సోషల్ మీడియా ... నిన్నెపుడూ వెంటాడుతూనే ఉంటుంది
వెంపల చెట్లకి నిచ్చెనలు వేసే వాళ్ళు పుట్టుకు వస్తారు అని బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్మక తప్పడం లేదు. బహుసా బ్రహ్మం గారు చిన్న మనసులు ఉన్న వాళ్ళు పుట్టుకొస్తారు అని అర్ధం లో చెప్పారేమో.
బోధిసత్వుడు పరిపాలించే కాలం లో ఈనాడు లో "పెద్దల సభలో కిష్కింధ కాండ" అని ఒక న్యూస్ వచ్చింది. అప్పుడు ఉన్న శాసన మండలి లో పెద్దలు హక్కుల తీర్మానం ఇచ్చారు, మా పరువు తీసారు అని. వెంటనే శాసన మండలి చైర్మెన్ గారు రామోజీ రావు ని అరెస్ట్ చేసి సభకి తీసుకు రమ్మని నగర పోలీసు కమీషనరు కు ఉత్తర్వు వేసారు. చివరికి రామోజీ గారు సుప్రీం కోర్ట్ కి వెళ్లి ఆ ఉత్తర్వు లు ఆపించుకున్నారు.
రాయడం తప్ప, ఒప్పా అనేది పక్కన పెడితే, ఒక సామాన్య మానవుడు తన కలం ప్రయోగిస్తే కూలి పోయే అంత బలహీనంగా ఉన్నదా మీ వ్యవస్థ.
కాల చక్రం గిర్రున తిరిగింది. 1983 కి ఇప్పటికి నాయకులు మారారు, అప్పుడు కొందరు అయినా ప్రజాస్వామ్య వాదులు ఉండే వాళ్ళు, ఇప్పుడు అందరూ ఫ్యూడల్ రాజులే. మాకు ఎదురు చెప్పకూడదు అనే విపరీతమయిన అసహనం, ప్రభుత్వ పోలీసు యంత్రాంగాన్ని ప్రజల కోసం ఉపయోగించాల్సింది పోనించి , ప్రజల మీద ఉపయోగిస్తున్నారు.
ఇంటూరి రవి కిరణ్ అనే ఒక సాధారణ నామాన్య మానవుడు శాసన మండలి మీద పెద్దలకి మాత్రమె అని రాసాడు అట. రాయడం తప్ప, ఒప్పా అనేది పక్కన పెడితే, ఒక సామాన్య మానవుడు తన కలం ప్రయోగిస్తే కూలి పోయే అంత బలహీనంగా ఉన్నదా మీ వ్యవస్థ.
పెద్దలకి మాత్రమె అన్నంత మాత్రాన, అర్ధ రాత్రి పోలీసు పవర్స్ ఉపయోగించి సామాన్యుడిని అరెస్ట్ చేయిస్తారా? కోర్ట్ లో ఏమని వాదిస్తారు. మా బిల్డింగ్ ని తిట్టాడు, మా మనోభావాలు గాయపడ్డాయి అనా? ప్రజలు ఎన్నుకుంటే, ప్రజల సొమ్ముతో నడిచే వ్యవస్థలు ప్రజల మీద సు మోటో కేసులు పెట్టడం ప్రపంచం లో ఎక్కడయినా, ఏ ప్రజాస్వామ్యం లో అయినా జరుగుతుందా?
పోనీ అరెస్ట్ చేసారు, సరే, మరి ఎందుకు వదిలేసినట్టు? మీరు చేసింది మంచి పని అని మీకు నమ్మకం ఉంటే, కేసు పెట్టి కోర్ట్ కచ్చేరి లో వ్యాజ్యం నడిపించాల్సింది. ఇప్పుడు ఏమి అయ్యింది, మీ బలహీనత మీరే బయట పెట్టుకున్నారు.
ఇందిరా గాంధి, నెహ్రూ, రాజీవ్ గాంధి, మోడీ, ఎన్టిఆర్, వైఎస్ కంటే మీరు పవర్ఫుల్ నాయకులు కాదు. వాళ్ళే సెటైర్ ని పట్టించుకునే వాళ్ళు కాదు. నవ్వుకోవడం ఒక భోగం, మనకి రాకపోవడం ఒక రోగం.
నెహ్రో స్వయం గా తన మీద సెటైర్ రాసిన వాళ్లకి ఫోన్ చేసి అభినందన లు చెప్పే వాడు.
చూడండి అబ్బాయిలూ. ప్రజలు అన్నాక అనేక రాళ్ళు వేస్తారు. మనం మొయ్యాలి. అంతే కాని ప్రజల మీద పోలీసు పవర్స్ ఉపయోగించడానికి మీరు నాజీలు కాదు ( అలా కావాలి అని మీకు ఎంత మనసులో ఉన్నా కూడా), ప్రజాస్వామ్య వ్యవస్థ అలాంటివి ఒప్పుకోదు.
ఇంతా చేసి చివరికి ఏమి అయ్యింది, ప్రభుత్వానికి అవమానం, యంత్రాంగానికి అవమానం, ఇప్పుడు వందల వందల రవి కిరణ్ లు పుట్టుకు వస్తారు. ఇంకా ఎక్కువ రాళ్ళు వేస్తారు. చూసి చూడనట్టు పోతే ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు.
చరిత్ర పుటల్లో రామోజీ రావు పక్కన ఇంటూరి రవి కిరణ్ పేరు సువర్ణాక్షరాలతో మీరే చెక్కారు. ఆయనకది అవమానమో, గౌరవమో వారే చెప్పాలి. ఎందుకైనా మంచిది అడిగి చూడండి.
చూడప్పా సిద్ధప్పా............. నేనొక చిన్న మాట చెబుతా, రాసి ఎక్కడన్నా పెట్టుకో లేదో పోస్ట్ చేసుకో.. మళ్లీ
మళ్ళీ చదువుకోవడానికి
రాణి ఈగ మన దగ్గర ఉన్నప్పుడే , తేనే తుట్టె మీద రాయి వెయ్యాలి, లేకుంటే తేనెటీగ లు అన్నీ వచ్చి కండ కండ పీకుతాయి