తెలంగాణా మేధావుల మౌనాంగీకారం !
అసలు కథలోకి వెళ్లేముందు ఒక పిట్టకథ చెప్పుకుందాం.
తను ప్రేమించి చేసుకున్న పెళ్లి. అందర్నీ ఎదిరించి చేసుకున్న పెళ్లి. ఎన్నో కలల తర్వాత... హీరోగారి కళలు ఒక్కొక్కటిగా తెలిసిన వేళ. బతుకు నరకం అవుతున్న వేళ. అయినా ఎవరికి చెప్పుకోవాలి. తల్లిదండ్రులు, బంధువులు హేళన చేస్తారేమో అన్న న్యూనత...!
సరిగ్గా అలాగే ఉంది నేటి తెలంగాణ మేధావుల పరిస్థితి. ఒకవైపు ప్రజలు పిట్టల్లా రాలుతూ ఉంటే, వీరింకా తమ పిట్టకథలు నెమరువేసుకుంటున్నారు.
కుడి, ఎడమ తేడా లేకుండా అహోం ఒహోం అంటూ పల్లకీ మోస్తున్నారు మేధావులు, ఉద్యమ'కారులు'. పిట్టల్లా రాలిపోతున్న రైతులు, నిర్వేదం గూడుకట్టుకున్న యువకులు, అడియాసకు గురైన మొత్తం తెలంగాణ సమాజాన్నే వెక్కిరించేలా అస్త్ర సన్యాసం చేసారు. ‘స్వంత పార్టీ’ పాతకాన్ని భరించాలని సంకల్పమూ పుచ్చుకున్నట్టున్నారు. విషాదమేమంటే, త్యాగాలకు ప్రతీకలుగా, ప్రతిరూపాలుగా తెలంగాణ సమాజంచే ఆమోదం పొంది, ప్రజలకు ఆశలు కలిగించి నేడు అదే తెలంగాణ ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వం అన్యాయాలపై మౌనం వహిస్తున్నారు.
వీరంతా మార్క్స్ నుంచి మావో నుంచి బుద్దుడి నుంచి అంబేడ్కర్ నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఆ రాజకీయ, తాత్విక చింతనలో ఆరితేరినవారే – అని ప్రజలు నమ్మారు!
బుద్ధుడి స్ఫూర్తి – విపరీత కోరికలు వద్దని. అన్యాయంపై మౌనం వహించాలని కాదు. తథాగతుడు యథాతథ స్థితి కోరలేదు. మార్పునాశించాడు. సమసమాజం స్వప్నించాడు. ఇవన్నీ తెలిసిన గద్దర్ నేడు ప్రభుత్వ పథకాలు బావున్నాయి అంటున్నారు. ఆ జెండా, ఆ కర్రా, ఆ అర్ధ నగ్నత్వం, ఆ పూజలు, నేడు అచ్చు మరో చినజీయర్ లా అనిపిస్తున్నారు. దొరల గురువు అయిన చినజీయర్ లా ఈయన ఇపుడు దొరల సహచరుడు అవుతున్నారు. యిక ఈ 'ప్రజా యుద్ధ నౌక' మునిగినా, తేలినా తెలంగాణ ప్రజలకు లాభనష్టాలు ఏమీ లేవు కాని, యుద్ధ ప్రతీకలు గడీలకు మోకరిల్లడమే జుగుప్సగా ఉంది. సాంస్కృతిక సారధులు, దళితోద్ధరణ అతిరథులు, ఓబీసీ మహారథులు, తత్వవేత్తలు, సామాజిక వేత్తలు - అందరూ మనసా వాచా మునులైనారు. '... వినయమూ, చివరికి యేం జరుగుతుందోనన్న భయమూ, మరికొన్ని చీకటి రహస్యాల కారణంగా సత్యం దారి తప్పుతోంది జీవితాన్ని తప్పించుకుంటూ’ అన్న కవి త్రిపురనేని శ్రీనివాస్ మాటలు గుర్తొస్తున్నాయి. స్వజనమును చంపుటకు ఇష్టపడక - నాకు విజయమూ వలదు, రాజ్యసుఖమూ వలదు - అని ధనుర్భాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునునివలె, తమ స్వజనం కోసమో స్వప్రయోజనాల కోసమో ఈ అస్త్ర సన్యాసం అని ఎవరైనా అంటే, తప్పెవరిది?
మీరంతా ఎవరికి వంతపాడుతున్నారో తెలుస్తోందా? మీది స్వార్థమో, లేదా ప్రజలు నమ్మిన నిస్వార్థమో ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది మీరే!
నాడు ఉద్యమ కాలంలోనూ, నేడు ఉద్యమ ఫలమైన స్వరాష్ట్రంలోనూ బడుగులు పిట్టల్లా రాలిపోతూ ఉంటే, దొరలకు ఫరవాలేదు కానీ ఆ బడుగులలోంచి వచ్చిన ఉద్యమకారులకు, నాయకులకు, మేధావులకు చీమ కుట్టినట్టయినా లేదెందుకు? ఉద్యమ పరమార్థం ఒక్క కుటుంబానికి వేలకోట్ల రూపాయలు దోచి పెట్టటమేనా? ఇది మేధావులకు, నాటి ఉద్యమ స్ఫూర్తి ప్రదాతలకు సమ్మతమేనా? మీరంతా ‘ప్రభుత్వ పథకాలు బాగానే ఉన్నాయి’ అంటున్నారు మీడియాతో. ఇవి ‘పథకాలు’ మాత్రమేననీ, పారదర్శక, ప్రజాప్రయోజన ‘విధానాలు’ కాదని మీ ఎరుకలో లేనిదా? తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో తొంభై శాతానికి పైన బహుజన వర్గాలకి చెందిన వారివే కదా. ఆ బడుగు ప్రాణాలు అంటే కేసీఆర్ కు లెక్క లేదేమో కానీ, మీకూ పట్టదా? నేడు తెలంగాణ దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందనే స్పృహ ఏమైనా ఉందా? ఒక్కసారి పల్లెలు తిరిగి రండి.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ బీసీ హాస్టళ్ళలో విద్యార్థులు వసతులు లేక తీవ్ర వ్యధలకు గురౌతున్నారు అని నిన్నమొన్న మీడియాలో వచ్చింది. 'కాల్మొక్తా కందులు కొనండి' అని రైతులు అధికారుల ముందు నిస్సహాయ స్థితిలో ఉండడమూ చూసాం. 250 రోజులుగా మల్లన్న సాగర్ వద్దని దీక్షలు జరుగుతున్నాయి వేములఘాట్ లో. ఈ ప్రాజెక్టూ, దాని ప్రయత్నాలూ, అందుకోసం తెచ్చిన జీవోలు చెల్లవని హైకోర్టు ఇప్పటికి ముప్ఫై సార్లకు పైగా మొట్టికాయలు వేసినా పెద్ద సార్లకు సోయి వస్తలేదు. వారికోసం పనిచేస్తున్న ఆడబిడ్డ రచనా రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా ఆడిపోసుకున్నారు సీఎం. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సన్నాసులు అయిపోతారు. అవును మరి సన్యాసుల మాయలో ఉన్నోడికి అంతకంటే ఏం భాష వచ్చు?!
నేడు తెలంగాణ ఎదుర్కుంటున్న సిసలు విషాదం – ప్రభుత్వ నిర్వాకం కాదు. అన్ని ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల్లోని నాయకులు స్వలాభం కోసం ప్రభుత్వం పట్ల మెతకగా ఉంటున్నారు. తమ తమ పార్టీలనీ, ప్రజలనూ మోసం చేస్తున్నారు. చాలామంది క్విడ్ ప్రో కో రాజకీయాలకు అలవాటు పడ్డారు. నేటి తెలంగాణ అవసరం – విశ్వసనీయత ఉన్న, నిస్వార్థ నవ రక్తం. వివిధ వేదికలపై పోరాటం చేస్తున్న శక్తులన్నీ ఒకటి అవ్వాల్సిన తరుణం ఇదే.
యువకులారా, మెయిన్ స్ట్రీం పాత్రికేయులారా... ఇపుడు మనం మురిసిపోవాల్సింది కేటీఆర్ ఆంగ్ల భాషకు కాదు. మోహించాల్సింది ఆయన బిడ్డ కాన్వెంట్ స్కూల్ ప్రతిభకు కాదు. అక్కడికి వెళుతూ ఆయన అడ్డుగా పడివున్న ఖాళీ వాటర్ బాటిల్ ని చెత్తడబ్బాలో వేయడం గురించి కాదు. అలెంబ్లీలో కేసీఆర్ ప్రతిపక్షాలను (ఉంటే గింటే) ఆడుకున్న తీరును చూసి కాదు. కవిత చలాకీతనాన్ని చూసి కాదు. చినజీయర్ ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడం కాదు. నరసింహన్ కు సాష్టాంగ పడటం కాదు. గుళ్ళకు, మసీదులకు, చర్చీలకు సంతర్పణలు కాదు. తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకు కాదు. ఒక్కసారి ఇటు దృష్టి మరల్చండి. నేడు తెలంగాణకు తక్షణం జరగాల్సినవి :
1. స్వరాష్ట్ర సాధన కోసం అనన్య త్యాగాలు చేసిన ఉద్యమకారులకు సత్వర న్యాయం
2. అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు
3. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణి
4. సింగరేణి పరిధిలోని సమస్యల పరిష్కారం
5. రైతులకు సంపూర్ణ రుణ మాఫీ
6. బలవంతపు భూసేకరణ ఆపడం
7. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు
8. ఏటా సకాలంలో ఫీజు రీ ఇంబర్స్ మెంట్
9. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళ నిర్వహణలో అలసత్వం, అన్యాయాలపై పోరు
10. ఉద్యోగ నియామకాలు
11. లాభదాయకమైవుండీ మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ
12. వివిధ సంస్థల నుంచి ప్రభుత్వం తెచ్చిన రుణాలు : రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి
వీటిపై జరగాలి చర్చ. కార్యాచరణ. ‘ప్రాంతం వాడే దోపిడి చేస్తే – ప్రాణంతోనే పాతర వేస్తం’ అన్న కాళోజీని గుర్తు మీకేవరికి గుర్తు రావడం లేదా...