రాయలసీమ జిల్లాల త్రాగు, సాగు నీటి అవసరాలకు గుండ్రేవుల కీలక అవసరం. రాయలసీమలోని నాలుగు జిల్లాల ప్రజలకు సాగు, త్రాగు నీటి అవసరాలకు గుండ్రేవుల నిర్మాణం మంచి పరిష్కారం. 2013 వ సంవత్సరంలోనే సర్వే పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2014 న చంద్రబాబు అంగీకారం తెలిపి నేటికి 4 సంవత్సరాలు కావస్తున్నా అడుగు ముందుకు పడటం లేదు. పలితంగా ఎపుడో ఆంగ్లేయుల నిర్మించిన  KC కెనాలే దిక్కయింది. రైతులకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. 60 సంవత్సరాల ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో, 4 సంవత్సరాల నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఒక లక్ష ఎకరాలకు నీరు అందించే ప్రాజక్టు ఒక్కటి నిర్మించలేకపోయారు.  సీమ కరువును చూచి చలించి ఆంగ్లేయులు నిర్మించిన KC కెనాల్ కు సైతం నీరు ఇవ్వని రాజకీయం నేటి పాలకులది.

గుండ్రేవులతో KC స్దిరీకరణ

పురాతనమైన KC కెనాల్ ను ఆంగ్లేయులు నిర్మించినారు. తుంగభద్ర నదిపై ఆదారపడిన ప్రాజెక్టు KC కెనాల్. తుంగభద్ర డ్యాం నుంచి 10 TMC లు, నదీ ప్రవాహం ద్వారా 29.9 TMC మొత్తంగా 39.9 TMC ల నికర జలాలు కలిగిన ప్రాజెక్టు KC కెనాల్. కర్నూలు, కడప జిల్లాలోని దాదాపు 10 నియోజిక వర్గాల త్రాగు, సాగు నీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టు కావడం వలన దీనికి ప్రాదాన్యత లభించినది. అయితే ఆచరణలో తుంగభద్రలో పూడిక వలన దాదాపు 5 TMC లు మాత్రమే వాడుకునే పరిస్దితి ఉంది. మరో వైపు నదీ ప్రవాహం ద్వారా 29.9 TMC లను వాడుకునే హక్కు ఉన్నప్పటికి 5 TMC లు మాత్రమే వాడుకునే దుస్దితి. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం క్రమం తప్పకుండా ఉంది. అంతే కాకుండా వేదవతి లాంటి ఉపనది క్యాచ్ మెంట్ ఏరియా కూడా పూర్తిగా కర్నూలులో నే ఉంది. అలా సరాసరి ప్రతి ఏటా 150 TMC నీరు తుంగబద్ర ద్వారా సీమకు అందుబాటులో ఉంది. సమస్య అంతా దానికి తగిన నీటి నిల్వ ప్రాజెక్టులు లేకపోవడమే. KC కి అవసరం అయ్యే నీటిలో 29.9 TMC లు నదీప్రవాహం ద్వారా వాడుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్టు సుంకేసుల. దాని సామర్థ్యం కేవలం 1.2 TMC లు మాత్రమే. నదిలో నీటి ప్రవాహం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ప్రవాహం ఉన్నపుడు నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టు ఉంటే తర్వాత వాటిని KC కెనాల్ ద్వారా నీటిని కడప, కర్నూలు జిల్లాలోని 10 నియోజిక వర్గాల ప్రజలకు అందించవచ్చు.

 

కీలక నిర్మాణం పై వివక్ష దుర్మార్గం

నికర జలాలు ఉన్నా వెనుక బడిన జిల్లాల అవసరం తీర్చే KC కెనాల్ స్థిరీకరణకు ఉపయోగపడే గుండ్రేవుల నిర్మాణం పై ప్రభుత్వ వైఖరి దుర్మార్గం. బాధ్యతగల పాలకులు తొలి ప్రాధాన్యత వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాలి. కాని అందుకు భిన్నంగా ఏపి ముఖ్యమంత్రి బాబుగారు ఆ భాద్యతను విస్మరిస్తున్నారు. 2014 లోనే ప్రాజెక్టుకు మాట ఇచ్చినా నేటికి తొలి అడుగు వేయడం లేదు. ఇదే ముఖ్యమంత్రి క్రిష్ణా డెల్టా అవసరాల కోసం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం పూర్తి అయ్యేలోపు వేల కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ నిర్మించినారు. గోదావరి అవసరాల కోసం వేల కోట్లు ఖర్చు చేసి పురుషోత్తపట్నం పూర్తి చేయడానికి పూనుకున్నారు. అంతే కాదు ప్రధాని కృషి సించాన యోజన క్రింద 6 ప్రాజెక్టులు ఏపికి వస్తే అందులో ఒక్క ప్రాజెక్టును కూడా రాయలసీమకు కేటాయించ కుండా సర్కారు జిల్లాలకే కేటాయించినారు.

ఆటంకాలపై అర్థం లేని వాదనలు

ప్రభుత్వం తాను చేయాల్సిన బాద్యతను విస్మరించడమే కాకుండా అవరోధాలపై అనవసరమైన వాదానలను తెస్తుంది. నిధులకున్న పరిమితులు, తెలంగాణ కున్న అభ్యంతరాలను ముందుకు తెస్తుంది. మొదటి ఏపీ ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించాలి. తెలంగాణలో ముంపుకు గురి అయ్యే 9 గ్రామాలకు సంబంధించి ఆ రాష్ట్రప్రభుత్వంతో చర్చలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్దగా అభ్యంతరం చెప్పక పోవచ్చు కారణం ముంపుకు అవకాశం ఉన్న గ్రామాలు నదిలో వరదలు వచ్చినపుడు నిరంతరం ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. అందుకు పరిష్కారం ఆ గ్రామాల ప్రజలకు 2013 పునరావాస చట్టాన్ని అనుసరించి న్యాయం చేయగలిగితే పరిష్కారానికి పెద్ద అవరోధ ఉండకపోవచ్చు. నిధులకు సంబందించి 1.20 లక్షల కోట్లు అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం జవాబు చెప్పాలి. పట్టిసీమ, పురుషోత్తపట్నం పూర్తి చేయడానికి నిధులు  ఎలా వచ్చినాయి. కేంద్ర చేయాల్సిన రాజధాని, పోలవరంలను రాష్ట్రం నిధులతో  చేయడానికి ఎందుకు ముందు వచ్చింది.

క్రిష్ణా, గోదావరి పుష్కరాల కోసం వేల కోట్ల నిధులు ఖర్చు చేయడాని సిద్ధపడిన ప్రభుత్వం రెండు వెనుకబడిన రాయలసీమ జిల్లాల కోసం నిధులు ఖర్చు చేయడానికి మనసు రాకపోవడం సీమ పట్ల వివక్ష కాకపోతే మరే మౌతుంది.

 అనంత, చిత్తూరు జిల్లాలకు సైతం ప్రయోజనం

గుండ్రేవుల ద్వారా ప్రత్యక్షంగా కర్నూలు, కడపకు ప్రయోజనం ఉంటే పరోక్షంగా అనంత, చిత్తూరు జిల్లాలకు ప్రయోజనం ఉంటుంది. తుంగబద్ర లోనే HLC, LLC లకు నీటి హక్కు ఉంది. కాలవ పూడిక వలన HLC 32.5 TMC ల ద్వారా కేవలం 17,18 TMC లు వాడుకుంటున్నాము. అదే LLC లో అయితే 29.5 TMC లకు గాను కేవలం 11 TMC లు మాత్రమే వాడుకుంటున్నాము. HLC, LLC లకు సమాంతర కాలవ చేపట్టినా నీటి నిల్వ ప్రాజెక్టులు తగినంతగా లేకపోతే మల్లీ KC కెనాల్ పరిస్దితి వీటికి వస్తుంది. గుండ్రేవుల ద్వారా గ్రావిటీతోనే HLC, LLC లు హక్కుగా ఉండి కోల్పోతున్న దాదాపు 23 TMC లను వాడుకోవచ్చు. అలా KC కోల్పోతున్న 29 TMC లు, HLC, LLC లు కోల్పోతున్న 23 TMC లు మొత్తంగా 52 TMC లను వాడుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. అలా సీమలోని కర్నూలు, కడప, అనంత జిల్లాలకు న్యాయం జరుగుతుంది.

హంద్రీ-నీవ, గాలేరు-నగరికి వత్తిడి తగ్గుతుంది

రాయలసీమలోని మరో వెనుక బడిన జిల్లా చిత్తూరు జిల్లా. అంతే కాదు హంద్రీ నీవా, గాలేరు నగరికి చివరి జిల్లా కూడా చిత్తూరు జిల్లానే. ఫలితంగా పై రెండు ప్రాజెక్టులకు ప్రారంభంలో ఉన్న అనంత, కర్నూలు, కడప అవసరాలు తీరకుండా చిత్తూరుకు నీరు రావడం అసాద్యం. అంతే కాదు హంద్రీ నీవా కాలవ పూర్ది అయినా శ్రీశైలంలో బ్యాక్ వాటర్ కు ఉన్న పరిమితుల వలన, ముచ్చిమర్రి తో పరిమిత అవకాశాలు ఉన్న కారణంగా హంద్రీ నీవాకు ప్రకటించిన 40 TMC లు ( అధికారికంగా కాదు) తీసుకోవడం కష్టం. వచ్చే నీరు కూడా కాలవ త్రాగడానికి 10 TMC దాకా ఖర్చు అవుతుందని నిపునులు చెపుతున్నారు. ఇన్ని పరిమితుల మద్య చిత్తూరు జిల్లాకు నీరు రావడం అంత సులబం కాదు. గుండ్రేవుల నిర్మాణం ద్వారా KC , HLC, LLC లకు నీటిని ఇవ్వడం ద్వారా అనంత, కర్నూలు, కడప జిల్లాలకు కొంత మేరకు న్యాయం చేయవచ్చు. పలితంగా హంద్రీ నీవా, గాలేరు నగరి కాలవ పై వత్తిడి తగ్గి ఆ మేరకు నీటిని చివరి జిల్లా అయిన చిత్తూరు జిల్లాకు ఇవ్వవచ్చు. ఇంతటి ప్రాదాన్యత కలిగిన గుండ్రేవులను తాను మాట ఇచ్చిన ప్రకారం చంద్రబాబు గారు పూర్తి చేయాలి. ప్రభుత్వ బాద్యతను గుర్తు చేస్తూ పోరాటం చేస్తున్న కర్నూలు జిల్లా ప్రజలకు రాజకీయ పార్టీలు , ప్రజలు మద్దుతుగా నిలవాలి.

 * ఫోటో : జనవరి 28న గుండ్రేవుల రిజర్వాయర్ కోసం కర్నూలు జిల్లాలో రైతులు జరిపిన పాదయాత్ర 

(*రచయిత మాకిరెడ్డి పేరున్న రాజకీయవిశ్లేషకుడు. ఫోన్ నెం.9490493436)