Asianet News TeluguAsianet News Telugu

ఈ సినిమా నటుడి గురించి మీకు తెలుసా?

a tribute to tollywood star amarnath of yesteryears

పై ఫోటో 1954 సెప్టెంబర్ 22 న  నాటి మేటి వార పత్రిక ‘ఆంధ్రపత్రిక’ కవర్ పేజీ మీద అచ్చయింది.

ఈ నటుడి పేరు  అమర్ నాథ్.  తెలుగు చలనచిత్ర రంగంలో 1950వ దశకంలో ఒక వెలుగు వెలిగిన గొప్ప నటుడు. ఆయన గురించి పరిచయం.

జీవిత విశేషాలు

అమర్‌నాథ్ అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్. ఇతడు విశాఖపట్నానికి చెందినవారు. ఇతడు 1925లో జన్మించారు. ఇతడికి చిన్నతనం నుండే నటన, సంగీతాల పట్ల మక్కువ ఉండేది. వాటిలో విశేషమైన కృషి చేశాడు. సంగీతంలో బాగా కృషి చేసి లలితసంగీత కచేరీలు ఇచ్చేవారు. మధురమైన కంఠస్వరంతో శ్రోతలను రంజింప చేసేవాడు. నాటకాలలో ప్రధానపాత్రలలో నటించి పెద్దల మెప్పులను సంపాదించుకున్నారు. హాస్యరసంతో కూడిన గీతాలను రచించి స్వరపరిచి గ్రామ్‌ఫోన్ రికార్డులను ఇచ్చారు. 1950లలో ఎం.ఎస్.పట్నాయక్ పేరుతో ఇచ్చిన రికార్డులకు మంచి గిరాకీ ఉండేది. ఇతడు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివాడు. చదువు తరువాత విశాఖపట్నం లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గుమాస్తాగా పనిచేశారు.

సినిమా రంగం 

భారత ఆహార సంస్థలో పనిచేస్తూ ఇతడు సినిమా అవకాశాలకోసం ప్రయత్నించారు. జి.కె.మంగరాజు, ఎం.ఎస్.నాయక్ ఇతనికి సహకరించి కొందరు నిర్మాతలకు సిఫారసు చేశారు. ఫలితంగా ఇతడికి 1953లో అమ్మలక్కలు, నా చెల్లెలు చిత్రాలలో నటించడానికి అవకాశం లభించింది. ఈ చిత్రాలు నిర్మాణదశలో ఉన్నప్పుడే ఇతడి నటనాశక్తిని గమనించి నిర్మాతలు ఇతడిని తమ చిత్రాలలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన అమర సందేశం చిత్రంలో ఇతడికి నాయకపాత్ర లభించింది. ఇతడు మగవారి మాయలు అనే సినిమాను నిర్మించారు. అది ఆర్థికంగా పరాజయం పాలయింది. తరువాత ఇతనికి సినిమా అవకాశాలు సన్నగిల్లి తెరమరుగు అయ్యాడు. 1973లో అమరచంద్ర మూవీస్ అనే సంస్థను స్థాపించి బాలయోగి అనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో ఇతడు, విజయనిర్మల నాయకానాయికలు. అయితే ఆర్థిక ఇబ్బందులవల్ల ఈ సినిమా నిర్మాణం పూర్తి కాలేదు. ఇతని సంతానం రాజేష్, శ్రీలక్ష్మి చిత్రసీమలో నటీనటులుగా రాణిస్తున్నారు.

ఆయన నటించిన సినిమాల జాబితా

అమ్మలక్కలు (1953)
చండీరాణి (1953)
పిచ్చి పుల్లయ్య (1953)
అమర సందేశం (1954)
చక్రపాణి (1954)
ఆడబిడ్డ (1955)
సంతానం (1955)
చెరపకురా చెడేవు (1955)
వదినగారి గాజులు (1955)
కనకతార (1956)
చింతామణి (1956)
పెంకి పెళ్లాం (1956)
అక్కచెల్లెళ్లు (1957)
వరుడు కావాలి (1957)
సతీ అనసూయ (1957)
సతీ సుకన్య (1959)
మగవారి మాయలు (1960)

అమర్ నాథ్ 1980, ఫిబ్రవరి 22వ తేదీన స్వర్గస్థుడయ్యారు.