నంద్యాల ఎన్నికల్లో అసలేం జరిగింది ? పోస్టుమార్టమ్-2
ఉప ఎన్నికలు సమీపించేనాటికి నంద్యాల అగ్రశ్రేణి నాయకులందరూ తెదెఫాలో ఉన్నారు..భూమా కుటుంబీకులు,శిల్పా సోదరులు, ఎస్ పి వై రెడ్డి,ఫరూక్..ఇక వైయస్సార్ పార్టీ తరపున ఎస్ పి వై రెడ్డి మేనల్లుడు రాజగోపాల్ రెడ్డి గడపగడపకు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు .ఇదుగో అదుగో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని గుసగుసలు.తెదేపా నాయకులందరూ ఎవరికివారు సీట్ మాదే అనుకున్నా...సెంటిమెంటుకు విలువిచ్చిన బాబు భూమా కుటుంబీకులకు సీట్ ఇచ్చాడు...జగన్ వైపు ఊగిసలాడిన శిల్పా మోహన్‌రెడ్డి ఆ తర్వాత బాబుతో రెండుసార్లు భేటీ అయ్యాక సీట్ రాదని తెలిసి జగన్ పార్టీలోకి చేరాడు..
ఇక నోటిఫికేషన్ రాకముందే బాబు ఇక్కడ సుమారు కోటి ఖర్చుతో ఇఫ్తార్ విందు ఇచ్చాడు..నగర సుందరీకరణ అంటూ ప్రభుత్వ స్థలాల గోడలకు పెయింటింగ్స్ వేసారు..ఆ తర్వాత లోకేష్ గ్రామీణప్రాంతాలకు వచ్చి రోడ్ పనులను ప్రారంభించాడు...
ఇక సీట్ ధీమాతో శిల్పా కొందరు ఆంతరంగికులతో కలిసి ఊరిలోనివారిని కలవడం మొదలు పెట్టాడు..ఈలోగా బాబు మంత్రి ఆదినారాయణరెడ్డిని రంగంలోకి దించాడు..ఆ తర్వాత నలుగురు మంత్రులు,18మంది ఎమ్మెల్యేల మకాం ఇక్కడే...
ప్రలోభాల పర్వం...
మా ఇంటికి శిల్పాతో వచ్చిన ఒక చోట నాయకుడిని 15 లక్షలకు కొనేసారు...మా సోదరుని ఇంటికి వచ్చిన నాయకుడిని 50 లక్షలకు...ఇలా ఒక్కొక్కరికీ గాలం వెయ్యటం మొదలైంది..కేశవరెడ్డి బాధిత సోదరులకు వడ్డీతో కలిపి 85 లక్షలు,మరో పెద్దబాధితునికి తర్వాత సెటిల్ చేస్తామంటూ నామినేషన్ మీద 70 లక్షల పనులు(కిలోమీటర్ రోడ్ ఇరువైపులా గజం వెడల్పు,లోతు మట్టి తీయడం)...ఇక మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్లు,సర్పంచులు..ఓడినవారినీ..స్థాయిని బట్టి 40-50 లక్షలకు కొన్నారు. ఇవేకాకుండా వారి వ్యాపార లావాదేవిలకు సంబంధించిన అనుమతులు,ప్రభుత్వ వివాదాలు చిటికెలో పరిష్కరించారు...ఇక ప్రచార పర్వం మొదలయ్యాక రోజు కూలీ మీద వందలాది స్త్రీపురుషులను ప్రచారానికి కూలి ఇచ్చి తిప్పుకోవడం... సభలకు రావడానికి కూలీ, ప్రత్యర్ధుల సభకు పోకుండా ఉండటానికీ కూలీ....
2014 ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థులే అంతకుముందు జరిగిన మునిసిపల్,పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్థులకు 10-15 లక్షల ఆర్ధిక సాయం చేసారు..అయితేనేం?ఇప్పుడు తమను గెలిపించిన నాయకుడితో కలిసుండటానికి ఒక రేటు..పక్క పార్టీ లో గెంతడానికి ఒక రేటు వసూలు చేసుకున్నారు..
కులాల కంపు...
ముందుగా బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం అంటూ మొదలైంది..ఇక వైశ్యుల కోసం రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్..ఈ ఎన్నికల పుణ్యమా అని KUDA అధ్యక్ష బాధ్యతలు కొత్తగా చేపట్టిన సోమిశెట్టి వెంకటేశ్వర్లు...ఇక ఇవే ఎన్నికలవల్ల రిటైర్‌మెంట్ జీవితం గడుపుతున్న ఫరూక్ ఎమ్మెల్సీ అయ్యాడు,మాజీ మునిసిపల్ చెయిర్మన్ నౌమాన్ ఉర్దూ అకాడమీ చెయిర్మెన్ అయ్యాడు...ఇక ప్రతిరోజు ఏదో ఒక మూల కులాల ఆత్మీయ సమావేశాలు...ముస్లింలకు ఈద్గా, బలిజలకు కళ్యాణ మండప నిర్మాణానికి 3 కోట్లు,యాదవులకు శ్రీకృష్ణాలయానికి స్థలం...ఇలా ఎన్ని కులాలు,ఉపకులాలు ఉన్నాయో అందరికీ వారిని బుజ్జగించడానికి రాష్ట్రస్థాయి నాయకులు దిగిపోయి కులసేవలో తరించారు...
అభివృద్ధి...
నంద్యాల ప్రత్యేకత ఒకటుంది.115 ఏళ్ల మునిసిపాలిటీ ఇది.అయితేనేం ఊరు పుట్టినప్పటి నుంచి ఒక్క మూరెడు రోడ్లు వెడల్పు కాని ఊరిది..నలువైపులా ఊరు విస్తరించటానికి అవకాశం తక్కువ..చెరువులు,వాగులు,కుందు నది ఉన్నందున..ఉన్న జాగాలోనే ఇరుక్కుని బతకాలి..ట్రాఫిక్ దుర్భరం...ఇంకేముందీ ముఖ్యమంత్రి 1977 లోనే విస్తరణకు గుర్తులు పెట్టిన రోడ్లను వదిలేసి 1990ల నుంచి విస్తరిస్తారని చెప్పే రోడ్ మీద పడ్డాడు..ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా,చర్చలు లేకుండా ప్రభుత్వ దాదాగిరి చూపించి భవంతులు కూల్చారు..రోడ్ విస్తరణ అవసరమే కానీ ఎంచుకున్న పద్దతి సరైంది కాదు...ఆ తర్వాత హెలికాప్టర్లో 3 చక్కర్లు కొట్టి నంద్యాల అభివృద్ధి చేస్తా అంటూ 1500 కోట్లు ఇవ్వబోతున్నా అని ప్రకటించాడు...ఈ కూల్చివేతలు జరిగిన రెండో రోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది....
ప్రచార హోరు...
రెండు పార్టీల తరపున ఎమ్మెల్యు లు, స్టార్ క్యాంపెయినర్లు దిగబడ్డారు..మాటల తూటాలు,ప్రచార హోరు..వీళ్లకు తోడు ఊరు,జనాల ముక్కూమొహం తెలియకున్నా దిగబడ్డ అభిమానులు..ఒక్కొక్కరి ఇంటికి వచ్చేవాళ్లు,పోయేవాళ్లు..ఏ లాడ్జులు,హోటల్లు,బజ్జీల బండ్లు,బేకరీల్లో సాయంత్రం తినాలనుకుంటే స్థానికులకు ఏమీ దొరకనంతగా నంద్యాల ఎన్నికల మేనేజర్లతో కిటకిటలాడిపోయింది.
ఇక చివర్లో బాబు 2 రోజులు పర్యటించాడు..జగన్ 12రోజుల రోడ్ షోలు నిర్వహించాడు...
ఎన్నికల ముందు వైసీపీ 1000 పంచారు..తెదేపా 2000 పంచారు.ఇది కాకుండా ముక్కుపుడకలు,చీరలు..ఇక మహిళలకు కుట్టు మిషన్లు,డ్వాక్రా సభ్యులకు మొత్తంగా 5000 చేరేట్లు చేసారు...ఇక 13 మంది సభ్యులున్న ఒక ఇంటికి లక్ష రూపాయలు తీసుకున్నవారు నాకు తెలుసు,మరోచోట 5 గురు సభ్యులు ఓటింగ్ కు రాకూడదని 70,000 ఇచ్చారు...నా చేతిలో 80 కుటుంబాలున్నాయన్న మా కుటుంబ సన్నిహితుడొకాయనకు 20 లక్షలు ముట్టాయి..చెప్పుకుంటూ పోతే నేనేదో అతిశయోక్తులు రాస్తున్నా అనుకుంటారు...
మొత్తానికి ఓటింగ్ జరిగింది..ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేసారు..మెజారిటీ గురించి లెక్కలు కట్టారు...
ఫలితాలు చూస్తే భారీ ఆధిక్యతతో తెదేపా గెలిచింది...కారణాలు విశ్లేషిస్తే...
***జరక్క జరక్క మన ఊరికంటూ ఇన్ని వేల కోట్ల నిధులిచ్చారు..ఈ అవకాశం మళ్లీ రావద్దా అనుకున్నారు కొందరు....
***కూల్చిన భవంతులు,రోడ్లు ఇలాగే వదిలేస్తారేమో అని భయపడ్డ జనాలు కొందరు..
***డబ్బు ప్రభావం బాగా పనిచేసింది..తీసుకున్న డబ్బుకు న్యాయం చెయ్యాలి కదా అన్న పాపభీతి కొందరిది...
***తల్లిదండ్రులు లేని పిల్లలు తిరుగుతున్నారనే జాలి కొందరిది..
***శిల్పా మీద గూడు కట్టుకున్న వ్యతిరేకత అన్నింటికన్నా పెద్దది...
***బాబు,జగన్ ల మధ్య ఊగిసలాడి చివరి నిమిషంలో పార్టీ మారడం జనానికి నచ్చలేదు.
***13 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధికి ఏం చేసాడని కొందరి భావన.
***బనగానపల్లె నుంచి వచ్చిన తమ ఉపకులం రెడ్లను తప్ప ఇతర రెడ్లను పట్టించుకోలేదన్న అసంతృప్తి కొందరిది.
***వీరి కొసరు బామ్మర్ధి మీద ఎన్నో ఆరోపణలు..ఫిల్లింగ్ సాండ్ లో కోట్లు వెనకేసుకున్నాడనే ఆరోపణలు.
***ఏవైనా పని కోసం శిల్పాను కలిస్తే వాళ్ల ముందు చేస్తా అని ఫోన్ చేస్తాడు తప్ప ఆ తర్వాత దాని గురించి పట్టించుకోడనే అపవాదు..
***వీరి కోటరీకి పౌడర్ బ్యాచ్ అని పేరు..వారి చేష్టల వల్ల అవమానాలపాలై మండిపడే జనాలు ఎందరో ఉన్నారు.
-ఇవే కాకుండా ఒక బార్ లో ఒక ముస్లిం,దళిత యువకుల మధ్య జరిగిన గొడవ చిలికిచిలి గాలివాన అయ్యింది..వీరు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోకున్నా పోలీసులే రెండు వర్గాల యువకుల మీద రౌడీ షీట్ తెరిచారు.ముస్లిం యువకులు దీని వెనకాల శిల్పా హస్తం ఉందని నమ్మారు.
ఇక శిల్పా తమ శిల్పా సహకార్ ద్వారా ఎం ఆర్ పి ధరల కంటే తక్కువకు నిత్యావసర వస్తువులు పేదలకు అందించడం కొన్ని వ్యాపార వర్గాల బాధకు కారణమైంది.
ఇక వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళల్లో ఆదరణ పొందుతున్నాడన్నది గమనించిన కొందరు అనవసరమైన పుకారు లేపారు..ముస్లిం మహిళలను కించపరచేలా మాట్లాడారని...
ఇక తన ప్రచారం చివరిరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రే ముగ్గురు మహిళల అనుమానాస్పద మరణాలపై విచారణ జరుపుతా అంటూ పెద్ద అభాండాన్ని వేసారు...
శిల్పా ఓటు బ్యాంక్ ఉంటుంది అనుకుంటే చివరికి ఈ పుకార్లే ఎక్కువ పనిచేసాయి..జగన్ ప్రచారంతో అవన్నీ మరుగున పడతాయనుకున్నా జనాలకు ఎందుకో శిల్పా మీద తీవ్ర వ్యతిరేకత ఉండన్నది స్పష్టమైంది.
చివరిగా మా శ్రీరాములు దగ్గరకు వస్తాను
"సార్,అప్పట్లో మన ఊర్లో అప్పట్లో 23,000 మెజారిటీతో గెలిచిన తెదేపా ఎమ్మెల్యే సంజీవరెడ్డి నాదెండ్ల వైపు పోయాడని జనం ఆయన ఇంటి మీదకు పోయింది గుర్తుందా?" అని అడిగాడు..
"ఉంది..అప్పుడు జనాల్లో నిజాయితీ ఉండేది కాబట్టి పోయారు..ఇప్పుడు అమ్ముడుపోయాక మనకా నైతికత ఎక్కడిది?సరేగానీ మొన్న ముఖ్యమంత్రి ముగ్గురు బాలికల అనుమానాస్పద మృతి అన్నాడు,నీకేమైనా గుర్తుందా?" అన్నాను...
"నాకు తెలిసి ముగ్గురి మృతి అంత అబద్దమే లేదు..అసలు ఎప్పుడూ చదవలేదు..ఆ విషయం చర్చించలేదు..గెలుపుకోసం అంత పెద్దాయన అట్లా అభాండాలెయ్యండం నచ్చలేదు..ఇక డబ్బులా?జనం ఏం చేస్తారులే సార్..వాళ్లే అన్నన్ని పార్టీలు మారుతుంటే మామూలోళ్లం మాకొచ్చిందా?" అన్నాడు..
"సరేగానీ అభివృద్ధి అన్నా జనాలు డబ్బు తీసుకోలేదా?"
"ఊరుకో సార్..భలే అడిగావు..ఎక్కడైనా బావా కానీ వంగతోట దగ్గర కాదని వినలేదా?పంచడానికి రాకముందే మాకెప్పుడు ఇవ్వబోతున్నారని పార్టీ కార్యాలయాలకు పోయి అడుకున్నారు"
------ఈ ఎన్నికలు,రాజకీయం అన్నదమ్ములు శ్రీరాములు,శేఖర్ లనేనా విడదీసింది? కాదు,కాదు, పదికోట్లదాకా ఖర్చు పెట్టుకుని సాధించుకున్న ఎమ్మెల్సీ సీటు వదులుకుని శిల్పా చక్రపాణి అన్నదగ్గరకు పోయేలా చేసింది.
ఎన్నికలకు 3 రోజుల ముందు గంగుల ప్రతాప్ రెడ్డి (వారి సోదరుడికి mlc పదవిచ్చినా) తెదేపాలో చేరాడు..రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అన్నొక పార్టీ,తమ్ముడొక పార్టీ...ఇదేం కొత్త కాకున్నా...
రాజకీయమా వర్ధిల్లు అనకుండా ఉండలేను.....
నంద్యాల ఎన్నికల పోస్ట్ మార్టమ్ -1 ఇక్కడ ఉంది