ఇంతకీ! నంద్యాల ఉపఎన్నికల్లో మోడీ ఘోరంగా ఓడినట్లేనా!
ప్రధాని నరేంద్రమోడీకి, నంద్యాల ఉపఎన్నికలకు 'లింక్' ఏమిటి? అన్నదేగా మీ సందేహం. పైపెచ్చు, ఎన్.డి.ఎ.లో భాగస్వామి పార్టీ అయిన టిడిపి అభ్యర్థి విజయం పట్ల ఆనందంతో మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు కదా!
రు.200 కోట్లు వెదజల్లి అధికార పార్టీ విజయం సాధించిందని, ఓటమి పాలైన ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికి పోయిన వై.యస్.ఆర్.సి.పి. తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని టిడిపి నాయకులు ప్రత్యారోపణలు చేశారు. ఎన్నికల్లో ప్రజల చేత మరొకసారి ఛీత్కారానికి గురైన కాంగ్రెస్ నాయకులేమో, రెండు ప్రధాన పార్టీలు ఓటర్లకు డబ్బు పంచారని, కాకపోతే టిడిపి, వై.యస్.ఆర్.సి.పి. కంటే రెండు రెట్లు అధికంగా ఓటర్లకు ముట్ట చెప్పిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యాతావాతా అందరి నోటా వినిపిస్తున్న మాట, 'నంద్యాల ఉప ఎన్నికల్లో డబ్బు విచ్చల విడిగా ఖర్చు చేయబడింది' అన్నదే.
ఇది నల్లధనమే కదా! అవినీతిని, నల్లధనాన్ని రూపుమాపే మహత్తర లక్ష్యంతో పెద్ద నోట్లను మోడీ గారు ఒక్క కలం పోటుతో రద్దు చేశారు. దేశంలో ఇప్పుడు నల్లధనమే చెలామణిలో లేకుండా చేశామన్న దోరణిలో డిల్లీ పెద్దలు మాట్లాడుతున్నారు కదా! మరి, నంద్యాల ఉపఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీలు, అభ్యర్థులు వెచ్చించిన డబ్బు ఇంతకీ 'వైట్ మనీ' నా! లేదా! 'బ్లాక్ మనీ' నా! బ్లాక్ మనీ అయితే, నంద్యాల నడి వీధుల్లో మోడీ ఘోరంగా ఓడి పోయినట్లే కదా! అన్నదే, నా ధర్మ సందేహం.