మన తెలుగు వాళ్లు ఉత్త వెధవాయిలోయ్

alternative politics need of the hour for telugu states

మన తెలుగు వాళ్లు ఉత్త వెధవాయిలోయ్,అని చాలా కిందట గిరీశం అనే పెద్ద మనిషన్నాడు.

 

అవునా? కాదా? 

 

ఖండిద్దామా? ఒప్పుకుందామా?! 

 

సరే. మన పార్టీ ఎమ్యెల్యే, ఎంపీలుగా ఉన్న జేసీ బ్రదర్స్ కి నోబెల్ శాంతి బహుమతి ప్రకటిద్దాం. సరేనా? 

 

హ్యాపీనా?! 

 

అంతర్జాతీయ శాంతికాముకుల పార్లమెంట్ నిర్వహించి జేసీలకూ, చింతమనేని ప్రభాకర్ కూ దుశ్శాలువాలు కప్పుదాం, సరేనా? 

 

సంతోషమా?! 

 

పరిటాల రవి స్ఫూర్తితో తెదేపాలో చేరిన జేసీ బ్రదర్స్ కి ఇపుడు తెలుగుదేశాధీశుడు అండగా నిలబడడం.... కేబినేట్ మొత్తం జగన్ చుట్టూ తిప్పి, తమది కాని నేరానికి బస్సు దుర్ఘటనలో హరీమన్న అల్పప్రాణాలను తూనాబొడ్డు అన్న చందంగా చూడడం... ఇదేమి పరిపాలనో, ఆయనేమి దార్శనికుడో... ఎవరికైనా అర్థం అవుతున్నదా? 

 

వ్యక్తుల చుట్టూ రాజకీయం తిప్పి వ్యవస్థలను విధ్వంసం చేయడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు ఆయన. ఏమైనా అంటే, అన్నిటినీ అమరావతి కలలతో అలరిస్తున్నారు. 

 

బస్సు ఆపరేటర్లు, కాలేజీ నిర్వాహకులు, పన్నులు ఎగ్గొట్టే వాళ్ళు, బ్యాంకులకు అప్పు పడిన వాళ్ళు... వీరే మన ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిన చోట... వీరే పాలనను ప్రభావితం చేస్తున్న చోట... ఇక ప్రజలకు దిక్కెవరు? 

 

మంచో చెడో... తెలంగాణ కంటే భిన్నంగా ఒక ప్రతిపక్షం అయితే ఏడ్చింది కదా ఆంధ్రలో. ఆ మాత్రం ప్రజలకు ఊరట కూడా భరించలేకుండా ఉన్నది పాలకవర్గం. నిండు కేబినేట్ లో బాధితుల ఊసు లేదు. ప్రతిపక్షాన్ని ఎలా తిప్పి కొట్టాలి అన్నదే చర్చ! 

 

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదం ఎటు పోయింది? ఈ రోజు పార్టీని, ప్రభుత్వాన్ని ఏ శక్తులు నడిపిస్తున్నాయి? గండరగండడు చంద్రబాబును ఆశక్తుడిని చేస్తున్న ఆ అదృశ్య శక్తులెవరు? 

 

ఇందిరాగాంధీ, రాంలాల్ సాధించలేని పనిని... అదే తెదేపాను మట్టిగరిపించడం... ఏ నవ యువ రక్తం చేయబోతున్నది? 

 

తెలంగాణలో పార్టీ పుట్టి ముంచినారు. అది అయిపోయిన కథ. ఇపుడు ఆంధ్రలో ఏం చేయబోతున్నరు? 

 

రెండు తెలుగు రాష్ట్రాలలో పాలక వర్గాలు  నానాటికీ ప్రజా వ్యతిరేకులుగా, కంటకులుగా మారుతున్నాయి. ఇది మంచిది కాదు. ఈ రచన చదివే వారు... ఏ ఏ వర్గాల వారైనా సరే... స్వీయ విమర్శ చేసుకోక తప్పదు. సమస్త వర్గాల ప్రాతినిధ్యంతో పరిపుష్టం కావాల్సిన ప్రజాస్వామ్యం... నేడు ఇద్దరు స్వీయప్రకటిత 'పాలనాదక్షుల' పదఘట్టనల కింద నలిగిపోతున్నది తెలుగు భూభాగం. 

 

ఇది ఎవరికీ మంచిది కాదు. 

 

ప్రపంచంలో నలుమూలలా నివసిస్తూ... మేలిమి బంగారు ప్రజాస్వామ్య ప్రభుత్వాలని చెప్పుకుంటున్న పాశ్చాత్య దేశాల పాలనను చూస్తున్న ఎన్నారైలు... ఆలోచించండి. 

 

మీరు మెచ్చే పార్టీలకు, నాయకులకు, ప్రభుత్వాలకు మీరేం సలహాలు యివ్వగలరో దృష్టి పెట్టండి. 

 

తెలంగాణ వరకు... ప్రత్యామ్నాయ రాజకీయాల చర్చ ఊపు అందుకుంటున్నది. కలిసి వచ్చేవారు రండి. ఆలస్యం కాకముందే.