ఉండీ లేని తనం
బ్యాంకులిప్పుడు
మనది ఉన్నదంతా
దిగమింగిన కొండచిలువలు!
కక్కూ! అని మనమంటుంటే
'క్యాష్లెస్' పోపో అంటున్నయ్!
నిన్ను నన్ను అందరినీ
బిచ్చగాళ్ళని చేసి
క్యూలైన్లలో నిలబెట్టినవి!
రేప్పొద్దున
పాలవాడొస్తాడు
పేపరోడొస్తాడు
దినవెచ్చాల అంగట్ల
పరువు కుదువ పెట్టలేనంతగా
ఆవిరైపోయింది!
మనమిప్పుడు
వర్షాకాలంలో ఎండిన చెరువులం
దిష్టి బొమ్మలైన ఏటీయం లెన్నున్నా
మనల్ని బెదిరించడానికి తప్పా
నాలుగు రాళ్ళు విదిలించలేవు
దుఃఖం వరదలై ముంచెత్తినా
దిగమింగుతూనే ఉండాలి
ఎవరూ బజార్ల పడి ఏడువొద్దు
ఏడిస్తే మనకు 'నల్లరంగు'పూస్తారు!
ఏమి లేకున్నా బాగుండేది
కాసింత జాలన్నా దక్కేది!
ఉండీ ఈ లేనితనం
దేనికి పనికొస్తుంది?
ఒక్క దెప్పి పొడిపించుకోవడానికి తప్పా!!