టమాటా సెంచురి

a poem on tomato that is beyond the reach of common man

టమాటా సెంచురి 

ఏకూరలేసినా 
ఏకమైపోతావు
ఏకాకిగొండినా 
ఎదమీటిపోతావు

చారులో నువ్వుంటె
సర్రునా జారుతవు
పచ్చడీ ముద్దైతె
పరమాన్నమవుతావు

పప్పుతో కలిసావొ
పడిచచ్చిపోతారు
కూరగా మారావో
కొరకొరా చూస్తారు

కూరల్లొ రాణివై
పరిడవిల్లే నీవు
అగ్నిగోళాలుగా
భగ్గుమంటున్నావు

సెంచరీ కొట్టేసి
శకిలించుతున్నావు
పేదోని పొట్టను
పెకిలించుతున్నావు

నువ్వులేక బువ్వ
జారనంటుంది
కొందమంటె జేబు
ఖాళియంటుంది

దిగితె పాతాళము
ఎక్కితాకాశము
టమాటా నీతోని
తంటాలె మాకు

దిగిరావె పేదోని
పొట్టనింపుటకు
దిగిరావె కూరల్లొ
రంగువడుటకు

(టమాట రేటు రు.100  చేరుకున్న సందర్భంగా)