.

 

4. ప్రతిఒక్కరూ ఈ వైద్యవిధానం పాటించొచ్చని వీరమాచనేని చెప్పటం తప్పు. శరీరం తీరు ఒక్కొక్కరిది ఒక్కొక్కరకంగా ఉంటుంది. ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క విధంగా స్పందిస్తుంది.

 

5. ఈ వైద్యవిధానాన్ని పరీక్షించటానికి నిర్ణీత సంఖ్యలో వాలంటీర్లను(వివిధ రకాల మనుషులను) తీసుకుని నిర్ణీతకాలంపాటు ఈ ఆహారాన్ని ఇవ్వటంద్వారా అధ్యయనం చేయాలి. తర్వాతే దీనిపై ఒక నిర్ణయానికి రావాలి.

 

6. ఎంతోకాలంగా పేరుకుపోయిన కొవ్వు కొద్దిరోజులలో తగ్గటం మంచి పరిణామంకాదు. బరువు క్రమక్రమంగా(gradual) తగ్గాలి.

 

7. ఈ డైట్ లు ఒక తాత్కాలిక వేలంవెర్రిలాంటివి మాత్రమే. ఆయిల్ పుల్లింగ్, నోని, మేగ్నెట్ థెరపీ, మంతెన సత్యనారాయణరాజు వైద్యం వంటి వేలం వెర్రులు ఎన్నో వచ్చాయి… కనుమరుగైపోయాయి.

 

 

ఏళ్ళతరబడి షుగర్, బీపీ, ఒబేసిటీ వ్యాధులతో బాధపడేవారు ఎందరో ఈ విధానంతో రెండు మూడు నెలల్లోనే వాటినుంచి విముక్తి లభించటంతో ఆనందంలో తలమునకలైపోతూ తమ అనుభవాలను స్వయంగా చెబుతున్నందున సత్ఫలితాలు లభిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే దీని ఫలితాలు ఎంతకాలం ఉంటాయనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. ముఖ్యంగా ఈ డైట్ ప్లాన్ ముగిసిన తర్వాత మళ్ళీ బరువు పెరిగే అవకాశంపైన అల్లోపతి వైద్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి డాక్టర్ సత్యనారాయణగానీ, వీరమాచనేనిగానీ ఇచ్చే వివరణ ఏమిటంటే 'వ్యాధులు తగ్గిన తర్వాతకూడా ఆహారంలో ఒక స్వీయనియంత్రణ పాటించాలి, కార్బోహైడ్రేట్స్ ను తక్కువగా తీసుకోవాలి' అని.

 

ఇక అల్లోపతి వైద్యులు ముక్తకంఠంతో ఈ ఆహారవిధానంపై చేస్తున్న ఆరోపణ ఏమిటంటే ఇది శాస్త్ర సమ్మతం కాదు అని. అయితే, జీవనశైలిలో మంచి మార్పులు చేసుకుంటే షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చన్నది తాము చదివిన చదువులో అతి ప్రాధమిక విషయమని కూడా వీరే చెబుతున్నారు. మరి ఈ ప్రత్యామ్నాయ ఆహారవిధానం చేస్తున్నది అదే కదా! డాక్టర్ సత్యనారాయణ, వీరమాచనేని ఇద్దరూ కూడా తమ బరువును తగ్గించుకునే క్రమంలో ఈ ఆహారవిధానాన్ని రూపొందించుకున్నారు. మరోవైపు, ఆహారంలో మార్పులద్వారా, బరువు తగ్గించటం ద్వారా షుగర్ వ్యాధి నయమైనట్లు ల్యాన్సెట్ అనే మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన ఒక పరిశోధనాపత్రం కూడా తేల్చింది. ఆ అధ్యయనాన్ని ఇక్కడ చూడొచ్చు - http://www.thelancet.com/journals/lancet/article/PIIS0140-6736(17)33102-1/fulltext. అధిక బరువే అన్ని అనర్థాలకూ కారణమని, అది తగ్గితే మోకాళ్ళ నొప్పులు, బీపీ వంటి పలు సమస్యలు తొలగిపోతాయన్నది వైద్యులందరికీ తెలిసిన విషయమే. ప్రత్యామ్నాయ ఆహారవిధానం ఆచరించటం వలన జరుగుతున్నది కూడా అదే. మరి దీనిని మెజారిటీ అల్లోపతి వైద్యులు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో తెలియటంలేదు.

 

డాక్టర్ సత్యనారాయణ ప్రత్యామ్నాయ ఆహార విధానంపై 'మనం ఏమి తినాలి' ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకంలో మొదటి మాటను రాసిన ప్రముఖ కార్డియాలజిస్ట్, కేర్ ఆసుపత్రుల అధినేత సోమరాజు ఈ ఆహారవిధానాన్ని బలంగా సమర్థించారు.

 

వైద్యులు ఎత్తిచూపుతున్న మరో అంశం ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవటంవలన లాంగ్ రన్ లో దుష్ఫలితాలు ఉంటాయని. అయితే ఈ విధానంలో ఇలా ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవటం ఒక నిర్ణీత కాలం(2-3 నెలలు) వరకే కాబట్టి ఆ విమర్శకూడా వాదనకు నిలబడటంలేదనే చెప్పాలి.

 

70 ఏళ్ళనాడు అమెరికన్ శాస్త్రజ్ఞులు రూపొందించి ఫుడ్ పిరమిడ్ భావనే కరెక్ట్ అని కూడా కొందరు వైద్యులు వాదిస్తున్నారు. అయితే కొత్త కొత్త పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతూ వైద్యశాస్త్రం నిరంతరం రూపాంతరం చెందుతున్న ఈ కాలంలో ఆ ఫుడ్ పిరమిడ్(ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ను 60 శాతం తీసుకోవాలని సూచిస్తుంది) భావనే కరెక్ట్ అనుకోవటం సమంజసం కాదని చెప్పాలి. కార్బోహైడ్రేట్స్… ముఖ్యంగా రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ చెరుపు చేస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా అందరూ చెబుతున్నాకూడా ఈ ప్రత్యామ్నాయ ఆహార విధానంలో వాటిని తగ్గించటం తప్పని వైద్యులు వాదించటంకూడా కరెక్ట్ కాదు. అందులోనూ ఈ విధానంలో కార్బోహైడ్రేట్స్ ను పూర్తిగా తగ్గించటంలేదు... అతి కొద్ది శాతం ఇస్తున్నారు. ఏది ఏమైనా ఈ విధానాన్ని విమర్శించే అల్లోపతి వైద్యులు ఒక్కరుకూడా అసలు దీనిద్వారా వ్యాధులు ఎలా తగ్గుతున్నాయనేదాని గురించి వివరణ ఇవ్వటంగానీ, చర్చించటంగానీ చేయకపోవటం గమనార్హం.

 

ఇక ఈ విధానంలో కనిపించే ఒక ప్రధానమైన లోపం ఏమిటంటే - ఈ విధానాన్ని ఆచరిస్తున్న, ఆచరించాలనుకుంటున్న లక్షలాదిమందికి సందేహ నివృత్తి చేసేవారు లేకపోవటం. ఇంతమందికీ డాక్టర్ సత్యనారాయణ, వీరమాచనేని వ్యక్తిగతంగా సమాధానాలు చెప్పటం కష్టం. రోగులకు తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు సుశిక్షితులైన సిబ్బందితో కాల్ సెంటర్ నుగానీ, రెండు మూడు ప్రదేశాలలో ఆరోగ్యకేంద్రాలనుగానీ వీరు ఏర్పాటుచేసి చక్కగా నిర్వహిస్తే రోగులకు ఎంతో మేలు చేసినవారవుతారు.

 

ఈ విధానంలో మరో ప్రతికూల అంశం ఉంది. ఈ డైట్ ప్లాన్ సమాజంలో అందరికీ సాయపడకపోవచ్చు. ఎందుకంటే ఈ పథ్యాన్ని నిష్ఠగా మూడునెలలు చేయాలంటే సమయం, వనరులు కూడా తగినంతగా ఉండాలి. అందులోనూ రోజువారీ వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమైనవారు చేయాలంటే కొద్దిగా కష్టమే. ఇంట్లో ఉండే ఆడవారికి, రిటైర్ అయినవారికి, ముఖ్యంగా ఉన్నతాదాయవర్గాలవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యం ముఖ్యం అనుకుని సంకల్పం చేసుకుంటే ఎవరైనా చేయొచ్చు… తద్వారా పొందే దీర్ఘకాల ప్రయోజనాలను చూసుకుంటే ఎంతో లాభం కూడా ఉంటుందనే చెప్పాలి.

ఏది ఏమైనా దీనిని ఆచరించాలనుకునేవారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే - క్రమం తప్పకుండా(రెగ్యులర్ గా) ఒక మంచి వైద్యుని సంప్రదిస్తూ వారి పర్యవేక్షణలో నడుచుకోవాలి. 

 

వీరమాచనేని డైట్ వలన లాభాలు, నష్టాలు పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాలలో ఆహారం తీసుకునే విధానంపైన ఒక విస్తృత చర్చ ప్రారంభమవటం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. పాలిష్డ్ బియ్యం, మైదాపిండి, గోధుమపిండి, రిఫైండ్ ఆయిల్ వంటి రిఫైన్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, టిన్డ్ ఫుడ్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ వలన జరిగే నష్టం మరోసారి తేటతెల్లమైంది. ఈ విధానం ప్రజలు తాము తీసుకునే ఆహారంపై పునరాలోచనలో పడేసింది… ఒక శాస్త్రీయ స్పృహను కలుగజేసింది. మరోవైపు వీరమాచనేని డైట్ రాబోయే కాలంలో మరింత సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ విధానం మెల్లగా తెలుగు రాష్ట్రాలు రెండింటికీ, క్రమక్రమంగా పక్క రాష్ట్రాలకు కూడా పాకుతోంది. లక్షల సంఖ్యలో జనం ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డయాబెటిస్, బీపీ వ్యాధులకు మందులు తయారు చేసే ఫార్మాస్యూటికల్ కంపెనీలకు, ఒబేసిటీ తగ్గించటంతో వ్యాపారం చేసే సంస్థలకూ తీవ్ర విఘాతం ఏర్పడుతుంది కాబట్టి అవి చేతులు ముడుచుకుని కూర్చోవు. దీనికి అడ్డుకట్టవేయటానికి తప్పక ప్రయత్నించే అవకాశం ఉండొచ్చు.

 

(* రచయిత సీనియర్ జర్నలిస్టు, హైదరాాబాద్, ఫోన్ నెం.99482 93346)

మొదటి వ్యాసం   మనం తినే విధానమే తప్పు! డాక్టర్‌లూ అనుసరిస్తున్న కొత్తపద్ధతి ఇదే! ఇక్కడ చదవండి

http://telugu.asianetnews.com/editorial/new-concept-of-obesity-says-our-style-of-food-consumption-is-dangerous