బందులు బాబోయ్ బందులు.
ఒక చేపలమ్మే ఒకామె నగరానికొచ్చి చేపలన్నీ అమ్మింది.కాకపోతే బుట్ట ఖాళీ అయ్యేసరికి చీకటి పడింది.
అసలే ఇప్పట్లా రహదారులు లేని రోజులు.ఊరు చేరాలంటే ఒక చిన్న అడవి మార్గంలో ప్రయాణించాలి.పురుగో పుట్రో భయం మరి.సరే జనాలు ఇప్పటంత అనుమానం పిశాచాలు కాదు కాబట్టి ఒక ఇల్లు చేరింది,రాత్రికి విశ్రమిస్తానంది.ఆ ఇంటివారు చాప,దిండు,దుప్పటి ఇచ్చారు.ఆ ఇంటిగలవారేమో పూల వ్యాపారులు.ఈవిడ పడుకున్న గదిలో మరుసటిరోజు సంతకు తీసుకుపోవాల్సిన పూల గుట్టలున్నాయి.
ఇక ఈ పల్లెటూరావిడకు ఎంత సేపు దొర్లినా నిద్ర పట్టలేదు.చివరికి కారణం తెలుసుకుంది.తన చేపల బుట్ట తలదగ్గర పెట్టుకుంది.అలవాటైన వాసన. వెంటనే నిద్రపట్టింది. తన ఇంటి పరిసరాల్లా అనుభూతి చెందటమే దీనికి కారణం.
శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన కథల్లో ఇదీ ఉంది.
అసలు మీరెప్పుడన్నా చూడండి....జూన్ రెండవ వారం లో విద్యా సంస్థలు తెరుస్తారు....అంతే మొదటివారంలోనే విద్యార్థి నాయకులు గుర్తింపులేని విద్యాలయాలు,అధిక ఫీజులకు అంటూ బంద్ పిలుపునిస్తారు.ఇక ఆ తర్వాత కొన్ని నెలలల్కు ట్రేడ్ యూనియన్ల బందులొకసారి,పన్నుల విధానాలకు వ్యతిరేకంగా మరోసారి,ఎక్కడో జరిగిన అన్యాయాలు,అత్యాచారాలకు వ్యతిరేకంగా అంటూ మరోసారి బంద్ జరగాల్సిందే!వీటిలో కొన్ని రాష్ట్ర బందులైతే మరికొన్ని భారత్ బంద్.
అసలు ఈ బందుల గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదు గానీ 1990 వ దశకం సంగతి చెప్పుకోవాలి.ఒకవైపు మండల్ కమీషన్ బందులు,మరోవైపు కమండల్(అదేనండీ రామజన్మభూమి)బందులు,ఇక హైదరాబాద్ నగరంలో మతకలహాల పేర జరిగే హింసాకాండకు కర్ఫ్యూలు.
అంతేనా?మతసామరస్యం వెల్లివిరిసే రాయలసీమ ప్రాంతంలోనూ బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత రోజుల తరబడి కర్ఫ్యూ పెట్టేసారు.
ఆ తర్వాత డంకెల్ ప్రతిపాదనలు,GATT,world trade organisation కు వ్యతిరేకంగా కొన్ని బందులు,స్వదేశీ జాగారణ్ అంటూ మరికొన్ని బందులు....
ప్రజల నిరసనలు తెలియజేయడానికి కొన్ని యూరోపియన్ దేశాల్లో అక్కడుండే స్క్వేర్ల దగ్గర జనం గుమిగూడుతారట,ఇక జపాన్ లాంటి దేశాల్లో ఎక్కువ సమయం పని చేసి ఉత్పత్తి పెంచుతారట...మనకు మాత్రం ఏ నీతి కథలు చెప్పే పార్టీ ఉన్నా జరిగేది ఒకటే తంతు..ఉదయాన్నే పార్టీ నాయకులు,కార్యకర్తలు బస్ డిపోల ఎదురుగా కూర్చోవడం,ఆ తర్వాత వాహనాల్లో ఊరంతా తిరుగుతుండడం...
సామాన్య ప్రజలు...ఎవరికోసం బంద్ చేస్తున్నామని పిలుపునిచ్చారో,వారు మాత్రం ఆ ఛాయల్లో కనిపించరు.నానా అగచాట్లు పడేది మాత్రం వీళ్లే.ఇక ఈ బందువీరుల ప్రతాపం చిరు,చిన్న వ్యాపారుల మీదే కానీ పెద్ద పరిశ్రమల జోలికి మాత్రం పోరు.
ఈ బంద్ చేసే పార్టీలందరూ కలసి బంద్ బదులు..ఇదుగో మీ గురించే మేము ఈ పని చేస్తున్నాం..మీరంతా సహకరించి అర్ధరాత్రి వరకు మీ దుకాణాలు తెరిచి నిరసన తెలియజేయండి అనగలరా???
ఆ రోజు రావటం అత్యాశేనేమో!
ఒక పార్టీ వాళ్లు బందుకు పిలుపివ్వగానే ఇవతలి పార్టీ వారు పునీతులైపోయి...బందులవల్ల నష్టాలు,పనిగంటల వ్యర్ధం,ఆర్ధిక నష్టాలు,సామాన్యుల అగచాట్లు అంటూ లెక్చర్లు మొదలు పెడుతారు...తమవంతొచ్చినప్పుడు మాత్రం ప్రజా సమస్యల కోసం అనే పల్లవి ఎత్తుకుంటారు.
మొత్తానికి ఈ బందుల పుట్టుపూర్వోత్తరాలేమో కానీ జీవితంలో ఒక భాగమయ్యాయి.....నాయనలారా మీరు ఈ బందులను వ్యతిరేకించకండి...అవే లేకుంటే ఆ చేపలమ్మే ఆవిడకు నిద్ర పట్టనట్టు..మాలాంటోళ్లకూ ఇది మన దేశం కాదేమో అన్న భావన వచ్చేస్తుంది.