ప్రస్తుతం ఉన్నస్థితినుంచి మెరుగైన స్థితికి వెళ్ళాలనుకోవటం మానవ నైజం.మరి మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారేమిటి దీనికి రివర్సులో వెళుతున్నారు. నాడు 1995 నుంచి 2004 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా దాదాపు పదేళ్ళు పాలించిన బాబుగారు ఏపీకి తాను సీఈఓనని అప్పట్లో చెప్పుకున్న సంగతి తెలిసిందే(కార్పొరేట్ సంస్కృతిపట్ల ఆ మోహంలోనే రెచ్చిపోయి వ్యవసాయం దండగ అనటమే ఆయన కుర్చీకిందకు నీళ్ళు తేవటం వేరే విషయమనుకోండి). మరి పదేళ్ళతర్వాత గద్దెనెక్కిన ఆయనకు ఇప్పుడేమయిందోగానీ ఈవెంట్ మేనేజర్ స్థాయికి దిగిపోయారు.

 

బాబు గద్దెనెక్కిననాటినుంచి ఏపీలో ఈవెంట్లే ఈవెంట్లు. గోదావరి పుష్కరాలతో మొదలయ్యింది ఈ ఈవెంట్ల పండగ ఏపీలో. కాశీలో గంగానది తరహాలో హారతి కార్యక్రమం అన్నారు, దర్శకుడు బోయపాటిశ్రీనుతో ప్రత్యేక సెట్టింగులు వేయించారు, హంగూ ఆర్భాటాలకు లోటులేకుండా అట్టహాసంగా మొదలుపెట్టారు. ఆదిలోనే హంసపాదులా - పుష్కరాలఏర్పాట్లలో సమన్వయలోపంవల్ల 27 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయినా బాబుగారి ఉత్సవస్ఫూర్తిని అవి దెబ్బకొట్టలేకపోయాయనుకోండి.

 

తర్వాతి ఈవెంట్ అమరావతి శంకుస్థాపన. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అంతర్జాతీయస్థాయిలో ధారాళంగా ఖర్చుపెట్టి వందలకోట్లతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అతిథులకోసం ప్రత్యేకవిమానాలు,ప్రత్యేక హెలికాప్టర్లు పెట్టారు, లక్షమంది ప్రజలను తరలించటంకోసం పొలాలను చదును చేసి ప్రత్యేక రహదారులు నిర్మించారు, వారందరికీ ప్రత్యేక భోజనాల ఏర్పాట్లు చేశారు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

 

 ఈ ఏర్పాట్ల కాంట్రాక్టులన్నీ 'మన'వారికే ఇస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదుగా!(ఈ ఒక్క కార్యక్రమమేకాదు, టీడీపీ ప్రభుత్వం ఏ ఈవెంట్ నిర్వహించినా అది రివాజేననుకోండి). సరే ఇంతా చేస్తే ఆ స్థాయిలో ఆర్భాటం చేసినా మోదీగారు చెంబుడు నీళ్ళు, తట్టడు మట్టి మాత్రమే ఇచ్చి ఏపీ ప్రజల ఆశలపైన నీళ్ళు గుమ్మరించటం యాంటీ క్లైమాక్స్. అసలే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉండి,ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేవని ఒకపక్కన చెబుతూ ఇంత దుబారా అవసరమా అని ఈ ఈవెంట్ పై జనంనుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

 

ఇక గత ఏడాది జరిగిన కృష్ణా పుష్కరాలు బాబు ప్రభుత్వం నిర్వహించిన మరో మెగా ఈవెంట్. గోదావరి పుష్కరాల చేదుఅనుభవందృష్ట్యా వొళ్ళు దగ్గరపెట్టుకుని పనిచేయటంతో ఈ ఈవెంట్ సాఫీగానే సాగిపోయింది. అయితే యథావిధిగానే ఏర్పాట్లకోసం డబ్బులు విరజిమ్మారని విమర్శలు వ్యక్తమయ్యాయి.

 

మొన్న అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంట్ బాబు నిర్వహించిన నాలుగో మెగా ఈవెంట్. దీనినికూడా విజయవంతంగానే నిర్వహించారు. కాకపోతే మహిళా సాధికారతపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముందు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు - మహిళలు వంటింటికే పరిమితమయితే వారికి మంచిది అన్నట్లు మాట్లాడటంతో కొద్దిగా వివాదం చెలరేగింది. అయితే ప్రభుత్వ పెద్దలు తమ మీడియా సహకారంతో ఈ వివాదాన్ని పెద్దది కానీయకుండానే చొచ్చగొట్టారు. ఈ కార్యక్రమం లక్ష్యమేమిటో, ఆ లక్ష్యాన్ని ఏ మేరకు సాధించిందో నిర్వాహకులైనా తెలుసో, లేదో అనుమానమే. ఇక సామాన్యప్రజలకు ఏం తెలుస్తుంది.

 

ఈ నాలుగు పెద్ద ఈవెంట్లు కాకుండా విశాఖలో ఏటా జనవరిలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సులు, అనంతపురంలో గత ఫిబ్రవరిలో నిర్వహించిన లేపాక్షి ఉత్సవం, కాకినాడలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ వంటి ఉండనే ఉన్నాయి.బీచ్ ఫెస్టివల్ అంటే గుర్తొస్తోంది... విశాఖలో కూడా సింగపూర్, థాయ్ లాండ్ తరహాలో శృంగారపరమైన బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని బాబు సర్కారు యోచించినప్పటికీ, సంస్కృతిని విధ్వంసంచేస్తారా అని ఉవ్వెత్తున విమర్శలు రావటంతో తోకముడిచారు. ఏ అవకాశం దొరికినా దానికొక ఆకర్షణీయమైన పేరుపెట్టి ఈవెంట్ నిర్వహించటమే బాబు సర్కారు ప్రధాన ఎజెండా అయింది.ఇదేమిటంటే ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని చెబుతున్నారు.

 

బాబుగారూ! విభజన నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవజ్ఞులైన మీరైతే న్యాయంచేయగలరని భావించి ప్రజలు నమ్మి మీకు ఓటువేశారు. అయితే మీరు చేయాల్సిన పని ఏమిటి, మీరు చేస్తున్నదేమిటి.కుక్కపని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఒక మంచి రాజధానిని నిర్మించటంతోపాటు, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్ళమని అధికారం చేతిలోపెడితే మీరు చేస్తున్న ఈ గుత్తేదారు పనులు ఏమాత్రం సమంజసంగా లేవు. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి, ప్రతి ప్రత్యర్థిపార్టీ నాయకుడితో తిట్లు తినటంతో మీరు ఫోకస్ కోల్పోయినట్లున్నారు.

 

రాజధాని నిర్మాణానికంటూ కనీవినీ ఎరగని స్థాయిలో 33వేల ఎకరాలు సేకరించిన మీ ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న కృషి ఏమీలేదన్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. రాజధాని అక్కడే వస్తుందని మీలో మీరు ముందుగానే చెప్పుకుని బినామీలతో చుట్టుపక్కల భూములన్నింటినీ కొనుక్కుని లాభపడ్డారని అనుమానాలున్నాయి. 4-5వేల ఎకరాలతో సరిపోయేదానికి,  33 వేల ఎకరాలు ఎందుకో ఎవరికీ అర్థంకావడం లేదు.  ఇప్పుడు వాస్తవంలోకి వస్తే అసలు రాజధాని నిర్మాణానికి మొదలెటో, చివరెటో ఆ పరమాత్మకే ఎరుక!.