శాస్త్రీయ సంగీతాన్ని మాస్ కు చేర్చిన మాంత్రికుడు
ఆధునిక వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఈరోజు పరమపదించారు.వారి శాస్త్రీయ సంగీతాన్ని పండితులు ఆస్వాదించి ఉండొచ్చు కానీ పామరులు,సామాన్యులు కూడా వారు ఆలపించిన తత్త్వాలను అమితంగా ఇష్టపడ్డారు.ముఖ్యంగా "ఏమి సేతురా లింగా ఏమి సేతురా" తెలియని తెలుగువారు ఉండరనటం అతిశయోక్తి కాదు.ఇక ఇదుగో భద్రాద్రి గౌతమి,తారకమంత్రము కోరిన దొరికెను,పలుకే బంగారమాయెనా అంటూ ఆలపించి తెలుగువారికి భక్త రామదాసు ను సాక్షాత్కరింపజేసారు.
ఇంతేకాక సినిమాల్లోనూ ఎన్నో జనరంజకమైన పాటలను పాడి సామాన్యులకూ చేరువయ్యారు.
వారు పాడిన కొన్ని సినిమా పాటలు...
**తనకంటే వయసులో పెద్దయినా తన శిష్యురాలైన నటి,గాయనీమణి యస్.వరలక్ష్మి నిర్మించిన సతీ సావిత్రి లో శిష్యురాలితో కలిసి "ఎందుకో ఈ అనందం,ఏనాటిదో ఈ అనుబంధం" అనే యుగళగీతం ఆలపించారు.
**ఇక AVM వారు నిర్మించిన భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడిగా నటించి మెప్పించారు..సినిమాల్లో నారదుడి పాట అనగానే "ఆది అనాదియు నీవే దేవా అంతట నీవే ఉండెదవు" పాట గుర్తురాక మానదు.ఇక ఇదే సినిమాలో "సిరిసిరి లాలి "అనే జోలపాటనూ ఆలపించారు.
**మరో నటి లక్ష్మిరాజ్యం నిర్మించిన నర్తనశాలలో బెంగుళూరు లత తో కలసి ఆలపించిన "సలలిత రాగ సుధారస సారం" పాటను ఎవరూ మరచిపోలేరు.
**ఇదే కథాంశంతో NTR నిర్మించిన శ్రీమద్విరాటపర్వం లో "జీవితమే కృష్ణ సంగీతము" అంటూ ఆలపించారు.
**తమిళ అనువాద చిత్రమైన కర్ణ లో సుశీలమ్మతో కలసి "నీవూ నేనూ వలచితిమి నందనమే ఎదురుగా చూచితిమి" అంటూ ఆ పాట చిత్రీకరించిన బేలూరు ఆలయమంత అందంగా ఆలపించారు.నిజానికి ఈ పాట వినే భాగ్యం తెలుగు వారికే దక్కింది..తమిళంలో సౌందర్యరాజన్ పాడాదు.
**దొరికితే దొంగలు సినిమా కోసం సుశీలమ్మ,బెంగుళూరు లతలతో కలిసి "శ్రీ వేంకటేశ ఈశా,శేషాద్రి శిఖరవాసా" అనే భక్తి గీతం పాడారు.
**పల్నాటి యుద్ధంలో "శీలము గలవారి చినవాడా" అనే యుగళగీతం సుశీలమ్మతో పాడారు..
**ఇక జానకమ్మతో కలిసి "వసంత గాలికి వలపులు రేగ " అంటూ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథలో పాడారు.
**పవిత్ర హృదయాలు సినిమాలో మరో శాస్త్రీయ సంగీతకారుడు నూకల చిన సత్యనారాయణతో కలిసి "కరుణామయి శారద" ఆలపించారు.
**ఉయ్యాల జంపాల సినిమాలో "ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు"...
**గుప్పెడు మనసు సినిమాలో "మౌనమే నీ భాష ఓ మూగమనసా" అంటూ తాత్త్విక గీతాలు ఆలపించారు...
**మేఘసందేశంలో "పాడనా వాణి కళ్యాణిగా " అంటూ కచేరీ లో పాడుతూ కనిపించారు.
** ముత్యాలముగ్గు టైటిల్స్ లో శ్రీరామ జయరామ సీతారామ....శ్రీరారాంజనేయ యుద్ధం లో మేలుకో శ్రీరామ....అనే సుప్రభాత గీతాన్ని,కరుణాలోలా నారాయణ అంటూ నారద పాత్రధారికి పాడారు. ఇదే విధంగా అందాలరాముడులో ’పలికే బంగారామాయెరా’ పాడి సినిమా అలరింప చేశారు.క్లాసికల్ మ్యూజిక్ సౌరభం చెడకుండా, సినిమా వంటి మాస్ మీడియం కు మార్చి, మాస్ ప్రేక్షకుడిని మనసుదోచిన మాంత్రికుడు మంగళంపల్లి.
ఈ పాటలే కాకుండా జంధ్యాల,రమేష్ నాయుడు గారు నిర్మించాలనుకున్న హరికీర్తనాచార్య అన్నమయ్య సినిమా కోసం "నిత్య పూజలివిగో నెరచినహో" పాటా పాడారు.
బాలమురళికృష్ణ గారు ఈ సినిమా పాటల ద్వారా సామాన్య సినీ ప్రేక్షకులనూ అలరించారు.